Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 21

 

    "వెళ్ళనంటే వెళ్ళను. నీకంటే నాకా స్నేహితులు , పిక్ నిక్ ఎక్కువ కాదు" మాటలు పూర్తీ కాకుండానే తల అడ్డంగా తిప్పుతూ అంది.
    "నీకు పుణ్యం ఉంటుంది. వెళ్ళు సరళా. నాకు ఒంటరిగా ఉండాలని ఉంది. నువ్వు నా తలనొప్పినే విధంగాను తగ్గించలేవు. ఇంకా ఎక్కువౌతుంది" కటువుగా అన్నాడు మాధవ.
    బిత్తరపోయి లేచి నిల్చుంది సరళ. "నేనుంటే నీ తలనొప్పి ఇంకా ఎక్కువవుతుందా?" నమ్మలేనట్లు అడిగింది మళ్ళీ.
    మరొకవైపుకు తిరిగి పడుకున్నాడు మాధవ. అదే సమాధానమన్నట్లు .
    "వెళ్తున్నాను."
    సరళ ముఖం చూడకపోయినా ఆ కంఠస్వరం సరళ ఎంత ఆవేదన పడుతుందో స్పష్టం చేసింది మాధవకు. భారంగా పడుతోన్న అడుగుల చప్పుడును బట్టి సరళ వెళ్ళి పోతుందని అర్ధమయింది మాధవకు.
    ఒక్క క్షణ కాలం లేచి వెళ్ళి సరళను బుజ్జగించి ఒదార్చాలనిపించింది. అంతలోనే ఏదో తనకే అర్ధం కాని నీరసం ఆవరించగా అలా పడుకుని ఉండిపోయాడు. అడుగుల చప్పుడు క్రమక్రమంగా దూరమయిపోయింది.


                                                            6

    వరుసగా అయిదారురోజులు సరళ కనబడకపోయేసరికి సరళకు తన మీద కోపం వచ్చిందని అనుమానం కలిగింది మాధవకి. తన ప్రవర్తనకు కోపం వచ్చి తన మీద మనసు విరిగిపోయిందేమో! ఈ ఆలోచన వచ్చేసరికి మాధవకు విచారానికి బదులు సంతోషం కలిగింది. గుండెల మీంచి ఒక పెద్ద బరువు దిగిపోయినట్లనిపించింది. అసలు సరళను గురించిన ఆలోచనే లేకుండా కాలేజి కెళ్ళి వస్తున్నాడు.
    ఆ రోజు క్లాస్ ముగించి వస్తుండగా మోహన్ ఎదురై - "మీకింకా క్లాసులు న్నాయా?" అని అడిగాడు.
    "ఏం లేవు . ఇంకా ఫ్రీ"
    "నాక్కూడా లేవు. కాస్త కాఫీ తాగి వద్దాం రండి."
    మాధవకు కాఫీ తాగాలని లేదు. అయినా మోహన్ మాట కాదనలేక అనుసరించాడు.
    కాఫీ సిప్ చేస్తూ అకస్మాత్తుగా అడిగాడు మోహన్.
    "మీకూ సరళకు మధ్య అపార్ధాలేమైనా వచ్చాయా?"
    ఉలిక్కిపడ్డాడు మాధవ. తొట్రుపాటు అణచుకుంటూ "లేదే!" అన్నాడు.
    మోహన్ ఆ మాటలు నమ్మలేదని అతని ముఖ కవళికలు చెప్పాయి మాధవకు. ఆందోళనతో మోహన్ మొఖంలోకి చూస్తూ కూచున్నాడు.
    "సరళకు నాలుగురోజుల్నుంచి తీవ్రంగా జ్వరం వస్తోంది."
    మాధవ గుండె వేగంగా స్పందించసాగింది. ఊపిరి బిగపట్టి వినసాగాడు.
    "ఎందుకో తనలో తనే ఏడుస్తుంది. మొన్న దాని కలవరింత నేను విన్నాను. "ఎందుకు నామీద నీకంత కోపం? నేనేం చేశాను మాధవా?" అని కలవరిస్తుంది...."
    "........"
    "ఈ నాలుగు రోజుల్లోనే చిక్కి శల్యమయిపోయింది " మోహన్ మాట్లాడటం ఆపి మాధవ ముఖంలోకి సూటిగా చూశాడు కొన్ని క్షణాలు. తర్వాత ప్రాధేయపూర్వకంగా అన్నాడు.
    "మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు. దానిదే తప్పు కావచ్చు. నోటి తొందర మనిషి. అయినా మా చెల్లాయి తరుపున క్షమించమని నేను ప్రార్ధిస్తున్నాను. దాని ఆరోగ్యం కోసం మీరొక్కసారి మా ఇంటికి రావాలి. ఇన్నాళ్ళూ ఎంతో శ్రద్దగా చదివింది. సరిగ్గా పరీక్షల ముందు ఇలా జబ్బు పడింది" మోహన్ కంఠం గద్గదికమయింది.
    "దాని ఆరోగ్యం కోసం.....సరిగ్గా పరీక్షల ముందు' ఈ రెండు వాక్యాలూ తిరిగి తిరిగి మాధవ హృదయంలో ప్రతిధ్వనించాయి.
    "వస్తాను" అన్నాడు.
    "థాంక్స్"
    వెయిటర్ బిల్ చెల్లించాడు మోహన్.
    ఇద్దరూ బయటికి కొచ్చాక "ఇప్పుడు నాతొ వస్తారా?" తరువాత వస్తారా?" అని అడిగాడు మోహాన్.
    "ఇప్పుడు వస్తాను పదండి"
    మాధవ మనసు పశ్చాత్తాపంతో కుంగిపోయింది. పాపం సరళ ఏం చేసింది? ఆవిడ మనసులో ఆశలు కల్పించి ఇన్నాళ్ళూ ప్రోత్సహించాడు . అమాయకురాలు ఇంకా ఆ ఆశలతోనే బ్రతుకుతోంది. తను చేసిన అన్యాయం చాలక ఇంకా మొరటుగా కూడా ప్రవర్తిస్తున్నాడు. సరళ మనసుకు నొప్పి కలగకుండా నెమ్మది మీద విషయం బయటపెట్టాలి. మొదట పరీక్షల ముందు సరళ ఆరోగ్యం పాడవకుండా కోలుకునేలా చెయ్యాలి. ఇంచుమించు వారం తరువాత సరళను చూసిన మాధవ చాలా ఆశ్చర్యపోయాడు. మనిషి బాగా నీరసించిపోయింది. చెక్కిళ్ళు పాలిపోయి కళ్ళు గుంటలుపడ్డాయి. మాధవను చూస్తూనే సరళ ముఖం వికసించింది. ఆ వికాసం గమనించిన మాధవ లోలోపల మరింత బాధపడ్డాడు. ఇంక వెనక ముందు లేమీ ఆలోచించకుండా తిన్నగా వెళ్ళి సరళ మంచం మీద కూచుని సరళ ముఖం రెండు చేతుల్లోకి తీసుకుని "ఇలా అయిపోయావేమిటి సరళా!" అన్నాడు.
    ఆప్యాయంగా ధ్వనించే అతని కంఠం వింటూ, లాలనగా తనను బుజ్జగించే అతని స్పర్శలో కరిగిపోయింది సరళ. అంత నీరసంలోనూ ఒక్కసారి ఆవేశంతో లేచి అతని ఒళ్ళో వాలి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆ ఉదృతం తగ్గేవరకూ సరళ శిరస్సు ప్రేమగా నిమురుతూ ఉండిపోయాడు మాధవ.
    "ఛీ! పిచ్చిపిల్లా! ఏమిటిది? లే! అసలే జ్వరం. అందులో ఏడుపా! ముందు కళ్ళు తుడుచుకో"
    "నీకు నామీద కోపం లేదా?"
    "నాకు నీమీద కోపమా? నీకు మతిపోయిందా? నీమీద కోపం తెచ్చుకోగలిగే శక్తి నాకు ఉందనే అనుకుంటూన్నావా?"
    "మరి ఆ రోజు....."
    "ఓస్! అంత మాత్రానికే ఇలా అయిపోయావా? ఆరోజు నా మనసు చాలా చిక్కగ్గా ఉంది మా అత్తయ్యతో దెబ్బలడినందుకు. ఊహ తెలిసినప్పటి నుండి అత్తయ్యని గౌరవించటమే కాని తిరస్కరించటం ఎరుగను . మొదటిసారి అత్తయ్యను నిర్లక్ష్యం చేసి వచ్చాను. ఆ చికాకులో నీమీద విసుక్కున్నాను. అంతే! నీమీద నాకేం కోపం లేదు"
    "మరి ఆ తర్వాత కూడా నన్ను చూడటానికి రాలేదు"
    "అదా! ....ఎందుకంటె.......అలా అనవసరంగా విసుకున్నాను కదూ! మళ్ళీ నిన్ను చూడ్డానికి ముఖం చెల్లక రాలేదు."
    పకపక నవ్వింది సరళ.
    జ్వరంతో నీరసించి కాడల్లా ఉన్న చేతులను మాధవ మెడ చుట్టూ పెనవేసింది.
    "హమ్మయ్యా! ఇప్పుడెంత శాంతంగా ఉంది! ఇలా నీ గుండెల్లో తల పెట్టుకుని చచ్చిపోయినా నాకు బాధలేదు."
    చటుక్కున తనచేత్తో సరళ నోరు మూసేశాడు మాధవ. "అలాంటి పిచ్చిమాటలు మాట్లాడకు. రెండు రోజుల్లో నయమైపోతుంది."
    "రెండు రోజుల దాకా ఎందుకు? నువ్వు నా పక్కనుంటే రెండు పూటల్లో నయమైపోతుంది. నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోవుగా!"
    మాధవ ఇబ్బందిగా కదిలాడు.
    "ఎప్పుడూ నీ దగ్గరే ఎలా ఉండగలను సరళా! నిన్ను చూడటానికి రోజూ వస్తూ వుంటానుగా!"
    "ఊహూ అలా వీల్లేదు. నా జ్వరం తగ్గేవరకూ నువ్విక్కడ ఉండి పోవలసిందే!" పసిపిల్లలా మారం చేసింది.
    అప్పుడే అక్కడికి వచ్చిన సరళ తల్లి. "పోనీ రెండు రోజులు మా ఇంట్లో ఉండు నాయనా!' అంది బతిమాలుకొంటున్నట్లు.

 Previous Page Next Page