ఏ.సి.పి. కిరణ్మయి....ఆరోజే డ్యూటీలో జాయిన్ అయ్యింది.
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసినా మహిళా పోలీస్ స్టేషన్ లో విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్ ఒకటి ఒకటి.
ఐ.పి.ఎస్. పూర్తీ చేసి కొత్తగా ఉద్యోగంలో చేరిన కిరణ్మయిని పోస్ట్ చేసింది హోమ్ మంత్రిత్వశాఖ.
'ఆమె వచ్చీ రావడంతోనే గత కొంతకాలం నుంచి చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ పట్టుబడకుండా సంచరిస్తున్న మహిళా కేసును శ్రద్దగా పరిశీలించింది.
ఆమె చేసిన దొంగతనాలు గురించి మరింత వివరంగా తెలుసుకోవాలంటే అంతవరకూ ఆ నేరాలను పరిశోధించిన ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ ను కలుసుకోవాలనుకున్నది ఏ.సి.పి. కిరణ్మయి. అనుకోవడమే ఆలస్యం కారులో బయలుదేరింది.
ఆమెను చూసి స్మార్ట్ గా సెల్యూట్ చేసి సాదరంగా ఆహ్వానించాడు ఇన్ స్పెక్టర్.
ఏ.సి.పి. కిరణ్మయి తనొచ్చిన పని చెప్పింది.....
"ఒకే మేడమ్ ........మాటలతో చెప్పేకన్నా కంటితో చూస్తే మీకు అర్ధం అవుతుందనుకుంటాను. రెండు నిమిషాలు ఆగండి మీ సందేహం తీరిపోతుంది.'
గది తలుపులు దగ్గరకు వేసి ఒక వేపున వున్న టి.వి. కి వి.సి.ఆర్. కనెక్షన్ ఇచ్చాడు. అల్మారాలో భద్రంగా దాచి వుంచిన వీడియో క్యాసెట్ తీసి . వి.సి.ఆర్ లో పెట్టి అన్ చేశాడు.
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ చేసే పనులను ఆశ్చర్యంగా చూసింది కిరణ్మయి.
టి.వి. స్ర్కీన్ పై బొమ్మలు ప్రత్యక్షమయ్యాయి. విష్ణు మందిరం లోని దృశ్యం అది!
ముందుగా ఆశ్రమం పరిసరాలను చూపించి తరువాత విష్ణు పూజా మందిరంలోని భక్తుల పరామర్శతో మొదలై వారి విశ్రాంతి గదులను ఎత్తి చూపించింది వీడియో కెమెరా.
నిత్యం జరిగే సన్నివేశాలతో పాటు రీటా తొలిసారిగా విష్ణు మందిరంలో నుంచి డైరీలు దొంగలించుకుని వెళ్ళడం, తిరిగి నాలుగు రోజుల తరువాత వాటిని తెచ్చి యధాస్థానంలో వుంచడం , ఆమె ఏ విధంగా విష్ణు భక్తురాలిగా మారిందో చూస్తున్న ఏ.సి.పి కిరణ్మయి ఆశ్చర్యంతో తలమునకలై పోయింది.
భారతి ఆ ఆశ్రమంలో ఏ విధంగా స్థానం సంపాదించిందో, ఇద్దరు అతివలు విష్ణుని ఎలా ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారో , అర్ధరాత్రి వేళ ఒకరికి తెలియకుండా ఒకరు ఆశ్రమంలో నుంచి బయట ప్రపంచంలోకి దొంగల్లా వెళ్ళే దృశ్యాలు ఒకదాని వెంట ఒకటి సినిమారీళ్ళ మాదిరి కనిపించాయి.
వి.సి.ఆర్ ఆఫ్ చేసి కిరణ్మయి వైపు చూశాడు వినయ్ కుమార్.
"ఇన్ స్పెక్టర్ నేను అడిగిన ఆమెకు మీరు ఇప్పుడు చూపించిన క్యాసెట్ కు ఏం సంబంధం వుంది? అంతేకాదు, ఎందరో శిష్యులు నిరంతరం తిరిగే విష్ణు మందిరంలో వాళ్ళకు తెలియకుండా ఎలా విడియో తీయగలిగారు?"
"సారీ మేడమ్....ఆ విషయం మాత్రం అడక్కండి. నేనెలా వీడియో తీశానో ఎంతో గొప్ప మహిమలున్నాయి అని చెప్పుకునే ఆ విష్ణు సయితం పసిగట్టలేడు" గంభీరంగా వున్నది ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ గొంతు.
ఇట్స్ ఒకే ఇన్ స్పెక్టర్ , క్యాసెట్ ఎలా వచ్చిందన్నది వదిలేద్దాం. ఈ క్యాసెట్ నాకు ఎందుకు చూపించారో తెలుసుకోవచ్చా?" అతని వేపు పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది.
"ఎగ్జాట్లీ, నా అనుమానం ఆ ఇద్దరిలో ఎవరయినా దొంగ అయి వుండవచ్చు. అంతేకాదు విష్ణు కలాపాల మీద నిఘా వేయడంలో భాగంగా తీయబడిన వీడియో క్యాసెట్ ఇది" చెరిగిపోనీ చిరునవ్వుతో బదులిచ్చాడు వినయ్.
"అంటే ఆ దొంగ స్థావరం విష్ణు మందిరం అయి వుంటుందంటారా?"
"ఏమో ఇప్పుడిప్పుడే చెప్పలేం. ఇది కేవలం నా అనుమానం మాత్రమే. నాపై అధికారిగా మొట్టమొదటిసారిగా నా అనుమానాన్ని మీకు మాత్రమే చెబుతున్నాను. అవునో కాదో పరిశీలించవలసిన బాధ్యత మీదే. అందరూ జేజేలు పలుకుతున్నట్టు విష్ణు మహామహిమాన్వితుడు కాదని నా అభిప్రాయం. కేవలం ప్రజల మూడ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని భక్తీ పేరుతొ మోసం చేస్తున్నాడని నా అనుమానం" అని చెప్పి , గది తలుపులు తెరుస్తూ రిలాక్స్ గా ఫీలయ్యాడు వినయ్ కుమార్.
"మరి నా పరిశోధన ఎక్కడ నుంచి ప్రారంభించమంటారు?" అయోమయంగా ప్రశ్నించింది ఏ.సి.పి. కిరణ్మయి.
"భారతి అండ్ రీటా. వాళ్ళిద్దరి పై దృష్టి ని కేంద్రీకరించండి. మీకు ఏదో ఒక ఆధారం లభించకపోదు.'
"ఓకే ఇన్ స్పెక్టర్......మీ సలహా పాటిస్తాను" చిరునవ్వుతో బదులిచ్చి బయటకు నడిచిందామే.
ఏ.సి.పి. కిరణ్మయి వెళ్ళిన వైపే చూస్తూ దీర్ఘాలోచనలో పడిపోయాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
ఆమె వెళ్ళిన కొన్ని నిమిషాలకి చకచకా డ్రస్ మార్చుకుని వేషాన్ని గుర్తుపట్టకుండా తీర్చిదిద్దుకుని, పరుగులాంటి వేగంతో స్టేషన్ లో నుంచి బయటపడ్డాడు వినయ్ కుమార్.
ఇప్పుడతని గమ్యం విష్ణు మందిరం.
* * * *
ఏ.సి.పి కిరణ్మయి డోర్ తెరచి కూర్చోగానే డ్రయివర్ కారు స్టార్ట్ చేశాడు.
ఎక్కడకు వెళ్ళాలో చెప్పకపోవడంతో ఆఫీసుకే నానుకుని బందర్ రోడ్ వైపు జీప్ ని మళ్ళించాడు డ్రయివర్.
'అటు కాదు.......విష్ణు మందిరం వైపు పోనీయ్.......'
అంటున్న ఏ.సి.పి కిరణ్మయి వైపు ఆశ్చర్యంగా చూశాడు డ్రయివర్.
అతని ఆశ్చర్యాన్ని గురించి పట్టించుకునే మూడ్ లో లేదామే.