Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 21

 

    ఏమనాలో తోచక విష్ణు మౌనం వహించాడు.
    "ఇప్పటికే చాలా పొద్దు పోయినట్టయింది. నాకోసం మీ విలువయిన సమయాన్ని కేటాయించినందుకు సంతోషం ఉంటాను గురూజీ......" అని ద్వారం వరకు వెళ్ళి మరొకసారి విష్ణు వైపు చూసి చిలిపిగా కన్నుగీటి మరీ బయటకు వెళ్ళిపోయింది రీటా.
    ఆమె చర్యను విష్ణు హతాశుడై పోయాడు.
    ఆమె వెళ్ళిపోయాక విష్ణులోని ఆలోచనా ఝురి పరి పరి విధాలా పోసాగింది.
    ఒకరి తరువాత ఒకరు చొప్పున ఊపిరి సలుపుకోనివ్వకుండా ప్రశ్నల పరంపరతో తనపై దాడి చేస్తున్న ఆ ఇద్దరు వనితల ఆగమనం వెనుక ఏం దాగుందోనన్న అనుమానం అతనిలో తొలిసారిగా మొదలయింది.
    వాళ్ళను శిష్యురాళ్ళుగా చేసుకుని తన మందిరంలో స్టానం కల్పించి తను పొరపాటు చేయలేదు కదా అనే మీమాంస విష్ణు మనస్సును కలచి వేస్తున్నది.
    ఎవరికి వాళ్ళే ఒకరి కన్నా ఒకరు ఎక్కువన్నట్టు తనే గుర్తింపు పొందాలనే తాపత్రయం చూపుతున్నారు. తమ తమ ధర్మ సందేహాలతో తనను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. నిజంగానే వాళ్ళకు ధర్మ సందేహాలు వస్తున్నాయో లేక ఆ వంకతో తనను తమ గూడార్ధ ప్రశ్నలతో చిలిపి చేష్టలతో మభ్య పెడుతున్నారో నిర్ధారణకు రాలేకపోతున్నాడు.
    అందాల పోటీలలో పాల్గొనబోయే సుందరీమణుల్లా ఒకరిని మించిన విధంగా ఒకరు అందంగా కనిపించాలని అలంకరించుకుని తన సమక్షంలో హొయలు చిందించడం చూస్తుంటే ఆశ్రమ నియమ నిష్టలకు , తన గౌరవ ప్రతిష్టలకు మచ్చ తెస్తారేమోనన్న ఆందోళన........
    ఇద్దరూ ఇలానే తమ సౌందర్యపోషణతో కొనసాగితే ....ఆశ్రమ వాతావరణం ఏ పరిణామాలకు దారి తీయనున్నదో ఏ అలౌకిక అనందాలకు దూరంగా వుండాలని తను ఇంత కాలం బద్దుడై వున్నాడో ఆ జీవితానికి వీళ్ళ ఆగమనం ఆటంకం కాదు కదా అనే మీమాంస విష్ణులో బయలుదేరింది.
    అసలు ఆ ఇద్దరూ ఏమాశించి తన మందిరంలో వుంటున్నారో?\
    నిజంగానే ఆధ్యాత్మికత పట్ల మక్కువతో వచ్చారా లేక మరొక కారణం ఏదయినా వున్నదా? తనను ఆకర్షించడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని వాళ్ళ హావభావాలు, వాళ్ళ మాటలు చెప్పకనే చెబుతున్నాయి. వాళ్ళ చేష్టలు తన బ్రహ్మచర్యాన్ని సవాలు చేస్తున్నట్టుగా వున్నాయి.
    విష్ణు అలా ఆలోచిస్తూనే అస్థిమితతో నిండిపోయిన అంతరాత్మను సమాధానపరచుకుంటూ నిద్రకు ఉపక్రమించాడు.
    ఎప్పుడయితే విష్ణు మందిరంలో లైటు అరిపోయిందో, ఆ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నట్టు తన నిర్వర్తించాల్సిన పనికి సమయం ఆసన్నమయినట్టు తను గదిలో నుంచి బయటకు వచ్చిన భారతి నలువైపులా దృష్టిని సారించింది.
    అంతటా నిర్మానుష్యం.
    శిష్యులు అందరూ నిద్రలో జోగుతున్నారు.
    తనను గమనించే వాళ్ళు ఎవరూ లేరని నిశ్చయించుకున్నాక చకచకా ముందుకు కదిలిందామె!
    తనను దాటి వెళ్ళిపోతున్న ఆకారాన్ని గుర్తుపట్టిన మరుక్షణం భారతి ఆశ్చర్యపోయింది.
    రీటా..
    ఎస్! రీటానే.......
    ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళుతున్నదో?
    ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, చప్పుడు కాకుండా రీటాను అనుసరించింది భారతి. తనను ఎవరయినా అనుసరిస్తున్నరేమోనన్న ధ్యేసే లేనట్టు సూటిగా పోయి ప్రహరీ గోడను అవలీలగా దాటి బయట రోడ్ మీదకు వెళ్ళి చీకట్లో కలిసిపోయింది రీటా.
    'తన జాతి' లక్షణాన్ని వదులుకోనన్నట్టు......రీటా తన దొంగ బుద్దిని పొనిచ్చుకోలేదన్న మాట' అని తనలో తాను గొణుక్కుంటూ ముఖ ద్వారం వేపు నడిచింది భారతి.
    చప్పుడు కాకుండా డూప్లికేట్ తాళం చెవితో గేటు తెరచి బయటకు వెళ్ళిందామె.
    కానీ......అంతవరకు ఒక చెట్టు చాటున ఒదిగి కూర్చున్న రీటా ఆ దృశ్యం చూసిందనే విషయం భారతికి తెలియదు.
    "ఇంత రాత్రివేళ భారతి ఎక్కడకు వెళుతుందో క్షణం ఆలోచించింది రీటా.
    ఆమెను అనుసరించాలా వద్దా?
    ఆలోచనల నుంచి తేరుకుంటూ ముందుకు తేరిపార చూసింది.
    "అశ్చర్యం......
    ఆమె ఆ చీకట్లో ఎటు వెళ్ళిందో.....అంత తొందరగా అక్కడ నుంచి ఎలా వెళ్ళ గలిగిందో రీటాకు అర్ధం కాలేదు.
    "ప్చ్..జస్ట్ మిస్" అనుకుంటూ రీటా కాలి నడకన ముందుకు సాగింది.
    అంతవరకు అక్కడే ఒక ఇంటి చాటున నక్కి రీటా కదలికలను గమనిస్తున్న భారతి పెదవులపై చిరునవ్వు చోటు చేసుకున్నది.
    ఒక నిమిషం అలానే నిలిచి మరో వైపుగా వెళ్ళిపోయింది భారతి.
    అంత రాత్రివేళ ఆశ్రమంలో వుండకుండా ఇద్దరు అతివలూ చెరొక దిశన వెళ్ళిన సంగతి తెలియని విష్ణు అప్పటికే నిద్రాదేవి ఒడిలోకి జారుకున్నాడు.


                                                             *    *    *    *

 Previous Page Next Page