వినయ్ కుమార్ చెప్పిన మాటలనే నెమరు వేసుకుంటుందామె.
అతనితో మాట్లాడి వస్తుందన్నమాటే కానీ ఒక దొంగ పవిత్రంగా భావించే విష్ణు మందిరంలో ఎందుకుంటుందనేదే నమ్మలేని విషయంగా అనిపించిందామెకు.
కానీ అతను చూపించిన కాసేట్ లో ఆ ఇద్దరమ్మాయిలు మూవ్ మెంట్స్ సందేహాస్పదంగానే తోచాయి. పైపెచ్చు ఎలా వీడియో తీసింది చెప్పమంటే చెప్పలేదు.
ఒక పోలీస్ ఆఫీసర్ గా అతని స్థానంలో తను వున్నా చెప్పేది కాదు.
క్యూరియాసిటీ అనేది వుంటుంది కాబట్టి తెలుసుకోవాలని అడిగింది....ఎంతో బిజీగా అనుక్షణం భక్తులు సంచరించే విష్ణు మందిరంలో సన్నివేశాలను వీడియో తీయడమనేది మాటలు కాడు. ఎవరో ఒకరు చూసే ప్రమాదం వున్నది.
అయినా నేర్పుగా తీయగలిగిన వినయ కుమార్ ఎంతో సాహసం చేసినట్టే లెక్క.
"మేడమ్....విష్ణు మందిరం వచ్చింది"
డ్రయివర్ మాటలతో ఆలోచన్లు కట్టిపెట్టి జీప్ డోర్ తెరచుకుని కిందకు దిగింది.
చక్కటి పూలమొక్కలతో ....విశాలమైన ఆవరణ మధ్యలో అధునాతనమయిన భవంతి చూసి ఆశ్చర్యపోయింది.
విష్ణు మందిర భవన సముదాయం , ఆ పరిసరాలు అంతకు ముందు వీడియోలో చూసిన దానికన్నా ఎంతో ఆకర్షణీయంగా ప్రశాంతత ఉట్టి పడుతున్నట్టుగా తోచింది ఆమెకు.
లోపల భక్తులు తిరుగుతున్న జాడలు ఎక్కడా కనిపించకపోవడంతో ముఖ ద్వారం తలుపులు కూడా వేసి వుండడం గమనించి కిరణ్మయి ఆశ్చర్యపోయింది.
నిత్యమూ సందడిగా వుండవలసిన విష్ణు మందిరం నిర్మానుష్యంగా ఎందుకు వున్నదో ఆమెకు అర్ధం కాలేదు.
"డ్రయివర్ లోపలకు వెళ్ళి విష్ణు గారిని దర్శించుకోవడానికి వీలవుతుందేమో కనుక్కో" అని తిరిగి కారులో కుర్చున్నదామే.
కారు దిగి అతను పది అడుగులయినా వేశాడో లేదో ఒక శిష్యుడు ఎదురయ్యాడు.
"విష్నుగారు వున్నారా?"
"ఈ సమయంలో అయన ఆశ్రమంలో వుండరు.'
"ఎక్కడ వుంటారు?"
"ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు భవానీ ద్వీపంలో వుంటారు. అని చెప్పాడతను భక్తీ భావంతో.
'అక్కడ ఏం చేస్తుంటారు?"
అది కూడా తెలియదా అన్నట్టు ఒక వెర్రి చూపు చూసి నోరు విప్పాడు ఆ శిష్యుడు.
"గాత్ర శుద్దితో పాటు హటయోగ ప్రక్రియను మననం చేసుకొంటూ సంద్యావందనం పూర్తీ చేసుకున్న తరువాత ఆశ్రమానికి తిరిగి వస్తారు. ఈ పూట ఎవరినీ లోపలకు అనుమతించరు" అని చెప్పి వెళ్ళిపోయాడతను.
డ్రయివరు అదే విషయం ఏ.సి.పి. కిరణ్మయి తో చెప్పి జీప్ ని స్టార్ట్ చేశాడు.
అప్పుడే విష్ణు మందిరానికి కొద్ది దూరంలో ఒక అటో వచ్చి ఆగింది. వెనుదిరిగి వెళ్ళిపోతున్న కిరణ్మయిని చూసి ఆటోలో వచ్చిన వ్యక్తీ భ్రుకుటి ముడిపడింది.
అతను.......మారువేషంలో ఉన్న ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్
* * * *
టేబుల్ పైనున్న ఫోన్ మోగడంతో ఆ రోజు పేపర్ చూస్తూ ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ యధాలాపంగా రిసీవర్ తీసాడు.
"హలో.......ఈజిట్ మిస్టర్ వినయ్ కుమార్."
అవతల వైపు నుంచి వినిపించిన కంఠస్వరాన్ని గుర్తుపట్టిన ఇన్ స్పెక్టర్ వినయ్ ఆశ్చర్యపోతూ చేతిలోని పేపర్ ను పక్కన పడేశాడు.
ప్రత్యేకించి పనిగట్టుకుని మరీ విష్ణు తనకెందుకు ఫోన్ చేస్తున్నాడో అర్ధం కాలేదతనికి.
"ఎస్ ప్లీజ్......."
"దయచేసి ఒకసారి నా మందిరానికి రాగలరా?"
విష్ణు గొంతులో అభ్యర్ధన......
వినయ్ కుమార్ లో అశ్చర్యం అయోమయం సమపాళ్ళలో తొంగి చూశాయి.
ఆయనకు తనతో ఎలాంటి అవసరం వున్నదో.....
విష్ణు పట్ల తానెప్పుడూ భక్తీ భావం ప్రదర్శించలేదు. కేవలం ఒక దర్యాప్తు అధికారిగా విమర్శనాత్మక దృష్టితోనే చూశాడు. అంతేకాదు తను ఇదివరలో విష్ణు ఎదుట కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాడు.
ఈపాటికే తనపట్ల ఆయనకు ఎలాంటి అభిప్రాయం వున్నదో చూచాయగా తను ఊహించగలడు.
తనను రమ్మని అభ్యర్ధించడం వెనుక ఏం కారణం దాగి వుందో?
"మిస్టర్ వినయ్ కుమార్.....వాట్ హేపెండ్.......ఏనీ ధింగ్ రాంగ్"
"నో......నో .....అలాంటిదేమీ లేదు.జస్ట్.....ఇప్పుడే బయలుదేరుతున్నాను. మరో పది నిమిషాలలో అక్కడ వుంటాను" అన్నాడు ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్.
విష్ణు ఫోన్ పెట్టేశాడు.
ఇన్ స్పెక్టర్ వినయ్ కుమార్ జీప్ లో బయలుదేరాడు.
విష్ణు మందిరం బయట అతని కోసం ఇద్దరు శిష్యులు ఎదురు చూస్తున్నారు.