Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 21

 

      "అవును."
   
    "ఆపరేషన్ థియేటర్ యిన్ చార్జిగా వున్న సిస్టర్ కూడా చదివి సిగ్నేచర్ పెట్టాలి."

    "అవును."
   
    "ఆపరేషన్ కు ముందు ఎనస్థటిస్ట్ కూడా కేస్ షీట్ చూడాలి."
   
    "అవును."
   
    ఉపేంద్ర టేబిల్ మీద గట్టిగా చరిచి అన్నాడు. "ఇంతమంది చూడగా యీ పొరపాటెలా జరిగింది?"
   
    డాక్టర్ అశోక్ ముఖం మరికొంచెం నల్లబడగా అన్నాడు. "సారీ! నేను దీనికి సరియైన సమాధానమివ్వలేను."
   
    "డాక్టర్! నేను మిమ్మల్ని హర్ట్ చెయ్యాలని మాట్లాడటంలేదు. ప్రస్తుతం మన హాస్పిటల్ కి యిది ప్రెస్టేజి యిష్యూగా మారింది. మనకిప్పుడు బర్నింగ్ ప్రాబ్లమ్. మనసంతా యిప్పుడు ఓ చాలెంజిని ఫేస్ చేస్తున్నాం. పేపర్సన్నీ మనని దారుణంగా విమర్శిస్తున్నాయి. పాపమీద సానుభూతి వర్షం కురిపిస్తుంది. ఆఫ్ కోర్స్! నాకు సానుభూతి లేదని కాదు, బట్ వాట్ హేపెన్డ్ యీజ్ హేపెన్డ్. కాని మనం యిందులోంచి ప్రెస్టేజియస్ గా బయటపడాలి."
   
    "నేను యిక్కడ రిజైన్ చేసి తిరిగి స్టేట్స్ కి వెళ్ళిపోతాను" అన్నాడు డాక్టర్ అశోక్ సాలోచనగా.
   
    "నో ప్లీజ్! మీరలా చేస్తే మన ప్రతిష్ట యింకా దిగజారిపోతుంది. ఇక్కడే వుండి...."
   
    "ఏం చెయ్యగలం? పొరపాటు మనమీద వుంచుకుని."
   
    "టు ఎర్ యీజ్ హ్యూమన్."
   
    "బట్ నాట్ టు దిస్ ఎక్స్ టెంట్."
   
    "మీరలా అధైర్యపడిపోకూడదు. మననే మనం విమర్శించుకుంటే లోకుల దృష్టిలో యింకా అపహాస్యం పాలవుతాం. దయవుంచి మీరిక్కడ్నుంచి వెళ్లిపోవాలన్న ఆలోచన విరమించండి డాక్టర్! మీరు నిజంగా చాలా గొప్పవారు. ఎంతమందికో నేత్రదానం చేశారు. ఇతరులకెవరికీ సాధ్యంకాని ఆపరేషన్లు చేసి మీ గొప్పతనం నిరూపించుకున్నారు. ప్రస్తుతం దేశమంతటా కన్ జక్టివైటిస్ వుంది. పాపకు రెటీనా బ్లాస్టోమా వున్న కంటితోబాటు, రెండో కంటికి కూడా కన్ జక్టివైటిస్ వచ్చింది. రెండుకళ్ళూ ఎర్రబడి వుండటంవల్ల యీ పొరపాటు సంభవించింది. డాక్టర్! మీరు డీలా పడకండి. మీదగ్గరకు పత్రికల వాళ్ళెవరయినా వస్తే ఇంటర్వ్యూ యివ్వకండి" అంటూ లేచి ధైర్యం చెబుతున్నట్లుగా అతని భుజం తట్టాడు.
   
                                                * * *
   
    హనుమంతరావుగారింట్లో రాధ మంచంమీద పడుకునివుంది. కుడికన్ను యింకా బ్యాండేజీ చెయ్యబడే వుంది. ఎడమకన్ను ఇంకా ఎర్రగానే వుంది. తెరచివున్న ఆ కన్నులోంచి ఒక్కోచుక్కగా నీరు కారుతుంది. అది కన్నీరో, వ్యాధివల్ల ఉబుకుతున్న నీరో తెలియటంలేదు.
   
    అంతకుముందే వచ్చిన ప్రదీప్ మంచం ప్రక్కనే వున్న కుర్చీలో కూర్చుని వున్నాడు. కొంచెం దూరంలో స్టూల్ మీద హనుమంతరావుగారు కూర్చున్నారు.
   
    "అంకుల్! నాకేం కనబడ్డంలేదు" అంది రాధ.
   
    "వస్తుంది. బ్యాండేజి విప్పగానే కనబడుతుందమ్మా" అన్నాడు ప్రదీప్.

    "ఎలా వస్తుంది అంకుల్? నాకు ఎడమకంటికి బదులు కుడికంటికి ఆపరేషన్ చేసేశారుగా?"
   
    ప్రదీప్ ఉలిక్కిపడ్డాడు. "ఈ సంగతి రాధకు చెప్పారా" అన్నట్లు హనుమంతరావుగారి వంకా, గుమ్మందగ్గర అక్కాచెల్లెళ్ళవంకా చూశాడు. హనుమంతరావు మొహంలో ఏ భావమూ కనపడలేదు. సునీత ఏదో చెప్పబోయి సందేహంగా ఆగిపోయింది.
   
    రాధ చాలా తెలివైందన్న సంగతి ప్రదీప్ కు గుర్తువచ్చింది. ఇంత హంగామా జరుగుతున్న విషయం, ఒక కంటికి వుండవలసిన బ్యాండేజి యింకోకంటికి వుంటే కనిపెట్టటం తనకు కష్టమైన సంగతేమీ కాదు.
   
    "కాదమ్మా! కొన్ని కారణాలవల్ల అలా చెయ్యాల్సి వచ్చింది జాగ్రత్తకోసం. బాండేజి విప్పెయ్యగానే చూపు వచ్చేస్తుంది."
   
    "ఏంకాదు. మీరంతా అబద్దం చెబుతున్నారు. నన్ను మోసం చేస్తున్నారు. నాకింక చూపురాదు. నాకు జన్మలో యింక చూపు రాదు" అంటూ రాధ యిహ ఉద్రేకం అణుచుకోలేక వెక్కి వెక్కి ఏడ్చెయ్యసాగింది.
   
    "రాధా! ప్లీజ్" నీకేమీ జరగదు. నన్ను నమ్ము" అంటూ ప్రదీప్ ఆమె భుజంమీద చెయ్యివేసి ఊరడించటానికి ప్రయత్నించాడు. కాని ఆమెను కంట్రోల్ చెయ్యటానికి అతనికి శక్తి చాలలేదు.
   
    కొంచెంసేపు వృధా ప్రయత్నంచేసి నిస్పృహగా లేచి యివతలకు వచ్చాడు.
   
    అతని వెనక హనుమంతరావు కూడా వచ్చాడు.
   
    "రెండు మూడురోజులనుంచీ యిదే పరిస్థితి....ఏంచెయ్యాలో అర్ధం కావటం లేదు."
   
    అరుణ లోపల్నుంచి ఎప్పుడు వచ్చిందో అతనికి దగ్గరగా చేరి, "అంకుల్! యింట్లో ఎవరికీ మనసులు బావుండటంలేదు. ఒక్కోక్షణం ఒక్కో యుగంలా గడుస్తుంది. మీరు తరచు వస్తూ వుండండి" అంది.
   
    అతను జాలిగా ఆమెవంక చూశాడు. అరుణ కళ్ళు తడిగా వున్నాయి. అతనికి చాలా జాలేసింది. యుక్తవయసులో వుండి ఎంతో సంతోషంగా వుండవలసిన ఆడపిల్లలు ఆర్దికభారంవల్లా, విరుచుకుపడుతున్న విషాద పరిస్థితులవల్లా శూన్యంగా మిగిలిపోయినట్లు శుష్కనయనాలతో కనబడుతుంటే అతని గుండె కలుక్కుమంది. ఇలాంటి అభాగినులు కనీసపు జీవన విధానానికి నోచుకోని యీ నిర్భాగ్యులు...
   
    "అంకుల్! మా జీవితాలు ఏమైపోయినా బాధలేదు. కాని రాధ...."
   
    "వస్తూ వుంటాను అరుణా!" అని చెప్పి కారు ఎక్కాడు.
   
                                  * * *
   
    డ్రైవ్ చేస్తున్నాడన్న మాటేగాని మనసంతా అల్లకల్లోలంగా వుంది. తన జీవిత గమ్యం, కనీసం ఆలోచన ఏమీ తెలియటంలేదు. తాను ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు, చాలా దూరంగా నలిగి నలిగి నశించిపోతున్నాడు. బిందును దారుణంగా పోగొట్టుకున్నాడు. ఎన్ని జన్మలెత్తినా పొందలేని బిందు దుఃఖం పొర్లుకు వస్తుంది. బిందు, రాధ.... బిందు.... రాధ.... ఏం తప్పుచేశారని వాళ్ళకింత శిక్ష! ఏం పాపం చేశారని? సృష్టికి వాళ్ళమీద యింత కసి!
   
    దుఃఖం ఆవేశంగా మారిపోయింది. ఆ ఆవేశంలో కారును వేగంగా శ్రీలక్ష్మీ హాస్పిటల్ వైపు పోనిచ్చాడు.
   
    కారులోంచి విసురుగా దిగి కంటివిభాగంలోకి వెళ్ళాడు. డాక్టర్ అశోక్ కన్సల్టేషన్ రూందగ్గరకు వెళ్ళి లోపలకు పోబోతుంటే "డాక్టరుగారు లేరు" అన్నాడు వెయిటర్.
   
    "ఎక్కడకు వెళ్ళారు?"
   
    "సెలవు పెట్టారు."
   
    "సరే" అంటూ అక్కడ్నుంచి బయటకు వచ్చి, విశాలమైన భవనాలు దాటుకుంటూ చివరకు ఉపేంద్ర వున్న బిల్డింగ్ లోకొచ్చాడు.
   
    బయట హాల్లో ఎవరూ లేరు. వెయిటర్ తప్ప.
   
    "ఉపేంద్రగారున్నారా?" అన్నాడు కటువుగా.
   
    "ఉన్నారండి. ఏవో కాయితాలు చూసుకుంటున్నారు. మీ విజిటింగ్ కార్డ్ ఇవ్వండి. అడిగివస్తాను" అన్నాడతను.

    అతనివంక నిరసనగా చూసి, అతను "ఏమండీ, ఏమండీ" అని వారిస్తున్నా వినిపించుకోకుండా స్ప్రింగ్ డోర్ త్రోసుకుని విసురుగా లోపలకు వెళ్ళాడు.
   
    రివాల్వింగ్ చైర్ లో కూర్చుని టేబిల్ మీద ఫైల్స్ లోకి కాయితాలు తిరగేస్తున్న ఉపేంద్ర తలెత్తిచూసి "మీరా?" అన్నాడు గుర్తుపట్టి.
   
    రాధ ఆపరేషన్ తర్వాత జరిగిన రభసలో ప్రదీప్ ను రెండు మూడుసార్లు అతను చూసివున్నాడు.
   
    "అవును నేనే. మీతో మాట్లాడాలని వచ్చాను" అన్నాడు ప్రదీప్ విసురుగా.
   
    "ప్లీజ్ టేక్ యువర్ సీట్!" అన్నాడు ఉపేంద్ర చాలా కూల్ గా.

 Previous Page Next Page