Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 21

    వాకిలి ముందు ఆగింది పోలీసు జీపు కానందుకు రవ్వంత నిరాశ చెందాడు బన్సీలాల్. అయినా అంబులెన్స్ ఎందుకు ఆగిందో తెలియక కంగారుగా కాస్త ముందుకు వచ్చాడు.
   
    బన్సీలాల్ మాట్లాడే లోపల వాళ్ళలో ఒకడు అడిగాడు. "మీరే కదూ బన్సీలాల్ గారు?"
   
    "అవును నాతో ఏం పని?"
   
    "మీరు ఫోన్ చేయమ్గానే బయలుదేరి వచ్చాము."
   
    "నేను ఫోను చేశానా?"
   
    "ఎస్....అర్జంట్ గా అంబులెన్స్ ని పంపించమని ముందు మీరు తర్వాత ఇన్ స్పెక్టర్ గారు ఫోన్ చేశారు కదా ఫోన్ అందుకున్న మరుక్షణం మీ ముందు వాలాము."
   
    "నేను ఇన్ స్పెక్టర్ ఇరువురం ఫోను చేశామా?"
   
    "అదేమిటి సార్! ఫోను చేసి రమ్మనీ..."
   
    "నే నెందుకు రమ్మన్నాను?"
   
    "మీ బాల్కనీ విరిగి కిందపడిందని....మీ నౌకర్లు ఇద్దరు ఇన్ స్పెక్టర్ తో వచ్చిన కానిస్టేబుల్ ఫోర్ నాట్ ఫైవ్ కింద పడ్డారని బాగా గాయాలు తగిలాయని...."
   
    "చాలు..." చేతులతో వారిస్తూ బన్సీలాల్ అన్నాడు.
   
    "పదండి వాళ్ళని తీసుకు వస్తాము."
   
    "ఎవరిని తీసుకు వస్తారు? కావాలంటే నన్ను తీసుకు వెళ్ళండి మీ అంబులెన్స్ లో."
   
    "అదేమిటి సార్!"
   
    "లేకపోతే ఏమిటయ్యా? బాల్కనీ విరిగి కిందపడటం ఏమిటి...? గాయాలు తగలటం ఏమిటి...? నే నసలు ఫోను చేయందే."
   
    "మరి...!"
   
    "ఎవరో మిమ్మల్ని ఆటలు పట్టించారు. రాంగ్ ఇన్ఫర్ మేషన్ తో రప్పించారు." బన్సీలాల్ లోలోపల గాభరా చెందుతూనే పైకి మాత్రం గంభీరంగా అన్నాడు.
   
    ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ళమధ్యమాటలు జరిగాయి. ఆపై చేసేదేమీ లేక వాళ్ళు వెళ్ళిపోయారు.
   
    బన్సీలాల్ వేగంగా ఇంట్లోకి వచ్చాడు.
   
    ఏ మాత్రం ఆలశ్యం చేయకుండా పోలీసు స్టేషనుకి ఫోన్ చేశాడు. "ఇన్ స్పెక్టర్ బయలు దేరి ఎంతసేపయింది" అన్నాడు.
   
    "కేసులేమి లేవు.... ఇన్ స్పెక్టర్ గారు తొమ్మిది న్నరకల్లా వెళ్ళిపోయారు." అని చెప్పగానే బన్సీలాల్ కి విషయం అర్ధమై పోయింది. ఇక్కడ వున్నది నకిలీ ఇన్ స్పెక్టర్ కాదు. ఎవరో గాని దొంగనాటకం బాగా ఆడారు...లేని పొంది ఫోనులో మాటలు విని ఇన్ స్పెక్టర్ ని..."
   
    బన్సీలాల్ కి ముచ్చెమటలు పోశాయి. ఆ ఆలోచన రాగానే రెండేసి మెట్లు ఒకేసారి ఎక్కుతూ మేడమీదకి వచ్చాడు.
   
    అక్కడ....
   
    నౌకర్లు కొట్టిన దెబ్బలతో చలిమిడి సుద్దలా మారి నేలమీద పడి వున్నాడు అతను.
   
    "చంపేశారా!" అరుస్తూ అడిగాడు బన్సీలాల్.
   
    "ఉహూ...చితక బాదాము. అప్పడాల పిండిని మర్దించినట్లు..."
   
    "నోరు మూసుకోండి__కాస్త సందిస్తేచాలు కొంప మొత్తం కూలుస్తారు." అని కోప్పడి ఇన్ స్పెక్టర్ ని మంచం మీదకి చేర్పించాడు. తెలివిరావటానికి వుపచర్యలు మొదలు పెట్టారు.
   
    అరగంట తర్వాత__
   
    ఇన్ స్పెక్టర్ కి తెలివి వచ్చి కనురెప్పలు బలవంతానా పైకి ఎత్తాడు. ఒళ్ళంతా విరగగొట్టినట్లు చెప్పులు కదలటానికి కూడా శక్తి లేకపోగా మాట్లాడటానికి అసలు శక్తి లేకపోయింది.
   
    తన మీదకు వంగి ఆతృతగా తన వంక చూస్తున్న బన్సీలాల్ ని చూడగానే నెమ్మదిగా జరిగింది గుర్తుకు రాసాగింది....రోషావేశాలు ఆపుకోలేక రయ్యిన పైకి లేవబోయాడు. గూడలు మెడనరం కలుక్కుమన్నాయి. అంతే బాధతో ముఖం వివర్ణం కాగా నిస్సత్తువగా వెనక్కివాలాడు.
   
    బన్సీలాల్ వెంటనే ఇన్ స్పెక్టర్ చేతులు పుచ్చుకున్నాడు. "సారీ చెప్పటం తప్ప నేనేం చేయగలను. మరోసారి నిండా మోసపోయాను" అన్నాడు డగ్గుత్తికతో.
   
    అతను ఏదో అనబోయాడు. పెదవులు కదిలాయిగాని మాట పైకి రాలేదు...
   
    బన్సీలాల్ చాలా ఖరీదైన మత్తుపానీయం స్వయంగా తన చేత్తో ఇన్ స్పెక్టర్ ని బతిమిలాడుతూ పట్టించాడు.
   
    పానీయం చక్కగా గుటక పడింది.
   
    రెండే రెండు నిమిషాల తర్వాత అతను వళ్ళెరుగని నిద్రలో పడిపోయాడు...
   
    బన్సీలాల్ మంచం పక్కనే కుర్చీలో కూర్చుని ఆలోచనలో మునిగిపోయాడు.
   
    వాడెవడో తన్ని బాగా మోసగించాడు. అంతకు క్రితం జరిగిన సంఘటనతో వాడి మాటల గారడీతో తను వాడు చెప్పింది నమ్మి ఇన్ స్పెక్టర్ ని నౌకర్లచేత బంధించాడు. అది చాలు కదా! వాళ్ళు నలుగురూ ఇన్ స్పెక్టర్ దేహాన్ని మర్దిస్తుంటే సరదాగా చూస్తూ నుంచున్నాడు. ఇంకానయం తనే పూనుకుని దేహశుద్ది కార్యక్రమం చేయలేదు...

 Previous Page Next Page