Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 20

    నలుగురు నౌఖర్లు ఆయుధాలతో వెనుకనే వచ్చారు.
   
    "ఎక్కడి నుంచి ఫోను?" బన్సీలాల్ ని చూస్తూనే అడిగాడు ఇన్ స్పెక్టర్.
   
    "రాంగ్ నెంబర్." క్లుప్తంగా సమాధానం ఇచ్చాడు బన్సీలాల్.
   
    ఇన్ స్పెక్టర్ అనుమానంగా అతన్ని చూస్తూ "అర్జెంట్ సీక్రెట్ మీతోనే మాట్లాడాలని వాడెవడో అన్నాడని మీ నౌఖరు చెప్పాడు?" అని అడిగాడు.
   
    వీడికెందుకు ఈ ఆకారాన్నీ! దొంగవెధవ కాబట్టే వీడికి వివరం కాలాల్సి వచ్చింది. తను గమనించలేదుగాని యిప్పుడు చూస్తుంటే తెలిసిపోతున్నది. ఇన్ స్పెక్టర్ క్రాపు యిలా వుండదు. క్రాఫు బాగా పొట్టిగా వుంది....
   
    "ఏమిటి ఆలోచిస్తున్నారు?" ఇన్ స్పెక్టర్ గుచ్చి గుచ్చి చూస్తూ అడిగాడు.
   
    "ఏమీలేదు." బన్సీలాల్ విసుగ్గా అన్నాడు.
   
    "కాదు ఏదో వుంది మీరు నా దగ్గర దాస్తున్నారు."
   
    "ఏమిటు మీ అనుమానం?"
   
    "పోలీసోడికి అనుమానం రాదు. వచ్చిందంటే ఏదో వున్నట్లే....చెప్పండి ఫోన్ చేసింది ఎవరు? ఫోన్ లో ఏం చెప్పారు?"
   
    "నేను చెప్పను."
   
    "చెప్పితీరాలి. అది ప్రమాదంతో కూడిన విషయం అయితే కొంప మునుగుతుంది."
   
    బన్సీలాల్ మౌనంగా వుండిపోయాడు.
   
    ఇన్ స్పెక్టర్ కి కోపం వచ్చింది.
   
    "నాకు తెలుసు. ఫోనులో ఎవరో ఏదో చెప్పారు. ఆ మాట నాతో చెప్పటం మీ కిష్టంలేదు. రాంగ్ నెంబర్ అయితే యింతసేపు ఫోనులో మీరు ఎవరితో మాట్లాడినట్లు? మీ మధ్య నా మధ్య రహస్యాలు ఉన్నపుడు మీరు మీరే.... నేను నేనే. ఇంక నేను ఇక్కడ దేనికి?" అంటూ ఇన్ స్పెక్టర్ విసురుగా పైకిలేచాడు వెళ్ళిపోదామని.
   
    ఇన్ స్పెక్టర్ తప్పించుకు వెళ్ళిపోతున్నాడని కంగారు పుట్టింది బన్సీలాల్ కి. పెద్ద స్వరంతో నౌఖర్లని పిలిచాడు.
   
    నలుగురు నౌఖర్లు నలుపక్కలనుంచీ వేటకుక్కల్లా అతడి మీదకి దూకి గట్టిగా పట్టేశారు. మారణాయుధాలని ప్రయోగించే అవసరం లేకపోయింది. వకడు చేతులు విరిచి పట్టుకుంటే, మరొకడు డొక్కలో ఓ పోటు పొడిచాడు.
   
    ఇన్నేళ్ళ సర్వీసులో ఇన్ స్పెక్టర్ యితరులని ఉతకటమేగాని, చీపురు పుల్లతోకూడా దెబ్బతిని ఎరుగడు... డొక్కలో బలంగా పిడికిటిపోటు తగిలేసరికి బాధతో గిలగిల లాడాడు. "దొంగనా కొడుకుల్లారా!" అంటూ గట్టిగా అరిచాడు.
   
    మరో నౌఖరు ఫెడేల్ మని అతని మూతిమీద కొట్టాడు.
   
    బన్సీలాల్ నవ్వుతూ చూస్తూ నుంచున్నాడు.
   
    ఏం జరిగిందో తెలియక ఓ పక్క అయోమయంగా వున్నా తాను ప్రమాదంలో వున్నట్లు ఇన్ స్పెక్టర్ బాగానే గ్రహించాడు. అక్కడ నుంచి ముందు పారిపోక పోతే వాళ్ళు తన ప్రాణం తీయటం ఖాయం అని గ్రహించాడు. అందుకని వాళ్ళ చేతుల్లోంచి గుంజుకుని పారిపోబోయాడు. అది గ్రహించి వాళ్ళు ఇన్ స్పెక్టర్ ని బలంగా నొక్కి వుంచారు.
   
    ఇన్ స్పెక్టర్ మాట్లాడబోతే గొంతు నొక్కిపట్టేవాడు వకడు. మూతిమీద కొట్టేవాడు వకడు తయారయ్యారు.
   
    చేతులు తీటతో జిలగా వున్నాయేమో తలోదెబ్బా ఇన్ స్పెక్టర్ ని వేయటం మొదలుపెట్టారు.
   
    ఫెడీ ఫెడీమని వాళ్ళు నలుగురు కలిసి మోదుతుంటే పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇన్ స్పెక్టరికి పీకదాకా పట్టించింది అయిదు నిమిషాలలో హరాయించుకు పోయింది. నిషా పూర్తిగా దిగి నిలువు గుడ్లు పడ్డాయి. భయంతో ప్రాణం పిడచకట్టుకు పోయింది. పిచ్చి కోపం వస్తున్నది. కోపం ఆపుకోలేక ఏదో ఒకటి అంటుంటే వాళ్ళు గూడ వాయకొడుతున్నారు. ఒళ్ళు వాచిపోతున్నది.
   
    బన్సీలాల్ మాత్రం చేయి చేసుకోలేదు. వినోదం చూస్తున్నట్లు కళ్ళముందు జరిగేది చూస్తూ ఇన్ స్పెక్టర్ రాకకోసం మాటి మాటికి వాచీలో టైము చూసుకుంటున్నాడు.
   
    ఇన్ స్పెక్టర్ వచ్చిం తరువాత ఈ నకిలీ ఇన్ స్పెక్టర్ గాడిని ఇక్కడే బంధించి తాను ఇన్ స్పెక్టరు కలసి సరదాగా కొత్త పద్దతులతో వీడిని హింసిద్దామనుకున్నాడు బన్సీలాల్.
   
    అయిదు నిమిషాల తర్వాత...
   
    వాకిలి ముందు వాహనం ఆగిన చప్పుడు అయింది.
   
    ఇన్ స్పెక్టర్ ని తోడ్కొని వెళ్ళటానికి బన్సీలాల్ వేగంగా మేడ దిగాడు.
   
    అక్కడ...
   
                                                   15
   
    వాకిలి ముందు అంబులెన్స్ ఆగింది.
   
    బిల బిల లాడుతూ అంబులెన్స్ లోంచి అరడజను మంది దిగారు.

 Previous Page Next Page