Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 21

       
                         మగవారి కృత్రిమయంత్రాలు

                          బుద్ధిహీనతకు స్మారకచిహ్నాలు
   
   నేడు నాజీ మారణయంత్రాల విజృంభణ ఆనాడు మగవాడి యీ కృత్రిమయంత్రాల విజృంభణ. ఈ యంత్రాలు రెండింటివల్ల మానవ నాగరికత ఎంత హీనస్థితికి వచ్చిందో తెలుస్తుంది. రెండింటిలోనూ మనుష్యునిలో ఉన్న పశుత్వం బయటపడుతుంది. రెండు శతాబ్దాలదాకా మరపురాని మహానర్ధకాలుగా-చిరస్థాయిగా ఉంటాయి.
    మగవాడి స్వలాభం కోసం స్త్రీని పనిముట్టుగా చేసుకున్నాడు. బానిసగా భావించాడు. దానికి ధర్మశాస్త్రాలు కల్పించాడు. స్త్రీ సరే అన్నది. ఎలాగో సుఖంగా ఉంటే చాలునన్నది.
    ఆ సౌఖ్యం ఇవ్వడానికి శక్తి చాలిందికాదు ఈ మగవాడికి. దీనికి తోడు వీడికి లీలా విహారంమీద మోజు పుట్టింది. బహుస్త్రీ లాలసత్వం కలిగింది.
    అసంతృప్త అయిన స్త్రీ ఏమి చేస్తుందో అని అనుమానం. తాను ఇతరులను చూచినట్టే, ఆడది గూడా పై చూపులకు పోతుందేమో అని సందేహం. తాను చేసింది ఒప్పు, ఆడది చేస్తే తప్పు అని సిద్ధాంతం.
    దీనితో బుద్ధికుశలత అంతా వినియోగించాడు. తాళాలు వేయటానికి సమకట్టాడు. కచ్చడాలు తయారుచేశాడు. స్త్రీని వశంవదగా చేశానని అనుకున్నాడు. ఇంకా ఎవరయినా "తప్పుతోవకు" పోతారేమో అని గ్రంధాలూ శాస్త్రాలూ, స్త్రీలను తిట్టడంతోను, వారినోళ్ళు కట్టడంతోను నింపివేశాడు.
    తూర్పువారిని చూచి పడమటివారు. ఒకరిని చూచి ఒకరు ప్రపంచం అంతా ప్రాకిపోయాయి కచ్చడాలు. చివరకు ఇవి అలంకారాలయి పోయాయి, కౌశలం చూపించడానికి మంచి అవకాశాలు కలిగాయి.
    వింతచేతనూ, విశేషంచేతనూ గ్రంధాల కెక్కాయి ఈ కచ్చడాలు. దురంతాలవల్ల కోర్టుల కెక్కాయి ఈ కచ్చడాలు. మగవాడి దుర్భుద్ధి చేతను దురహంకారంవల్లను ఈ కచ్చడాలు శాశ్వతంగా నిలబడ్డాయి.
    మగవారి కృత్రిమాలకు ఇవే స్మారకచిహ్నాలు. మగవారి స్వప్రయోజన బుద్ధికి ఇవే నిత్య సాక్ష్యాలు. మగవారి పక్షపాతబుద్ధికి ఇవే తార్కాణాలు.
    ఇటువంటి వాటిని ప్రవేశపెట్టి స్త్రీల ఆత్మగౌరవం పోగొట్టాడు. తన గౌరవం కోల్పోయాడు. "దొంగవాడా కరువకురా" అన్నట్టు చెడుగు చేయడానికి సూచన ఇచ్చాడు.
    ఇన్నిటినీ పరులమీద అధికారరీతిగానే ఆలోచించాడు గాని, తాను గూడా ఇలాంటి శ్రద్ధ పడితే బాగుండును అని అనుకోలేదు. తన్ను బాగు చేయడానికి యత్నించలేదు. లోకం మరావత్తుకు పూనుకున్నాడు. అందుచేతనే మగవాడి దోషం రెండింతలయింది. ఆడదానిలో తాను కోరిన మంచిగుణం తనలో లేదని గ్రహించడానికి జ్ఞానం చాలింది కాదు. తన స్త్రీకి ఒక కచ్చడం బిగించి, తాను మరొకయింటికి కచ్చడం భేదించడానికి బయలుదేరుతాడు-మూర్ఖుడు కాక మరేమి?
    ఇప్పుడు కచ్చడాలు వాడుకలో ఉన్నా లేకపోయినా, ఇలాంటి గుణం మాత్రం ఇంకా ఉందనే చెప్పాలి. ఇంకా అనుమానాలతో దహించిపోతూ ఉన్నవారు చాలామంది ఉన్నారు.
    వీరిలో చాలామంది అకారణపు అనుమానాలు అని గట్టిగా చెప్పవచ్చును. ఆ అనుమానాలకు కారణం ఆడవారు కారు; ఈ మగవారే అని గూడా నిరాఘాటంగా చెప్పవచ్చును. ఏమంటే, తాను అశక్తుడు. స్త్రీని రంజింపగలిగిన నేర్పు తనకు లేదు. ఆడదానిని సంతృప్తిపరచే ఉపాయం తానెరగడు.
    ఈలౌక్యం ఇతరులకు చెప్పడుగాని తనకు బాగా తెలుసు. ఆ తెలియడంవల్లనే ఈ అనుమానం. ఈ అనుమానంతోనే ఇలాంటి రాక్షస కృత్యాలకు దిగుతాడు. ఇది తప్ప మరి మార్గం లేదనుకుంటాడు. అదే మగవాని పొరపాటు.
    అలాకాకుండా, ఈ అసంతృప్తికి కారణం ఏమిటి అని తెలుసుకుంటే, ఇంత అనర్ధానికి దిగడు. సవ్యంగా ప్రవర్తిస్తాడు. అక్కడే కామశాస్త్రజ్ఞానం కావలసి ఉంటుంది. మగవాడికి ఆడదానికిగాని అసలు అల్పనిషిద్ధ గ్రంధం. ఆమాట అనకూడదు, వినకూడదు, మన కుటుంబాలలో.
    కాపరాలు కూలిపోతే పోవచ్చు, రంకుతనం బలిసిపోతే పోవచ్చు. తప్పులేదు. కాని, పిల్లలు కామశాస్త్రం చదవకూడదు. చూడకూడదు. శుష్కసూత్రాలతో కట్టిపడవేద్దాం అనుకుంటారు. మానవ హృదయాలను, దెబ్బతింటారంటే తప్పా, ఇంత సన్నాహంచేసి తయారుచేసిన కచ్చడాలు నిరర్ధకం అయిపోయాయంటే దోషమా? ఆమాటే చెప్పాడు అల్లసాని పెద్దన్న.
        ఇనుప కచ్చడాల్ గట్టుకొను మునిమ్రుచ్చులెల్ల
            తామరస నేత్రలిండ్ల బందాలుగారే?

 Previous Page Next Page