Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 20

       
                               మగవారి రాక్షసకృత్యాలు

                                     కచ్చడాలకూ వ్యభిచారానికీ ఉన్న

                                సంబంధం ఎంత?


    ఆడది నా సొత్తు అన్న బుద్ధి పుట్టింది. మగవాడు మర్కటమయి పోయాడు. ఎన్ని అనాచారాలకు పాలపడ్డాడో, ఎంత తెలివిమాలినతనం ప్రదర్శించాడో చెప్పలేము. ఆలోచనా పాలోచనాలేని వట్టి శుంఠ అయిపోయాడు. దయాదాక్షిణ్యం లేని క్రూరరాక్షసి అయిపోయాడు.
    ఆడుది కావాలన్న ఉబలాటం అంతరంగంలో వుంటుంది. దానివల్ల సౌఖ్యం తనకు కావలసిందే. తన జన్మకు, తన జీవనానికి ఆడుది అత్యవసరం అన్నమాట ఈ మగవాడికి తెలుసును.
    తన అక్క ఆడుది; తన తల్లి ఆడుది; తన భార్య ఆడుది; తన ఉంపుడుకత్తె ఆడుది. వీరి అందరివల్లా భవాన్ని, అనుభవాన్ని పొందుతున్నాడు. అయినా, మగవాడు స్త్రీని తిట్టినతిట్లు ప్రపంచంలో ఎవరూ ఏ వస్తువునీ తిట్టలేదు.
    స్త్రీ అంటే యమదూత అన్నారు, కఠోర విషసర్పం అన్నారు. మృత్యుదేవతకు దగ్గర చుట్టం అన్నారు. నమ్మకూడదన్నారు, నారీ పిశాచం అన్నారు. గ్రంధాలనిండా ఈ తిట్లే. పుస్తకాలన్నింటిలోనూ ఈ ఉపన్యాసాలే.
    ఆడుది అంటే అసహ్యం వేసేటట్లు చెయ్యడానికి ఎన్ని ఉపాయాలున్నాయో అన్నిటిని ఉపయోగించారు. ఎంత అన్యాయానికి ఒడికట్టడానికి వీలుందో అంతా చేశారు. ఇంకా తనివితీర లేదు. ఈ కచ్చడాలవంటి క్రూర పరికరాలకు కూడా దిగారు.
    ఇంతకన్నా మగవారి తెలివి తక్కువతనం ఏమికావాలి? ఇంతకన్నా అసూయా, చూపోపమీ, ఇంకేమిటుంటుంది? అయినా పెద్దవారమని తట్టపాగాలు పెట్టుకొని మాటలాడతారు. గంటలూ కలాలూ పట్టుకుని వ్రాస్తారు. "స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః" అని.
    అమ్మో! స్త్రీ దగ్గరకు చేరకు "అవసరదూరాత్" దూరంగా పారిపో అని వ్రాస్తారు. ఆడుదంటే మహా క్రూరసర్పానికన్నా కఠోర విషం ఉన్నదట. కర్కోటక విషానికయినా మందూ మంత్రం ఉంటే ఉండవచ్చునుగాని ఈ స్త్రీ విషానికి మరి మంత్రం లేదట.
    ఇలాంటి ముద్దుపేరులతో ముచ్చట్లు వ్రాశారు, వ్రాస్తున్నారు. ఆడువారేమయినా అనబోతారేమో అని వారిని ఆ జ్ఞాన సముద్రంలోనే పెట్టారు. మగవారి సౌఖ్యం - అదిగూడా ఏమి సౌఖ్యం; కేవలం పశుసౌఖ్యం - కోసం స్త్రీలను వినోద వస్తువులలాగా ఉంచారు. పెద్దరికం చెలాయించారు.
    ఆడువారే మగవారి సంగతి వ్రాయవలసివస్తే వారెంత చక్కగా వర్ణించి ఉందురో ఊహించు కోవలసిందే. మగవారి అయోగ్యత, అక్రమాలు, అశక్తి, అవకతవకలు అన్నీ వారు అచ్చొత్తినట్టు చూపగలుగుతారు.
    కాని, వారిని వ్రాయనిస్తామా? రౌరవనరకంలో పడదొయ్యమా? నామరూపాలు లేకుండా నాశనం చేయకుండా ఊరుకుంటామా?
    అలాంటి ప్రమాదం ఏమిరాకుండా ముందుగానే జాగ్రత్తపడ్డాం. పాతివ్రత్యం అనీ, పతిభక్తీ అనీ, పత్నీధర్మం అనీ కొన్ని అసత్యాలు పుట్టించాం. దేశంలో వాటిని అల్లించాం. ప్రజల రక్తనాళాలకు ఎముకులకు గూడా ఆ ధర్మాలు పట్టించాం.
    ఇంక మగవాడన్న వాడంతా దేవుడే. వాడు ఏమిచేసినా తప్పులేదు.
        ఎన్ని పూవులన్ వ్రాలదు తేటి?
        అట్ల, మగవాడను వానికి దోషమున్నదే?
    ఇలాంటి సూత్రాలతో ఆడవారిని వలలో వేశాం. ఇంక మగవారి అగచాట్లు వ్రాసే ఆడుది ఎక్కడుంటుంది? ఎంత సాహసం చెయ్యాలి?
    ఆడవారిని అంత నిర్జీవంగా చేసి పారవేసినా మగవాడికి తృప్తి తీరలేదు. ఈ కచ్చడాలు బిగించాడు, తాళాలు వేశాడు. పచ్చి పశువయినాడు. క్రూర రాక్షసుడయినాడు.
    ప్రగల్భాలకేమి: నాగరికత కోసం పాటుపడుతున్నానంటాడు. ప్రపంచం అంతా ఉద్ధరిస్తానంటాడు. వేదాంతం అంటాడు. భాష్యాలు వ్రాస్తాడు. తన పశుత్వాన్ని తాను చూసుకోలేకుండా ఉన్నాడు. తన్ను తాను గుర్తించుకోలేడు.
    దేనికి ఈ తిట్లు, ఈ కట్టళ్ళు, ఈ కచ్చడాలు? దేనిని నిర్మూలం చెయ్యడానికి ఈ ప్రయత్నం అంతాను? అసలు వారించాలని అనుకున్న గుణం ఒకటి ఉందా? ఎందుకు ఉంది? ఆ గుణం ఒక్క ఆడుదానికే ఉందా? మగవారికి గూడా కలదా? మగవారిని ఏమిచేశాము? ఈ ప్రశ్నలను ఎప్పుడయినా, విశాలహృదయంతో అడిగాడా? అడగడు. అలా అడగడానికి శక్తి చాలదు.
    శక్తి చాలదు-ఒక్క అడగడానికే కాదు; ఆడుదానిని సంతృప్తి పరచడానికి గూడా శక్తి చాలదు. సంతృప్తి పొందిన స్త్రీకి కచ్చడాల అవసరం అన్నదే ఉండదని గ్రహించడానికి బుద్ధిశక్తి చాలదు. ఆ లోపాన్ని కప్పిపుచ్చడానికి స్త్రీని నోటికి వచ్చినట్టు తిట్టడం, కచ్చడాలు వేసి బాధించడం, ఇదీ మగవాడి నేర్పు.
    స్త్రీలందరూ విచ్చలవిడిగా వ్యభిచరించాలని ఎవ్వరూ అనరు. అలా చెయ్యాలన్నా వీలుండదు. స్త్రీలందరినీ పతివ్రతలుగా చెయ్యడం ఎంత దుర్ఘటమో, అందరినీ వ్యభిచరించేటట్టు చెయ్యడంగూడా అంతా దుస్సాధ్యమే, దీనిని గురించి సందేహం ఎవ్వరికీ ఉండనక్కరలేదు.
    లోకంలో వున్న స్త్రీల కందరికి కచ్చడాలు బిగించినా వ్యభిచారం ఆగదు. అలాగే లోకంలోని స్త్రీలనందరిని విచ్చలవిడిగా స్వేచ్ఛగా విడిచి పెట్టినా, అందరూ వ్యభిచరించరు. స్వభావం అనీ, సందర్భం అనీ అనేక విషయాలున్నాయి. కొన్ని కారమాలు సమకూరితేగాని ఈ కార్యం కలగదు.
    బుద్ధిగలవాడయితే మగవాడు ఆ కారణాలు లేకుండా చేసే ఉపాయం ఆలోచించాలి. మూలకారణం ఏమిటో గ్రహించాలి. అది ఎక్కడుందో- స్త్రీలోనా, పురుషుడిలోనా- తెలుసుకోవాలి. అప్పుడు ఆ కారణాన్ని నిర్మూలనం చెయ్యాలి.
    ఈ ప్రయత్నం అంతటిలోనూ సంభోగవాంఛ అన్నది ఆహార వాంఛలాగాను, నిద్రావాంఛ లాగాను, ఒక స్వభావ సిద్ధమయిన వాంఛ అని మాత్రం మరచిపోకూడదు. ఈ వాంఛకు గూడా ఒక తృప్తి, ఒక తనివి అన్నవి ఉండాలి.
    తిండి చాలకపోతే ఎంగిలి ఆకులకు పోతారు. నిద్ర చాలకపోతే మండుటెండలోనయినా బండరాతిమీద కునుకుతారు. అన్నిటిలోనూ ఇదే తత్వం.

 Previous Page Next Page