Previous Page Next Page 
విషవలయం పేజి 20

    నాకు బొత్తిగా కాలక్షేపమవటంలేదు. అన్నయ్యకూ అంతేనట. ఇక్కడికి మీ రెప్పుడు వస్తారు? ఈ ఊరికో మీకు పూర్తిగా ఋణం తీరిపోయిందా? మరి సామాను తీసుకుపోవటానికికయినా రారూ? మీకేం? మీరు లక్షాధికారులు. ఈ కొద్దిపాటి సరంజామా ఉన్నా, లేకపోయినా మీకు లెక్కలోది కాదు. కాని...దీన్ని కాపలా కాయలేక మేము పడే యిబ్బంది ఉందే__దాని విషయం మీరు కాస్త ఆలోచించాలి. అదీగాక నాకు మిమ్మల్ని చూడాలని ఉంది... అన్నయ్యకూడా మీకు ఉత్తరం రాద్దామనుకున్నాడు. కాని వాడికి వంట్లో బాగుండలేదు. జ్వరం వస్తోంది రెండురోజుల్నుంచి మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు. మీ నాన్నగారి కుశలం తెలియబరుస్తూ వెంటనే సమాధానం రాయండి, ఉంటాను.

   
                                                                                                                                                                      ఉష.


        ఈ ఉత్తరం తనకి చేరీ చేరగానే వెంటనే జవాబు రాయాలని మనసు ఆరాటపెట్టింది. కాని అప్పుడు తాను చాలా గంద్రగోళంలో, హడావుడిలో వున్నాడు. మానసికమైన విశ్రాంతి ఏమీ వుండేదికాదు. "నాన్నగారు పోయారు" అని కనీసం ఒక్క ముక్క రాసి పదేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. ఇంట్లోని విషమ వాతావరణంవల్ల ఈ ఉత్తరం అతన్ని రేపవలసినంత ఉత్సాహం రేపలేదు మరో పరిస్థితులలో ఈ లేఖ వచ్చివుంటే ఎంత ఉత్సాహంగా, ఆదుర్దాగా జవాబు ఇచ్చి వుండేవాడో!

    కాని ఇప్పుడు స్తబ్దుగా వుంది. మనసు ఇంటివైపు మొగ్గడంలేదు. పైగా తలనిండా ఇంకా ఎన్నో సమస్యలు అలుముకొని ఉన్నాయి.

    ఏమనుకొంటూ ఉంటుంది తననిగురించి ఉష! అసలు ఏమీ అనుకోవటంలేదేమో! అనుకోకుండా ఎలా ఉంటుంది?

    బయటనుంచి చలిగాలి రివ్వుమని వీస్తోంది. అతను కిటికీ తలుపులు మూసివచ్చి, కుర్చీలో కూర్చుని ఉషకు ఉత్తరం రాయటానికి ఉపక్రమించాడు కాని ఎంత ప్రయత్నించినా, ఎంత ఆలోచించినా అతనికి లోపల్నుంచి మునుపటి ఆప్యాయత, ఆత్రుత ఉత్పన్నం కావటంలేదు. కారణము ఏమిటి? తాను మనిషి మారాడా? ఆమెని మరిచిపోతున్నారా?

    అంత చంచలుడా తను?

    "నాన్నగారు మరణించారు. ఈ ప్రతికూల పరిస్థితులలో వెంటనే జవాబివ్వలేకపోయాను. మీ అన్నయ్యకి జ్వరం తగ్గిందా?"

    ఇంతే. ఎంత అనుకునా, ఇవే ముక్కలు.

    అతను భారంగా ఉత్తరం ముగించాడు.

    కాసేపు గడిచాక క్రింద గేటుదగ్గర రిక్షా ఆగిన చప్పుడయింది. తర్వాత "సత్యం! సత్యం!!" అని పిలుస్తూ రామకృష్ణయ్యగారు పైకివచ్చి గదిలోకి తొంగిచూసి "ఏం చేస్తున్నావురా? ఏది ఒక రూపాయివుంటే ఇవ్వు. రిక్షావాడికి ఇవ్వాలి. అబ్బబ్బ! ఎంతపని! ఎంతపని!! ప్రాణం విసుగొస్తోంది. కూడానూ" అన్నాడు హడావుడిగా.

    సత్యమూర్తి మాట్లాడకుండా డ్రాయరు సొరుగులోంచి పర్సుతీసి డబ్బుతీసి, లేనివెళ్ళి తండ్రికి యిచ్చివచ్చాడు.

    ఆయన "చంద్రయ్యా! చంద్రయ్యా" అని కేకేస్తూ "ఏడీ వీడు? ఎక్కడ చచ్చాడు? క్రిష్ణ క్రిష్ణ మళ్ళీ నేను క్రిందికి దిగిచావాల్సిందే" అని విసుక్కుంటూ, గింజుకొంటూ మెట్లు దిగివెళ్ళి రిక్షావాడికి డబ్బులిచ్చిపంపేసి మళ్ళి వగరుస్తూ పైకి వచ్చాడు.

    "లోపలికి వచ్చి కూర్చో నాన్నా" అన్నాడు సత్యమూర్తి జాలేసి.

    రామకృష్ణగారు దృఢకాయుడే. కాని కొంతకాకపోతే కొంతయినా వయసు రావడంవల్లా, విపరీతంగా శ్రమపడటంవల్లా మనిషి తరచు ఆయాసపడుతూ ఉంటాడు. లోపలికివచ్చి వాలుకుర్చీలో చతికిలబడి "అమ్మయ్య" అని ఉస్సురని  "ఇవాళ చాలా శ్రమ అయిపోయిందిరా అబ్బాయి" అన్నాడు.

    "ఏమిటి నాన్నా!"

    "మీ నాయన ఒక్క విషయం సరిగ్గాచెప్పకుండా, అనేక పీకులాటలు పెట్టి చచ్చాడోయి" అన్నాడాయన.

    పరాయి వ్యక్తితో మాట్లాడినట్లు మాట్లాడుతోన్న ఆయన ధోరణికి విస్మతుడై తండ్రివంక ప్రస్నార్ధంకంగా చూశాడు సత్యమూర్తి.

    "ఇన్నాళ్ళబట్టి వచ్చిపోతున్నాగాని అయినవాడినని ఏ సంగతీ విపులంగా చెప్పాడా చచ్చాడా ఏమన్నానా? అయ్యో మనవాళ్ళే విషయం ఎరుకపరిస్తే ముందు ముందు ఆదుకుంటారు. అన్న జ్ఞానం లేకపోయె ఆ...డబ్బు దాచుకున్నట్లే పత్రాలు గిత్రాలూ అయినకాడికి లేనికాడికీ కూడా తెగదాచుకున్నాడు." అని ఆయన రుంజుకున్నాడు.

    "ఏం జరిగింది నాన్నా?"

    "అప్పటికీ రాత్రింబవళ్ళు ఆచిఠ్ఠాలూ, దస్త్రాలూముందు వేసుకుని, శ్రద్దతో పరిశీలిస్తున్నానా? ఒక్క విషయం సరిగ్గాబోధపడదే. ప్రతిదాంట్లోనూ ఏదో గుళ్ళకషాయం బోసుగు. ఎంత రావలసివుందో, ఎంత ఇవ్వవలసివుందో ఏమీ తేలడములేదు. అంతా అయేటప్పటికి ఎంత నష్టపోతామో తెలీదు. ఇన్ని గంద్రగోళపు వ్యవహారాలు ఒక్కచేతిన ధాటిగా నడిపించాడంటే__మీ నాన్న ఉద్దండుడేరా అబ్బాయి!

    కొడుకేం మాట్లాడలేదు.

    "అందులోనూ ఆస్తి సగానికి సగం ఇద్దరికీ పంచాడు. సరియైన ఒప్పందాలు లేనిదే నిక్కచ్చిగా తేలి చస్తుందా ఏమన్నానా? ఆ రాధమ్మ అసలే గయ్యాళి మనిషి దానికి తోడు అగ్గిమీద గుగ్గిలంగా ఆ వీరభద్రంగాడు..."
 

 Previous Page Next Page