లోపల టీ తయారుచేస్తూ ప్రేమీ ఈ మాటలన్నీ వింది. టీ గ్లాసు రామచంద్రకు అందించి, "రాత్రి ఇక్కడే భోజనం" అని చెప్పింది.
"ప్రభాకర్ రమ్మన్నాడే భోజనానికి!"
"తప్పించుకోవాలని చూడకు! ఈ రాత్రి ఇక్కడే నీ భోజనం! రేపు నీ ఇష్టం!"
"నువ్వు ఆజ్ఞ ఇవ్వడం, నేను కాదనడమూనా?" టీ తాగాక రామచంద్ర లేచాడు, ఫ్రెండ్సు ని కలిసి రాత్రికి వచ్చేస్తానని చెప్పి!
రాత్రి ఎనిమిది అయినా అతడు తిరిగి రాలేదు.
"నువ్వు తినెయ్, నాన్నా! ప్రొద్దుమీరితే నీకు అన్నం అరగదు!"
"అతడు రానీ, పాపా!"
రామచంద్ర మరోగంటయినా రాకపోయేసరికి "రామూ జతకి నేనుంటానుగా, నాన్నా? నువ్వు తినెయ్!" అంటూ తండ్రికి భోజనం పెట్టేసింది.
టేబిల్ మీద గడియారంకేసి చూస్తూ నిరీక్షించసాగింది ప్రేమీ. చిన్న ముల్లు పడిమీదికి వచ్చింది. ప్రేమీ అసహనంగా, ఆశా భంగం చెందినట్టుగా అనుకొంది. 'అందరికీ నేనిచ్చేవాడినేగాని ఎవరిదగ్గరా నేనేం తీసుకోను' అన్న ఈ అహం ఎందుకో? వెళ్ళేముందు చెప్పడానికి వస్తాడు కాబోలు! రాకపోయినా ఆశ్చర్యంలేదు. వస్తే మాత్రం చస్తే మాట్లాడను!"
కాని, రామచంద్ర వచ్చాడు.
ప్రేమీ ఇంకా తినలేదని తెలిసి నొచ్చుకొన్నాడు. "ఫ్రెండ్సు తో మాట్లాడుతూంటే రాత్రయిపోయింది! వేళకి బస్సులు కూడా దొరకలేదు! నువ్వు తినేయాల్సింది ప్రేమికా!"
"నిన్ను భోజనానికి పిలిచి నేను తినేస్తానని ఎలా అనుకొన్నావు? పద, కాళ్ళు కడుక్కో. కాసేపయితే పాచిముఖాలు పడతాయి!" తండ్రి కట్టుకునే లుంగీ అందించింది.
రామచంద్ర కళలు కడుక్కొని వచ్చాడు. "నా ఒక్కడికే వడ్డిస్తున్నావేం? నువ్వూ పెట్టుకో."
ప్రేమీ తనకు కూడా వడ్డించుకొన్న తరువాతే అతడికి వేసిన పీటమీద కూర్చొన్నాడు. "ప్రేమికా! నాన్న నీగురించి చాలా బాధపడుతున్నాడు. నీకు పెళ్ళయితే ఆయనకు నిశ్చింతగా ఉండేది! పెళ్ళంటే నీకెందుకిష్టంలేదు?"
"పెళ్ళంటే ఇష్టం లేదని ఎవరన్నారు?" ప్రేమీ నవ్వుతూ అడిగింది.
"ఇదే తప్పించుకోవడమంటే! నేను నీసంగతి అడిగితే నువ్వు ణా సంగతి అడుగుతావేమిటి?"
"నువ్వు మనిషివి కావా? నీకు పెళ్ళీడు రాలేదా?"
"నాగురించి బాధపడడానికి ఎవరూ లేరు! నీసంగతి అలాకాదు!"
"నువ్వే అందరి గురించీ బాధపడతావుగాని, నీగురించి ఎవరూ బాధపడరని ఎందు కనుకొంటున్నావు?"
"ఎవరున్నారు నా గురించి బాధపడడానికి?" విస్మయంగా అడిగాడు.
జవాబు చెప్పకుండా తలొంచుకొని అన్నం తినసాగింది ప్రేమీ. "ఎవరూ లేరా? రామూ, నువ్వింత అంధుడివా? నేనేతప్పుగా ఊహించుకొన్నానేమో! చిన్నప్పుడు జీవితంలో ఎదగాలన్న జిజ్ఞాస, పెద్దయ్యాక పేదల కన్నీళ్ళు తుడవాలన్న ఆర్తి, నీకు ప్రేమగురించి, జీవితంపంచుకొనే మనిషి గురించి ఆలోచించే తీరికెప్పుడు చిక్కించి? ఆ తీరిక ఇప్పుడు చేసుకొమ్మని, నీకళ్ళేదుట ఉన్న ఆ మనిషికి గుర్తించమని ఎలా చెప్పను?'
"నా అంటూ ఎవరూ లేనివాడిని! పైగా మగవాడిని. ఎలావున్నా నన్ను విమర్శించే వాళ్ళులేరు. నాకూ నీకూ పోలికలేదు, ప్రేమికా! ఒక విధంగా నా జీవితంలో పెళ్ళి అసంభవమనే అనుకొంటాను. సంసార బంధంలో చిక్కుకొంటే ప్రజాసేవ ఇంత స్వేచ్ఛగా చేయలేను! ప్రజాసేవలో దొరికే ఆనందాన్ని సంసారంలో పొందలేను."
"పెళ్ళి చేసుకోవడంవల్ల నువ్వు స్వేచ్ఛని పోగొట్టుకోగలవని ఎందుకనుకొంటున్నావు? నీ ఆదర్శాలే తనవి చేసుకొని నీ ఆనందంలో భాగం పంచుకోగల యువతి దొరికితే నీకు అభ్యంతర మేమిటి?"
"అలాంటి యువతి ఉంటుందని కాని, ఉండాలని కాని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ జీవితాన్ని పూర్తిగా ప్రజాసేవకు అంకితం చేయాలన్న ఆలోచన తప్ప నాకు మరొకటి తోచదు!" రామచంద్ర ఈ మాట అంటూ కంచంలో చేయి కడుక్కున్నాడు. "అరే! అన్నంలో చెయి కడిగేసుకొన్నావేమిటి?"