బాక్టీరియా వృద్ధిచెంది కనీసం ఒక్క క్రిమైనా కుండలో నుంచి బయటికి వస్తే అది చనిపోయిన వ్యక్తి యొక్క పునర్జన్మగా భావించి జీలుగ కల్లు తాగి గూడెమంతా పండుగ జేసుకుంటారు. ఆ తర్వాత గూడేనికి నలుదిక్కులా అవయవాల్ని పాతి పెడతారు. అలా చేస్తే పొరుగున ఉండే భూతాలు, ప్రేతాలు గూడెంలో చేరకుండా చనిపోయిన వ్యక్తి కాపాడతాడన్నది వారి నమ్మకం.
తరతరాలుగా వస్తున్న ఇలాంటి సంప్రదాయాన్ని మార్చే ప్రయత్నం కాదు చైతన్య చేసింది. సహజంగా ధైర్యవంతులయిన వాళ్ళే తరచుగా క్రూరమృగాలకు బలయ్యేది. అందుకే మేనీటర్ కు ఏ వ్యక్తి బలిఅయినా, ముందుగా తనకు తెలియపరి చేటట్టు చేయాలని వారిలో బలమయిన విశ్వాసాన్ని కలిగించాడు. యుక్తిగా గెలిచాడు.
తుపాకీ పేలడానికి అవసరమైన సేప్టి కాచ్ ఆఫ్ లో ఉండటంతో అదృష్టవశాత్తూ అది యువకుడి చేతిలో పేలలేదని, చైతన్య మాత్రం వారికంటపడకుండా దాన్ని ఆన్ లోకి మార్చేడని అందుకే అది పేలిందని తెలీని ఆ అమాయకులకి దేవుడిలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.
"పొద్దుపోయేసరికి ఇళ్ళకు చేరండి. తలుపులకి గడియపెట్టి అవసరమయితే దూలాన్ని అడ్డంగా వుంచి నిద్రపొండి. సమీపంలో ఏ అలికిడి వినిపించినా డబ్బాలపైనో, గిన్నెలపైనో గట్టిగా శబ్దం చేస్తూ కూర్చోండి. మీకేదన్నా హాని జరుగుతుందన్న అనుమానం కలిగితే గుంపులుగా బయలుదేరి గట్టిగా కేకలువేస్తూ రెస్టుహౌస్ కి రండి."
10
పొద్దు గూకుతోంది. ఇంకా తిరగాల్సిన పల్లెలు చాలా వున్నాయి. ఈరోజుకి కార్యక్రమం ముగించుకోవాలని ఆలోచించిన చైతన్య వొంటరిగా బయలుదేరాడు జీప్ ఆపిన చోటుకి.
ఏడుమైళ్ళదూరం నడవాలి. పైగా అంతా కొత్త ప్రాంతం. సూర్యుడు చీకటి వేటుకు గాయపడ్డ సైనికుడిలా రక్తం కక్కుతున్నాడు. ఆ రక్తం ఒలికిన పశ్చిమాద్రి పులివాతపడ్డ కళేబరంలా మసకబారుతోంది.
మరో రెండుమైళ్ళ దూరం. చీకటి ముసురుకుంటున్న అడవి చిత్రమైన ధ్వనులతో భీతిని గొలుపుతోంది. వడివడిగా అడుగులు వేస్తున్నాడు.
ఇంతలో హఠాత్తుగా దిక్కులు పిక్కటిల్లేట్టు, అడవి దద్దరిల్లేట్టుగా వినిపించింది పులి గాండ్రింపు. ఎంతో దూరంలోకాదు, చాలా సమీపంలో.
క్షణంపాటు రక్తం స్తంభించినట్టయిన చైతన్య టక్కున ఆగిపోయాడు. రైఫిల్ ను పైకెత్తి ట్రిగ్గర్ పై వేలినుంచాడు. అతని జ్ఞానేంద్రియాలన్నీ చాలా ఏకాగ్రతగా పనిచేయడం మొదలుపెట్టాయి.
భయంకరమయిన నిశ్శబ్దం మళ్ళీ. సరిగ్గా అదే ఎలాంటి ధైర్యవంతుడయిన వేటగాడినయినా తప్పుదోవ పట్టించేది.
ఓ పెద్దపులి ఎక్కడో పొంచి ఉందన్న ఆలోచన ఎంత భీతావహమయినదీ అనుభవంతోకాని అర్ధంకాని విషయం. ఓ బండరాయికి చేరువగా వున్న కనీసం ఒక చెట్టును ఆనుకుని వున్నా ఒక పక్కనుంచయినా ఆత్మరక్షణ గావించుకుంటూ దాని అలికిడిని పసికట్టే ప్రయత్నం చెయ్యొచ్చుగాని, చైతన్య ఇప్పుడు నిలబడింది నిలువెత్తు గడ్డి దుబ్బల అంచున, ఎంతో నిశితంగా పరీక్షిస్తే తప్ప గడ్డిదుబ్బల్లోంచి మెల్లగా కదిలే మేనీటర్ గమనాన్ని గుర్తించడం కష్టం గాలికి తల లూపుతున్న గడ్డిదుబ్బల్లోకి చూస్తున్నాడు చైతన్య.
అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు అతడికి వినిపించేటంత నిశ్శబ్దం.
ఒక జింక గడ్డి దుబ్బుల్లోంచి పరుగెత్తినప్పుడు చప్పుడుతో పాటు దుబ్బులు హడావిడిగా విడిపోతుంటాయి. కాని, పాములా ప్రాకుతూ కదిలే మేనీటర్ స్టాకింగ్ సమయంలో ఒక్క గడ్డిపోచ సైతం క్రిందికి వాలకుండా జాగ్రత్త పడుతుంది. అదే దాని ప్రత్యేకత.
సరిగ్గా మరో నలభై సెకండ్ల తర్వాత చాలాచేరువలో భారీగా వున్న ఓ జంతువు కదులుతున్నట్టు భూమిపై ప్రకంపనలు.
ప్రమాదాన్ని పసిగట్టిన చైతన్య వేగంగా వెనక్కి తిరిగాడు.
మరీ దగ్గర్లో కాదు గాని, రైఫిల్ రేంజ్ కు మించనంత దూరంలో అతనికి కుడిపక్కగా సింధూర చెట్లలోంచి బయటికి వచ్చింది చాలా భారీగా వున్న మేనీటర్.
అదే సమయంలో సింధూర వృక్షాల పక్కనున్న కాలిబాటపై నడుస్తున్న ఓ వృద్ధుడ్ని చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. అలాంటి వేళ అందునా మేనీటర్ కధలతో నిండిన ఆ ప్రాంతంలో ఆ వృద్ధుడు కనిపించటం అందులోనూ తనకేమీ కానట్టు తీరుబాటుగా నడవడం చాలా ఆశ్చర్యాన్ని కలుగచేసింది.
చేతికర్రతో ఆ సన్నని కాలి మార్గాన్ని వెదుకుతూ నడుస్తున్న ఆ ముసలివాడు అంధుడని గుర్తుపట్టడానికి చైతన్యకు అట్టేసేపు పట్టలేదు.
అప్పటికే పులి అతడిపై చార్జి చేయడానికి చాలినంత దగ్గరగా వచ్చేసింది.
అనాలోచితంగా పులిని ఘాట్ చేస్తే పొరపాటున, లేక వృద్ధుడు బుల్లెట్ మార్గంలోకి వచ్చినా చేజేతులా అతడి చావుకి తనే కారణమవుతాడు. ఆలోచిస్తూ కాలయాపనచేస్తే తన ప్రయత్నంతో పనిలేకుండానే పులికి అతడాహారమైపోతాడు. మేనీటర్ చార్జిచేసే ప్రయత్నంలో తోకను పైకి లేపింది బలాన్ని కూడగట్టుకుంటూ. మరుక్షణం చైతన్య చేతిలోని తుపాకీ తూటాల్ని కక్కింది.
చైతన్య అలా కాల్చింది పులిని గురిచూసి కాదు. పులికి అయిదడుగుల నిలువెత్తున వున్న ఓ చెట్టు కొమ్మల్లోకి.
చైతన్య ఊహ తప్పు కాలేదు. క్షణాల వ్యవధిలో వృద్ధుడ్ని నోట కరవబోయిన పెద్దపులి ఊహించని పరిణామానికి ముందు బిత్తరపోయింది. తరవాత వెనక్కు మరలి పొదలగుండా అడవిలోకి పరుగు తీసింది.
ఆబ్జెక్ట్ స్పష్టంగా కనిపించని ఆ క్షణాన రిస్కు తీసుకోవడం ఇష్టంలేని చైతన్య వెనువెంటనే పైకి గురి చూసి తుపాకి పేల్చాడమన్నది కేవలం పులిని తరిమేయాలన్న ఉద్దేశ్యంతోనే.
"గుడ్ గాడ్!" ప్రమాదం తప్పిన ఉద్వేగంతో చైతన్య పులి పరుగు తీసిన పొదలగుండా వేగంగా అనుసరించాడు.
చీకటి గుయ్యారంలా మారిపోయింది అడవి అప్పటికే. కొంతదూరం వరకూ ఆగకుండా వెళ్ళిన చైతన్య ఎదురుగావున్న రెల్లుపొదల్లోకి ఏదో అలికిడయ్యేసరికి ఆగిపోయాడు.
సూటిగా రెల్లుపొదల్ని చేరకుండా ఒక్కో అంగలో ఒక్కో సింధూరపు చెట్టును చేరుకుంటూ పొదల అంచున వున్న ఓ చెట్టుమాటున ఆగిపోయాడు.
అతడు వెంటాడుతున్నది రెండు కాళ్ళ హోమో సేపియన్స్ అంటే అణుమాత్రమయినా భయంలేని మేనీటర్ అన్న విషయాన్ని మరిచిపోలేదు.
పొదలవేపే దృష్టిని కేంద్రీకరిస్తూ నిలబడ్డాడు కొంతసేపు. ఆ నిశ్శబ్ద నీరస వాతావరణంలో అతని గుండె చప్పుడు అతనికే చాలా స్పష్టంగా వినిపిస్తోంది.
ఆయాసంతో రొప్పుతున్న చైతన్య హఠాత్తుగా ఉలికిపడ్డాడు. తను నిలబడ్డ చెట్టుపై నుంచి ఓ కొండముచ్చు (లంగూర్)వికృతంగా అరిచేసరికి.
అంటే పులి సమీపంలోనే ఎక్కడో నక్కి ఉందన్నమాట.
కళ్ళు రిక్కించి చీకటిలోకి చూస్తూ నిలబడ్డ చైతన్య ట్రిగ్గర్ గార్డు పైనుంచి వేలిని కదపలేదు.
నిముషాలు గడుస్తున్నాయి.
ఇంతలో తప్పిపోయిన అవకాశానికి క్రోధం చెందినట్టు గాండ్రించిన పులి దూరంగా పచ్చిక బయళ్ళపై నుంచి గుట్టమీదికి పరుగెత్తుకు వెళుతోంది.
మసక వెలుతురయినా చీకటి పూర్తిగా ఆవరించని ఖాళీ ప్రదేశం కావడంతో పులి చాలా స్పష్టంగా కనిపించింది.
దాన్ని ఆకారాన్ని అంచనా వేయగానే అటవీశాఖ అధికారిగా ఎన్నో పులుల్ని చూసిన చైతన్య గుండె లయ తప్పినట్టయింది.