సుమారు పది అడుగుల పొడవుతో రమారమి మూడున్నర అడుగుల ఎత్తుగల అంతటి బలిష్టమయిన పులిని చూడటం అదే తొలిసారి.
తొలిరోజునే అనుకోని స్వాగతం, ఊహించని పరిచయం.
అప్పటి సంఘటనలో మేనీటర్ అనుసరించిన పద్ధతిని బట్టి అది సాహసం గలదే కాదు. ప్రమాదాన్ని బట్టి అప్రమత్తంగా మెలిగే తెలివయిన జంతువు కూడా అని గ్రహించాడు చైతన్య.
పోరాటం మొదలయింది....
ఓడితే ఒక తల్లికి కడుపుకోత మాత్రమే.
గెలిస్తే ఎందరో తల్లుల గుండె కోతకు వారధి పడుతుంది.
ఈ సంఘర్షణ చివరి ఘట్టం వేటాడ్డమో, వేటాడబడటమో కాలమే నిర్ణయించాలి.
వెనక్కి తిరిగాడు చైతన్య.
మరికొన్ని నిమిషాలలో అప్పటికే మైదానంలోకి చేరుకున్న వ్యక్తిని కలుసుకున్నాడు.
చైతన్య అనుకున్నట్టు అతడు అంధుడే కాని, వృద్ధుడుకాదు. నలభయ్యేళ్ళకే వృద్ధాప్యంలో అడుగుపెట్టిన వ్యక్తిలా అనిపించాడు.
ప్రమాదకరమయిన పరిస్థితుల్లో సైతం అరణ్యాలలో ప్రవేశించడం బతుకు తెరువుకి ఆధారమయిన అటవీ సంపద కోసం వారు ఆరాటపడటం అసాధారణ విషయంకాదు.
కాని, అతడు అంధుడు. అటవీ సంపదకోసం వచ్చివుండడు. పైగా ప్రమాద భూయిష్టమయిన పరిసరాల్లో, అదీ ఆ సమయాన అంత యధాలాపంగా నడవటం చైతన్యకు అమితంగా ఆశ్చర్యపరచిన విషయం.
భుజంపై చేయి పడగానే ఆగిన ఆ వ్యక్తి, "కొత్తగా వచ్చారా, బాబూ" అన్నాడు. తాకింది ఎవరో గ్రహించినట్టు.
తన గురించి తాను పరిచయం చేసుకున్న చైతన్య, "ఈవేళలో ఇలా ఎందుకు రావాల్సి వచ్చింది" అన్నాడు మామూలుగానే.
వెలుగూ చీకటి రెండూ తనకు ఒకటే అన్నట్టు నల్లటి చారికల మధ్య పాలిపోయిన కళ్ళను కదిలిస్తూ నిర్లిప్తంగా నిలబడ్డాడతను.
జవాబు చెప్పలేని అతని పెదవులు సన్నగా ఒణకడం చైతన్య గమనించలేదు.
"ఎలాంటి ప్రమాదంలో ఇరుక్కునేవాడివో తెలుసా?" సాధ్యమయినంత సౌమ్యంగా అడిగాడు.
అంతే....
ఏ గుండె వాగుకు గండి పడిందో, ఏ మనసు పొరచిట్లి మెదడు నరాలను మెలిపెట్టి నిక్షిప్తమయి వున్న నిప్పుసెగల్ని పైకి చిమ్మిందో_లావాలా ఉబికిన కన్నీళ్ళు క్షణంపాటు అతన్ని కలవర పెట్టాయి. కుదిపేశాయి.
"ఎప్పుడో చచ్చిపోయిన దానయ్యకి ఇప్పుడు పెమదమేటి, బాబూ?"
ఎందుకు రక్షించావన్న ప్రశ్న వినిపించింది దానయ్య గొంతులో.
"ఇంకా ఏం మిగిలిపోనాదని నాను బతకాల, బాబూ?"
నిస్సహాయంగా వణికింది దానయ్య కంఠం.
"బాబూ!" తడుముతూ చైతన్య చేతుల్ని పట్టుకున్నాడు.
"నాను పోగొట్టేసుకున్నది కళ్ళొక్కటేకాదు, బాబూ! కట్టుకున్న దాన్ని, కన్నోల్లనికూడా."
దానయ్య గొంతులోని జీర చైతన్యని కొద్దిగ కదిలించింది.
"నువ్వొంటరివాడవా దానయ్యా?"
ఆమాత్రపు సానుభూతికే కదిలిన దానయ్య కొన్ని క్షణాలవరకూ దుఃఖం నుంచి తేరుకోలేనట్టు మోచేతిని అడ్డంగా పెట్టుకుని కుమిలిపోయాడు.
"దేవుడు మాసెడ్దోడుబాబూ! ఉన్నదాంతో కడుపునీ, కట్టుకున్న దాంతోపిల్లల్నీ కళ్ళారా సూసుకుంటూ బతికున్నన్నాళ్ళూ బతికేద్దామనుకుంటే....మాయదారి పులికి ఆల్లని అప్ప చెప్పేసి మాయరోగంతో నా కళ్ళూ తీసుకుపోయి నాకు మా సెడ్డ అన్నెయం చేసినాడు...."
పూడుకుపోయిన గొంతుతో ఇక మాటాడే శక్తిలేనట్టు దానయ్య నలిగిపోతుంటే అనునయంగా భుజంపై చేయివేశాడు.
ఇటు కళ్ళు లేక, అటు ఆడుకొనే దిక్కులేక మానసికంగా అతడెంత చిత్రవధ అనుభవిస్తున్నదీ గ్రహించిన చైతన్య ముందుకు నడిపిస్తూ, "ఇక్కడ ఉన్నవాళ్ళంతా పోయేవాళ్ళే. పోయినవాళ్ళను తలుచుకుంటూ ప్రమాదాల్ని కొని తెచ్చుకోవడం మంచిదంటావా!" ఆధ్యాత్మికంగా ఓదార్చబోయాడు.
"పెమాదమని తెలిసినా, పోయిన నా వోళ్ళని రోజూ యిలగబోయి పలకరించి రావడం నాకు అలవాటై పోనాది బాబూ!"
అతడేం చెబుతున్నది ముందుగా అర్ధంగాలేదు చైతన్యకు.
కళ్ళను కోసుకు వస్తున్న అశ్రువులు దానయ్య కళ్ళల్లో తళుక్కుమన్నాయి.
"ఆ గుట్ట ఉన్నాది సూసేవా బాబూ!"
గుడ్డివాడయినా, అలవాటైన పరిసరాలు కావడంతో ఇంచుమించు గుట్ట ఉన్న దిక్కుకేసి వణుకుతున్న చేత్తో చూపుతూ, "నా వోళ్ళని నాను సేతుల్తో మట్టి కలిపిందక్కడే బాబూ! అందుకే....నన్నొగ్గి నాకెందుకు అన్నేయం సేసారరరర్రా అనడానికి రోజూ ఆళ్ళకాడి కెళతాను. ఆలుబదులు సెప్పకపోయినా, గుండె మంట సల్లారీవరకూ అక్కడ ఏడుస్తా కూకొని, పొద్దు గూకీయేలకి ఇంటికి బయలెల్తాను" తుండుగుడ్డతో కన్నీళ్ళు వత్తుకున్నాడు.
"ఉండేదెక్కడ?"
అప్పటికే పూర్తిగా చీకటి ఆవరించి ఉండటంతో, అవసరమయితే ఇంటివరకూ తోడు వెళ్ళాలనుకున్నాడు.
"గుడ్దోడయిన నాకు సీకటేటి బాబూ?" చైతన్య మనసులోని ఆలోచనల్ని గుర్తించినట్టుగా అని, "రెండు మైళ్ళ దూరంలోని వంజెర మాపల్లి" బదులు చెప్పాడు.
"తోడు రమ్మంటావా!"
"ఒంటరోడ్ని. నాకు తోడెందుకు బాబూ!" విచిత్రమయిన వేదాంతాన్ని ధ్వనింపచేసి కర్ర తాటించుకుంటూ వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు దానయ్య.
చీకటిలో అతడు కనుమరుగయ్యేవరకూ స్థబ్దంగా నిలబడిపోయాడు చైతన్య.
ఒక నిర్భాగ్యుడి వేదనకు నేపథ్యంలా ఓ గాలి చైతన్యను జాలిగా స్పృశించి వెళ్ళిపోయింది.
ఎందరి ఆక్రందనలో గుండెలో దాచుకున్న అడవి దిక్కుమాలిన శవంలా సద్దుమణిగింది.
తొలిరోజు అనుభవాన్ని మననం చేసుకుంటూ జీప్ వున్న ప్రదేశానికి చేరుకోవాలనుకున్న చైతన్య సందిగ్ధంలో పడ్డాడు. ఆ నిశీధిలో సరిగ్గా జీప్ ఎక్కడ విడిచిందీ గుర్తించలేకపోయాడు. పైగా టార్చికూడా తేలేదు.
అట్టే పరిచయంలేని అడవిలో పైగా చీకటివేళ జీప్ కోసం దేవుళ్ళాడడంలో అర్ధం లేదనిపించింది.
అదృష్టవశాత్తు ఆకాసంలో ఉదయించిన చంద్రుడు కొద్దిపాటి వెలుగురేఖల్ని చిమ్ముతుంటే వీలయినంత త్వరగా రెస్టు హౌస్ కి చేరుకోవాలని వేగంగా నడవటం మొదలుపెట్టాడు.
చుట్టూ కీచురాళ్ళు రొద.
చీకటి అడవిలో దూరంగా కూస్తున్న సిబియా పక్షి సంగీతం అతని కిష్టమయినదైనా, ఆ భయానక వాతావరణంలో మృత్యువు ఆకలితో చేస్తున్న పెనుకేకలా వినిపిస్తోంది.
సుమారు నలభై అడుగుల ఎత్తు సైతం పెరిగే అడవి సంపంగి పూలవాసన అలసిన అతని మనస్సును ఆహ్లాద పర్చలేకపోయింది.
ఒక్కోచోట ఆగి తడుముకుని నడవాల్సి రావడంతో, తొలిరోజే అంతసేపటివరకూ అడవిలో తిరగాల్సింది కాదనుకున్నాడు.