తర్వాత అక్కడికి మరోనాలుగుమైళ్ళ దూరంలో వున్న గొండుపల్లికి బయలుదేరాడు .దారిపొడుగునా ముళ్ళకంచెలతోపాటు వాగులు, బండలు, కాళ్ళు నొప్పెడుతున్నా ఆగలేదు.
మరో గంటకల్లా వాల్మీకులు, కోతులు, గోండులు అధికంగా గల ఆ పల్లెని చేరుకున్నాడు. గిరిజనుల్లో బాగా వెనుకబడిన తెగకి చెందిన వీరిలో మూఢనమ్మకాలెంత ఎక్కువో ,మూర్ఖత్వమూ అంతే ఎక్కువ.
ముందుగా చైతన్యను ఓ శత్రువును చూసినట్టు చూశారు. కనీసం వివరాలు సేకరించాలంటే ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో ఆలోచిస్తూ నిలబడ్డాడు. వారి నిర్లక్ష్యానికి కోపం రాలేదు. వారి దైనందిన జీవితం మేనీటర్ మూలంగా ఎంత అస్తవ్యస్తమైందీ గ్రహించాడు.
సమాధుల్లాంటి చిన్న చిన్న పూరిళ్ళలోంచి ఒంటికి నల్లజీడిని పూసుకున్నట్టున్న యువతులు ఓమారు బయటికి వచ్చి, మళ్ళీ అంతలోనే లోపలికి వెళ్ళిపోయారు. ముక్కులకు కమ్మలతో, జుట్టును కొప్పులుగా చుట్టుకుని, ఒంటిపై చుట్టూ చీరను అనాగరికంగా కట్టుకుని, బ్లౌజులు సైతం వాడని కొండజాతి స్త్రీలు వీరు.
మృగాలంటేనే కాదు; మొగుళ్ళన్నా లెక్కచేయని ఆడవారు. ఇలాంటి వారి ముందు తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలంటే ఎంత కష్టమో చైతన్యకు తెలియందికాదు.
ఓ బూరుగు చెట్టు క్రింద కూచుని ఆలోచిస్తున్న చైతన్య "యేవల్నువ్వు" అంటూ పలకరించిన వ్యక్తిని చూసి ముందు ఉలికి పడ్డాడు. బలిష్టంగా, నల్లపాషాణంగా వున్న ఆ వ్యక్తి చాలా నిర్లక్ష్యంగా చూశాడు చైతన్యని.
"కూర్చో" తన పక్కన బాగా చూపించాడు చైతన్య.
"నీలాటోలు సేనామంది యెల్లిపోనారూ" అరటి సారా వాసన గుప్పుమంది.
"నేను మీ శత్రువుని కాదు."
"కొండదేవర పంపిన మడిసివా?"
"కాదు. మిమ్మల్ని పీడిస్తున్న పులిని చంపాలనివచ్చినవాణ్ని."
పగలబడి నవ్వాడు. ఎగతాళిగా కాదు_ఏహ్యంగా, బండరాళ్ళు దొర్లినట్లు. పులి ఎముకల్ని కొరికినట్టు వినిపించిందా నవ్వు.
"మా ఏలిక పెబువులు బగతాలనే సంపుకుతింటున్న పులిని నువ్వు సంపాలనొచ్చావా....సత్తావు."
కొండజాతిలో బగతాలనే కులం వారిని వారు దేవుళ్ళలా భావిస్తారు! వారికే హాని జరిగిందంటే అది మహత్తుగల శక్తిగా ఆలోచిస్తారు.
"అయితే, మిమ్మల్ని బాధిస్తున్నది పులి కాదంటావా?"
"కాదు, మా కొండదేవరకి మామీన కోపమొచ్చి పంపిన భూతం" చాలా నమ్మకం ధ్వనించింది అతడి గొంతులో.
చైతన్య గెలవాల్సింది సరిగ్గా ఆ మూఢనమ్మకంపై.
"లోకాన్ని పీడించే రాక్షసుల్ని చంపడానికి దేవుడు అవతారాలెత్తే వాడు కదూ!" సాలోచనగా చూస్తూ అన్నాడు.
ఎప్పుడో, ఎక్కడో ఏ జముకుల కథలోనో విని వుంటాడు. ఈసారి ఖండించకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు.
"ఆ దేవుడే ఒక్కోమారు మీలాంటి మంచి మనసున్న మనుషుల్ని రక్షించమని కొందర్ని పంపుతుంటాడు" చైతన్య వెంటనే మరో అస్త్రం ప్రయోగించాడు, "అడవిని నమ్ముకుని బ్రతికే మీలాంటి వాళ్ళకు సాయం చెయ్యమని నాకు కలలో చెప్పిన దేవుడు నన్నిలా పంపేడు."
"భంగీ....సుంగీ....మల్లే! "హఠాత్తుగా కేకలు వేస్తూ పిలిచాడు.
పరుగున వచ్చారు గుడిసెల్లో నుంచి.
ఆ వ్యక్తి ముఖంలో కొద్దిపాటి నమ్మకం.
ఓ వృద్దురాల్ని చూపుతూ_"ఎదిగిన దీని బిడ్డ అడివికెల్లి రొండ్రోజుల కిందటే సచ్చిపోనాడు, దొరా! ఇప్పుడేటి మాట?" అడిగాడు నిలదీసి.
"దేవుడిలో కలిసేక వెనక్కిపంపడం దేవుడికి సాధ్యంకాని పని"
అందరూ విభ్రమంగా చూస్తున్నారు.
"గట్లయితే ఏం శలవు, దొరా!"
"ఆ శవం ఎక్కడ?"
"సచ్చిన సెవాన్ని కొండదేవరకి పూజచేసి మట్టిలో కలిపేత్తాం."
'అలాచేస్తే ఆ రాక్షస పులి మరింత బలవంతురాలౌతుంది" రోజుకో మనిషి చొప్పున ఊరవతలకి రప్పించి, భోజనంతో సహా వ్యక్తినీ భోంచేసి విందు చేసుకునే బకాసురుడి కథ చెప్పాడు చైతన్య.
"అందుకని...." ఆశ్చర్యంగా వింటున్న అమాయకులయిన గిరిజనులను చూస్తూ_"ఆహారాన్ని తీసుకువెళ్ళి దాన్ని అడ్డం పెట్టుకుని బకాసురుడిని చంపిన భీముడిలా ఆ రాక్షస పులిని అంతంచేయాలంటే అది చంపిన మనిషి శవాన్ని అడ్డం పెట్టుకునే ఆ క్రూరమృగం ప్రాణాలు తీయాలి" అంటూ చాలా నమ్మకంగా వారిని ఒప్పించే ప్రయత్నం చేశాడు.
చనిపోయిన శవాల విషయంలో వారనుసరించే విచిత్రమయిన సంప్రదాయాల్ని, తరతరాలుగా మారని వారి మౌడ్యాన్ని తనో దేవదూతలా పరిచయం చేసుకుని ఒక్కరోజులో అనూహ్యమైన మార్పును సాదిద్దామనుకున్న చైతన్య ఎలాంటి ఇరకాటంలో పడ్డాడో తెలుసుకోవడానికి సాక్ష్యం వెనువెంటనే జరిగిన ఓ సంఘటన.
ఏ మూల నిలబడ్డాడో, ఎక్కడ నుంచి వచ్చాడో హఠాత్తుగా అతడు తన పక్కన రాయికి ఆనించిన తుపాకీని అందుకున్నాడు ఓ యువకుడు. కొండచిలువలా భయంకరంగా వున్న ఆ యువకుడు అలా ఎందుకు చేశాడో అర్ధంకాని చైతన్య ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే తుపాకీ గురి పెట్టాడు.
"నువ్వు కొండదేవర అంపిన మడిసివైతే సావకుండా బతకాలి" అన్నాడు ట్రిగ్గర్ పై వేలివుంచుతూ.
రక్తం ఓడిన కళ్ళతో తుపాకీ గురిపెట్టి రాక్షసంగా తననే చూసే ఆ యువకుడ్ని వారించాలని పైకి లేవబోతుంటే అతనిపై బరిసెల్ని గురి పెట్టారు మరికొందరు పురుషులు.
నమ్మనివాడు ప్రాణాలను తీయడానికైనా వెనుకాడని ఆ జాతి వాళ్ళ గురించి తెలిసిన చైతన్య అనవసరమైన తెలివి నెందుకు ప్రదర్శించానా అనుకుంటున్నాడు.
ఏ క్షణాన ఆ యువకుడు ట్రిగ్గర్ నొక్కుతాడో అన్న భీతి.
సన్నగా ప్రకంపించింది చైతన్య శరీరం, బేరల్ సరిగ్గా చైతన్య గుండెకు గురిపెట్టబడి ఉంది. అంతటా నిశ్శబ్దం. అందరిలోనూ ఉత్సుకత.
మూర్ఖుల దగ్గర అతితెలివి ప్రదర్శిస్తే అపాయాన్ని అతడు తెల్సుకొనేలోగానే ఆ యువకుడు చాలా నిక్కచ్చిగా, కసిగా ట్రిగ్గర్ నొక్కాడు. అంతే__
మరికొన్ని క్షణాలలో మృత్యువు తనని కబళిస్తుందనుకున్న చైతన్య అప్పటికే భయంతో కళ్ళుమూసుకున్నాడు. కాని, అతడనుకున్నట్టు అతడి గుండెను తూటా దూసుకు పోలేదు.
కేవలం 'క్లిక్' మన్న శబ్దం మాత్రం వినిపించింది.
ఏం జరిగి వుంటుందో వెంటనే గ్రహించిన చైతన్య తేరుకుని, పైకి నిలబడి ఆ యువకుడి చేతిలోని తుపాకీని లాక్కుని గాలిలోకి పేల్చాడు.
"ఢాం' అన్న శబ్దానికి గూడెం అదిరి పడింది. గుండె లవిసినట్లు గిరిజనులు వెనక్కి జరిగారు.
ఆశ్చర్యంగా, అబ్బురంగా ఒకరి మొహాలోకరు చూసుకున్న వాల్మీకులు సౌంజ్ఞలతోనే చైతన్య గొప్ప తనాన్ని అంగీకరిస్తున్నట్టు కేకలు వేశారు. నాట్యం చేశారు.
ఏ ప్రభుత్వ ప్రణాళికలకీ అందనంత దూరంలో కొన్నివేల సంవత్సరాలక్రితం నాటి ఆటవిక వ్యవస్థలోనే ఇంకా బ్రతుకుతున్న కొందరు వాల్మీకుల్లో ఓ విచిత్రమయిన ఆచారం ఉంది.
వారిలో ఎవరు. ఎలా చనిపోయినా ఇంటికింత చింతపండు చొప్పున శవానికి పూసి ఊరి మధ్యలోని ఓ నిలువెత్తు గోతిలో కప్పేస్తారు. మూడు రోజుల తర్వాత అప్పటికే దుర్గంధంతో నిండిన శవాన్ని ముక్కలుగా కోసి, ఒక్కో అవయవాన్ని కుండల్లో దాచి కొండదేవర విగ్రహంముందు వుంచుతారు.