Previous Page Next Page 
భారతి పేజి 20

    కొట్టికొట్టి  అలిసిపోయి, "అప్రాచ్చురాలా" అంటూ  చివరకు గంగాధరంగారు చేతికర్ర అవతలకు గిరవాటు వేశాడు.

    ఆ సమయానికే  రంగాజమ్మగారి  పెదవులమీద కనిపించీ  కనిపించనట్లు ఒక చిరునవ్వు మొదలటం, వెనువెంటనే  తెలివి తప్పిపోవటం  జరిగిపోయాయి.

    ఆ సమయానికే భారతి తెలివి తెచ్చుకుని రంగాజమ్మగారి వైపు చూసింది. కమిలి చారలుపడిన ముఖం, చిట్లి రక్తం  కారుతున్న  పెదవులు, వాతలుపడిన శరీరం....ఆమె  భయబ్రాంతురాలయిపోయింది. "అత్తయ్యా" అని అరిచి ఆమె పాదాలమీద వాలిపోయి  మరుక్షణంలో  తను కూడా స్పృహ కోల్పోయింది.


                                 *    *    *


    తెల తెలవారుతూంది. తూరుపురేఖలు  విచ్చుకుని, కిటికీలోంచి ఒకరి కౌగిలిలో ఒకరు  ఒదిగివున్న అత్తా కోడళ్ళిద్దరిపైనా  పడినాయి.

    ఇద్దరి ముఖాలూ  ఏడ్చి ఏడ్చి వుండటం చేత వాడి, వడిలి, కన్నీటి చారలతో  నిండిపోయి వున్నాయి, కళ్ళు ఇద్దరివీ  ఎర్రగా  జ్యోతులవలె వున్నాయి.

    "అత్తయ్యా! జన్మలో  మళ్ళీ మిమ్మల్ని కలుసుకున్నా కలుసుకోకపోయినా, మీ మంచితనమనే స్పర్శ ఎల్లకాలం  నా ఒంటిమీద మెదులుతూనే వుంటుంది. సెలవిప్పించండి. అత్తయ్యా" అంది భారతి.

    రంగాజమ్మగారు కోడల్ని  మరింత  గట్టిగా  తనకు అదుముకుంది. "ఈ పాపిష్టి జబ్బు నీకెందుకు వచ్చిందమ్మా? నీ కన్యాయం జరిగిపోయింది, తల్లీ. నీ కన్యాయం  జరిగిపోయింది" అని గొల్లున ఏడ్చింది.

    భారతి అత్తగారి  ముఖంలోకి  నిశ్చింతగా  చూసి, "జబ్బు పాపిష్టిది కాదత్తయ్యా! నేను పాపిష్టిదాన్ని. నా జీవితం  పాడుచేసుకోవటమే గాకుండా  మీ జీవితంలో కూడా పెద్ద గండి ఏర్పరచిపోతున్నాను, నాను క్షమించండత్తయ్యా." అన్నది.

    రంగాజమ్మగారు  ఆపుకోలేని  ప్రేమతో  కోడలితల  నిమిరింది. ఈ లోకంలో  జరిగేది అదమ్మా. క్షమించవలసిన వాళ్లే క్షమాపణలు అడుగుతూంటారు....నిన్ను పరీక్షించే  శక్తి నీకు వుందనుకున్నాను. కాని ఆ గిరి నుంచి నువ్వు దాటిపోయావు. కాని వెన్నెలలాంటి  దానవు నీకు అశుభం జరుగుతుందా? నీ జీవితం శుభ్రప్రదమౌతుందని  ఏ అజ్ఞాత శక్తో  చాటుతోంది నాకు" అని నిట్టూర్చింది.

    "కానివ్వండి, అత్తయ్యా! మీ దీవెన అపూర్వంగా తలపోస్తున్నాను"

    ఒక నిమిషం  నిశ్శబ్దంగా గడిచాక తిరిగి భారతి, "అత్తయ్యా! పైకి వెళ్ళి ఒకసారి వారివద్ద కూడా సెలవు తీసుకోవాలని ఉంది. వెళ్ళిరానా?" అని అడిగింది మెల్లిగా.

    రంగాజమ్మగారు ఆమెవంక ఆశ్చర్యంగా చూసి  "ఈ విషయంలో వాడి స్తబ్ధత చూశాక  ఎన్నడూ లేనిది నాకే వాడంటే  అసహ్యం వేస్తోంది కదా, నీకేమీ అనిపించటం లేదూ?" అని అడిగింది.

    భారతి తల ఊపుతూ, "లేదత్తయ్యా! వారిమీద  నాకెంతమాత్రం  అసహ్యం లేదు" అంది.

    రంగాజమ్మగారు బాధగా ఓ నిట్టూర్పు విడిచి, "అలాగే భారతీ! వెళ్ళి చెప్పిరా. ఇదేమంత  కోరిక గనుక" అంది.

    భారతి అత్తగారి కౌగిలి నుండి మెల్లిగా విడవడి, గదిలోంచి  బయటకు వచ్చి, మెట్లెక్కి పైకి వెళ్ళింది. సారధి గదిని సమీపిస్తూంటే  ఆమె గుండె గబగబ కొట్టుకోవటం లేదు. నిశ్చలంగా, నిర్మలంగా, విర్వికారంగా వుంది ఆమె మనసు.

    సారధి కిటికీ దగ్గర బయటకు  చూస్తూ నిలబడి ఉన్నాడు. లాల్చీ పైజామా....రాత్రి తడిసిన బట్టలు విప్పినట్లుగా లేదు.

    గదిలోకి  అడుగుపెట్టి, చప్పున తలుపు గడియ పెట్టింది  భారతి.

    సారధి ఉలికిపడి వెనుదిరిగి  చూశాడు ఎర్రగా, జ్యోతుల్లా వున్న  అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.
    అతను నోరు తెరిచి  ఏదో అనేలోపలే  ఆమె మరికొంచెం ముందుకు వచ్చి, "ఎందుకలా భయపడతారు. మీరు? బంధాలను, అనుబంధాలను  ఎరగా జూసి  మిమ్మల్ని ఆకర్షించటానికీ, మనసు మరల్చటానికీ  రాలేదు. కడసారి చూపులంటారే__అవి అందుకోవటానికి  వచ్చాను. సెలవు కూడా తీసుకోవాలిగా మరి. మీరు నా పెనిమిటి ఆయె. అట్లా సంఘర్షణ కనిపిస్తుందేం మీ ముఖంలో? కలవరపడకండి  మీ నిర్ణయం సరి అయినదే" అంది.

    సారధి గడగడ వణికిపోయాడు. అతనినోట  మాట రాలేదు.

    "మీ మీద నెపం వేస్తాననుకుంటున్నారా? అలా ఎన్నడూ  చేయను. మీ స్థితిలో నేనుంటే నేనూ ఇలాగే ప్రవర్తిస్తాను మీరింకా  జంకుతున్నారు గాని  నేనైతే  మీ నాన్నగారన్న  మాటలన్నీ  నా నోటితో ఉచ్ఛరించి ఉండేదాన్ని."

    అప్పటికీ సారధి  మాట్లాడలేదు. కళ్ళప్పగించి చూస్తున్నాడు.

    "మిమ్మల్ని ద్వేషిస్తాననే  భావం కూడా మీకు వద్దు. నాలో ఇప్పుడు హిందూత్వమంతా  పుణికి పుచ్చుకుని ఉన్నాను. మిమ్మల్ని ప్రేమిస్తున్నానండీ! నిజంగా. జీవితాంతం ఇలా ప్రేమిస్తాననే  నా నమ్మకం."

    సారధిలో  చలనం లేదు.

    "మిమ్మల్ని కాపాడమన్నారు. కాపాడదామనుకున్నాను. కానీ ఆ శక్తే నాకు లేకపోయింది.

    సారధి కాళ్ళ  క్రింద భూమి కంపిస్తున్నట్లయింది.

    "తలుపు ఎందుకు గడియ పెట్టానని నివ్వెరపోతున్నారు కదూ! ఏమీలేదు, ఒక్కసారి....ఒక్కసారి మీకు పాదాభివందనం చేసి సెలవు తీసుకుందామని...." అంటూ ఆమె గభాలున క్రిందకు జరిగి,అతని పాదాలను తాకి, కళ్ళకద్దుకుని లేచి నిలబడింది. "నా కోరిక  తీరిపోయింది. బహుశా మీ కోరికే  తీరివుండదు. సెలవు" అంటూ  గిరుక్కున వెనక్కి తిరిగి, తలుపు గడియ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది.

    సారధి నిరుత్తరుడై  చూస్తూ నిలబడిపోయాడు.


                                                                    *    *    *    *


    మట్టి రోడ్డుమీద చందరాల వైపుగా  కారు మెల్లగా సాగిపోతూంటే వెనకసీట్లో భారతి కళ్ళు మూసుకుని కూర్చుంది.
    ఎవరో "భారతీ! చూడు చూడు" అని పిలిచినట్లయింది. ఉలికిపడినట్లయి  ఆమె కళ్ళు తెరిచేసరికి  నిన్న తాము విహరించిన తోట అప్పుడే కనుమరుగై పోతూంది.    

    పదహారు గంటలన్నా ఇంకా గడవలేదు. తోటలోని  తడిమట్టిలో తమ పాదాల ముద్రలు ఇంకా చెరగనన్నా  చెరిగి వుండవు. కాని తన జీవితంలో  తళుక్కుమని మెరిసిన  వెలుగుతెర  మాత్రం  చిరిగిపోయింది.

    అతనితో  షికారు, అతని పక్కన చెట్ల మధ్యగా నడవటం, అతనితో వానలో నడవటం, మెరుపుల మధ్య భయంతో  వివర్ణమైన అతని వదనం. తను ఇద్దరిమీదా  గొడుగు__నిన్న జరిగిన  సంఘటనను స్మృతి అంటారా?

    నిట్టూర్పు విడిచి, మళ్ళీ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది.

    కళ్ళ వెనక  దాగిన  విశ్వమంతటి  చీకటో  ఎన్నో  నల్లని దృశ్యాలు కలగలుపుగా, అస్పష్టంగా, అస్తవ్యస్తంగా కదిలిపోతున్నాయి.

    ఎంతసేపటికో  మళ్ళీ  ఎవరో "భారతీ! చూడు, చూడు" అని పిలిచినట్లయింది.

    ఆమె  మళ్ళీ ఉలిక్కిపడి, కళ్ళు తెరిచి చూసింది. చందనాల చెరువు పక్కనే తాము అట్లతద్దినాడు ఉయ్యాలలు వేసుకుని  ఊగిన  పెద్ద రావిచెట్టు.

    "ఇక్కడే నువ్వు నీళ్ళబిందెతో మల్లికతో  సాగిపోతూంటే, అతను వచ్చి, వచ్చీ రాని డ్రైవింగ్ తో, కారు మీమీద పెట్టినంత పని చేశాడు. మల్లిక అతన్ని కోప్పడింది. అతను తడబడిపోయాడు. ఊరెళ్ళాక  వాళ్ళ నాన్నగారిని నిన్ను చూడటానికి పంపించాడు."

    అవును, అంతవరకూ  బాగానే వుంది. ఆ తరువాత కూడా కొంతవరకూ బాగానే వుంది. కాని ఆ తరువాత....?

    నెమ్మదిగా  కారు ఊళ్లోకి ప్రవేశించింది. ఉదయం ఎనిమిది దాటిపోతూంది. పొలాల్లో  పని చేసుకునే వారి దగ్గరి నుంచి, అరుగుల మీద కూర్చున్న బాతాఖానీ కొట్టేవాళ్ళదాకా అంతా ఒకసారి  తల ఎత్తి కారు వంక చూసి 'ఎవరు? కరణంగారి అమ్మాయి కదూ' అనుకుంటున్నారు. గుడిదగ్గర మండపంలో ఆడుకుంటున్న  కుర్రాళ్ళంతా  కుతూహలంగా అటుకేసి  చూసి "కారు, కారు" అని గెంతులేస్తున్నారు. ఇళ్ళలోని అమ్మలక్కలు యాదృచ్చికంగా బయటకు రాగానే  కారు కనబడి 'భారతి వచ్చింది' అనుకోసాగారు.
 

 Previous Page Next Page