Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 21


    "అలాగే సార్-"
    "అసలు ఇన్ని సార్లు దొంగతనాలెందుకు చేస్తున్నానో నాకర్ధం కావటం లేదు-"
    "ఎందుకంటే సార్- మీరు ఎప్పటికప్పుడు పెంచుతూ పోతూన్న జరిమానాలు కట్టడానికి-"

    ఒక ప్రమాదకరమైన క్రిమినల్ కోసం వేట మొదలయింది.
    పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ఆ క్రిమినల్ ఫోటో ఒకటి- ముందునుంచీ, రెండు సైడ్స్ నుంచీ- వెనుక నుంచీ, నాలుగు యాంగిల్స్ లో తీయించి అన్ని పోలీస్ స్టేషన్స్ కీ పంపించారు. ఆ నేరస్తుడి ఆచూకీ తెలుసుకున్న పోలీస్ అధికారికి యాభైవేలు బహుమతి కూడా ప్రకటించారు.
    రెండో రోజే ఒక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందాయనకి.
    "సార్! ఆ ఫోటోలో ఉన్న నలుగురినీ అరెస్ట్ చేశాం సార్- కొంచెం థర్డ్ డిగ్రీ ఉపయోగించాక వాళ్ళు ఆ నేరాలన్నీ చేసినట్లు ఒప్పుకున్నారు సార్-"

    ఓ వ్యాపారస్తుడు ఇన్ కమ్ టాక్స్ అధికారిని కలుసుకున్నాడు.
    "సార్! నాపేరు పటేల్! పదేళ్ళ నుంచీ టింబర్ బిజినెస్ చేస్తున్నాను. బాగా లాభాలు సంపాదించాను గానీ ఇన్ కమ్ టాక్స్ మాత్రం కట్టలేదు.
    దాని వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది సార్! అంచేత దయచేసి ఈ పదిలక్షల చెక్కూ నేను కట్టాల్సిన టాక్స్ కింద తీసుకోండి!" అంటూ ఓ చెక్ ఆ అధికారికి ఇచ్చాడు.
    అధికారి హాపీగా ఫీలయ్యాడు.
    "థాంక్యూ! అందరూ మీలాగా సిన్సియర్ గా ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది" అన్నాడతను.
    వెళ్ళిపోబోతూన్న ఆ వ్యక్తి ఆగి వెనక్కు వచ్చాడు.
    "ఇంకొక్క విషయం సార్! ఇంకో వారం చూస్తాను. ఒకవేళ అప్పటికీ నాకు మనశ్శాంతి రాకపోతే యాభయ్ లక్షలకు ఇంకో చెక్ తెచ్చిస్తాను సార్-" వినయంగా అన్నాడు.

    యుద్ధం భయంకరంగా జరుగుతోంది.
    ఆర్మీ ఆఫీసర్ తన ట్రూప్ లోని సైనికులందరినీ పిలిచాడు.
    "చూడండి! శత్రు సైనికులు ముందుకొస్తున్నారు! వాళ్ళు ఓ రెండు వందల గజాల దూరంలోకి రాగానే మీరు వెనక్కు వెళ్ళిపోండి! నాకు కొంచెం మోకాలి నొప్పి ఉంది గనుక నేను ఇప్పుడే వెనక్కు వెళ్ళిపోతున్నాను-"

    ఓ వర్రీల వెంకట్రావ్ సైకియాట్రిస్ట్ దగ్గర కొచ్చాడు.
    "డాక్టర్ గారూ- భవిష్యత్తు గురించి  నాకు చాలా ఆందోళనగా ఉంటోంది. ఏం జరుగుతుందో - ఎలా జరుగుతుందో - అన్నీ ఇలాంటి ఆలోచనలే! ఈ వర్రీలకు ఏమయినా ట్రీట్ మెంట్ ఉందంటారా?"
    "ఎందుకులేదు-  బ్రహ్మాండమయిన ట్రీట్ మెంట్ ఇస్తాను. మీరు వారానికి మూడు రోజుల చొప్పున సంవత్సరంపాటు మా క్లినిక్ కి రావాల్సి ఉంటుంది. ఒక్కొక్క విజిట్ కీ ఐదు వందలు ఫీజ్ కట్టాలి. అదీ ఆరు నెలల ఫీజు అడ్వాన్స్ గా కట్టాలి-"
    "చాలా బాగా మీ భవిష్యత్తుని సెట్ చేసుకున్నారు సార్! కానీ నేను మీ దగ్గర కొచ్చింది మీ భవిష్యత్తు గురించి కాద్సార్- నా భవిష్యత్తు గురించి......"

    ఓ రాయలసీమ రాజకీయ నాయకుడు ఉపన్యాసం దంచాక ఆఖర్లో ప్రశ్నవేశాడు.
    "కనుక సోదర సోదరీమణులారా- అమ్మలారా-అక్కలారా! నేను రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా అవ్వాలనుకుంటున్నానంటే అందుకొక కారణం ఉంది. అదేమిటో ఎవరయినా చెప్పగలరా?"
    జనం ముందు వరుసలో కూర్చున్న ఓ ఓటరు లేచి నిలబడ్డాడు.
    "తెలుసు! ఈ టరమ్ లో తినాలనుకున్నదంతా తినలేకపోయావ్- అందుకని!"

    రమణారావ్ కి కోటి రూపాయల లాటరీ తగలింది. అయితే ఆ సంగతి ముందు అతనికి ఆ టికెట్ అమ్మిన ఏజెంట్ కి తెలిసింది.
    రమణారావ్ హార్ట్ పేషెంట్ కావడం వల్ల ఆ లాటరీ వచ్చిన విషయం చెప్తే ఆ సంతోషంలో హార్ట్ ఎటాక్ వస్తుందేమోనని అనుమానం కలిగి రమణారావ్ తాలూకూ ఫామిలీ డాక్టర్ దగ్గరకొచ్చాడు ఏజెంట్.
    "రేపు మీరు రొటీన్ గా వెళ్ళినట్లు రమణారావ్ ఇంటికెళ్ళి లాటరీ విషయం చెప్పండి సార్! ఒకవేళ అతనికి ఆ ఆనందంలో హార్ట్ ప్రాబ్లెం వచ్చినా పక్కన మీరుంటారు గనుక వెంటనే ట్రీట్ మెంట్ ఇచ్చి అతనిని రక్షించవచ్చు-" అన్నాడతను డాక్టర్ తో.
    డాక్టర్ ఒప్పుకున్నాడు.
    మర్నాడు డాక్టర్ రమణారావ్ ఇంటికెళ్ళి కాసేపు అవీ ఇవీ మాట్లాడాక నెమ్మదిగా లాటరీ విషయం చెప్పాడు. రమణారావ్ ఆనందంతో పొంగిపోయాడు.
    "అబ్బ! ఎంత మంచివార్త చెప్పారు సార్! నాకొచ్చే కోటిలో సగం మీకిచ్చేస్తా సార్" అన్నాడు హాపీగా-
    దాంతో డాక్టర్ షాక్ తిని కిందపడి గిలగిలకొట్టుకొని ప్రాణాలు వదిలాడు.

    "నువ్వూ, మీ ఆవిడ విడాకులు తీసుకున్నారంటగా! అసలు జరిగిందేమిటి?" అడిగాడో ఫ్రెండ్.
    "ఎప్పుడూ మోసాలు చేస్తూ, అబద్దాలు చెప్పే వాళ్ళతో ఎవరు మాత్రం ఎంతకాలం సంసారం చేస్తారు?" అన్నాడా భర్త నింపాదిగా.
    "అంటే, మీ ఆవిడలా చేస్తుందా?"
    "మా ఆవిడ కాదు- నేను-"
    జడ్జి : నువ్ టైప్ రైటర్ ఎత్తుకుపోతున్నట్లు సాక్ష్యం స్ట్రాంగ్ గా ఉంది! ఇంకా నిర్దోషినంటావేంటి?
    దొంగ : కానీ నేనది కావాలని చేసింది కాద్సార్! పొరబాటు వల్ల జరిగింది.
    జడ్జి : వ్వాట్? పొరబాటా?
    దొంగ : అవున్సార్- అది కాష్ బాక్స్ అనుకున్నా!"

    "ఏంటి బ్రదరూ- బాండేజీ వేసుకున్నావ్? యాక్సిడెంటా?"
    "కాదు! దగ్గు ప్రాబ్లెమ్-"
    "దగ్గు ప్రాబ్లెమా! దగ్గు ప్రాబ్లెమ్ తో గాయాలవుతాయా?"
    "ఒకళ్ళింట్లో నగలు తీసుకుని కిటికీలోంచి దూకుతుండగా ఈ దగ్గువచ్చింది సార్- మరి!"

    ఏ.సి. టూటైర్ లో ప్రయాణం చేస్తోన్న ఓ రిచ్ పెద్దమనిషిని ఎదురుగ్గా కూర్చున్న ఓ యువకుడు టైమడిగాడు.
    "ఛస్తే చెప్పను-" అన్నాడతను చిరాగ్గా-
    "అదేంటి సార్! టైమ్ చెప్తే ఏంటి ప్రాబ్లెమ్"
    "ప్రాబ్లెమ్ ఏంటంటే- నేను టైమెంతయిందో నీకు చెప్పాననుకో! నువ్ వెంటనే 'థాంక్యూ' అంటావ్. అని అక్కడితో ఊరుకోవు- మీరేం చేస్తూంటారని అడుగుతావ్. తరువాత నా ఊరూ, పేరూ అడుగుతావ్- ఆటోమేటిగ్గా నేనూ నీ గురించి అడగాల్సి వస్తుంది. ఆ తరువాత ఇద్దరం నీ డిన్నర్ షేర్ చేసుకుంటాం! ఆ తరువాత హైదరాబాదులో దిగుతాం. అక్కడ నా కార్డ్ అడుగుతావ్. కర్టెసీ కోసం ఎప్పుడయినా ఇంటికిరండి! అంటాన్నేను. మర్నాడే నువ్ మాయింట్లో వాలిపోతావ్.
    'మా ఫ్రెండ్ ఇల్లు కూడా ఈ ఏరియాలో ఉంది. అందుకని వచ్చాను" అంటావ్. నేను లంచ్ చేయమనాల్సి వస్తుంది. లంచ్ టైమ్ లో మా డాటర్, మిసెస్ ని పరిచయం చేయాల్సి వస్తుంది. ఇంత అద్భుతమయిన భోజనం జన్మలో చేయలేదంటావ్. దాంతో మా ఆవిడకు నీమీద చాలా మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ తరువాత మా డాటర్ ని ఎక్కడో ఓ చోట యాక్సిడెంటల్ గా కలుసుకున్నట్లు కలుసుకుంటావ్. నువ్ మా అమ్మాయ్ తో లవ్ లో పడిందిగాక ఆమెను కూడా లవ్ లో పడేట్లు చేస్తావ్. దాంతో ఎన్ని సమస్యలు వస్తాయో ఎవడికి తెలుసు. అందుకని ఇప్పుడే ఎవైడ్ చేసేశాననుకో - గొడవే లేదుగా"

 Previous Page Next Page