"మీరు నావంకే చూస్తున్నారు. నావంకే చూస్తున్నారు. నావంకే చూస్తున్నారు" అన్నాడు సింహాద్రి మళ్ళీ.
దాంతో వళ్ళుమండిపోయింది విశ్వనాధానికి.
"నోర్మూసుకోరా పక్షీ! నీవంకే చూడడం ఏమిటి? చూస్తేనేం? ఏం చేస్తావ్?" అన్నాడు గట్టిగా అరుస్తూ.
"మీరిప్పుడు నిన్నటిలో కెళ్ళున్నారు. నిన్నటిలో కెళ్ళున్నారు. నిన్నటిలో కెళ్తున్నారు" అన్నాడు సింహాద్రి అతని మాటలు పట్టించుకోకుండా.
హఠాత్తుగా విశ్వనాథానికి అనుమానం ముందు కొచ్చింది.
సింహాద్రి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపిస్తోంది. తనతో భావయ్య చెప్పిన విషయాలన్నీ నిజమేనేమో! సింహాద్రికి అకస్మాత్తుగా చిన్నసైజు పిచ్చి పట్టుకుందేమో! లేపోతే అలా అర్ధం పర్ధంలేని మాటలు ఎందుకు మాట్లాడతాడు?
"నిన్నటిలో కేవరయినా వెళ్ళగలరా? ఛస్తే వెళ్ళలేరు. నిన్నటిలోకీ వెళ్ళలేరు, రేపటిలోకీ వెళ్ళలేరు.
సింహాద్రి విశ్వనాథం మొఖంలోకి మార్పులన్నీ జాగ్రత్తగా గమనిస్త్జూనే వున్నాడు.
"మీరు నిన్నలో ఉన్నారు- నిన్నలో ఉన్నారు- నిన్నలో ఉన్నారు-" అన్నాడు అతను మళ్ళీ.
విశ్వనాథం అంత తేలిగ్గా సింహాద్రి పిచ్చి గురించి నిర్ధారణకు రాదల్చుకోలేదు. అంచేత క్రాస్ కొశ్చెన్స్ వేయాలని నిర్ణయించుకున్నాడు.
"ఏమిటి భావయ్య దగ్గర వాగావుట?" తీవ్రంగా అడిగాడు.
"చూశావా శ్రీదేవి! అతనిప్పుడు నిన్నట్లో కెళ్ళి పోయాడన్నమాట! నిన్న జరిగిన అతని తాలూకు విషయాలన్నీ ఇప్పుడు మాట్లాడాతాడన్న మాట"
"అబ్బ! ఎంత బాగుందో" అంది శ్రీదేవి ఆనందంగా.
"ఏమిటా పిచ్చివాగుడు?" అరచాడు విశ్వనాథం.
శ్రీదేవి తప్పట్లు కొట్టింది. ఆమెతోపాటు చిరంజీవి కూడా తప్పట్లు కొట్టేశాడు.
"వండర్ ఫుల్" అంది శ్రీదేవి.
"యస్. కంప్లీట్ గా నిన్నటిలో కెళ్ళిపోయాడు" అన్నాడు చిరంజీవి.
"ఏం? నీక్కూడా ఎక్కిందా పిచ్చి?" చిరంజీవిని తీవ్రంగా చూస్తూ అడిగాడు మావయ్య.
"ఏమిట్రా అతను మాట్లాడుతున్నాడు" అర్ధంకానట్లు సింహాద్రినడిగాడు చిరంజీవి.
"పిచ్చి గురించి మాట్లాడుతున్నాడు. బహుశా నిన్న వాళ్ళింట్లో ఎవరికో పిచ్చిపట్టి వుంటుంది. లేదా ఈయనకే పిచ్చి ఉండవచ్చు. అతను ఇంకొంచెం వివరంగా మాట్లాడితేనే గాని మనకు తెలీదు" అన్నాడు సింహాద్రి.
మావయ్య కేమీ పాలుపోవడం లేదు. భావయ్య చెప్పినట్లు సింహాద్రి పిచ్చివాడనడానికే ఎక్కువ ఆస్కారాలు కనబడుతున్నాయ్.
కానీ మరి ఈ చిరంజీవిగాడు కూడా ఎందుకలా మాట్లాడుతున్నట్లు? అంటే ఇందులో ఏదో నాటకం ఉందన్న మాట!
"అయితే ఇద్దరూ కలిసి భావయ్య దగ్గర నాటక మాడారన్నమాట" అన్నాడు కోపంగా.
సింహాద్రి, చిరంజీవి మొఖాలు చూసుకున్నారు.
"భావయ్య ఎవరు?" చిరంజీవి సింహాద్రిని అడిగాడు.
"నిన్న అతనికి జరిగిన ఓ సంఘటనలో భావయ్య అనే వ్యక్తి కూడా ఉన్నాడన్న మాట" చెప్పాడు సింహాద్రి.
"ఈ వెధవ్వేషాలు నా దగ్గర కాదు! ఆ సంబంధం తప్పించుకోడానికి నీకు పిచ్చి వున్నట్లు నువ్వు వాగితే, వాడేమో నీది మెంటల్ కేసని సర్టిఫికేట్ ఇస్తాడా? ఇద్దరూ కలసి నిక్షేపం లాంటి సంబంధం కాస్తా చెడగొట్టేస్తారా? రాస్కెల్స్! మీ పని ఇప్పుడే పడతాను" అంటూ ఓ అడుగు ముందుకి వేశాడు విశ్వనాథం.
"ఏమిటి అంటాడు?" అడిగింది శ్రీదేవి సింహాద్రిని.
"ఏదో పెళ్ళి సంబంధం గురించి. ఇతనినెవరో కుర్రాళ్ళు ఆటలు పట్టించినట్లున్నారు. అందుకని కోపం వచ్చిందన్న మాట" అన్నాడు సింహాద్రి.
"అబ్బ! రియల్లీ ఒండర్ ఫుల్" అంది శ్రీదేవి.
"అవును చాలా మోర్వలెస్ ఈవెంట్" వప్పుకున్నాడు చిరంజీవి.
"ఒకోసారి ఇలా బాగా కుదురుతుంది" అన్నాడు సింహాద్రి.
"అవును శ్రీదేవిగారూ! సింహాద్రి ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రదర్శనలు చాలా ఇచ్చాడుగానీ, ఇంత సూపర్బ్ గా ఎప్పుడూ కుదరలేదు" అన్నాడు చిరంజీవి.
విశ్వనాథం ఉగ్రుడయిపోయాడు.
అయితే ఠక్కున వాళ్ళ మీద దాడి చేయడానికి కొంచెం బెరుగ్గానే ఉంది. "రాస్కెల్స్! ఏమిట్రా సూపర్బ్ అంటున్నావ్" చిరంజీవి వంక చూస్తూ అరిచాడు.
"మీరు మళ్ళీ ఇవాల్టిలో కొచ్చేస్తున్నారు- ఇవాళ్టిలో కొచ్చేస్తున్నారు. ఇవాళ్టిలో కొచ్చేస్తున్నారు." అన్నాడు సింహాద్రి విశ్వనాథం వంక చూస్తూ.
"ఇవాళ్టిలోకా?" అరచాడు విశ్వనాథం.
"అవును" అన్నాడు సింహాద్రి.
"ఏమిటి ఇవాళ్టిలోకి రావడం?"
"అంటే- అదే ఇవాళ్టిలోకి. ఇంతవరకూ నిన్నటిలో ఉన్నారు కదా?"
"ఇవాళ లేదు నిన్నా లేదు! నోర్మూసుకో! ఇప్పుడు మీ ఇద్దరినీ డొక్క చీరేస్తేగాని అసలు విషయం బయట పడదు" అంటూ వాళ్ళ డొక్కా చీరడానికికానీ సరయిన ఆయుధం కోసం గదంతా వెతకసాగాడు. అతని కళ్ళకి టేబుల్ మీదున్న పొడుగాటి దబ్బలం కనిపించగానే స్ప్రింగులా ఎగిరి అది చేతిలోకి తీసుకున్నాడు.
శ్రీదేవి ఆశ్చర్యపోయింది.
"అదేమిటి? అతను ఇవాళ్టిలోకి రాడేం?" సింహాద్రి నడిగింది విస్తుపోతూ.
"ఒకోసారి అంతేనండీ! ఓ పట్టాన రారు" అన్నాడు సింహాద్రి.
"మరి రాపోతే ఎలా?"
"ఎలాగేముందీ? ఎన్ని రోజులయినా అక్కడే ఉండి పోతాడు"
"పాపం! పూర్ ఫెలో" జాలిపడింది శ్రీదేవి.
"ఏయ్ పిల్లా! ఎవర్నువ్వు?" శ్రీదేవి వంక కోపంగా చూస్తూ అరిచాడు విశ్వనాథం.
శ్రీదేవి మరింత ఆశ్చర్యపోయింది.
"నాతోనేనా మాట్లాడుతున్నాడు?" సింహాద్రి నడిగిందామె.
"అవును" అన్నాడు చిరంజీవి.
"అతను నిన్నటిలో ఉన్నాడు కదా! మరి నాతో ఎలా మాట్లాడుతున్నాడు?"
"నిన్నలో కూడా మీలాంటి ఓ అమ్మాయితో ఘర్షణ పడ్డాడన్న మాటండీ! అందుకని మిమ్మల్నలా అంటున్నాడు" చెప్పాడు చిరంజీవి.
"పాపం పూర్ ఫెలో!" మళ్ళీ జాలిపడింది శ్రీదేవి.
"ఇదిగో ఇంకోసారి పూర్ ఫెలో గీర్ ఫెలో అన్నావంటే మక్కెలిరగ్గొడతాను" కోపం అణుచుకుంటూ అరచాడు విశ్వనాథం.
"వెరీబాడ్ లాంగ్వేజ్" శ్రీదేవి.
"అవునండీ! భాష చాలా మెరుగు పర్చుకోవాల్సుంది అతను! పదిహేను రోజుల్లో తెలుగు అనే పుస్తకం కొంటే సరిపోతుంది" తన అభిప్రాయం చెప్పాడు చిరంజీవి.
"ఇంతకూ ఇప్పుడితనిని బయటకు పంపటం ఎలా?" అడిగింది శ్రీదేవి.
"అదే... అదే.... నాకూ తెలీటం లేదు" అన్నాడు సింహాద్రి.
"దాన్దేముందీ- బలవంతంగా గెంటెయ్యడమే" అన్నాడు చిరంజీవి.