"లేదు" అని సమాధానమిచ్చాడు వరప్రసాదం.
"ఎందుకని?" అనడిగాడు అభిరాం.
"అదృశ్యరూపం దాల్చే ముందు చదివే మంత్రం మటుకే అతను బయటకి ఉచ్చరించాడు. తిరిగి యధారూపానికి మారే మంత్రాన్ని అతడు నాకు తెలియనివ్వలేదు...." అన్నాడతను.
"మరి రెండోదేమిటి?" అడిగాడు అభిరాం.
"వర్ష స్థంభన మంత్రము నేనూ, అతనూ బయటికి వచ్చినప్పుడు చిన్నగా జల్లులు కురుస్తున్నాయి. అప్పుడతను- 'ఒం నమో భగవతే రుద్రాయ జలస్తంభాయ స్తంభాయ ఠః ఠః స్వాహా' అంటూ ఆకాశం వైపు చూసి మంత్రపఠనం చేశాడు. అంతే! ఆశ్చర్యకరంగా హం ఆగిపోయింది.
'ఇక నువ్వు వెళ్ళవచ్చు' అన్నాడతను.
నేనతనికి నమస్కరించి అక్కడినుంచి వచ్చేశాను" అన్నాడు వరప్రసాదం.
అభిరాం చాలాసేపు మౌనంగా వుండిపోయాడు.
"నేను చెప్పిన సంగతులు నమ్మలేకపోతున్నావ్ కదూ?" అభిరాం వంకే చూస్తూ అన్నాడతను.
"కాదు! ఇంకా ఇటువంటి విద్యలు తెలిసినవారున్నారంటే ఆశ్చర్యమూ, అబ్బురమూ అన్పిస్తోంది" అన్నాడు అభిరాం.
"అవే కాదు... యింకా ఎన్నో అద్భుతాలు చవిచూశాను..." అని అతడంటుండగా వాల్ క్లాక్ ఒంటి గంటయిందన్న సంగతి వారికి గుర్తు చేస్తున్నట్లు ఒకసారి మోగింది.
"ఇక పడుకుందాం. రేపు మరిన్ని విషయాలు చెబుతాను" అన్నాడు వరప్రసాదం.
"అలాగే" అన్నాడు అభిరాం. ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి, బెడ్ ల్యాంప్ వెలిగించాడు. రెండు సింగిల్ కాట్ బెడ్ లు ఒక్క దగ్గిరే వేయడంతో విశాలంగా వుంది.
అభిరాం గోడవైపు వత్తిగిలి పడుకుంటే, వరప్రసాదం అతని పక్కనే మేను వాల్చాడు.
* * * * *
సమయం సరిగ్గా ఉదయం ఆరూ నలభై అయిదు!
అప్పుడే గోదావరి ఎక్స్ ప్రెస్ వచ్చి సికిందరాబాద్ రైల్వేస్టేషన్ లో ఆగింది మహదేవ్ గబగబా ఎస్-4 కోచ్ వద్దకు నడిచాడు. ప్రయాణీకులు ఒక్కొక్కరే నెమ్మదిగా దిగసాగారు. మహదేవ్ అసహనంగా చూడసాగాడు. క్షణమొకయుగంలా అన్పిస్తోంది అతనికి.
ప్లాట్ ఫాం మీద కాఫీలమ్మే వాళ్ళ కేకలు, ప్రయాణీకులు, వారి బంధువులు చేస్తున్న రణగొణ ధ్వనులు ఇవేం అతని దృష్టిపథంలోకి రావటం లేదు. అతని చూపులన్నీ కోచ్ ద్వారం దగ్గరే బంధింపబడ్డాయి.
ఇంతలో అతని భుజమ్మీద ఎవరిదో చేయి సున్నితంగా పడింది.
ఉలిక్కిపడి పకకి చూశాడతను.
తూర్పునుంచి పొడుచుకొస్తూ లోకాన్ని సింధూర వర్ణంతో అడ్డుతున్న సూర్యకాంతిలా, ఉత్తరాన ప్రత్యక్షమై వెండి వెలుగు ప్రసరిస్తున్న నెలవంకలా దర్శనమిచ్చింది మనస్విని.
అయిదదుగుల నాలుగంగుళాల ఎత్తుతో, నిశీధిలో సైతం తళతళ మెరిసే ముఖారవిందంతో, గోదారి అలలపై తేలే కార్తీక దీపకాంతుల్ని గుర్తుకు తెచ్చే నయనాలతో, పట్టుదలని సూచించే తీరయిన నాసికతో, హిమవాహిని లలిత తరంగాల్లా చిరునవ్వులు చిందిస్తున్న జ్యూసీ పెదాలతో చైత్రమాసపు మునిమాపు వెలుగులో. మొగలిపూల సువాసనల్ని ఆస్వాదిస్తూ, గున్నమామి కొమ్మపై తీరిగ్గా పాడే కోయిల పాట వింటూ బ్రహ్మ, ఆహ్లాదంలో నిండా మునిగిపోయి తయారుచేసిన బొమ్మలా వుందామె.
"ఏమిటలా చూస్తున్నావు కొత్తగా?" అప్పుడే లేలేత మావిచిగురు తిని కూసిన కోయిల పలికినట్లు అడిగింది మనస్విని.
"ఏంలేదు నిన్ను చూసి పదిహేను రోజులపైనే అయిపోయింది కదా.....తనవి తీరటం లేదు. అవునూ నేనిక్కడే ఉన్నాను. ఎట్నుంచి వచ్చావ్ నువ్వు?" ఆమె చేతిలో సూట్ కేస్ అందుకుంటూ అడిగాడు.
"ఈ ద్వారం దగ్గర జనం ఎక్కువగా వున్నారని, ఆ వైపు నుంచి బయట పడ్డాను. తీరా చూసేసరికి నువ్విక్కడ కన్పించావ్" అందామె.
మహదేవ్, మనస్వినిల పరిచయానికి ఓ ఏడు పూర్తయి రెండో ఏడు ప్రవేశించింది.
ఆమెది విశాఖపట్నం కంప్యూటర్ ప్రోగ్రామర్ గా హైదరాబాద్ లో వున్నా ఓ సంస్థలో పనిచేస్తుందామె. ఉన్న వూరు వదిలి వేరే ఊళ్ళో పనిచేయడం ఆమె తఃల్లికి యిష్టం లేదు. తండ్రి మాత్రం ప్రోత్సహించాడు. దాంతో ఆమె ఉద్యోగంలో జాయినయిపోవడం, లేడీస్ హాస్టల్లో చేరిపోవడం జరిగింది.
"ఎలా వున్నారు మీ వాళ్ళు?...." స్టేషన్ నించి బయటకు వస్తూ అడిగాడతను.
"అందరూ బాగానే వున్నారు. వాళ్ళని చూసి ఆరునెలలు పైనే అయిపోయింది కదా! అందుకే వెళ్ళాను..... ఓ వారం ఉండి వచ్చేద్దామని అనుకుని వెళితే, మరో వారం బలవంతంగా వుంచేశారు" అందామె.
అతనేం మాట్లాడలేదు.
"ఏమిటి మాట్లాడవ్? ఈ పదిహేను రోజులు ఏం చేశావ్?" అతనితో పాటు నడుస్తూ అడిగింది.
"ఏం చేస్తాను? రాత్రివేళ అందరూ నిద్రపోతుంటే ణ ఆగదిలో పడుకుని నీ కరకలం ద్వారా జాలువార్చిన అక్షరాలలో నిన్ను చూసుకుంటూ గడిపాను..."
"ఆహాఁ...." అందామె చిరునవ్వుతో నవ్వినప్పుడు విచ్చుకున్న ఆమె పలువరుస చంద్రకాంతుల్ని విరజిమ్మినట్లుంది.
"ఏం చేస్తాం? అలాగే కానీ" అంటూ బైక్ స్టార్ట్ చేసాడతను.
"పదిహేను రోజులుండిపోయావ్ గా నన్నొదిలి.... అన్ని రోజులకీ ఒక్క ఉత్తరమా వ్రాస్తావ్? అదీ ఏ ట్రైన్ కి వచ్చేదీ, ఏ కోచ్ లో వచ్చేది తెలిపి నీ పెట్టెల్ని, బ్యాగుల్నీ మోయదానికే ఆ ఉత్తరం రాస్తావా? కరిగే కొవ్వొత్తులమీద కనీసం కొవ్వొత్తికైనా సానుభూతి దొరుకుతుంది. తాను జ్వలించిపోతూ యితరులకి వెలుగు పంచుతుందని.
కానీ ఆ కొవ్వొత్తిని వెలిగించడానికి తాను కాలి నేలరాలే అగ్గిపుల్లని ఎవరూ పట్టించుకోరు. అలా వుంది నా పరిస్థితి..." తను బైక్ స్టాండ్ తీస్తూ అన్నాడతను.