'అఘోరీల గురించి అధర్వణ వేదంలో వుంటుంది. వీలయితే చదువు. అఘోరీ శాస్త్రం నశిస్తోంది.
పండితులకు యిది అక్కర్లేదు. క్రమంగా దీనిని అందరూ మర్చిపోతారు. ఇది ఒక శాస్త్రం.
ఓ శాస్త్రజ్ఞుడిలో అఘోరీలు వివిధ వ్యాధుల నివారణకు అఘోరీ మార్గాన్ని వాడాలి. ఇతర శాస్త్రజ్ఞులతో పదార్ధాన్ని శక్తిగా, శక్తిని పదార్ధంగా మార్చవచ్చని చెప్పాలి. రెండింటినీ నడిపే నియమం ఒక్కటే అన్ని పేర్ల వెనుక, రూపాల వెనుక ఐక్య సూత్రం ఒక్కటే. దీనిని నేటి శాస్త్రజ్ఞులు పరిపూర్ణంగా తెలుసుకోలేరు. వేదాంతం, ప్రాచీనా విజ్ఞానం జీవితంలో అంతర్లీనంగా వున్నా ఈ సత్యాన్ని ఎప్పుడో చెప్పాయి. ఉన్న జీవశక్తి ఒక్కటే తక్కినవన్నీ దీని రూపాలే కాబట్టి వీటిమధ్య ఉన్న సంబంధాలు అర్ధం చేసుకోవడం కష్టం కాదు.
నీరు గడ్డ కడితే మంచుముక్క అవుతుంది. కరిగి వేడెక్కితే ఆవిరి అవుతుంది. ఇవి మూడూ ఒక్కటే అని పిల్లలకు తెలియదు. రూపంలోనే తప్ప సంఘటనంలో తేడా లేదని కూడా వారికి తెలియదు.
నేటి శాస్త్రజ్ఞులు కూడా ఇటువంటి పిల్లలే వారికి అన్ని పదార్ధాల వెనుక ఉన్న ఐక్యత అర్ధం కాదు. ఒక రూపం మరొకటిగా మారే నియమాలు తెలియవు. జనన మరణాలు రెండు బిందువులు, జీవితం ఆ రెండు బిందువులను కలిపే రేఖ జీవితంలో మనకు తెలియనిది అనంత రేఖ.
మనస్సు అసంఖ్యాకమైన శక్తుల నిధి. గుప్తంగా వున్న వనరులను వాడుకుంటే ఎవరయినా ప్రపంచంలో విజయశిఖరాలను అందు కుంటారు.
మనస్సుకు శిక్షణ యిచ్చి, ఏకాగ్రంగా, అంతర్ముఖంగా మార్చితే అది మరింత లోతులకు వెళ్ళగలదు. మనస్సు మనిషికున్న పరికరాలలో అతి సూక్ష్మమైనదీ, అతి విలువైనది....' అన్నారాయన.
"మీకింత జ్ఞానం ఇన్ని విద్యలు తెలిసినా ఎందుకు ప్రజల మధ్యకు రారు?" అనడిగాను నేను.
దానికాయన యిలా బదులిచ్చాడు.
'ఆత్మజ్ఞాన సాధకులకు ప్రజల ఇబ్బందులు ఎక్కువగా వుంటాయి. మనదేశంలో స్వామి అంటే ఏమడిగినా చెప్పాలి. వాళ్ళ అష్టకష్టాలకు మార్గం చెప్పాలి. నయమైన వారు గోరంతలు కొండంతలు చేయడంతో ప్రజల తాకిడి ఎక్కువై పోతుంది.
అభ్యాసానికి సమయం లేక స్వామిగా వుండిపోవలసి వస్తుంది. అఘోరీలు ప్రజానీకంలో కలవకపోవడానికి యిదొక కారణం. నిజ జీవితంలో గొప్ప యోగులు ప్రజల బారినుంచి తప్పించుకోవడానికి పిచ్చి వారిలా ప్రవర్తిస్తారు....' అన్నారాయన."
"మీరొచ్చేసే ముందు ఏవో అద్భుతాలు అఘోరీ చూపించాడని అన్నారు. అవేమిటి?" కుతూహలంగా అడిగాడు అభిరాం.
"మర్చిపోయాను. నా జీవితంలో మర్చిపోలేని అనుభవాలవి. చెప్పినా ఎవరూ నమ్మలేని నగ్నసత్యాలు నేను అఘోరీ దగ్గర సెలవు తీసుకొని వచ్చేసే ముందు రెండు గొప్ప విద్యలు ప్రదర్శించాడతను. మొదటిది.....అదృశ్యకరణ బదనిక తంత్రము."
"అంటే" అర్ధంకానట్లు అడిగాడు అభిరాం.
"మనం చూస్తూ వుండగానే అవతలి మనిషి అదృశ్య రూపుడై పోవడం" అతని మాటలకి అభిరాం ఒక్కక్షణం వూపిరి పీల్చుకోలేక పోయాడు.
"అంటే మీరు చూస్తుండగానే అతను అదృశ్యమైపోయాడా?" ఆశ్చర్యంలోంచి తేరుకుని అడిగాడు.
"అవును! అలా అదృశ్యమైపోయే ముందు అతడు ఓ మంత్రం పఠించాడు. నాకు బాగా గుర్తుందా మంత్రం...." అన్నాడు వరప్రసాదం.
"ఏమిటా మంత్రం?" ఆత్రంగా అడిగాడు అభిరాం.
"ఓం నమో భగవతె రుద్రాయ మృతార్కమద్యే సంస్థితయ మమ శరీర మమృతం కురు కురు స్వాహ' అని మరుక్షణం అతను అదృశ్యమై పోయాడు. నేను కట్రాటలా బిగుసుకుపోయాను. అతనెక్కడున్నాడాని చుట్టూ చూడసాగాను.
'నేను నీ ముందే వున్నాను.....అదృశ్యరూపంలో' అన్న అఘోరీ గొంతు నాకతి సమీపంలో వినిపించింది. నేను షాక్ నుంచి తేరుకోక ముందే కొన్ని క్షణాల్లో అతడు నా ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు.
'ఓహ్! ఇది కళా? నిజమా' నన్న నేనే ప్రశ్నించుకున్నట్టు బయటకే అనేశాను.
అప్పుడతను- 'ఇది కలకాదు నిజమే నేను అదృశ్యకరణ బదనిక తంత్రము సాయంతో అదృశ్యమవగలిగాను' అంటూ ధీర, గంభీర వదనంతో పలికారు.
"స్వామీ..... ఇది..... ఇదెలా సాధ్యం?" అనడిగాను. దానికతడు ఇలా బదులిచ్చాడు.
"ఇందాక నేను చదివిన మంత్రాన్ని పదివేలసార్లు అతి నిష్టతో జపిస్తే సిద్దిస్తుంది. తరువాత కొన్ని తంత్రములను వుపయోగించుకోవాలి.
మొదటిది అనూరాధా నక్షత్రమునాడు ముళ్ళ 'మోదుగ' చెట్టుపై నుండే బదనికను తీసుకువచ్చి పై మంత్రముచే వెయ్యిన్నూట ఎనిమిదిసార్లు అభిమంత్రించి బుగ్గన పెట్టుకుంటే సాధకుడు నిస్సందేహంగా అదృశ్యమైపోతాడు.
మరొక విధానం మృగశిరా నక్షత్రం నాడు 'తపసి' చెట్టుపై నుండే బదనికను తీసుకొచ్చి పై మంత్రాన్ని వెయ్యిన్నూట ఎనిమిదిసార్లు అభిమంత్రించి బుగ్గన పెట్టుకుంటే మనిషి మాయమైపోతాడు.
అలాగే భరణీ నక్షత్రమునాడు ప్రత్తి చెట్టు బదనికను పై మంత్రముతో వెయ్యిన్నూట ఎనిమిదిసార్లు అభిమంత్రించి చేతికి కట్టుకున్న ఎడల సాధకుడు యితరుల కంటికి కనిపించడు.
స్వాతీ నక్షత్రమునాడు 'వేప' బదనికను తీసుకువచ్చి పై మంత్రంచే వెయ్యిన్నూట ఎనిమిదిసార్లు అభిమంత్రించి, ఆ బదనికను చేతికి కట్టుకున్న యెడల సాధకుడు అదృశ్యమైపోతాడు.
అలాగే అశ్వనీ నక్షత్రంనాడు, మృగశిరా నక్షత్రంనాడు 'మారేడు', అశోక బదనికల్ని తీసుకువచ్చి, పైన పేర్కొన్న మంత్రంచే నూట ఎనిమిది సార్లు అభిమంత్రించి, ఆ బదనికలను చేతికి కట్టుకున్న యెడల సాధకుడు నిస్సందేహంగా అదృశ్యమైపోతాడు' అని చెప్పాడతను.
"మరి మీరెప్పుడైనా ప్రయత్నించారా?" కుతూహలంగా అడిగాడు అభిరాం.