"అదేమిటి?"
"మీ పేరు అదే అయ్యుంటుందని ఊహించానుకాబట్టి"
"ఆశ్చర్యంగా వుంది"
"దేనికి?"
"ముక్కుసూటిగా నడవగలననుకుంటున్న ఓ జర్నలిస్టుకి ముఖస్తుతికూడా అలవాటున్నందుకు."
"ఏం నేను చెప్పింది నిజమేగా..."
"అదినిజమని మీరు అన్నా నేనుపొంగిపోను. నన్ను అందరిలో ఒకరిగా అనుకుంటే మీరు పొరపాటుపడినట్టే మిస్టర్ త్యాగి...." ఆ ప్రసక్తిని త్రుంచేస్తూఅంది. "పాయింటుకి. "పార్కుకి మీరు పిలవగానే వచ్చింది పాయింటు తెలుసుకోవాలనే" ఆమె చూపుల్లోని తీవ్రతకి తనూ కాస్త కంగారు పడ్డాడేమో తల తిప్పుకుంటూ అన్నాడు "చెప్పండి.....ఎందుకు ఫోన్ చేశారు."
"నేను సైకాలజీలో పి.జి. స్టూడెంటునైనా దురదృష్టవశాత్తూ పుస్తకాలకి పరిమితం కావటంఅలవాటు లేనిదాన్ని...."
"ఫైన్"
"మీ అభినందన నాకు అనవసరం."
"స్ల్పెండిడ్."
త్యాగిజవాబుల్లో అహంకారం కనిపించడం ఆమెకు మరింతకోపకారణమవుతున్నా నిగ్రహించుకుంది. "మొన్నెప్పుడో మీరు ముఖ్యమంత్రిరాజారాంగార్ని దుయ్యబట్టడాన్ని మంత్రివర్గ విస్తరణని అందంగా ఖండించడాన్ని చదివి మీ మీద సానుభూతి పెంచుకున్నాను."
సానుభూతి అన్న పదం ఎందుకు వాడిందితోచని త్యాగి వివరణకోరలేదు కాని పరిశీలనగా చూశాడు.
"ఓహియో స్టేట్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ రిచర్డ్ పెట్టి థియరీ ప్రకారం చూసే పరిస్థితుల క్రమాన్ని బట్టిమనిషి ప్రభావితుడవుతుంటాడు. ఇంకా వివరంగా చెప్పాలీ అంటే సైకాలజీ స్టడీ ప్రకారం కోర్టుల్లో న్యాయమూర్తులు కూడా తొలిసారి విన్న సాక్ష్యానికి చివరగా విన్న సాక్ష్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారని...చెప్పొచ్చేదేమిటంటే ముఖ్యమంత్రి రాజారాం గురించి మీరలాగేరియాక్టయి వుంటారు"
"మీరునన్ను అభినందిస్తున్నారోలేక విమర్శిస్తున్నారోతోచడంలేదు"
ఒకమేధావిననుకుంటున్న త్యాగిని యిలా కంగారు పెట్టడం ఆమెకు ఆనందంగా వుంది. నిజానికి తనో మేధావినని అతడెక్కడా రాసినట్టుగాని చెప్పుకున్నట్టుగాని ఆమెకు తెలీకపోయినా అతడు కరప్టెడ్ జర్నలిస్ట్ గా మాత్రం బలంగానమ్ముతోంది. ప్రిజుడిస్ తో అతడిపై దాడి జరుపుతున్నట్టు తను సైతం వూహించలేదు.
"అంటే....." నవ్వింది అహంకనిపించకుండా.
"నాభాష సైతం మీకు అర్ధంకావడం లేదన్నమాట."
"భాష అర్దమౌతూంది. కానిభావం తెలీడంలేదు. రాజకీయ నాయకులఅర్ధం లేని ఉపన్యాసంలా"
"యూసీ మిస్టర్ త్యాగీ- జర్నలిజంలో కూడా తెలివైన సేల్స్ మెన్ షిప్ అవసరమంటాడు చికాగో సెంటర్ ఫర్ డెసిషన్ రీసెర్చి సెంటర్ డైరెక్టర్ రాబిన్ హోగార్త్.....కారుని అమ్మాలనుకునే సేల్స్ మెన్ కొన్నవాడికి స్టీరియోని కూడా అంటగట్టాలంటే చెప్పాల్సింది స్టీరియోఖరీదు.
మూడువేల రూపాయలన్నికాదు. కారు ఖరీదులో మూడు శాతం మాత్రమే అని.."
"మిస్ సౌందర్య" మృదువుగా అన్నాడు "మీకు తెలిసినసబ్జెక్టుని ఏకరువు పెట్టాలని మీరు ప్రయత్నిస్తేనేనూ జూలందించుకోవాల్సివస్తుంది"
రోషంగా చూసింది "నాకు అభ్యంతరంలేదు".
"కానినా కంత తీరుబాటులేదు"
"జర్నలిజంలో ఎస్కేపిజం కూడా ఓ భాగమనినిరూపిస్తున్నారు."
"మిస్ సౌందర్యా....ఇందాక మీరన్న ఓహియో స్టేట్ యూనివర్సిటీ సైకాలజిస్ట్ రిచర్డ్ పెట్టి మరో విషయంకూడా స్పష్టంగా చెప్పాడు."
"ఏమిటట" వ్యంగ్యంగా అడిగింది.
"మనిషిఅవగాహనలే ఆ మనిషి జీవితానికో రూపం ఇస్తుంటాయని. మమ్మల్ని చూస్తుంటే అది నిజమనిపిస్తూంది."
ఉలిక్కిపడింది రిచర్డ్ పెట్టి థియరీని అతడంత ఖచ్చితంగా ఉటంకించినందుకు.
ఆమెయింకా తేరుకోకముందే అన్నాడు "మీరు జర్నలిజాన్ని పాఠకులు ఆమోదించగల సేల్స్ మెన్ షిప్ తో డీల్ చేయమనడాన్ని అంగీకరించగలను కాని మీ మాటల్లో ధ్వనించినట్టు ప్రతి జర్నలిస్టూ తనకు తాను అమ్ముడుపోయే సేమన్ కాడు....."
తనవ్యాఖ్యానం అతడికి ఘాటుగానే తగిలిందని బోధపడిందామెకి.
"వినటానికి ఆందోళనగా వున్నా ప్రస్తుతం జర్నలిస్టుల గురించి నాకున్న అభిప్రాయం ఇది. లేకపోతే ఒక ముఖ్యమంత్రి గురించి అంత దూకుడుగా మీరు రాయగలిగేవారు కాదు."
చురుక్కుమంది త్యాగికి.
"నాకుతెలుసు మిస్టర్ త్యాగీ.....మీరు చాలా తెలివైన, లేదూ తెలివైనజర్నలిస్టుగా చలామణికావాలనుకుంటున్న వ్యక్తి"
"థేంక్యూ" మృదువుగా నవ్వేడు" నన్ను బాగా అంచనా వేయగలిగారు."
"ఆప్టరాల్....వుయ్ లివ్ ఫర్ అవర్ సెల్స్...కాబట్టే మన తెలివిని క్యాష్ చేసుకుంటూ పైకి రావాలి....."
మొత్తం యూనివర్సిటీ స్టూడెంట్సు ఆరోజు అతడు రాసిన ఆర్టికల్ గురించి ప్రస్తుతించడం తెలిసిన సౌందర్య క్రమంగా అతడి అసలురంగుని గుర్తించగలుగుతున్నాననుకుంటూ అంది "ఇద్దరు వేటగాళ్ళు అడవిలోకి వెళ్ళారు హంటింగ్ కోసమని..రైఫిల్స్ ఓ మూల పెట్టి మధ్యాహ్నం భోంచేస్తుండగా ఉన్నట్టుండి వాళ్ళ ముందుకి ఓ సింహం వచ్చింది. ఆకలిగా గాండ్రించింది. వేటగాళ్లిద్దరిలో ఒకడు పరుగు లంకించుకోబోతుంటే రెండోవాడు అన్నాడుట..... ఈమధ్య మనం చదివిన ఓ క్రూరమృగాలకి చెందిన పుస్తకంలో పరుగెత్తకుండా నిబ్బరంగా నిలబడి సింహంకళ్ళలోకి చూస్తే అపాయం వుండదని రానుంది గుర్తుందా అని. దానికిరెండో వ్యక్తి అవునుతనూ చదివానంటూ
సీరియస్ గా సింహం కళ్ళలోకి చూడటం ప్రారంభించాడు......మరోనిముషం గడిచేసరికి సింహం వెళ్ళిపోలేదు.....ఒకేసారి యిద్దరిపైనా లంఘించిందట......కారణం ఆ పుస్తకం అది చదవలేదు కాబట్టి."
"బాగుంది."
"ముఖ్యమంత్రి రాజారాం కూడా ఆ సింహంలాంటి వాడే. నిజానికి అతడికి మీ థియరీలూ, విశ్లేషణలూ అక్కర్లేదు".