Previous Page Next Page 
శతఘ్ని పేజి 22

 

    "ఫైన్" అభినందించాడు.
    
    "పైగా చాలా సమర్దుడయిన ముఖ్యమంత్రి."
    
    "నిజమా..."
    
    "బహుశా అది తెలీక మీరు ప్రత్యర్ధివర్గం మూలంగా ఇన్ ఫ్లూయెన్స్ అయినట్టున్నారు."
    
    "కావచ్చు"
    
    "సో..."క్షణం ఆగి అంది "మీరు రేపు ముఖ్యమంత్రిరాజారాం సమర్దుడే అని రాయాలి..నేను ఎవర్నినా కేమిటి యింట్రస్టూ అని అడక్కండి....ఇదుంచండి" వాలెట్ లో వున్న పదివేల రూపాయల కరెన్సీ కట్టని తీసి అతడిచేతిలో వుంచింది..... "మీరు రాశాక కావాలంటేమరోపది వేలు."    

 

    వాదించకుండా డబ్బు అందుకున్నాడు "ఇది చెప్పడానికి యింత ఉపోద్ఘాతమెందుకు సౌందర్యా....ఈ అవినీతి ప్రపంచంలో యిలా డబ్బు తీసుకోవడం నేను నేరంగా భావించాను.....కాని చిన్న షరతు...."    
    
    ఒక చిన్న గెలుపులాంటి గర్వం సౌందర్య కళ్ళలో "చెప్పండి"
    
    "నేను రాస్తాను రేపు అబ్జర్వర్ లో కాని ఆ తర్వాత నాకు కావల్సింది డబ్బు కాదు."
    
    "మరి!"
    
    "ప్రపంచసుందరిగా వర్ణింపబడినక్లియోపాత్ర రాబెర్రీస్ట్రా బెర్రీరసాలతో ఆలివ్ ఆయిలుకలుపుకుని అందులో స్నానమాడేదట. ఎందుకంటే శరీరం కాంతిగా మృదువుగా సౌరభాన్ని వెదజల్లుతుండాలని.....అలాంటిదేహ సౌందర్యాన్ని స్పృశించి తరించాలని అనుకునేవాడ్ని...ఇంతకాలానికి మిమ్మల్ని చూశాను......."
    
    సౌందర్య చెంపలు రాగరంజితమైనాయి.
    
    "ఈ విషయం యింత ఆలస్యంగా ఎందుకు చెబుతున్నామా అని మీరడిగితే నా జవాబు ఒక్కటే. కొన్ని విషయాలు చర్చించడానికి కొన్ని సందర్భాలున్నాయి. ఉదాహరణకి యిందాక మీరు చెప్పిన కథలాంటిదే ఓ జోక్ చెబుతాను...."
    
    తప్పదు......ఆసక్తిలేకపోయినా నేలచూపులు చూస్తూవుండి పోయింది.
    
    "మీలాంటి అందమైన అమ్మాయి తన స్నేహితురాళ్ళతో గండిపేట పిక్నిక్ కు వచ్చింది. అక్కడ చెరువుని చూసి స్నానం చేయాలని చాలా ముచ్చట పడిందట. పాపం అంతదాకా యింట్లో స్విమ్మింగ్ ఫూల్ అలవాటు....తనను తాను నిభాయించుకోలేక స్నేహితురాళ్ళకళ్ళగప్పి ఒంటరిగా చెరువుగట్టుకు చేరి వివస్త్రగా మారడం మొదలుపెట్టింది."    

 

    బిడియంగా వున్నా ఊపిరి బిగబట్టి వుంటూంది సౌందర్య.
    
    అతడింతమాటకారిని తెలిస్తే యింతదాకా రానిచ్చేదికాది.
    
    "నగ్నంగామారినా ఆ అమ్మాయి యిక చెరువులోకి దూకాలనుకుంటూండగా నాలాంటి ఓ అబ్బాయి కేక వినిపించింది.....మేడమ్ ఇక్కడ స్నానం చేయడం నేరమన్నాడట కూచున్నచోటనుంచే ఆసక్తిగా అమ్మాయి ఒంటిని చూస్తూ....సిగ్గుతో కుంచించుకుపోయిన ఆ యువతి రోషంగా అడిగింది. ఇందాక బట్టలు విప్పకముందే ఆ విషయం ఎందుకు చెప్పలేదూ అని. దానికా అబ్బాయి యిక్కడ ఈత ఆడటమే తప్పబట్టలు విప్పడం నేరం కాదు అన్నాడు. అలా సందర్భం వచ్చినపుడే రియాక్టవడం నా సిద్ధాంతం."
    
    ఆమెలేచింది పౌరుషంగా.
    
    "ఇంకా నా షరతు వినకుండానే వెళ్ళిపోతున్నారు."
    
    "చెప్పండి" ఎందుకో అతడి కళ్ళలోకి సూటిగా చూడలేకపోతూంది.
    
    "రేపు నేను రాసేక మీరు నా కివ్వాల్సింది డబ్బు కాదు."
    
    ఆమె జీర్ణించుకోటానికి రెండు లిప్తల వ్యవధినిచ్చాడు "అలా రోషంగా చూడకండి. మీరు ఓకే అంటే నేను రెడీ. లేదూ అంటే ఈ డబ్బు వెనక్కితీసుకోండి."
    
    హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం వరించింది.
    
    ఏ గెలుపుకోసం యింతసేపూ శ్రమపడిందో అది ఓటమిగా మారటం ఆమె కిష్టం లేదు.
    
    "సరే" అంది యిప్పటి ఈ గెలుపు చాలన్నట్టుగా.
    
    "థేంక్యూ..రేపుయిదే చోట కలుసుకుందాం."
    
    వెళ్ళిపోయాడు వెనక్కి చూడకుండా....
    
    అతడు వెళ్ళిన రెండు నిముషాలకి నీలిమతో బాటు మరికొంత మంది అమ్మాయిల పొదలచాటు నుంచి బయటికొచ్చారు.
    
    ఇంకాతేరుకొని సౌందర్యనిశ్చేష్టురాలై నిలబడివుండగానే అంది నీలిమ "కంగ్రాట్స్ సుందూ, నువ్వు గెలిచావు."
    
    "స్టుపిడ్, ఫెలో....అతనింత కరెక్టిల్ అనుకోలేదు" మరో అమ్మాయి అంది.
    
    డబ్బు తీసుకోవటాన్నే చూశారు తప్ప వారి సంభాషణ వాళ్ళు వినలేదు.
    
    అదే ఆ క్షణంలో సౌందర్య చేసుకున్న అదృష్టం.
    
    "రేపు ఆర్టికల్ రానియ్" నీలిమ హెచ్చరికలా అంది "యూనివర్శిటీ స్టూడెంట్స్ ని కూడగట్టుకుని...."
    
    "ఏం చేస్తావ్?" అడిగింది సౌందర్య నిర్లిప్తంగా.
    
    "అబ్జర్వర్ పత్రికాఫీసు ముందు నిలబడి ధర్నా చేద్దాం.....త్యాగి అసలు రంగు మేనేజ్ మెంటుకి తెలియచెప్పి సేక్ చేయమని కేకలు పెడతాం..."
    
    సరిగ్గా ఇదే సమయంలో...
    
    భాగ్యనగరం నడిబొడ్డునా నిరాహారదీక్షకి కూర్చున్న బ్రహ్మజీ గంటక్రితం స్పృహకోల్పోయి ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు.
    
    నదులు కుంకుమ మెడలో దండలు అతడిలోని ప్రేతకళని పెంచుతుంటే టెంట్ ని చేరుకున్న కార్యకర్తలు ఉద్రేకంగా పొలికేకలు యిప్పుడు సమ్మెట పోట్లలా అనిపిస్తూంటే దుఖంముంచుకొచ్చిందేమో నీరసంగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నాడు.
    
    అదంతా సీతారామరాజు పై భక్తే అని తలపోసిన కార్యకర్తలు కొందరు ఆవేశంగా సమీపంలోని గుడిలోకి చొరబడిపోయి అర్జెంటుగా బ్రహ్మాజీపేర్న అర్చనలు చేయించారు.
    
    అసలు మందు లేకుండా నాన్ వెజిటేరియన్ ముట్టుకోకుండా ఏ ఒక్కరోజూ గడవని అతనికి ఇది దారుణమైన శిక్షలా అనిపిస్తూంది. అప్పటికి ఏ అర్ధ రాత్రిపూటో రెండుపెగ్గులు తాగి ఓ బిరియాని పాకెట్టు చాటుగా తినేద్దామనుకుంటే పరిచయం లేని సానుభూతిపరులు టెంట్ లోనే తిష్టవేసి యిబ్బందికి గురిచేస్తున్నారు.

 Previous Page Next Page