Previous Page Next Page 
కదిలే మేఘం పేజి 21


    "ఇక్కడున్నావా నువ్వు? నీకోసం వెదికి వెదికి ఎంత అవస్థపడ్డానో  తెలుసా?"
    "........."
    "నీకోసం అంత తాపత్రయపడి కష్టపడి అతన్ని వెదికి పట్టుకుంటే చడీ చప్పుడూ కాకుండా పారిపోయి వచ్చేస్తావా? నా పొజిషన్ ఎంత యిరకాటంలో పడిపోయిందో తెలుసా? అందరికీ కన్నుగప్పి బయటపడ్డాను కానీ లేకపోతే....."
    "......"
    "అసలెందుకలాచేశావు? ఎందుకు పారిపోయి వొచ్చేశావు?"
    "......"
    "మాట్లాడవేం?"
    ".... ...."
    "అడిగేది నిన్నే. ఎందుకని జవాబు చెప్పవు? నాకూ నాకూ...." అంటూ కోపంగా ఆమె భుజంమీద చెయ్యివేసి రెండోచేత్తో ముఖం యిటుకేసి త్రిప్పాడు.
    "ఏమిటిది" అన్నాడు ఉలికిపాటుతో.
    ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి వుండటంవల్ల ఎర్రబడి వున్నాయి. ముఖం వడలిపోయి. వాడిపోయి, వుంది. చెంపలనిండా కన్నీటి చారలు.
    తాను చాలా మొరటుగా ప్రవర్తించానా అనుకున్నాడు. ఆ పరిస్థితిలో చిక్కుకున్న ఆడపిల్ల ఏం చేస్తుంది?" తెలిసో తెలియకో అతనికి మనసు అర్పించింది. అతనికి భార్యాపిల్లలూ వున్నారన్న సంగతి తెలిశాక- పదిమందిముందూ బయటపడి అల్లరిపాలు కావటం యిష్టంలేక పారిపోయి వొచ్చేసి వుంటుంది. బయటకు చిలిపిగా, అల్లరిగా కనిపించినా, చాలా సున్నితమైన మనస్తత్వం అయివుంటుంది.
    "ఐయామ్ సారి" అన్నాడు.
    ప్రియంవద అతని ముఖంలోకి చూసి నవ్వటానికి ప్రయత్నించింది. కాని నవ్వలేకపోయింది.
    అతనికేంచెయ్యాలో,  ఆమెను ఎలా ఓదార్చాలో తెలీలేదు. కాసేపు అటు తిరిగీ, ఇటుతిరిగీ కాలక్షేపం చేశాడు. తర్వాత "సరే. దీనికేదో పరిష్కారం ఆలోచిద్దాం.....రా అన్నం తిందాం" అన్నాడు.
    "మీరుతినండి. "నాకాకలిగాలేదు" అంది ప్రియంవద చివరకు మాట్లాడుతూ.
    "నాకు చాలా ఆకలిగా వుంది".
    "అందుకే మీరు....".
    "నువ్వు తినకపోతే నేను తినను".
    "సరే". అంటూ ఆమెలేచి, చేతులు కడుక్కుని వొచ్చింది.
    మహేష్ చాపవేసి, క్యారియర్ విప్పి ఇద్దరికీ అన్నం కొంచెం కొంచెం వొడ్డించాడు- కంచాల్లో.
    తాను అన్నం కలుపుకుంటూ "ఊ. తిను" అన్నాడు.
    ఆమె చెయ్యి అన్నాన్ని ముట్టుకుంది. కాని వ్రేళ్ళు కదలటం లేదు.
    అతను ముద్ద కలుపుకుని నోట్లో పెట్టుకోబోతూ ఆమెవంక చూశాడు. అలాగే కూర్చొని వుంది.
    "ఏమిటిది?"
    ఆమె తిన్నట్లులేదు. నీటి పొరతో నిండివున్న కళ్ళు ఎటో నిలబడి వుండిపోయాయి.
    "ఇలా నాకేం బాగా;లేదు".
    అప్పటికీ ఆమె మాట్లాడలేదు.
    "నువ్వు తింటే కానీ నేను తినను"
    "........"
    "వినిపిస్తోందా? నువ్వు తింటేగాని నేను తినను"
    "......."
    "ఊ తిను"
    ఆమె తెలివిలోకివచ్చి అతనికేసి చూసింది. అతని చేతిలో అన్నం ముద్దవుంది. పెదవుల దగ్గరగా తీసుకొచ్చి "ప్లీజ్, తిను" అంటున్నాడు.
    ఆమెకళ్ళు విస్ఫారితాలైనాయి. ఆశ్చర్యంగా చూస్తున్నది. ఎవరితను? ఎందుకింత ఆత్మీయత, ఆప్యాయత ప్రదర్శిస్తున్నాడు!
    అతని కళ్ళలోని అమాయకత్వం, అనురాగం....
    ఆమె కరిగిపోతుంది.
    "ఊ?"
    "ఊ"
    "ఆ కళ్ళు....
    "ఊ...."
    ఆ చూపులు....
    "ఊ..."
    ఆ...."
    అప్రయత్నంగా నోరు తెరిచింది.
    అతను పెట్టిన మొదటిముద్ద....ఆమె పెదవులు కదిలాయి.
    
                              *    *    *
    
    ఆ రాత్రి అతనికి ఎంతకూ నిద్రపట్టటంలేదు.
    బెడ్ లైట్ వెలుగులో - కళ్ళు మూసుకుని మంచంమీద పడుకుని వున్న ఆమెరూపమే కనిపిస్తోంది.
    ఆ రూపాన్ని చూడకుండా వుండలేకపోతున్నాడు.
    అమాయకత్వం, అల్లరికలబోసి రూపొందిన యీ లేత సౌందర్యపు ముద్ద....అతన్ని.....ఆ పిల్లల తండ్రిని.....ఏ మాత్రంరూపసి కాని ఆ వ్యక్తిని ఎలా ప్రేమించింది? ఎలా తన జీవితం అంకితం చేసుకునేందుకు సిద్దపడింది.
    'ప్రేమ గ్రుడ్డిది' అన్నది ఆరోజు నిజమే.
    కాని....
    ఎందుకంత ఆకర్షణకలుగుతోంది ఆమె పట్ల! ఆమె తన మనిషి కాదని తెలిసీ, తన సొంతంకాదని తెలిసీ, ఆమె యింకొకరికి అంకితం కాదల్చిన మనిషి అని తెలిసీ తన హృదయం ఎందుకు ఆమెకోసం అలమటిస్తోంది.
    ఇది....
    లేచి కూర్చుని ఆమె ముఖంలోకి చూశాడు. మూతలుపడ్డ కనుదోయి అలసటగా. చెంపల మీద కన్నీరు. ఆ కన్నీటిని తుడవాలనిపించింది. చేతిని మృదువుగా ఆమెచెంపకు ఆనించి వ్రేళ్ళతో అలా....అలా.....తుడిచాడు. నిద్దట్లో ఆమె కదిలింది. ఉలికిపడి తన చేతిని వెనక్కి తీసుకునే టంతలో ఆమె చెయ్యివొచ్చి చెక్కిలిమీద వున్న అతని చేతిమీద వ్రాలింది. అయినా మెల్లిగా తీసుకోబోయాడు. ఆమె వ్రేళ్ళు అతని వ్రేళ్ళలో బిగుసుకుని వున్నాయి.
    ఆమె వ్రేళ్ళతో అతని వ్రేళ్ళు.
    ఆమె చెక్కిలిపై అతని చెయ్యి.
    అప్రయత్నంగా ముందుకు వొంగాడు. అతని ముఖం ఆమె ముఖానికి చేరువగా వొచ్చింది.
    ఆమె కనురెప్పలకు, నుదురుకు, పెదిమలకు దగ్గరగా వొచ్చింది.

 Previous Page Next Page