హఠాత్తుగా ఎదురుగా వున్న గోడమీద ఆంజనేయులి బొమ్మ కనిపించింది. వెన్నుమీద ఎవరో చరిచినట్లు వెనక్కి జరిగాడు. జాగ్రత్తగా ఆమె వ్రేళ్ళనుండి పట్టు విడిపించుకున్నాడు.
ఆమె.....తన మనిషికాదు. ఆమె మనసు యింకొకరికి యిచ్చి వేసింది. ఒకప్పుడు పసిపిల్లలా, వికసించని పువ్వులా కనిపించిన ఆమె ఇప్పుడు పరిపూర్ణ సుందరిలా కనబడుతూ తాను ఆకర్షితుడయేమాట నిజం కావచ్చు. ఆమె రూపం తన హృదయంలో క్రమంగా చోటు చేసుకుంటూ వుంటే వుండవచ్చు. కాని ఆమె తన సొత్తుకాదు. ఈ ఆకర్షణను తాను త్రెంచేసుకోవాలి.
అతనికి చాలా బాధనిపించింది. ఈ చిరుప్రాయంలో యిటువంటి బాధ మున్నెన్నడూ ఎరుగడు. ఏదో పోగొట్టుకున్న భావనతో అతనిగుండె బరువెక్కింది.
చదువు ఆటలు, తబలా- వీటిమీదనుంచి అతనిదృష్టి యింతవరకూ ఎప్పుడూ ప్రక్కకి మరలలేదు.
ఎప్పుడూ ఏదో వ్యాపకంతో ఆ వ్యాపకం మీద ఏకాగ్రతతో- దీక్షగా. నిర్మలంగా, పట్టుదలగా వుండే మనసుతో క్షణం తీరికలేనట్లు కనబడే అతన్లో ఏదో కలవరం, కలకలం బయల్దేరింది.
ఈ బరువు నిస్పృహ- ఆరాటం అతనికి కొత్త.
అతని లేత గుండె- యీ అనుభూతుల తాకిడి భరించలేక పోతున్నది.
"ఎందుకిలా అయిపోతున్నాను?" అతను తనని ప్రశ్నించుకుంటున్నాడు, నిందించు కుంటున్నాడు. నిగ్రహంగా వుండటానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఆమె నా.....ఆమె.... నా...."
"నా సొంతంకాదు.....ఈ ఆలోచనతో అతని హృదయం చలించింది. కళ్ళలో చిన్ననీటిపొర క్రమ్మబోయి- బలవంతాన నిగ్రహించుకోవటంతో ఆగిపోయింది.
* * *
"ప్రియా!"
అనుక్షణం నా దురుగా వుంటావు. ఉహు. నిలబడివుండవు. కదుల్తూవుంటావు. ఎప్పుడూ ఏదో కావాలన్నట్లు- నిలబడలేకుండా పరిభ్రమిస్తూ వుంటావు.
నా మనసంతా నువ్వు నిండివున్నావనీ నీ ఆలోచన్లతోనే నాలోని ప్రతి అణువూ చలించి, జ్వలించిపోతున్నదనీ నీకు తెలియదు.
నాలో దాచుకున్నవి యింకొకరి రూపంకాదు. నిన్ను, నీ సుందర రూపాన్ని.
నేను చిత్రించుకుంటున్నది వేరొకరి మూర్తి కాదు. కేవలం నిన్నే నీ దివ్యమూర్తినే.
ఈ తెలిసీ తెలియని, ఎదిగీ ఎదగని లేతగుండె- నీ స్మరణతో పులకించి, వికసించి నాకే విస్మయం కలిగించేటంతటి ఎత్తుకు ఎగసింది.
ఈ గుండె వేగంతో నేను సరితూగలేకుండా వున్నాను.
నిన్నందుకోవాలనే ఆరాటంతో - నేను వెనక్కి మరింతవెనక్కి వెళ్ళిపోతున్నాను.
నిన్ను చేరుకోవాలన్న కోరికలోని నిషాతో నా అడుగులు తడబడుతున్నాయి.
ఎన్నడూ ఎరుగని- కావాలని.....కావాలని అనిపించే బాధ.
నువ్వు తప్ప తెలీని పెదవులపై దుఃఖపూరిత దరహాసం.
కన్నీరంటే తెలీని కన్నులలో ఉబికే విషాద తుషార బిందువులు.
నువ్వునాకు కావాలి.
ఎలా చెప్పాలో తెలియదు.
రానా? నీలో తలదాచుకోనా? ఆర్తిగా నీ గుండెలో దూరిపోనా?
ఎలా యీ విషయాలు నీ కర్ధంకావటం? ఎన్నాళ్ళని నాలోనేను దాచుకోవటం? దాచలేక, దాచటానికీ చోటులేక- ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవటం.
ప్రియా!
నేను నీ ప్రియంవదను కానా?
నన్ను నీ వెప్పుడు తెలుసుకుంటావు ఆరోజెప్పుడు వొస్తుంది?
ఆ శుభదినం కోసం ఎన్నాళ్ళని ఎదురుచూడాలి?
కానియిలా యీ నిరీక్షణే బాగుందేమో. ఒకవేళ.....ఒకవేళ.... నా మనసువిప్పి చెప్పమంటే నీవు నిరాకరిస్తావేమోనన్న భయం. ఆ నిరాకరణ భరించటంకంటే ఈ ఎదురు చూపులోని తియ్యని దుఃఖమే మంచిదేమో.
నువ్వు....
నా సర్వస్వావివైన నువ్వు
రావా?
నా దగ్గరకు రావా?
వొచ్చెయ్యి. వొచ్చేయి.
లేకపోతే - నా గుండెల మీద ఎప్పుడూ నర్తించే లాకెట్ లో దూరి పోయి శాశ్వతంగా అక్కడ వుండిపో.
నిన్నక్కడ్నుంచి కదలనివ్వకూడదన్న స్వార్ధం నాకు.
ఎంత అందమైన స్వార్ధం!
అసలు స్వార్ధం లేకపోతే ప్రేమలేదు.
ఏదో పిచ్చిపిల్లలా రాసేస్తున్నాను కదూ.
ఈ పిచ్చిపిల్ల- నీ కర్ధమవుతుందని ఆశిస్తూ-
నీ....."
గుమ్మం దగ్గర అడుగుల చప్పుడయి తలత్రిప్పి చూసింది.
సునంద లోపలకువొస్తూ "ఏమిటి రాస్తున్నావు?" అని ఆకాగితం వైపుచూసి "అరె! ప్రేమలేఖా? యిన్నాళ్ళకి తీరికదొరికిందా" అంటూ చేతిలోకి తీసుకుని తడుముకుమ్త్గూ తడుముకుంటూ చదివింది-తెలుగు చదవటం సరిగ్గా రాదుకాబట్టి.
ఒక విధమైన పులకరింతతో ఆమెముఖం విప్పారింది. "వండర్ ఫుల్" అంటూ ఆ కాగితాన్ని మడిచిజేబులో పెట్టుకుని "నీకెలా థ్యాంక్స్ చెప్పాలి?" అని కృతజ్ఞతగా ఆమె వైపుచూసి "అరె! ఎందుకు నీకంట్లోతడి?" అంది ఆశ్చర్యంగా.
"అది....తడికాదు" అన్నది ప్రియంవద పొడిగా.
"నాకు తెలుసు" అన్నది సునంద ఆమెకు దగ్గరగా జరిగి తల నిమురుతూ.
"అతను గుర్తువొచ్చాడు. అవునా?"
అవునన్నట్లు తన ఊపి, విషాదంగా నవ్వింది.
"నువ్వు నాకు సాయపడినట్లే నేను నీకు సాయంచేస్తాను. కారు డ్రైవింగ్ నేర్పించమని అడిగావుకదూ! నేర్పిస్తాను. ఇద్దరం కారులో ఊరంతా గాలించి పారేద్దాం. సరేనా?" అంది బుజ్జగిస్తూన్నట్లు.
* * *