ఆమెకు సంతోషంతో మాట రావటంలేదేమో అనుకున్నాడు.
వీల్ మళ్ళీ క్రిందకు వొస్తోంది.
"ఈసారి మళ్ళీ చూడు".
ఆమె చూసింది. అదేసమయానికి ఆంజనేయులు ఆమెకేసి చూశాడు.
వీల్ పైకి వెళ్ళిపోయింది.
"నిన్ను చూశాడు. పారిపోతాడేమో ఇదిత్వరగా ఆగితేబాగుండును". అంటున్నాడు మహేష్ కంగారుగా.
ఆమెకు గుండె ఝల్లుమంటున్నది.
"దూకెయ్యనా? ఇక్కడనుంచి దూకేసి పట్టుకోనా?". అంటున్నాడు ఉద్రేకంగా.
నిజంగా అన్నంతపనీ చేసేటట్టు కనిపించాడు. గాబరాగా చెయ్యి పట్టుకొని ఆపింది.
జయింట్ వీల్ స్లో అయింది.
"అతనక్కడే నిలబడివున్నాడు. బహుశా యిది స్పీడుగా తిరుగుతూండడంలో నిన్ను గుర్తుపట్టి వుండడు".
జయింట్ వీల్ ఆగుతోంది.
ప్రియంవద చాలా కలవరపాటులో వుంది.
ఆంజనేయులు చేతిలో, అతని ప్రక్కనున్న లావుపాటి స్త్రీ చేతిలో పెద్ద పెద్ద మసాలా అప్పడాలున్నాయి. అవి కాస్త కాస్త కొరికి తింటూ యిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలిద్దరి చేతుల్లో మసాలా అప్పడాలున్నాయి.
జయింట్ వీల్ ఆగింది. ఒక్కొక్కరూ సీటు క్రిందకి వొచ్చేసరికి వరుసక్రమంలో దిగుతున్నారు.
మహేష్ కి చాలా ఆత్రంగా వుంది. ఇంకా తాముదిగే సమయం వుండగానే కొక్కెంవూడదీసి, అంత ఎత్తులోంచి ఒక్కదూకు దూకి ముందుకు పరుగెత్తాడు.
జాయింట్ వీల్ ఆగేసరికి వరుసక్రమంలో అందులోకి కుటుంబంతో సహా జోరబడదామని సిద్దపడుతోన్న ఆ వ్యక్తి హఠాత్తుగా ఓ యువకుడు తనమీదకు దూసుకురావడంతో అదిరిపడ్డాడు.
"ఏయ్ మిస్టర్! ఓ ఆడపిల్లను వంచించి ఆమె జీవితంతో ఆటలాడుకుని యిక్కడింకెవరితోనో విహారాలు సాగిస్తున్నావా! అక్కడే నిలు" అని మహేష్ ఆవేశంతో కేకలుపెట్టాడు.
ఆ వ్యక్తి తెల్లబోయి "నేనేమిటి! ఎవరో ఆడపిల్ల జీవితంతో ఆడుకోవటమేమిటి? నీకేమైనా మతిపోయిందా?" అన్నాడు దబాయింపుగా.
"నీ దబాయింపు చూసి విడిచిపెడతాననుకున్నావేమో. ఇదిగో యీ అమ్మాయి నీకు తెలీదూ?" అన్నాడు తన వెనకనే వొచ్చిన ప్రియంవదను చూపిస్తూ ఆమె ఏదో చెప్పబోతోంటే వినిపించుకోకుండా.
అతను ఆమెవంక విస్మయంగా చూసి "తెలీదు" అన్నాడు.
"తెలీదూ?" అన్నాడు మహేష్ కోపంగా అతనిచొక్కా పట్టుకుని గుంజుతూ.
చుట్టూ జనం పోగవుతున్నారు.
"అయ్యో! మా ఆయన్ని వీడెవడో వొచ్చి కొడుతున్నాడు. నాయనోయ్ రక్షించండి బాబోయ్" అంటూ ఆ యిల్లాలు పెద్దగా శోకాలు పెట్టసాగింది. చేతిలో అప్పడం మాత్రం అలాగే వుంది.
"వెధవ్వేషాలు వేస్తే వూరుకుంటాననుకున్నావేమో, నీ పేరు ఆంజనేయులు కదూ?"
"అవును" అన్నాడతను బింకంగా.
"మరింకేం? ఏమీ తెలీనట్లు బుకాయిస్తావేం? ఆ పిల్లను నువ్వు ప్రేమించి మోసం చెయ్యలేదూ?" అన్నాడు మహేష్ మళ్ళీ బలంగా అతని కాలర్ పట్టి గుంజుతూ.
"నాన్నా! అప్పడం క్రిందపడిపోతుంది. జాగ్రత్త" అన్నాడు ఎనిమిదేళ్ళు కొడుకు ఆదుర్దాగా.
"నాకేం తెలీదు. ఆ అమ్మాయిని నేనెప్పుడూ చూడలేదు" అన్నాడా వ్యక్తి గట్టిగా అరుస్తూ.
"అవునయ్యా! మా ఆయనలాంటివాడు కాదు. ధర్మరాజులాంటివాడు" అంటోంది భార్య.
"ఈ మొగాళ్ళంతా బయటకు అలానే కనిపిస్తారులేవమ్మా. మీ ఆయన ముద్దుపేరు కుట్టీ అవునుకదా?"
"అవునూ. అయ్యయ్యో అయితే నిజమే. ఏవయ్యా! అందుకేనా యీమధ్య నైట్ డ్యూటీ నైట్ డ్యూటీ అని తరచూ బయటకువెడుతున్నావు?" అన్నదా యిల్లాలు మొగుడ్ని నిలదీస్తూ.
"నాన్నా! అప్పడం జాగ్ర్రత్త" అంటున్నాడు కొడుకు.
"పోనీ నువ్వు తినకపోతే నాకిచ్చెయ్యి నాన్నా" అన్నది ఆరేళ్ళకూతురు.
"పర్వతం! యిన్నాళ్ళబట్టీ కాపరంచేస్తూ నన్ననుమానిస్తున్నావా! వీళ్ళెవరో తుంటరివాళ్ళు. నన్ను నీనుంచి దూరం చేయటానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు."
"బ్లాక్ మెయిలేమిటయ్యా బ్లాక్ మెయిలు. అసలు పేరు కరెక్ట్ గా చెప్పాడు. మనిద్దరం పడగ్గదిలో పిల్చుకునే పేరూ కరెక్ట్ గా చెప్పాడు. ఏదో గ్రంధం జరుగుతోంది నాయనోయ్. నైట్ డ్యూటీ అని నా కొంప ముంచాడు. తండ్రోయ్" అంటూ ఆమె అప్పడం" పట్టుకోవే" అని కూతురు చేతికిచ్చి గుండెలు బాదుకోసాగింది.
"పర్వతం! నా మాటవిను. నన్నపార్దం చేసుకుంటున్నావు".
"అపార్ధమేంటయ్యా-నా సంసారంలో గుండంపెట్టి...."
ఈ గొడవంతా విని జనం చుట్టూ గుమిగూడిపోయారు.
"ఏం జరిగింది? అహ! అసలేం జరిగింది?"
"ఇతను ఎవరో అమ్మాయిని ప్రేమించానని చెప్పి మోసం చేశాడట."
"ఆఁ"
"తనకు పెళ్ళాం పిల్లలూవున్న సంగతి దాచిపెట్టి యీ ప్రేమాయణం సాగించాట్ట."
"అమ్మమ్మా."
"ఆ అమ్మాయికిక....."
"ఛీఛీ ఎంత దుర్మార్గం."
ఇంతలో ఎవరో పెద్దమనిషి ముందుకొచ్చాడు. "నాకేం తెలియదో అని మొత్తుకుంటూంటే అతనిమాట వినిపించుకోరేమిటి? అసలా అమ్మాయి ఉలక్కుండా పలక్కుండా నిలబడుతుందేం? ఆ అమ్మాయినే అడిగితే సరి అసలు విషయం బయటపడుతుంది" అని సలహా యిచ్చారు.
ఈ సలహా అందరికీ వచ్చింది.
మహేష్ కూడా తల ప్రక్కకి త్రిప్పి "యింత జరుగుతూంటే నువ్వు నోరుమెదపవేం" అంటూ ఆమెకోసం చూశాడు.
అక్కడ ప్రియంవద లేదు.
7
ఓ గంట గడిచాక మహేష్ ఆ గదికి వొచ్చేసరికి ప్రియంవద మంచంమీద కూర్చుని వుంది. ముఖం గోడకేసి త్రిప్పివుంది.