"అబ్బే! రెండు సందులు దాటితే సరిగ్గా మూడో సందు."
"సరిగ్గా చెబుతాడా?"
"అమ్మో! మహా ఘటికుడే ఇలాంటి విషయాల్లో!"
"అబ్బా!"
"శివరావుగారని! ఇప్పుడందరూ శివబాబా అని పిలుస్తున్నార్లే! పాము మంత్రం దగ్గర్నుంచీ ప్రయోగాలు చెయ్యడం దాకా ఏమైనా చెయ్యగలడు, తలుచుకుంటే! మొహం చూసి నీ బతుకేమిటో చెప్పెయ్యగలడు యావనుకున్నావో!"
హుషారొచ్చింది శంకర్రావుకి.
"జరిగేది చెప్పగలడా?"
ఆ ప్రశ్న తనకు వ్యక్తిగతమైన అవమానంగా భావించాడు రామ్మూర్తి.
"అట్టా, ఇట్టా చెప్పడమనుకున్నావేమిటి? ఆయన చెప్పాడూ అంటే జరిగి తీరాల్సిందే అన్నమాట! ఆయన దగ్గర కర్ణపిశాచి ఉందోయ్ భగవాన్లూ! మన మనసులో ప్రశ్నలకి మనం నోరు తెరిచి అడక్కుండానే, ఆయన చెవుల దగ్గర సమాధానం చెబుతుందిట ఆ కర్ణపిశాచి. యావనుకున్నావో!"
"అలాగేం!"
"మరి అల్లాడప్పా గాడనుకున్నావా ఏమిటీ? చదువుకున్న వాడు గురూ! ఇదివరకు సెక్రెటేరియట్ లో సెక్షనాఫీసరుగా పన్జేసి రిటయిరయ్యాడు."
శివరావుగారి ఇల్లు చేరారు. ఆయన దర్శనం చెయ్యాలని మూడ్రోజుల నుంచీ తహతహ లాడుతున్నాడు శంకర్రావు. ముఖ్యంగా రామ్మూర్తి చెప్పిన ప్రత్యక్ష సాక్ష్యాలు విన్న తరువాత. అతనికి బాబాల పిచ్చి ఎక్కువే! వూరికి కొత్త సాధువుగానీ, బాబా గానీ, వచ్చాడని తెలుస్తే క్యూలో నిలుచుని దర్శనం చేసుకోకుండా వదలడు.
అందులో ఈయన మొహం చూసి జాతకం చదివేస్తాట్ట! కర్ణపిశాచి ఉందిట!
"రోజూ ఆయన ఇంటిదగ్గర అంతులేని జనం ఉంటారు. అందుకని శనివారం పొద్దున్నే వెళ్ళిపోదాం" అన్నాడు రామ్మూర్తి. అందుకని తెల్లవారుజామున ఐదు గంటలకే లేచివచ్చాడు శంకర్రావు.
బాబాగారు ఒంటరిగానే కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో ఇంగ్లీషు న్యూస్ పేపర్ ఉంది. ఇంకా జనం ఎవ్వరూ రాలేదు.
ఆయన్ని చూసిన శంకర్రావు కొద్దిగా ఆశ్చర్యపోయాడు. బాబాగారంటే కాషాయ బట్టలూ, రుద్రాక్షమాలలూ, మొహాన పెద్దపెద్ద కుంకుమ బొట్లూ ఉంటాయనుకున్నాడు అతను. అలాంటి బాబాల్ని డజనుమందిని చూశాడు తను. ఆయన అలా లేడు. రిటైరైపోయి, పడక్కుర్చీలో విశ్రాంతిగా పడుకుని, గత జీవితం గురించి ఆలోచించే మనిషిలా కనబడుతున్నాడు.
బాబాగారు వాళ్ళ నమస్కారాల్ని చిరునవ్వుతో అందుకుని 'కూర్చోండి' అన్నట్లు సైగ చేశారు.
ఇద్దరూ వినయంగా ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నారు.
బాబాగారు నవ్వుతూ వాళ్ళవైపు చూశారు. ఆ నవ్వులో పలకరింపూ, కుశల ప్రశ్నా. ఆశీర్వాదం కనబడుతున్నాయి.
రెండు మూడు క్షణాలపాటు రామ్మూర్తివైపు చూశారు. "మీ చెల్లెలి పెళ్ళి ఈ సమ్మర్ లోగా జరుగుతుంది" అన్నారు.
రామ్మూర్తి తేలిగ్గా నిట్టూర్చి నమస్కారం పెడుతూ - ఈ విషయంలో చాలా మధనపడి పోయానండీ!" అన్నాడు.
"ఆరాటం వద్దు. అన్నీ బాగానే జరుగుతాయి" అంటూ శంకర్రావుని చూశారు. అలా చూస్తూనే ఉండిపోయారు.
శంకర్రావు ఇబ్బందిగా కదిలి ఏదో చెప్పబోయాడు. బాబాగారు సంబాళించుకుని- "నీ భార్య గర్భవతి అవుతుంది" అన్నారు క్లుప్తంగా.
శంకర్రావు సంతోషం అతని మొహంలో, అతని కళ్ళల్లో, అతని చేతల్లో కనబడిపోతోంది. సంతోషాన్ని భరించలేక రామ్మూర్తి చేతిని గట్టిగా వత్తాడు.
'ఇంకేమిటి?' అన్నట్లు చూశారు బాబా. శంకర్రావు ఆనందాతిరేకంతో వణుకుతూ లేచి, జేబులోనుంచి అయిదు రూపాయలు తీసి నమస్కారం చేసి, ఆయనకి అందించబోయాడు. ఆయన పక్కనే ఉన్న హుండీని చూపించారు. శంకర్రావు నోటు అందులో వేశాడు. అతనూ, రామ్మూర్తీ, ఇద్దరూ బాబాగారి కాళ్ళకి తల ఆనించి పాదాభివందనం చేశారు. బాబాగారు వాళ్ళ తలలమీద చెయ్యి వుంచి మావునంగానే ఆశీర్వదించారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే, మళ్ళీ శంకర్రావు వైపు పరీక్షగా చూశారు.
శంకర్రావు వళ్ళు సంతోషంతో తేలికైపోయింది. తన చెయ్యి భుజం మీద లేకపోతే, హైడ్రోజన్ నింపిన బెలూన్ లా అతను మబ్బుల్లో కెగిరిపోయేవాడేమోనని అనిపించింది రామ్మూర్తికి.
* * *
పరధ్యానంగా, యాంత్రికంగా వంట చేస్తూంది శారద. రోజులెంత త్వరగా పరిగెడుతాయి? 'ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదు?' అన్న ఆలోచనతోనే నెల గడిచిపోయింది.
పిరికివాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారంటారు. కాని, చావడానికీ ధైర్యం కావాలని తెలుస్తూంది ఇప్పుడు. గుండె రాయి చేసుకుని కష్టాల్ని ఎదిరిస్తూ బతకగలరు కొందరు. కానీ, తనమీద ఆధారపడ్డవాళ్ళని, తనని చూసుకునే బతికేవాళ్ళని నట్టేట ముంచేసి, తను ఏ బావిలోనో దూకెయ్యాలన్నా గుండె రాయి చేసుకోవాల్సిందే!
అసహ్యమైన బ్రతుకు తనది! నిస్సత్తువగా, నిరాసక్తిగా రోజూ రెండుపూటలా ఇంత వండి పడెయ్యడం, ఆయన బలవంతం చేస్తే రెండు మెతుకులు తినడం, ఎప్పుడూ, ఏపని చేస్తున్నా దుఃఖాన్ని ఆపుకుంటూ జరిగిన దాన్ని గురించీ, జరగాల్సినదాన్ని గురించీ ఆలోచించడం ఆయన పరామర్శలూ, మధ్య మధ్య దుర్గ వచ్చి తన పిచ్చి వేషాలతో వద్దంటున్నా నవ్వించడం...