Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 20

 

    చిరాగ్గా వున్న పులి కోపంతో గాండ్రించి, పంజాతో ఒక్కదెబ్బ కొట్టింది కింద పడిన పాల పిట్టను.
    
    నీలం రంగు పాల పిట్ట ఎర్రగా మారింది.
    
    నిశ్చలంగా ఆగిపోయి చూశాడు సుధీర్. ఆ జూలో అడుగు పెట్టిన తర్వాత అతను దృష్టి కేంద్రీకరించి చూసిన దృశ్యం అది ఒకటే! భీభత్సంగా, ఉద్రేకపూరితంగా ఉందా దృశ్యం.
    
    "అయ్యో పాపం!" అంది శశి, జాలిగా ఆ పిట్టను చూస్తూ.
    
    "అమ్మో!" అంది వసుమతి, భయంగా పులిని చూస్తూ.
    
    "యూ బాస్టర్డ్!" అన్నాడు రాజన్, పులిని చూసి పిడికిలి గాల్లో వూపుతూ.
    
    ఆ దృశ్యం చూసిన తర్వాత శశీ, వసుమతీ, రాజన్ కాస్త డల్ గా అయిపోతే, సుధీర్ మొహంలోకి ఉత్సాహం వచ్చింది.
    
    "యూనో! ఇది రాయల్ బెంగాల్ టైగర్! ఎంత అందంగా ఉందో!" అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ.
    
    "మీకు బొత్తిగా భయం లేదు!" అంది శశి సుధీర్ వైపు ఇష్టంగా చూస్తూ. అతనిలోని క్రౌర్యాన్ని ఆమె ధీరత్వంగా భ్రమపడింది.
    
    "అవునవును! పేరే సుధీరుడుకదా! పొరబాట్న డాక్టరైపోయాడు. పెద్ద వేటగాడు కావలసినవాడు" అన్నాడు రాజన్.
    
    "పెద్ద వేటగాడే లెండి! మంచి 'లేడీ'నే పట్టుకున్నాడు" అంది వసుమతి, శశిని చూపించి అర్ధవంతంగా నవ్వుతూ. కానీ ఆమెకి మనసులో అదోలా ఉంది. మొదటిసారిగా సుధీర్ ప్రవర్తన అసహజంగా కనబడింది. 'అయ్యో పాపం!' అనిపించాల్సిన దృశ్యాన్ని అతను హుషారుగా చూశాడు.
    
    ఇంకో అరగంట తర్వాత బాగా పచ్చిక ఉన్న స్థలం వెదుక్కుని జంబుఖానా పరిచారు.
    
    హాట్ కేస్ తెరిచింది వసుమతి. కట్ లెట్లు, శాండి విచెస్, సమోసాలు.
    
    తళతళ మెరుస్తున్న స్టీలు కారియరు విప్పింది శశి. పులిహోర, పెరుగన్నం....సంప్రదాయసిద్దంగా ఉన్న ఉపాహారం.
    
    "మీరు పాత కొత్తల మేలు కలయిక" అన్నాడు రాజన్.
    
    మొహమాటంగా నవ్వింది శశి.
    
    తినడం పూర్తయ్యాక కాసేపు కార్ద్సు ఆడారు సరదాగా.
    
    శశిది ఎనభై రూపాయలు పోయింది. వసుమతిది ఇరవై రూపాయలు, సుధీర్ ధీ అరవై ఆరూ పోయాయి. డబ్బంతా రాజన్ గెల్చేసుకున్నాడు. పట్టపగ్గాల్లేకుండా ఉంది అతని సంతోషం.
    
    సుధీర్ మొహంలో చిరాకు కనబడింది. వోడిపోయినందుకు అసహనంగా వుంది మనసు.    

 

    శశి లేచి వాటర్ బాటిల్ తో నీళ్ళు తేవడానికి పంపు దగ్గరి కెళ్ళింది. రాజన్ ఏదో చెబుతూంటే వింటూంది వసుమతి.
    
    అప్పుడు ఎగురుతూ వచ్చి అతని మీద వాలిందొక సీతాకోకచిలుక, తరవాత జారుతూ గడ్డిలో పడింది.
    
    తీక్షణంగా దాన్ని చూసి, చేత్తో కొట్టాడు సుధీర్.
    
    గడ్డిలో అణిగిపోయింది సీతాకోకచిలుక. తెగిన రెక్కలు గాలికి మెల్లిగా ఎగిరిపోయాయి.
    
    అప్రయత్నంగా అటు చూసిన వసుమతి నిశ్చేష్టురాలై పోయింది. పాలపిట్టని పంజాతో కొట్టిన పులి గుర్తొచ్చిందామెకి.
    
    "ఏమిటలా ఉన్నావ్?" అన్నాడు రాజన్.
    
    "ఏమీ లేదు!" అంది వసుమతి తెప్పరిల్లుకుంటూ.
    
    శశి నీళ్ళు పట్టుకుని వచ్చింది. సుధీర్ చెయ్యి కడుక్కోవడానికి పంపు దగ్గరకి వెళ్ళాడు.
    
                                                              * * *
    
    ఒక ఇంటిముందు ఆగి, "రామ్మూర్తీ" అని కేకేశాడు శంకర్రావు.
    
    రెండోసారి పిలుపుకి-"వోయ్! వస్తున్నా!" సమాధానం వినబడింది.
    
    శనివారం పొద్దున్న-ఆరుంపావు ప్రాంతం. రేడియోల్లోంచి సుప్రభాతం వినబడుతూంది.
    
    గోడకి కన్నంలా ఉన్న ద్వారం. దానికి రేకు తలుపు. అది తెరుచుకుని బయటికి తొంగి చూశాడు రామ్మూర్తి.
    
    "దా కాఫీ తాగి వెళ్దాం!" అన్నాడు.
    
    కాఫీ దేముందిలే! తాగే వచ్చాను. నువ్వు త్వరగా రా!" అన్నాడు శంకర్రావు.
    
    "అయితే ఒక్క అయిదు నిమిషాలు!" అన్నాడు రామ్మూర్తి. పది నిమిషాల తరవాత బయటికి వచ్చాడు.
    
    పోట్లాడుకుంటున్న రెండు కుక్కల్ని చూస్తూ నిలబడ్డాడు శంకర్రావు.
    
    "వెళ్దామా?" అన్నాడు రామ్మూర్తి.
    
    ఇద్దరూ త్వరత్వరగా నడుస్తున్నారు.
    
    "చాలా దూరమా?" అన్నాడు శంకర్రావు.

 Previous Page Next Page