పెళ్ళి వారు దూరం వూరునుంచి వస్తారు. పెళ్ళి ఉదయం పదిగంటలకి అయినా ఆ వూరునుంచి వచ్చే రైలు రాత్రి బయలుదేరి తెల్లవారుజముకి తప్ప లేదు. స్నేహుతుడికి సాయపడదామని రాత్రి భోజనానికి తప్పక వెళ్ళాలి కాబట్టి ఏడుగంటలకి వెళ్ళటానికి తయారయారు. ధైర్యని రమ్మంటే రానంది.
నిరంజనరావుది లంకంత కొంప. పక్క వాటాలో అద్దెకున్న వాళ్ళు యాత్రలకి వెళ్ళారు. ప్రస్తుతం ఇంటి మొత్తంమీద వీళ్ళ ముగ్గురే వున్నారు. దొంగల భయం అనేది వాళ్ళకి లేదు. రాత్రిళ్ళు దొంగతనాలు ఆ వీధిలో జరగలేదు.
"ఇంటి మొత్తంమీద ఒంటరిగా ఏం వుంటావు? నీవు కూడా రా" అన్నాడు నిరంజనరావు.
"ఆడపిల్ల ఒంటరిగా వుండటం మంచిదికాదు" అంది సావిత్రి.
"పరిక్ష రోజులు చదువుకోవాలి. పైగా పెళ్ళివారి ఇంట్లో నాకెవరు తెలియదు. నేను రాను. రేపు ఉదయం పదకొండు గంటలకి పెళ్ళి అయితే ఇప్పటినుంచి వాళ్ళింట్లో వుండటం మహా బోర్. రేపు మాత్రం పెళ్ళి టైంకి వచ్చి పెళ్ళి చూసి భోం చేసి వస్తాను. ఒంటరిగా వుంటే భయం అని నేననుకోవాలి. నాకు లేని భయం మీ కెందుకు?" అంది ధైర్య.
నిరంజనరావుకి అంత భయం లేదు. సావిత్రి అలా కాదు చాలా భయస్తురాలు. ధైర్యని ఒంటరిగా వదిలి వెళ్ళటం యిష్టం లేదు. పెళ్ళికి వెళదాం రమ్మని అడిగింది రానంది ధైర్య అందుకని "మీ అలుసు చూసుకుని అదలా తయారయింది. మీరు రమ్మని గట్టిగా చెప్పండి. "అని భర్తని పోరింది." మీ అమ్మ అడగమందిరా ధైర్యా!" అంటూ అయన నాన్చుతూ అడిగాడు.
అసలు విషయం
ధైర్యకి పెళ్ళి కెళ్ళటం ఎలర్జీ ఏమి కాదు. పరిక్షలు యింకా పదిరోజులు వున్నాయి. ఒక్కరోజు చదవకపోతే వెస్ట్ అవుతుందని కాదు. కారణం వేరే వుంది. చదువుకోవాలి అని వంక బెట్టింది.
ధైర్య రానని మొండికేయ్యటంతో జాగ్రత్త అని ఒకటికి రెండుసార్లు చెప్పి నిరంజనరావు సావిత్రి ఎడున్నరకల్లా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళారు.
"ఇల్లు మొత్తం మీద తను ఒక్కతే. తన కోరిక తిరనుంది. ఎన్నాళ్ళ కెన్నాళ్ళకి ఈ ఛాన్స్!" అనుకుంది ధైర్య.
అవకాశాలు అన్నివేళలా రావు. ఇలాంటి రోజు కోసమే చూస్తున్నది ధైర్య. అది యిప్పుడు వచ్చింది.
ఆ రోజు పరిశోధన మాసపత్రికలో భయంకరముర్తి రాసిన క్రైం రచన "ఆ చీకటి రాత్రి" చదివిన ధైర్య స్నేహితురాళ్ళు మహానంద శ్రివిద్యలతో బెట్ కాసింది. ఆ చీకటి రాత్రి రచనలో అభయ చేసినట్లు ప్రాక్టికల్ గా తనూ చేసి చూస్తానని... అలా చేయోడ్డాన్నారు వాళ్ళు, చేస్తానంది ధైర్య.
సరిగా మూడువారాల క్రితం పరిశోధన మసపత్రికని పుచ్చుకుని ముగ్గురూ ఆ చీకటి రాత్రి గురించి చర్చించుకున్నారు. అక్కడితో వాళ్ళు ఆగలేదు. "ఎప్పుడు చేస్తావ్ పరిశోధన?" అంటూ ధైర్యని నవ్వుతూ ఏడిపించటం మొదలుపెట్టారు మహానంద శ్రీవిద్య.
"ఈ రాత్రికి చేయటానికి రెడీగా వున్నాను. ఖాళి కొంప మీరు చూసిపెట్టండి మా యింట్లో చూడబోతే అమ్మా నాన్న పక్కనే అద్దెకున్న వాళ్ళు ఎలా పరిశోదన చేయను?" అంది ధైర్య.
ధైర్య చెప్పింది నిజమే కాబట్టి స్నేహితురాళ్ళు యిద్దరూ నవ్వుతాలుకి ఏడిపించే మాటలు అనటం తప్ప వాళ్ళు ఏమి చేయలేక వూరుకున్నారు.
ఏనాటికైనా ప్రాక్టికల్ గా పరిశోధన చేయటం తనకు కుదురుతుందో లేదో అని ధైర్య నిరాశ చెందింది. ఓ పక్క యింట్లో తల్లి తండ్రి మరో పక్క అద్దెకున్న వాళ్ళు . పోనీ తన గదిలో వంటరిగా వుండి చేద్దామా అంటే ఆ త్రిల్లింగ్ రాదు. భయపడటం మాట అటుంచి నవ్వు రావటం ఖాయం.