మరోమూడు రోజులు మొదటి రోజులాగే గడిచిపోయాయి. అరుణకి నిజంగానే కాస్త భయంఆదుర్దా కలిగాయి. అందరూ తనని హెచ్చరించినట్టే తన వైద్యం తను ఈ పల్లెటూరి ప్రజలకి అవసరం లేదా? మూడురోజులయినా ఒక్క కేసులేదు ఇలా అయితే తనఆశయం మాటెలా ఉన్నా తన జీవనోపాధిమాటేమిటి? ఒకవేళముందు ముందు వచ్చినా ఏ మూడు నాలుగు రోజులకో ఒకకేసు వస్తే తను ఇక్కడ ప్రాక్టీసు పెట్టడంలో అర్ధంలేదు. ఇలా అవుతుందేమోనన్న భయంతోనే ఎవరూముందుకు రావడం లేదేమో ఈ పల్లెటూళ్ళకి: ఎంతో ఉత్సాహంగా ఆరంభించిన అరుణ దిగులు పడిపోయింది. అలా ఏ పని లేకుండా ఊరికేకూర్చోవడం విసుగనిపించింది అలా గదిలోంచి పైకిఇంట్లోకి కాలు గాలిన పిల్లిలా తిరిగింది. వంటింట్లో మణికూరలని ఎలా చేస్తున్నాడో చూసి వచ్చింది. తోట ముందు జాగా అంతా శుభ్రం చేయించడానికి పెట్టిన కూలీలచుట్టూ మరికాసేపుతిరిగింది.
చదువుకున్నన్నిరోజులు చదువుతో ఊపిరి సలిపేది కాదు. ఊరికే ఉండడం ఒక్కక్షణం చేతకాని అరుణకి ఆ నాలుగురోజులు పనిలేక పిచ్చెక్కినట్లయింది అక్కడికీ మధ్యాహ్నం పూట రుక్కు వచ్చింది, తను చదివిన పాత పుస్తకాలు పట్టుకుని అవి అన్నీ పరీక్ష చేసి, రుక్కుకి ఏమాత్రం స్టాండర్డు ఉందో చూసింది. ఓ పూటచదువు చెప్పురుక్కు ఏమాత్రంచురుగ్గా గ్రహించగలదో పరీక్షించింది. ఫరవాలేదు, శ్రద్దగా రోజూ ఎవరన్నాచెపితే ఓ రెండేళ్ళలో మెట్రిక్ పరీక్షకి కట్టించవచ్చని నిర్ధారించుకుంది అరుణ. పుస్తకాలకి రాస్తానని, మెట్రిక్ కి కట్టిస్తానని రుక్కుకి వాగ్ధానం చేసింది. సాయంత్రం సుబ్బారావుగారితోటలో తిరిగి వచ్చేది.
ఎంతచేస్తే మాత్రం అనుకున్న పని ఒకటి ఒక పనికోసం వచ్చి ఆ పనికాకపోతే ఎవరికన్నా ఆదుర్దా సహజంసుబ్బారావు మాత్రం....." ఈ మాత్రానికే అధైర్యపడితే ఎలాగండీ? మీ కెందుకు నెలతిరిగే సరికి మీకు ఊపిరి సలపనిపని ఉండకపోతే నా పెరుమార్చుకుంటాను" అని శపథం చేశాడు నవ్వుతూ: అతని నోట ఆ మాటవచ్చిన వేళావిశేషమో ఏమోకాని, ఆ మధ్యాహ్నం నాలుగు గంటలకి ఓపది మంది ఆడా, మగా, పిల్లలు గోలగా ఓ పన్నెండేళ్ళకుర్రాన్ని మోసుకొచ్చారు ఆస్పత్రికి "ఓలమ్మోపంపేశాడు కొడుకా ఓలమ్మో నేనేం సేతును?" అంటూ పెద్దగా శోకాలు పెడుతూంది ఓ ఆడది.
అరుణ హడావిడిగా బయటికివచ్చి చూసింది ఆ పిల్లాడికి తలమీద బలమైనగాయం తగిలింది. నెత్తురు వరదలుగాకారిపోతుంది తెలివితప్పి పోయిన పిల్లాడిని నలుగురు మోసుకొచ్చారు ఆస్పత్రిలోకి 'ఏమయింది?" అరుణ గబగబా దగ్గరికి వచ్చి గాయం చూస్తూ అడిగింది.
పిల్లలు గోళీ కాయలు ఆడుతున్నారు. ఆటల్లో దెబ్బలాటలువచ్చి తిట్టుకున్నారు. కాసేపటికి కొట్టుకోవడం వరకు వచ్చింది. ఆ కొట్లాటలో ఒకడు పెద్ద రాయి ఒకటి తీసిబలంగా నెత్తిచిల్లుపడేట్టు కొట్టాడట నెత్తురు ఆగకుండా కారిపోతుంటే గాయానికి ఇంత బంకమన్ను పెట్టి మోసుకొచ్చారు తెలివిలేని ఆకుర్రాడిని, ఆ మట్టితోసహా నెత్తురు ఒళ్ళంతా కారి చాలా అసహ్యంగా అయింది.
"మట్టిపెట్టారా?" తెల్లబోతూ అడిగింది అరుణ. "మట్టిపెడతారా గాయానికి?" ఆ క్షణంలో వాళ్ళ మూర్ఖత్వానికి కోపంతో పాటు విచారంకూడా కలిగింది. "ఏమిటోనమ్మ మాకేటి తెల్సునెత్తురు కారిపోతుంటే? ఎట్టా" అన్నాడు ముసలాడు భయం భయంగా.
అరుణ గబగబ పిల్లాడిని లోపలి బల్లమీదికి చేర్చమని గుంపుగా చుట్టుముట్టిన అందర్ని బయటికివెళ్ళమంది. పిల్లాడికి తెలివిరావడానికి స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించి, బ్లీడింగు ఆగడానికి ఓ ఇంజక్షన్ ఇచ్చింది. ఆ గాయానికి కూరిన మట్టి అంతతీసి, శుభ్రం గా కడిగేసరికి పావుగంట పట్టింది. గాయం చాలా లోతుగా అంగుళం లోతు పడిందికుట్లు కుట్టవల్సివచ్చింది. అంతా అయి, డ్రెస్సింగు చేసేసరికి అరగంట పట్టింది.
ఆంటిటెటసన్ ఇంజక్షన్ ఒకటి ఇచ్చి పిల్లాడిని లేవదీసింది వారం పోయాక కుట్లు విప్పుతానని, మాత్రలు వేసుకోమనిచెప్పి మాత్రలు ఇచ్చింది. ఇంకెప్పుడూ అలా తెలివి తక్కువగా గాయానికి వాటికి మట్టిపెట్టవద్దని పెట్టడంవల్ల ఏం జరుగుతుందో వివరంగా బోధించింది అందరూ కుతూహలంగా విన్నారు: తల లూపారు. దండాలు పెట్టివెళ్ళిపోయారు అరుణపిల్లోడి తండ్రిమాత్రం వెనక్కి వచ్చాడు బుర్రగోక్కుంటూ, "అమ్మగారూ తమకి.....బీదోన్ని ఏటియ్యాలో సెపితే" అని నసుగుతూ అన్నాడు.
అతనడిగేవరకూ అరుణకి డబ్బు మాటేగుర్తు రాలేదు. అప్పటివరకు హౌస్ సర్జన్ గా ఉన్నప్పటి అలవాటు ప్రకారం వైద్యం చేయడమేగాని, డబ్బు పుచ్చుకోవడం అది అలవాటు లేని వ్యవహారం తన మొదటి పేషెంటు దగ్గిర ఎంతడబ్బు తీసుకోవాలో ఏమని చెప్పాలో బోదపడడం లేదు అరుణకి. పుచ్చుకోవడం మానేస్తే ఎలా? ఇదేగదా? తన జీవనోపాది అందులో మొదటిపేషెంటు. "తరవాత చూద్దాంలే, పూర్తిగా నయమయ్యాక ఇద్దువుగాని" అంది అరుణ అప్పటికి ఏదీ తేల్చుకోలేక." నీవు ఏంచేస్తుంటావు?" అతని తాహతేమిటో ఏమాత్రం ఈయగలడో తెలుసుకోడానికి అడిగింది.
"మున్సబుగారింటికాడ కమతగాణ్ణి అమ్మా" అన్నాడు.
"సరేకుట్లు విప్పాక నీకు తోచింది ఈయి" అంది అరుణ. మహాఅయితే అయిదు రూపాయలు ఈయగలడు. అదైనా కష్టం మీద అంతకంటే ఇలాంటివాళ్ళు ఏం ఈయగలరు?
అసలు ఓ డాక్టరుంది గదా అని, తనదగ్గరికి తీసుకొచ్చారు మోజుకొద్దో కుతూహలం కొద్దో, లేకపోతే ఇంతగచ్చాకు, పుచ్చాకు కట్టిస్వంత వైద్యాలు చేసిఉండేవారు అలా మట్టి అదిపెట్టిన ఆ గాయం ఎంత ప్రమాదానికైనా దారితీస్తుందని తెలియనివాళ్ళు. భగవంతుడిమీదే భారం వేసి నిశ్చింతగా ఉంటారు. ఆయుష్షు తిన్నగా ఉంటే ఏ రెండు నెలలకో ఆ గాయం మాని తిన్నగా ఉంటాడు ఆ కుర్రాడు. లేకపోతే? హు ఎంత తెలివితక్కువ ప్రజలు వీళ్ళందరికి అన్నీ తెలియజెప్పవలసిన బాధ్యత తనమీద ఉంది మరోసారి గట్టిగా బాధ్యత గుర్తుకు తెచ్చుకుంది అరుణ.
ఆ సాయంత్రం సుబ్బారావు గారి తోటలోకి వెళ్ళినప్పుడు ఉదయం సంగతి చెప్పింది అరుణ. "చూశారా నేను పందెం వేశానో లేదో అప్పుడే మీకు పేషెంటు దొరికాడు" అన్నాడు నవ్వుతూ"అంతేనండి వాళ్ళకి పాపం, ఏం తెలీదు ఓసారి ఇలాగే ఎవడికో దెబ్బతగిలితే ఇంతపేడ తీసుకొచ్చి పెట్టారట. ఆ గాయం నిండా పేడలో పురుగులు దూరి కోతిపుండు బ్రహ్మరాక్షసి అయి పెద్దాసుపత్రికి తీసుకెళ్ళి ఓ నెలరోజులుండి వస్తేకానీ అది తగ్గుమొహంపట్టలేదు. కాలంతోకుళ్ళి కాలు తీసే వరకు వ్యవహారం వెళ్ళింది" అన్నాడు.
"అవునుగానీ వీళ్ళలాంటివాళ్ళ దగ్గిర డబ్బు ఎలా అండీ తీసుకోవడం? ఏం ఈయగలరు?" అనుమానంబయట పెట్టింది అరుణ. "అవును మీరు చెప్పింది నిజమే. ఓ నాలుగో అయిదో ఈయాలన్నావాళ్ళకి కష్టమే కానీ, అలా అని వదిలేస్తే మీకెలా? ప్రాక్టీసు అంటూ పెట్టక ప్రతి వాళ్ళని ఇలా జాలి దలచివదిలేస్తే మీ కెలాకుదురుతుంది? ఒకలాచేయండి. మీ విజిటింగ్ ఫీజు అయిదు రూపాయలని నిర్ణయించండి. అంటే కనీసం ఓ కేసు చూడాలంటే అయిదు రూపాయలు తరవాత రోగాన్ని బట్టి, వాళ్ళ తాహతుని బట్టి ట్రీట్ మెంట్ అది అయ్యాక డబ్బు వసూలు చేయవచ్చు:"
"అయిదురూపాయలు ఎక్కువేమో? ఇక్కడవాళ్ళు అంతఈయగలరంటారా?"
"ముందుమీరలా ఓ రేటు ఫిక్స్ చేయకపోతే లాభంలేదు. అంతగా ఈయలేని వాళ్ళు దగ్గిర తక్కువ వసూలు చేద్దురుగాని ఆమాత్రం ముందు కాస్త ఖరాఖండిగా ఉండకపోతే అందరూ ఎగగొట్టడానికి చూస్తారు. ప్రతివాళ్ళు ఊరికేవైద్యం చేయించుకుని డబ్బీయరు. అలాఅని మరీ అంత కర్కశంగా డబ్బిక్కడపెడితేనే వైద్యం చేస్తాను. లేకపోతేలేదు అని అనమని నా ఉద్దేశంగాదు, ఏదో ఒకనిర్ణయం అంటూ ఉంటే వచ్చేవాళ్ళకి సులువు అని నా ఉద్దేశం."
సుబ్బారావు చెప్పింది సబబుగానే ఉందనిపించింది అరుణకి. ఆ మాత్రం ఈయగలిగినవారే వస్తారు దగ్గరికి. లేనివాళ్ళు నిజంగా అపాయంలో ఉంటే డాక్టరు దగ్గరికి రాక మానరు. అలా వచ్చినవాళ్ళని డబ్బీయకపోతే చూడను అని తను చెప్పలేదు! మనిషిని బట్టి డబ్బు వసూలు చేయవచ్చు అని నిర్ణయించుకుంది అరుణ.
"థాంక్స్ మీ సలహా బాగుంది నా తరపున నా రేటు ఎంతో చాటింపు వేయించి పెడుదురూ" నవ్వుతూ అంది అరుణ.
* * *
నెలాపదిహేను రోజులు గడిచేసరికి సుబ్బారావు పందెంలో గెలిచాడు. అరుణ ఇప్పుడు పేషెంట్లకోసం ఎదురు చూస్తూ కూర్చునేస్థితి దాటిపోయింది. పేషెంట్లే డాక్టరుగారికోసం బల్లలమీద పడిగాపులు పడుతున్నారు. ఎప్పుడు చూసినా కనీసం అరడజను మందితక్కువ లేకుండా డాక్టరుగారి దర్శనం కోసం ఉంటున్నారు. మొదట్లో సుబ్బారావు అన్నట్లు ఆ ఊరి వాళ్ళకి డాక్టరు దగ్గరికి వెళ్ళడం అలవాటుపోయి, తమ ఊళ్ళో ఓ డాక్టరుంది అని తట్టి ఏదన్నా రోగం వస్తే డాక్టరుని చూడాలి అన్న అలవాటు కావడానికికొన్ని రోజులు పట్టింది.
అదైనా ఏదో సిగ్గుపడుతున్నట్టు బిడియంగా భయంభయంగా కొత్తపెళ్ళికూతురు సారె గదిలోకి వెళ్ళినట్టు తలుపుల మూలనక్కేవారు ఆస్పత్రికివచ్చి 'అలా నిలుచున్నా వాళ్ళని అరుణ చూసిదగ్గరికి వెళ్ళి పిలిచి, పదిసార్లు అడగ్గా తామెందుకువచ్చారో చెప్పేవారు. ఇంక తరవాత వాళ్ళరోగం గురించి, వాళ్ళబాధలను గురించి తెలుసుకోడానికి ఎన్నెన్ని విధాలుగానో ప్రశ్నిస్తే కానీ సంగతి రాబట్టలేకపోయేది అరుణ : డాక్టరు దగ్గరికివచ్చి జబ్బు గురించి చెప్పడం తెలియని ప్రజలని చూసి జాలిపడాలోకోపం తెచ్చుకోవాలో అర్ధం అయ్యేది కాదు అరుణకి.
"ఏమిటినీ ఒంట్లో సుస్తీ?" అని మొట్టమొదటి ప్రశ్న వేసేది అరుణ. ఆ వచ్చిన వాళ్ళు గుడ్లు మిటకరించి అరుణవైపు చూసేవారుగుటకలు మింగుతూ. "చెప్పు నీ బాధ ఏమిటో చెప్పకపోతే నా కెలా తెలుస్తుంది?" నెమ్మదిగా వాళ్ళభయం పోగొట్టడానికి నవ్వుతూ ప్రశ్నించేది అరుణ. "ఏటోనమ్మగారూ, ఒంట్లో బాగునేదు." నసుగుతూ కాసేపటికి అనేవారు.
"అదేమిటి బాగులేదు? జ్వరమా? కడుపునొప్పా దగ్గు వస్తుందా, ఒళ్ళునొప్పులా?" ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తే తలా తోకా సంబంధం లేకుండా ఏవేవో చెప్పేవారు ఆ చెప్పిన లక్షణాలను బట్టి, పరీక్ష చేసి వాళ్ళరోగం ఏమిటో నిర్ణయించడానికి అరుణకి కష్టమే అయ్యేది అయినా సహనంతో ఓర్పుగా రకరకాలుగా అడిగి తెలుసుకుని మందు లిచ్చిపంపేది అరుణ.