అతను వెళ్ళాక రెండు నిముషాలకుగాని పరాంకుశం మనిషి కాలేకపోయాడు.
టేబిల్ మీద ఫోన్ మ్రోగేసరికి యీ లోకంలోకి వచ్చి రిసీవర్ అందుకోబోయి 'వద్దు, అప్పులవాళ్ళయి వుంటారు' అనుకుంటూ రిసీవర్ ఎత్తి ప్రక్కకు పెట్టేశాడు. గుర్ గుర్ మన్న చప్పుడు అందులోంచి వచ్చి కాసేపటికి ఆగిపోయింది.
'బహుశా అవి తిట్లు, శాపనార్ధాలు అయితే నాకేం? నాకు వినిపించలేదుగా' అనుకున్నాడు పరాంకుశం గర్వంగా.
కాసేపటికి అతనికి ఆకలేసింది. కనీసం కాఫీ అయినా త్రాగాలనిపించింది.
ఎక్కడకు పోయింది పంకజం? ఇంట్లో చెట్టంత భర్తను, కొండంత మొగాడ్ని, ఆ మాటకొస్తే మొనగాడ్ని విడిచిపెట్టి ఎక్కడ షికార్లు కొడుతుంది? తాను మంచివాడూ, విశాలహృదయం గలవాడూ కాబట్టి చూస్తూ వూరుకుంటున్నాడు గానీ, యిహ సహించేదిలేదు. ఈవేళ అటోఇటో తేల్చేసుకోవాలి. ఆఁ ఈ పరాంకుశానికి అంకుశం ఎడిటర్ కి కోపమొస్తే ఏమనుకుంటోందో!
బయట అడుగుల చప్పుడయి, ఏదో నీడ పడినట్లయేసరికి తల ప్రక్కకి త్రిప్పి చూసి "ఎక్కడికెళ్ళావు?" అన్నాడు లోపలకు వస్తున్న పంకజాన్ని చూసి.
పంకజనికి ముఫ్ఫయి రెండూ, ముఫ్ఫాయి మూడేళ్ళు వుంటాయి. కాని మేకప్ చేసుకోవటం పట్ల తీసుకున్న శ్రద్ద, ఆకర్షణగా కనిపించాలన్న తాపత్రయంవల్ల చిన్నదిగా కనిపిస్తుంది. మనిషి అందగత్తేమీ కాదుగాని, అనాకారిమాత్రం కాదు. మొగవాళ్ళు యిష్టపడే అంశాలు ఆమెలో చాలా వున్నాయి.
"ఏమిటంత దబాయించినట్లుగా అడుగుతున్నారు?" అనడిగింది నిలదీసినట్లుగా.
"భర్తను కాబట్టి అడిగాను" అంటూ ఆమె మొహంలోకి చూసి, మూడ్ గమనించి, ఎందుకైనా మంచిదని కాస్త తగ్గి "నేనేమీ దబాయించడంలేదు. తెలుసుకోవాలి కాబట్టి అడిగాను."
"నూన్ షోకి వెళ్ళాను."
"మళయాళం పిక్చర్ కా? తెలుగు పిక్చర్ కా?"
"దేనికో ఓ దానికి అజలు చెప్పాలా?"
"చెప్పక్కర్లేదనుకో! అయినా రోజూ ఎందుకు పంకజం సినిమాలు?"
"ఏం వెళితే?"
"వెళ్ళవద్దనికాదు. అసలే నీ వొళ్ళు మంచిదికాదు, ఆరోగ్యం దెబ్బ తింటుందని."
"ఇక్కడ యింట్లోవుంటే ఏముంది నా తలకాయ? కబుర్లా కాలక్షేపమా? ఇంకేవన్నా."
"ఇంకేవన్నా..." అంటే ఆ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో తనకి తెలుసుకాబట్టి "అదికాదు పంకజం, ఏదో ఆకలేసి కోపంతో అన్నాననుకో, దానికింత రాద్దాంతం దేనికి? పదపద అన్నం తిందాం."
అతన్తో కలిసి భోజనం చేయటమంటే పంకజానికి ఎలర్జీ. "నాకోసం కూర్చోకపోతే మీరు పెట్టుకుని తినెయ్యకపోయారా?" అంటూ విసురుగా లోపలకు వెళ్ళిపోయింది.
"నా పెన్నుపోటుతో యింతమందిని హడలగొట్టానుకాని, దీన్నిమాత్రం లొంగదీసుకోలేకపోతున్నాను" అని అతను విసుక్కునేలోపల బయటనుండి రామలింగం చెమటలు గ్రక్కుతూ పరుగెత్తుకు వచ్చాడు.
"సార్! సార్! న్యూస్" అన్నాడు వగరుస్తూ.
"నువ్వు గొప్పన్యూస్ అన్నావంటే అది ముమ్మాటికీ చాలా సామాన్యమైన సంగతి అయివుంటుంది" అన్నట్లు నిరసనగా ఓ చూపుచూసి "ఏమిటి?" అన్నాడు.
"శ్రీలక్ష్మి హాస్పిటల్లో గొప్ప ఘోరం జరిగిపోయింది సార్"
పరాంకుశం నిరసనకు ఉద్వాసనచెప్పి ఆసక్తిగా ముందుకు వంగాడు.
"ఏమిటా ఘోరం?"
"శ్రీలక్ష్మి హాస్పిటల్ కంటివిభాగంలో ఒక చిన్నపాపకు ఎడమకంట్లో కేన్సర్ వుంటే కుడికంటికి ఆపరేషన్ చేసేశారు" అని రామలింగం తనకు తెలిసిన వివరాలన్నీ గడగడ చెప్పేశాడు.
పరాంకుశం కుర్చీలోంచి ఎగిరి గంతేశాడు. శ్రీలక్ష్మి హాస్పిటల్ ప్రొప్రయిటర్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉపేంద్రను ఒకసారి తన పత్రికలో ఎడ్వర్ టైజ్ మెంట్ కోసం కలుసుకుంటే 'ఆఫ్ ట్రాల్ నీదీ ఒక పత్రికేనా'అన్నట్లు చులకనగా మాట్లాడాడు. అప్పట్నుంచీ అతనంటే మనసులో ఒకమూల అగ్ని రగుల్తూనే వుంది.
"కమాన్, క్విక్! ఉపేంద్రవీ, డాక్టర్ అశోక్ వీ ఫోటోలు సేకరించు. అర్జంటుగా హనుమంతరావు దగ్గరకు పోదాం పద. అతన్దీ, పాపదీకూడా ఫోటోలు సేకరించాలి. హనుమంతరావును ఇంటర్వ్యూ చేయాలి. ఈ ఫోటో లన్నీ ముఖచిత్రంగా వెయ్యాలి. ఈ త్రిశూలంగాడు బయల్దేరకముందే యీ పనులన్నీ చకచక జరిగిపోవాలి" అంటూ ఆకలిమాట మరిచిపోయి శిష్యుడితో సహా బయటకు బయల్దేరాడు ఆదరాబాదరాగా.
* * *
వార్తాపత్రికలన్నీ యీ సంఘటనగురించి విపరీతంగా ప్రచారం చేశాయి. దేశమంతా ఈ ఆపరేషన్ గురించి భయంకరంగా ప్రాకిపోయింది.
నాలుగైదురోజుల్లోనే శ్రీలక్ష్మి హాస్పిటలంటే ప్రజల్లో ఓరకం భయం, ఏవగింపు కలిగాయి. ఉన్నట్లుండి అక్కడకు వచ్చే పేషెంట్సు సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.
ఉపేంద్ర తలపట్టుకుని కూర్చుండిపోయాడు. అతనెంత బిజినెస్ మేన్ అయినా, వ్యాపార విషయాల్లో అతన్లో ఎంత కఠినత్వమున్నా, దానికితోడు హుందాతనం, గాంభీర్యం వున్నాయి. జీవితంలో ఏ అంశంలోకూడా ఓడిపోవడమతను భరించలేడు.
అతనూ, డాక్టర్ అశోక్ ఎదురెదురుగా కూర్చుని వున్నారు. డాక్టర్ అశోక్ ముఖం బాధతో, దిగులుతో వాడిపోయి వుంది.
"ఇలా ఎందుకు జరిగింది?" అనడిగాడు ఉపేంద్ర ఉద్రేకాన్ని అణచుకుంటూ.
డాక్టర్ అశోక్ జవాబివ్వలేదు.
"డాక్టర్! మీరారోజు కేస్ షీటు చూడలేదా?"
"చూడకుండా ఎలా వుంటాను? ఆరోజు జరిగే కేసు షీట్సన్నీ నా అసిస్టెంట్ డాక్టర్ మనోహర్ చిద్వి వినిపించగా, ఫాలో అయి కేస్ షీటు మీద స్నాతకం కూడా పెట్టాను."
"ఈ అమ్మాయి కేస్ షీటు రాసిందెవరు? డాక్టర్ మనోహరేనా?"
"కాదు, డాక్టర్ శ్యాంప్రసాద్! అతను సెలవుమీద ఊరు వెళ్ళటంచేత బాధ్యతంతా డాక్టర్ మనోహర్ మీద పడింది."
"డాక్టర్ శ్యాంప్రసాద్ ఎప్పుడొస్తాడు?"
"ఇహ రాడు. అతను ఇరాక్ లో ఉద్యోగమొచ్చి వెళ్ళిపోయాడు."
ఉపేంద్ర వులిక్కిపడ్డాడు. "అంత ఆకస్మికంగా ఎందుకని వెళ్ళిపోయాడు?"
"ఆకస్మికంగా వెళ్ళలేదు. అతనెప్పుడో అక్కడ ఉద్యోగానికి అప్లై చేశాడు. వీసాకూడా సిద్దంచేసుకువుంచుకున్నాడు. అతను సెలవుపెట్టటం, అక్కడ్నుంచి జాయిన్ అవమని లెటర్ రావటం అన్నీ యించుమించు ఒకేసారి జరిగాయి."
"ఈ గొడవకు బెదిరి అతను కావాలని తొందరపడి వెళ్ళిపోయాడని అనుకోవచ్చా?"
"తెలియదు."
"అయితే నాకు యిన్ ఫామ్ చెయ్యకుండా ఇక్కడ్నుంచి రిలీవ్ కాకుండా ఎలా వెళ్ళాడు?"
"అనుకోని పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నానని నాకొకటీ, మీ పేర్న ఒకటీ లెటర్స్ రాసి పంపించాడు. ఈ గొడవలో నా దగ్గరే వుండిపోయాయి" అంటూ డాక్టర్ అశోక్ ఆ లెటర్స్ తీసి టేబిల్ మీద పెట్టాడు.
"కేస్ షీట్ టైప్ చేశాక, అతనుకూడా దానిమీద సిగ్నేచర్ పెట్టాలి."