అదే సమయంలో మోతీలక్ష్మీ, వాసుదేవ్ తదితరులందరూ కెమిస్ట్రీ లాబ్ హాల్లో సమావేశమయ్యారు.
ముందుగా జుత్తుల జిన్నా, మహమ్మదాలీ, జానకి, లీల తమ డైలీ రిపోర్టును సమర్పించాడు.
"లైబ్రరీ హాల్లోకి మొదట సంధ్య వెళ్ళింది-కొన్ని గంటల తరువాత నారాయణరావు వెళ్ళాడు - కానీ అక్కడ నారాయణరావు, సంధ్యతో మాట్లాడాడు-సంధ్యతో మాట్లాడి, ఎలాగయినా తనను ప్రేమించేట్టు చెయ్యమని కమలాక్షిని రిక్వెస్టు చేయడానికి నారాయణ రావు ఆమెను కల్సి వుంటాడని నా అనుమానం....." రిపోర్టు చేసి తన అభిప్రాయాన్ని చెప్పి కూర్చుంది జానకి.
"అక్కడ నారాయణరావు, సంధ్యతో మాట్లాడకపోయినా, సంధ్య మాత్రం నారాయణరావుతో మాట్లాడింది. మేం దూరంగా యీ దృశ్యాన్ని కిటికీలోంచి చూస్తూ ఉండడంవల్ల వారి మాటలు మాకు వినిపించలేదు. అక్కడ జరిగిన సంభాషణ వివరాలను కమలాక్షి మేడమ్ ద్వారా తెలుసుకుని రేపటి మన మీటింగులో తెలియజేస్తాం....." అని చెప్పింది లీల.
మహిళా సభ్యుల రిపోర్టు తర్వాత, మగ సభ్యుల రిపోర్టును తెలియజేశారు. మొదట జిత్తుల జిన్నా మాట్లాడుతూ___
"మైడియర్ యూనియన్ మెంబర్స్......జనరల్ బాడీ సభ్యుల తీర్మానం మేరకు అయిదువేల కరపత్రాలు ప్రింటింగ్ కు యివ్వండి జరిగింది-అయిదువందల బ్యానర్లను తయారు చేస్తున్నాం__ఇవ్వన్నీ రేపు ఉదయానికి మనకొస్తాయి-అప్పుడు సిటీలోని ఇంపార్టెంట్ ఏరియాలో రేపంతా ఆ బ్యానర్లు కట్టే కార్యక్రమం కొనసాగుతుంది......అలాగే .....కరపత్రాల్ని పంచడంకూడా జరుగుతుంది."
ఆ తర్వాత చాలాసేపు విద్యార్ధి నాయకులందరూ సీరియస్ గా సమాలోచనలు జరిపారు.
ఒక పక్క ఉధృతంగా, ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుండగా, రెండో పక్కన నారాయణరావు, సంధ్యల్ని లవర్స్ గా మార్చడానికి ఒక నిర్దిష్టమైన కార్యక్రమాన్ని తయారు చేయాల్సిన అవసరం వుందని అక్కడ సమావేశమైన అందరూ గుర్తించారు.
ఆ కార్యక్రమంలో భాగంగా నారాయణరావు, సంధ్యలు ఏకాంతంగా కలిసేటట్టు చేయటానికి ఏ యే కార్యక్రమాల్ని చేపట్టాలో కొన్ని సూచనలు చేసింది మోతీలక్ష్మి.
మధ్యలో జుత్తుల జిన్నావేపు తిరిగి "ఉత్తరాలు పోస్టు చేసావా?" అని అడిగింది.
"ఆ కార్యక్రమం ఎప్పుడో అయిపోయింది. మా ఇంటెదురుగా మన్న ట్యుటోరియల్ కాలేజీ కుర్రాళ్ళను రాతఃరంతా కూర్చోబెట్టి రెండు వందల ఉత్తరాల్ని రాయించి, ఇవాళ ఉదయాన్నే పోస్టు చేయించాను. ఆ ఉత్తరాలు రెండు రోజులలో స్టేట్ మొత్తం వెళ్ళిపోతాయి" చెప్పాను జుత్తుల జిన్నా.
"ఈ ఉత్తరాల కార్యక్రమం ఏంటి?" అడిగాడు వాసుదేవ్.
"సడన్ గా ప్లాష్ లాంటి అయిడియా వచ్చిందిలే. దాని ప్రకారం లెటర్స్ కార్యక్రమం మొదలెట్టాం. నారాయణరావు, సంధ్యల లవ్ ని బలపరచమని, ఈ కార్యక్రమానికి గల నేపధ్యాన్ని వివరిస్తూ, మన రాష్ట్రంలోని కాలేజీల స్టూడెంట్ లీడర్స్ కి ఉత్తరాల్ని రాయడం-దీనివల్ల ఒక్క మన వైజాగ్ లోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యమం, బలపరచడానికి మద్దతును సంపాదించడానికి అవకాశముంటుంది......" చెప్పింది మోతీలక్ష్మి.
"గుడ్ ఐడియా......కొన్నాళ్ళుపోయాక......మనం వైజాగ్ లో భారీప్రేమ ర్యాలీ తీద్దాం ఈ ఉత్తరాల కార్యక్రమం అప్పటికి మనకు ఉపయోగపడుతుంది" హుషారుగా అన్నాడు వాసుదేవ్.
"మన ప్రేమ జంట, ప్రేమను బలపర్చమని కోరుతూ, రేడియోలో కూడా ప్రకటనలిస్తే అలాగే టీ.వీ.లో కూడా....." సలహా యిచ్చాడు షక్తీ కపూర్.
"దానికి బడ్జెట్టు కావాలి. ప్రస్తుతం మనకు అదంతా అవసరం లేదు. ముందు నారాయణరావు, సంధ్యలు ఏకమయ్యేట్టు చూడండి. మన లవ్ మేనిఫెస్టోలో ఫస్టు ప్రోగ్రాం అది. ఇంతకూ వాళ్ళ మధ్య నున్న భేదాభిప్రాయాలేమిటి?" అడిగింది మోతీలక్ష్మి.
"అదే అర్ధం కావడంలేదు" లీల అంది.
"ఆ విషయాన్ని ముందు దర్యాప్తు చేయండి. ప్రాబ్లమ్ ఎక్కడుందో తెలిస్తే, మెడిసిన్ ఎక్కడ వెయ్యాలో అర్ధమైపోతుంది. ఈ డిటైల్స్ మనకు రెండు రోజుల్లో తెలియాలి" చెప్పాడు వాసుదేవ్.
ఆ బాధ్యతను జుత్తుల జిన్నా, మహమ్మదాలీ, లీల, జానకి స్వీకరించారు.
* * * *
జుత్తుల జిన్నా చెంప "ఫాఠ్" మని పేలిపోయింది.
రెండో చెంపమీద చెయ్యి మళ్ళీ పడుతుండగా నారాయణరావు చేతిని గట్టిగా పట్టుకుని సీరియస్ గా అతని ముఖంలోకి చూశాడు జుత్తుల జిన్నా.
"నువ్వు నన్ను ఫ్రెండ్ షిప్ కొద్దీ కొట్టావా......ఇతరేతర కారణాల వల్ల కొట్టావా?" లారెల్ లెవెల్లో ఫోజు పెడుతూ అడిగాడు.
"నీకూ నాకూ ఫ్రెండ్ షిప్ ఏమిట్రా? లేదు-ప్రపంచంలో ఫ్రెండ్ షిప్ లేదు-అన్యాయం వుంది-దుర్మార్గ వ్యవస్థ నాశనం కావాలి" ఆవేశంగా ఎర్రసైన్యం సినిమాలో నారాయణమూర్తిల అరిచాడు నారాయణరావు.
"ఒరేయ్....నీ దుర్మార్గ వ్యవస్థ నాశనానికి నువ్వు నా చెంపను ఫడేల్మని కొట్టడానికి మధ్య సంబంధమేమిట్రా. నువ్వు అకారణంగా నా చెంపను కొట్టడం ఏవీ బాగాలేదొరే" చంపను తడుముకుంటూ ఉక్రోషంగా అన్నాడు జుత్తుల జిన్నా.
"వెర్రిపీనుగా......నేను నిన్ను ఉత్తినే కొట్టాననుకున్నావా? లేదు గాక లేదు-రాష్ట్ర వ్యాప్తంగా, స్టూడెంట్ లీడర్స్ కి లెటర్స్ రాస్తే బావుంటుందని, ఐడియా యిచ్చింది నువ్వేనా?" సీరియస్ గా అడిగాడు నారాయణరావు.
"ఏం.....ఆ అయిడియా బావుందా?" గాంధీలా నవ్వుతూ అడిగాడు జుత్తుల జిన్నా.
"అందుకే నీ చెంపలు పేలిపోయాయి. నీ ఉత్తరాల కార్యక్రమం ద్వారా ణ లైఫ్ ని నాశనం చెయ్యడానికి నువ్వు కుట్రపన్నావ్. నువ్వు పాకిస్థాన్ ఏజెంట్ కన్నా, పరమ భయంకరమైన కుట్రదారుడవని, నా అభిప్రాయం నాదగ్గర ఎ.కె_ ట్వంటీఫోర్ వుంటే నిన్నిపుదే కాల్చిపారేద్దును" మళ్ళీ ఆవేశంగా అన్నాడు నారాయణరావు.
"నీ అభిప్రాయం చెప్పు. కానీ తప్పులు చెప్పొద్దు.....ఎ.కె. ట్వంటీఫోర్ అనే రైఫిల్ లేదు. ఎ.కె. ఫార్టీ సెవెన్, ఫిఫ్టీ సిక్స్ అలాంటివి వుంటాయి" తప్ప సరిదిద్దాడు జుత్తులి జిన్నా.
గుర్రుగా చూశాడు జిన్నావేపు నారాయణరావు.
"ఒరేయ్ జిన్నా.....ఆ సంధ్య నన్ను ప్రేమిస్తే, నేను సంధ్యను ప్రేమిస్తాను. ఆ సంధ్య తలతిక్కగా వుందనుకో. నేనూ తలతిక్కగానే వుంటాను. అంతే!