Previous Page Next Page 
ఇనుప కచ్చడాలు పేజి 19

       
                                         బంగారు గొలుసుల కచ్చడాలు

                                               భార్యాభర్తలు పడ్డ చిత్తక్షోభ


    సంతోషంకోసం చక్కనిపిల్లను పెళ్ళి చేసుకుంటారు. పెళ్ళి చేసుకోగానే పెడబుద్ధి పుడుతుంది. ఆ పిల్ల ఏమి చేస్తుందో అని అనుమానం కలుగుతుంది. అక్కడనుంచి ఈ రూపవతి పెళ్ళాం ఒక శత్రువులాగా కనబడుతుంది.
    ఈ మాట నీతిశాస్త్రాల్లోనికి కూడా ఎక్కింది. క్షణం ఆలస్యమయితే అనుమానం. ఎవరితోనయినా - సోదరభావంతోనే కావచ్చు - మాటలాడితే కడుపుమంట. ఒకడు ఆమెను చూచితే తంటాయే: ఆమె ఒకడిని చూచినా తప్పే.
    మానవస్వభావం అంత చెడ్డదని చెప్పలేము. కాని, మగవాడు అభ్యాసబలంవల్ల అంతటికి తీసుకువచ్చాడు--దానితో అగచాట్లు పడుతున్నాడు. నీడనుచూచి భూతం అని భ్రమిస్తాడు.
    అందమైన పెళ్ళాం కావాలని ఒక నాయకుడు చాలా శ్రమపడి దేశాలు తిరగి చక్కనిచుక్క నొకదానిని పెళ్ళిచేసుకున్నాడు. పెళ్ళిముచ్చట మొదటినెల పూర్తి అయిందో లేదో, అప్పుడే అనుమానం కలిగింది. ఎవడు ఏమి చేసిపోతాడో: ఈ పెళ్ళాం ఏం దగా చేస్తుందో: అని రాత్రీ పగళ్ళు యాతన ఆరంభమయింది.
    పాపం, ఈ బాధ సహించలేకపోయాడు. ఇటలీకి వెళ్ళి (చక్కని కచ్చడాలకు అప్పటికి ఇటలీ ప్రసిద్ధి కెక్కింది) బంగారు గిల్టు, చక్కని నగిషీ, బలే పనితనమూ ఉన్న కచ్చడం ఒకటి కొనుక్కొచ్చాడు.
    భార్యకు చూపించాడు; మెచ్చుకున్నాడు; ఇలాంటివి చాలామంది పెద్ద ఇంటి స్త్రీలు తొడుక్కున్నారన్నాడు. భార్యకు తొడిగాడు. అద్దంలో చూచుకో అన్నాడు. ఎంత అందంగా ఉంది అన్నాడు. తాళం వేసి తాళం జేబులో వేసుకున్నాడు.
    తమాషాగా ఉందని ఆ ఇల్లాలుగూడా కొంతసేపు నవ్వింది. కేరింతలాడింది. కొంచెం చిరాకుగా ఉన్నా, అలవాటు లేకపోవడం చేతనే అలా ఉందని అనుకుంది. పెద్దింటి ఆచారం తనకూ వచ్చిందికదా అని ఆనందించింది కూడాను.
    ఆ కచ్చడంలో ఒక్క విశేషం ఉంది. కచ్చడం రేకులను ఒడ్డాణానికి తగిలించడానికి నాలుగు బంగారు గొలుసులుండేవి. ఈ గొలుసులలో నుంచి దూర్చి ఒడ్డాణానికి తాళం వుండేది.
    కచ్చడం కొంత చికాకుగానే ఉండినా, దానివల్ల ఈ భార్యకు కొంత స్వేచ్ఛ వచ్చింది. ఇన్నాళ్ళలాగా, ఎప్పుడూ అంటి పెట్టుకుని భర్త ఉండటం తప్పిపోయింది. క్షణం ఆలస్యమయితే ఏం చేస్తున్నావన్న ప్రశ్నలు పోయాయి. ఎప్పుడూ ఖైదీలాగా, భర్త పర్యవేక్షణ కిందనే ఉండడం తీరిపోయింది.
    స్వేచ్ఛగా స్నేహితురాండ్రను చూడడానికి, వేడుకలకు ఒక్కర్తె వెళ్ళడానికి కొంత అవకాశం ఏర్పడ్డది. ఎక్కడకు వెళ్ళినా భయంలేదన్న తృప్తి భర్తకు వుండేది. ఏదయినా అనుమానం కలిగినా, జేబులోని తాళం తడువుకొనేటప్పటికి ఆ అనుమానం అంతా ఎగిరిపోయేది. ఖజానా పెట్టె ఎక్కడుంటేనేమి? తాళంచెవి నా దగ్గరనేకదా ఉంది అని అనుకునేవాడు.
    ఇలా కొంత స్వేచ్ఛగా ఉన్న రోజులలో ఒక అందగాడు తారసిల్లాడు ఈ ఇల్లాలికి. వీరిద్దరికి కొంత చనువు--పాపం ఏమీలేదు; ఉండడానికి వీలుగూడా లేదుకదా-- కలిగింది. అది పాపచింతగా పరిణమించేదో, లేక కేవలం స్నేహరూపంగానే ఉండిపోయేదో, కాని భర్తకు అనుమానం కలిగింది. భార్యను దండించాడు. స్నేహితుడిని రానీయడం లేదు. పెళ్ళాన్ని మరొకవూరికి తీసుకుపోయాడు.
    ఇంట్లో పనిచేస్తూ నౌకరు ఒకడు కొంచెం అందంగానూ, తన స్నేహితుడి పోలికతనూ ఉండేవాడు. భర్త ఆ స్నేహితుడిని దూరం చేసిన తరువాత, ఈ ఇల్లాలు ఈ నౌకరును కొంచెం ఎక్కువ ఆదరంతో చూస్తూ వుండేది. తానెక్కడకు వెళ్ళినా, వెంట తీసుకుపోయేది.
    ఒకనాడు ఈ నాయిక ఒక డాన్సుకు వెళ్ళింది. వెంటను ఈ నౌకరు గూడా వెళ్ళాడు. కులాసాగా డాన్సు జరుగుతూంది. ఈయమ్మ గూడా సీతాకోకచిలుకలాగా చిందులు తొక్కుతూ ఉంది. ఇంతలో ఏ కారణం చేతనో కచ్చడానికున్న నాలుగు గొలుసులలో ఒకటి తెగిపోయింది.
    బిక్క మొగం వేసుకొని, బెంబేలుపడి, పాపం, ఈ ఇల్లాలు డాన్సును హఠాత్తుగా ఆపి తొందర తొందరగా ఒక గదిలోనికి వెళ్ళిపోయింది.
    ఇదంతా చూస్తూ ఉన్నాడు నౌకరు. ఏమిటి చెప్మా ఈ వుపద్రవం అని ఆదుర్దాతో ఆ గది తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు సందులోంచి చూశాడు.
    నాయిక తెగిన గొలుసు సదురుకుంటూ ఉంది. చిన్నదారం ముక్కతో ఒడ్డాణానికి కడుతూ ఉంది. నౌకరుకు ఆశ్చర్యం కొంత కలిగింది. ఆవేశం పూర్తిగా కలిగింది.
    డాన్సుమళ్ళీ జరిగి పూర్తయిపోయిన తరువాత, ఈ నౌకరు ఏదో సమయం చూసుకొని మెల్లగా సరస సంభాషణలకు దిగాడు. రెండు మూడు నిమిషాలలో వీడి ధోరణి గ్రహించింది నాయిక. అపరిమితమయిన అసహ్యంతో అయిదువేళ్ళూ అంటుకునేటట్టు పట్టున ఒక్క చెంప పెట్టుపెట్టింది. ఆ వేళతోనే వాడి నౌకరీ అంతమయిందని చెప్పి, ఇంటికి పోయింది.
    ఇంటిదగ్గర భర్త చూచాడు, కచ్చడం, గొలుసు తెగివుంది. అనుమానానికి ఇంకేమి కావాలి? చిర్రుబుర్రులాడాడు; చీదరించుకున్నాడు. మరింత పకడ్బందీగా గొలుసులు బిగించాడు. మరి పదికళ్ళు పెట్టుకొని, కనిపెడుతూ ఉండేవాడు.
    ఇంతలో నాయికకు ఒక బిడ్డడు పుట్టాడు. దురదృష్టవశాత్తు, ఆ బిడ్డడు, ఆనాడు దేవిడీమన్నా చెప్పిన స్నేహితుడి మూడుమూర్తులతోనూ పుట్టాడు. ఆ బిడ్డడుగూడా పదిరోజులకన్నా ఎక్కువకాలం బతకలేకపోయినా, భర్త అనుమానం తగ్గలేదు.
    మనోతత్వవేత్తలు, శాస్త్రజ్ఞులూ, ఎంతో చెప్పారు. బిడ్డల ఆకారం ఒకరి విధంగా ఉండడానికి వ్యభిచరించనక్కరలేదన్నారు. ఎన్నో నిదర్శనాలు చెప్పారు. కురూపులకు మంచి స్ఫురద్రూపులు పుడుతున్నారు కారా అన్నారు. చిత్రాలూ పటాలూ అందమయినవి పడకగదులలో పెట్టడానికి ఇదే సుమా కారణం అన్నారు.
    ఏమి చెప్పినా లాభం లేకపోయింది. ఆ భార్యను ఒల్లనన్నాడు. పగ సాధించుకోవడానికి, భార్యకు మళ్ళా ఆ కచ్చడం తొడిగి తాళం తన దగ్గర ఉంచుకొని, భార్యను ఇంటిలో నుండి తరిమివేశాడు.
    పాపం ఆ ఇల్లాలు ఏమిచేస్తుంది? దిక్కు ఏమీ కనబడలేదు. మెల్లగా మనసు ఆ మొదటి స్నేహితుడిమీదికి వెళ్ళింది. పరిస్థితులన్నీ అతనిమీద స్నేహాన్నే బలపరచాయి.
    చాలా ప్రయత్నం చేసి, ఎంతో భోగట్టామీద ఆ స్నేహితుడిని చేరుకుంది. వారిద్దరి మనసులు కలిశాయి. తరువాత ఈ కచ్చడాలూ, ఆ బంగారపు గొలుసులూ అడ్డు వస్తాయా? కచ్చడం తాళం భర్త జేబులోనే ఉంది. వారిద్దరు కులాసాగా కాలక్షేపం చేసుకుంటూ ఉండేవారు.

 Previous Page Next Page