అని కసురుకొనేవాడు. చదువులో అతడికున్న ఆసక్తి గమనించి తనకు తీరికగా ఉన్నప్పుడు దిద్దిపెట్టించేది సువర్చల. అక్షరాలు వచ్చాయి. ఒకటో తరగతి పుస్తకంకూడా చెప్పింది. సుందరయ్య ఒంట్లూ, ఎక్కాలుకునేర్పాడు. అలాఅలా కష్టపడి టెంత్ పరీక్ష ఇచ్చి పాసయ్యాడు.
"అమ్మగారూ! నాకింకా చదువుకోవాలనిఉంది." అన్నాడు ఓరోజు.
సువర్చల అతడు చదువుకోడానికి స్కాలర్ షిప్ వచ్చేలాచేసి తన ఉదార హృదయం చాటుకొంది.
అతడు కాలేజీలో చదువుతున్నప్పుడే నక్సలైట్ల ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. బి.ఎ. పరీక్షలవుతూనే ఓరోజు మాయమై పోయాడు. ఓరోజు పోలీసులువచ్చి ఇల్లు సోదా చేయడంతో రామచంద్ర ఉద్యమంలో చేరాడన్న విషయం బయటపడింది. ఆ విషయం తెలుస్తూనే ముసలామె బెంగతో మంచం పట్టి కన్ను మూసింది.
నాయనమ్మ చావువార్త విన్నట్టున్నాడు, రామచంద్ర వచ్చాడు.
అప్పుడతడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలా ఉన్నాడు. మార్క్సిజం ఒక్కటే మానవాళికి శ్రేయస్సు నివ్వగలదన్న ప్రగాఢ విశ్వాసంతొ ఉన్నాడు.
"రామూ! విప్లవం మంచిదే. విప్లవం లేకుండా మానవసమాజంలో సంస్కరణ లెప్పుడూ జరగలేదు. విప్లవ కెరటాలే మానవమహాసాగరంలో చైతన్య సూచికాలు. ఆ విప్లవం మనుషుల మధ్యనుండి బయల్దేరాలి. మనుష్యుల మధ్యసాగాలి. ఏ కొండకోనల్లోనో దొంగల్లా దాగుకొని, తుపాకీ చేతబట్టుకొని, తను నమ్మిన సత్యానికి ప్రాణం పణంపెట్టి సాధించేది ఎంత అని ప్రశ్నవేయాలనిపిస్తూంది. ఒక్క అడుగుముందుకు వేయాలంటే ఎన్ని ప్రాణాలు బలిపెట్టాలి? ఎందరిని బలి తీసుకోవాలి? ప్రాణం పణం పెట్టడమే గొప్ప విషయంకాదు. ప్రాణం ఎంతో విలువైనది. దాన్ని త్యాగం చేయడం కంటే రక్షించుకొని నలుగురికి నీ శక్తిని పంచు. దీనుల కన్నీళ్ళు తుడవదానికి ప్రయత్నించు. ఈ ప్రజల్లో తరతరాలుగా జీర్ణించుకొన్న మౌఢ్యం, అజ్ఞానం, అనైఖ్యత పారద్రోలడానికి ప్రయత్నించు."
"గాంధీ ప్రాణం పణం పెట్టకపోతే మనకు స్వాతంత్ర్యం వచ్చేదా?"
"స్వాతంత్ర్య సమరంలో సత్యాహింసలే ఆయుధంగా చేతబట్టుకొని తనప్రాణం ఎదురొచ్చి నిలిచాడు గాంధీజీ. ఆయన ఆయుధమే ఆయనకు రక్షణకవచమైంది. మీ ఆయుదంలో హింస, రక్తదాహం ఉన్నాయి! వాటికి జయ మెప్పుడూ ఉండదు."
"నువ్వు మా సిద్దాంతాల గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నావు?"
"తెలియకపోయినా ఫర్వాలేదు. పురుగుల్ని మాడ్చేసే దీపశిఖవెల అంతకంటే భయంకరమైనవి ఎన్ని లేవు? కొంచెం కళ్ళు తెరుచుకుని మనుషులమధ్యకు వెళ్ళి నిలబడి చూడు!
"తుపాకీ గుండు ఎదురుగా నీ గుండెను నిలబెట్టటం నాకేమంత గొప్ప విషయంగా కనిపించడంలేదు! ప్రాణం తృణప్రాయంగా బలిపెట్టినంత మాత్రాన పేదల, దీనుల కన్నీళ్ళు తుడవబడతాయా?"
రామచంద్ర ఈ ప్రపంచంలో ఎవరిమాటైనా వింటాడంటే అది సువర్చలదీ, తరువాత తన బాల్యస్నేహితురాలు ప్రేమీది. అతడిని ఆ మార్గంనుండి మరల్చదానికి సువర్చలకూడా చాలా శ్రమపడింది.
"పేపరుకి అలాంటి ప్రకటన ఎందుకిచ్చావు, మామా?"
"పాపా! టీ పెట్టమ్మా!" సుందరయ్య ప్రేమీని లోపలికి పంపించి తగ్గుస్వరంతో అన్నాడు. "నా రోజులు దగ్గర పడినాయనిపిస్తూంది, రామూ! పాప బెంగపెట్టుకొంటుందని నా అనారోగ్యాన్ని సాధ్యమైనంత వరకుకప్పి పెట్టుకొంటున్నాను. నేను పోయాక పాప ఏం కావాలి? ఆ పిల్ల మంచిచెడ్డలు ఎవరు చూస్తారు? ఆమెను ఆడపిల్లగా కాదు, మగపిల్లాడిలా పెంచుతాను అనుకొన్నాను. అలాగే పెంచాను. కావలసినంత స్వేచ్ఛ ఇచ్చి, ధైర్యం, ఆత్మ విశ్వాసం నేను ఆశించిన దానికంటే ఎక్కువే ఏర్పడ్డాయి ఆమెలో! ఇవి ఉన్నంత మాత్రాన ఒంటరి ఆడపిల్ల సురక్షితంగా జీవిస్తుందా ఈ సమాజంలో అన్న ప్రశ్న ఈ మధ్యే తలెత్తింది! పాపకి నా అంటూ ఎవరూ లేకపోతే ఎలా అన్న చింత రేయింబవళ్ళు పీడించింది నన్ను. చివరికి నాకు తట్టిన ఆలోచన అది. ఒక్క 'ఈనాడు' లోనే కాదు. హిందూలోనూ, దక్కన్ క్రానికల్ లోనూ వేయించాను ఆ ప్రకటన. ఆమె చూడకపోయినా ఈ ప్రకటన ఒక వింతగా ఆనోటా, ఆనోటా చెప్పుకోగానైనా ఆమె చెవిని పడదా? పడితే మాత్రం ఆమె తప్పకుండా వస్తుందని నా నమ్మకం!"
"నీ నమ్మకంలో వెర్రి ఉంది, మామా! కనగానే బిడ్డను పారేసిన మనిషి ఇవాళ బిడ్డ ఒంటరిదై పోతుందని వస్తుందా?"
"అప్పటికీ ఇప్పటికీ ఆమెకు జీవితం చాలానేర్పి ఉంటుంది! రక్త సంబంధంలో ఉండే మమకారమేమిటో తెలిసి ఉంటుంది!"
"అప్పుడు తెలియంది ఇప్పుడు తెలుస్తుందా? మామా! నీ ఊహ నిజమే అవుతుందనుకో! కాని, ప్రేమిక ఆమె గాలికూడా సోకనివ్వదు! ప్రేమిక సంగతి నాకు బాగా తెలుసు. తనపట్ల ఆ తల్లి చూపిన కాఠిన్యానికి తన ప్రతీకారాన్ని తప్పకుండా తీర్చుకొంటుంది."
"రక్త సంబంధంలో ప్రతీకారం నిలబడలేదు, రామూ!"
"ఉహుఁ. ప్రేమిక ఏనాటికీ కన్నతల్లిని క్షమించలేదు!"
"ఈ నాలుగు రోజులకోసం ఊహాగానం ఎందుకు? ఏం జరుగుతుందో చూద్దాం. ఆమె వచ్చినా రాకపోయినా పాపని ఎవరిచేతిలోనైనా పెట్టి పోగలిగితే నాకు చాలా నిశ్చింతగా ఉండేది! పాప పెళ్ళిమాటెత్తితే కస్సుమంటుంది."
"ఆ సంగతేమిటో నేను కనుక్కొంటాను. కాని, నువ్వు మాత్రం నిశ్చింతాగా ఉండు. ప్రేమికకి మేమంతాలేమా? ప్రేమిక ఒంటరిదైపోతుందని నువ్వెందుకు అనుకొంటున్నావు? నీ పాపకి స్నేహితుడిని నేనున్నాను. తల్లిలా సువర్చలమ్మగారు ఉన్నారు. ఆమెను కూతురిలా, తోబుట్టువులా చూచుకోడానికి ఈ పేట జనం ఉన్నారు. ప్రేమికని ప్రేమించని వాళ్ళెవరున్నారు? ఇంతమంది ఉండగా ఆమె ఒంటరిదెలా అవుతుంది?"
సుందరయ్య కళ్ళు చెమర్చాయి. "నిజమే, రామూ! మీరంతా ఉండగా పాప ఒంటరిదికాదు. పాపకి ఈ పేట జనమంతా తల్లులూ తోబుట్టువులే. ఆమె జననం గురించి అంతా ఎప్పుడో మరిచిపోయారు. ప్రేమిక అంటే రాజ్యం సుందరయ్యల కూతురు. ప్రేమిక అంటే అందరికీ ఆత్మీయం! పాపలో చిన్నప్పటినుండి కనిపించే సేవాభావం, చొరవ, స్నేహం అందరినీ ఆమెకు ఆత్మీయుల్ని చేసింది. ఈ ప్రపంచంలో ఆమె శత్రువులెవరూ లేరు. ఒక్క జన్మనిచ్చిన తల్లితప్ప! నేను పోయేలోగా అ శత్రువుపట్ల ప్రేమలేకపోయినా కాస్త సానుభూతినైనా పాపలో కలిగించి పోవాలని నా తాపత్రయం! తల్లీకూతుర్ని నేను కలపలేకపోవచ్చు! కనీసం ప్రయత్నం చేయడంలో నా మనసుకు తృప్తిగా ఉంటుంది."