"ఎవరికోసం చేసుకున్నా చేసుకున్నాక ఆమెను ప్రవృత్తిరీత్యా బాధపెట్టేవాడిని కాదు. వృత్తిరీత్యా బాధ పెట్టేవాడిని కాదు. వృత్తిరీత్యా చెప్పలేను. నేను ఇదివరకే చెప్పను. డాక్టరు వృత్తిలో వున్న సమస్య."
"ఆ సంగతి అర్చన వదిన నాకు చెప్పిందండీ! అంకితభావంతో వృత్తిని నిర్వహించే వాళ్ళంటే నాకు గౌరవం. మిమ్మల్ని ప్రశంసిస్తూ పత్రికలో వచ్చిన ఆర్టికల్ అర్చన వదిన నాకిచ్చింది_ చదివాను."
"చదివారా?" పొగడ్తలంటే అట్టే గిట్టని అరవింద్ కొంచెం ఇబ్బందిగా కదిలాడు.
"వేలమంది డాక్టర్లు వేలకి వేలు డబ్బు సంపాదించుకుంటున్నారు. లక్షాధికార్లు కావడమే ధ్యేయంగా. ప్రజల అభిమానాన్ని సంపాదించుకునే డాక్టర్లుమాత్రం చాలా అరుదుగా వుంటారు. ఆ అరుదైన వ్యక్తుల్లో మీరుండడం, మీతో నాకు పరిచయం కావడం సంతోషంగా వుంది."
రెన్నెల్లక్రితం అరవింద్ గురించి పత్రికల్లో పడింది. 'రోగులసేవే పరమావధిగా భావించే డాక్టరు' అన్న శీర్షికతో అతడి ఫోటో కూడా వేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ, ఆసుపత్రికి వచ్చే రోగుల్ని ఇంటికి రమ్మని చెప్పి వాళ్ళనుండి వందలకి వందలు డబ్బు గుంజే డాక్టర్లున్న ఈ సమాజంలో, ఒక్క పైసా కూడా రోగులనుండి ఆశించకుండా రాత్రనకా పగలనకా రోగుల సేవలో మునిగి వుండే డాక్టరుగా ప్రశంసించబడ్డాడు. అతడి హస్తవాసి కూడా మంచిదన్న నమ్మకం ప్రజల్లో కలగడం వల్ల ఎలాంటి సుస్తీ అయినా వున్నవాళ్ళు, లేనివాళ్ళు అన్న తేడా లేకుండా ఆసుపత్రికి వచ్చి అతడికి చూపెట్టుకుంటారు. సర్జరీలో కూడా అతడికి మంచి పేరుంది. ప్రజల్లో అతడు సంపాదించుకున్న అభిమానంవల్ల ప్రైవేట్ డాక్టర్ల పరిస్థితి దయనీయంగా తయారయింది. అతడిని ట్రాన్స్ ఫర్ చేయించాలని ప్రయత్నించిన ప్రైవేట్ డాక్టర్లూ లేకపోలేదు.
అర్చన అంది- "మా కాంచన మీకు సరిపోయిన అమ్మాయి అనుకుంటే మా మామయ్యకి కబురు చేస్తాను. మిగతా విషయాలు మాట్లాడుకోడానికి రమ్మని. ఏమంటారు?"
"అమ్మని కూడా ఒక్క మాట అడగండి."
"ప్రత్యేకంగా అడగాల్సిన పనిలేదనుకుంటాను. పిన్నిగారి మనసు నాకు తెలిసింది. మీ సంగతే చెప్పండి."
"నాకు నచ్చింది. తనకి కూడా నేను నచ్చాలి కదా?"
"నేను ఉద్యోగం చెయ్యడం మీకు అభ్యంతరం లేకపోతే..."
"అభ్యంతరం కాదుగాని ఇబ్బదులుంటాయని నా ఉద్దేశ్యం. మీరొకచోట నేనొకచోట."
"ఒకే చోటికి ట్రై చేసుకోవచ్చులెండి."
"ఓ.కే" నవ్వేశాడు.
* * * *
సరిగ్గా నెలరోజుల తర్వాతః పెళ్ళికి ముహూర్తం కుదిరింది.
పెళ్ళి చాలా సింపుల్ గా జరిగితే బాగుంటుందన్నాడు అరవింద్. రిజిష్టర్ మ్యారేజ్ అయితే యింకా మంచిదన్నాడు. కట్నకానుకల ప్రసక్తి అసలు లేదన్నాడు.
"మీరు వద్దన్నాక కట్న కానుకలిస్తాననే ధైర్యంలేదు. కాని పెళ్ళి మాత్రం సింపుల్ గా చెయ్యలేను. ఎందుకంటే ఇది మా యింట్లో జరుగుతున్న మొదటి పెళ్ళి- నా పెద్దకూతురు పెళ్ళి. మా యింట్లో ఆడవాళ్ళకు చాదస్తం ఎక్కువ. ఏ రిజిష్టరు మ్యారేజో అంటే అసలు ఒప్పుకోరు. పెళ్ళి మా యిష్టప్రకారం ఘనంగా చెయ్యక తప్పదు అల్లుడుగారూ! దీన్నిమాత్రం కాదనకండి" అన్నాడు కాంచన తండ్రి మాధవరావు.
ఒప్పుకోక తప్పలేదు అరవింద్ కు.
"అయినా పెద్దలు అన్నీ తెలిసే పెట్టిన సంప్రదాయాలివి. మనం సరిగా అర్ధంచేసుకోలేక 'అంతా ట్రాష్' అని కొట్టివేస్తాంగని ప్రతిదానిలోనూ ఏదో ఒక పరమార్ధం వుండనే వుంటుంది."
ఒక ఆడ, మగ కలిసి కాపురం చెయ్యడానికి పెళ్ళి అన్నది అవరసరమే అయినా దానికింత ఆర్భాటం, అట్టహాసం చెయ్యడం ఎందుకో అర్ధంకాదు. పెళ్ళి పేరుతో ఎంత దుబారా? ఎంత హైరానా! ఏమైనా అంటే సంప్రదాయం అంటారు. ప్రతిదానికీ ఏదో అర్ధం, పరమార్ధం వుంటాయని చెబుతారు. ఉందనుకుంటే వుంటుంది, లేదనుకుంటే లేదు, అదంతా మనం చెప్పుకోవడం మీద ఆధారపడుతుంది.
రెండు మనసులు కలిసి రెండు దండలతో జరిగే పెళ్ళి పెళ్ళికాదని ఎవరంటారు? వాళ్ళు పచ్చగా కలిసి కాపురం చెయ్యరని ఎవరంటారు?
ఏదైనా ఒక ఆలోచన ఎదుటి మనిషికి కూడా వస్తే ఆచరణసాధ్యమౌతుందిగాని వ్యతిరేకత ఎదురైతే ఆచరణ సాధ్యంకాదు. ఆలోచన ఆలోచనగానే వుండిపోతుంది.
పెళ్ళికి రోజులు తరిగిపోతుంటే అరవింద్ లో విచిత్రమైన అలజడి కలుగసాగింది. ఇదివరలో ఇల్లు, హాస్పిటల్. మరో ఆలోచన వుండేది కాదు. ఇప్పుడు ఎక్కువగా అతడి ఆలోచనల్లో కాంచన చోటు చేసుకోసాగింది.
'నిన్నటిదాకా శిలనైనా, నీ పదముసోకి నే గౌతమినైనా...' అన్నట్టుగా వుందతడి పరిస్థితి. ఎన్నో తీయటి ఊహలు....రెక్కలు విప్పుకున్న సీతాకోకచిలుకలౌతున్నాయి.
* * * *