Previous Page Next Page 
మణిదీపం పేజి 19

    "అమ్మాయి నచ్చినట్టే కదా?"

    "ఊఁ"

    "వెళ్ళి కూర్చుందామా వాళ్ళ దగ్గర?"

    "ఊఁ"

    తల్లీ కొడుకులు తమకేసి అడుగులు వేస్తుంటే అర్చన మనస్సు తేలికపడింది. 'అమ్మయ్య! అమ్మాయి నచ్చింది' అన్న ఫీలింగ్ తో.

    కాంచన ముఖంలో గాభరా! గుండెలో చిన్నగా దడ!

    గుళ్ళో భక్తులు భక్తులు కలుకున్నట్టుగా అయినా పెళ్ళిచూపులే కద!

    తమకేసి నెమ్మదిగా అడుగులు వేస్తూ వస్తున్నది తెల్లటి లాల్చీ పైజమాలో ఆరడుగుల అందగాడైనా డాక్టరు! పెళ్ళే వద్దని కూర్చున్న కఠోర బ్రహ్మచారి.

    అతడి మనసు గెలవడం అంటే సామాన్యమా?

    "రామకృష్ణ రాలేదూ?" అరుంధతమ్మ కూర్చుంటూ అడిగింది.

    "ఆయన హాస్పిటల్ కి వెళ్ళారు పిన్నిగారూ!"

    "ఈ అమ్మాయి ఒక్కతే వచ్చిందా! వీళ్ళమ్మగారు, నాన్నగారు..."

    "అమ్మాయి నచ్చిందని కబురుచేస్తే తరువాత సంబంధం మాట్లాడుకోవడానికి వస్తామన్నారు మామయ్య. ఇప్పుడాయనకి పల్లెలో కుప్పనూర్పిళ్ళు! ఒక క్షణం తీరికి వుండదు!"

    ఒకటి రెండు ప్రశ్నలు కాంచనని కూడా వేసింది అరుంధతమ్మ.

    జవాబు చెప్పింది కాంచన.

    'మాట తీరుకూడా బాగుంది!" మనసులోనే మార్కులు వేసింది అరుంధతమ్మ.

    "మా మరదలితో మీరు ఏదైనా మాట్లాడతారా?" అరవింద్ ని అడిగింది అర్చన.

    "అన్నీ తెలిసిన విషయాలే కదా? పేరు, ఊరు, చదువు...అన్నీ మీరిదివరకే చెప్పేశారు!" నవ్వాడు అరవింద్.

    "ఏమైనా చెప్పనివి వుంటే అడగండి!"

    "మీరు అడగమంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇంటర్వ్యూ  చేస్తున్నానని అనుకోకండేం? మామూలుగా పెళ్ళిచూపుల్లో 'వంటొచ్చా?' అని అడిగినట్టుగా వుందని అపోహపడకండి. రొటీన్ కి భిన్నంగా వుండాలానే గుళ్ళో ఈ సమావేశం! కేవలం మీ అభిప్రాయం తెలుసుకోవడమే నా ప్రశ్నల ఉద్దేశం! పెళ్ళయ్యాక మీరు జాబ్ చేస్తారా?"

    "వై నాట్?"

    "మీరు జాబ్ డబ్బుకోసం చేస్తున్నారా, శాటిస్ ఫాక్షన్ కోసం చేస్తున్నారా?"

    "రెండూ."

    "పెళ్ళయ్యాక మీ భర్త ఉద్యోగం మానెయ్యమంటే మానేస్తారా?"

    "ఈ కాలంలో భార్యల్ని ఉద్యోగం మానెయ్యమని చెప్పే మగాళ్లుంటారని నేననుకోను.

    "ఉంటారని ఇప్పుడు తెలిసింది కదా?"

    "ఇప్పుడేకద తెలిసింది. ఆలోచిస్తాను."

    "అంటే, నన్నూ మీ జాబ్ నూ క్రాసులో చెరో పక్కన వుంచి చూస్తారన్నమాట!"

    "త్రాసులో తూచడం కాదుగానీ ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయం కదా? నాకూ కొన్ని ఇష్టాలుంటాయి. పెళ్ళయినంతమాత్రాన అవి వదులుకోనక్కరలేదనుకొంటాను. బాటనీలో డాక్టరేట్ తీసుకున్నానంటే అది కేవలం విజ్ఞాన తృష్ణకోసం కాదు. నాకు నేనుగా ఒక హోదాను కల్పించుకోవడం కోసం చేశాను. స్త్రీకి జీవితంలో గృహిణీత్వపు పదవి ఉన్నతమైనదే! కాదనను. కానీ అందుకోసం ఎంతో పరిశ్రమించి సాధించుకున్న హోదాను వదులుకోనక్కరలేదనుకుంటాను. నేను రెండు బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలననుకుంటాను. అలాంటప్పుడు నేను ఉద్యోగం చెయ్యడంలో మీ అభ్యంతరం ఏమిటి?"

    "అభ్యంతరాలు కాదుగానీ నిర్మొహమాటంగా చెప్పాలంటే నేనీ పెళ్ళి అమ్మా నాన్నలకోసం చేసుకుంటున్నాను, అమ్మకి ఈ వయసులో చేదోడు వాదోడుగా వుండే కోడలుండడం మంచిది కదా."

    కొడుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఈ సంబంధం చెడగొడతాడేమో అనిపించింది అరుంధతమ్మకి. ఆమెకి అమ్మాయి చాలా బాగా నచ్చింది. చదువుకుంది, అందమైంది, మంచి కుటుంబంలోనిది.

    "చేసిపెట్టే కోడలు కావాలని నేనేమీ అనుకోవడంలేదు. నేనింకా మంచాన పడలేదు. కాలు చెయ్యి నాకు బాగానే ఆడుతోంది. నాకు చేసిపెట్టే కోడలేకావాలనుకుంటే యింత చదువుకున్నది ఎందుకు? ఏ పల్లెటూరి అమ్మాయినో చేసుకుంటే సరిపోతుంది కదా! ఏ తల్లి అయినా తన కొడుకు భార్యా పిల్లలతో కళకళలాడాలని పెళ్ళి చేస్తుందేగానీ చాకిరీచేసే కోడలు కావాలని చెయ్యదు."

    అర్చన అంది_ "మీరు పెళ్ళిచేసుకుంటే మీకోసం చేసుకోవాలిగనీ అమ్మకోసం చేసుకుంటాననడం నాకు బాగా అనిపించడంలేదు. అన్నివిధాలా మీ మనసు ఈ అమ్మాయిని ఇష్టపడితేనే చేసుకోండి. అంతేగానీ ఎవరి కోసమో చేసుకొనే పెళ్ళి మీ భార్యని అసంతృప్తి గురిచేస్తుంది."   

 Previous Page Next Page