పెళ్ళి మాధవరావుగారి స్వగ్రామంలో, జమీందారుల హవేలీలా వుండే ఆయన ఇంట్లో జరుగుతుంది.
పార్వతీ పరమేశ్వరుల్లా ఆయన తల్లిదండ్రులు ఇంకా బ్రతికేవున్నారు. తల్లి డెబ్బైఏళ్ళ వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా తిరుగుతూ పెళ్ళి పనులన్నీ స్వయంగా పర్యవేక్షింస్తూంది. ఆవిడకన్నీ సాంప్రదాయప్రకారం నడవాలి.
కాంచన తల్లి డాబుదర్పాల మనిషి ఆవిడకన్నీ అట్టహాసంగా జరగాలి. భూదేవి అంత అరుగూ, ఆకాశమంత పందిరీవేసి మాధవరావుగారి అమ్మాయి పెళ్ళి రంగ రంగ వైభవంగా చేశారని ప్రజలు కలకాలం చెప్పుకోవాలని ఆవిడ ఆరాటం. అందుకు తగినట్టుగానే భర్తను పోరి భారీగా ఏర్పాట్లు చేయిస్తోంది.
మాధవరావుగారూ మంచి పరపతి వున్న మనిషే. ఆ ఊళ్ళోనే కాదు. చుట్టుపక్కల వాళ్ళకీ ఆయన సుపరిచుతుడు. పంచాయితీ బోర్డ్ ప్రెసిడెంట్ గా పదిహేనేళ్ళుగా ఏకాగ్రీవంగా ఎన్నికవుతున్న పెద్దమనిషి. ప్రజల దృక్పధంలో ఆయన భారీ మనసున్న ఒక జెంటిల్ మెన్.
వెడ్డింగ్ కార్ద్సే పదివేలు కొట్టించి పంచితే ఆయన ఎంత భారీగా కూతురు పెళ్ళి చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
పెళ్ళికొడుకై బంధుమిత్రులతో తరలివచ్చిన అరవింద్ కి పైనుండి దిగి వచ్చిన ఇంద్రుడో చంద్రుడో అన్నట్టుగా మర్యాదలు.
ఆ మర్యాదలూ, ఏర్పాట్లూ చూసి అదిరిపోయారు పెళ్ళికొడుకు వెంట వచ్చిన బంధుమిత్రులు. అన్నిరకాల మనుషుల్నీ సంతృప్తిపరిచేలా అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు జరిగాయి. ఇహ విందు భోజనం సరేసరి. అలాంటి భోజనం, పదార్ధాల రుచీ ఎక్కడా చూడలేదని చెప్పుకున్నారు.
అలాంటి మామగారిని పొందిన అరవింద్ అదృష్టాన్ని పొగడని వాళ్ళు లేరు.
"పెళ్ళి ఆలస్యమయితేనేం? బంగారంలాంటి మామగారిని పట్టేశా వోయ్" అన్నారు.
ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, ఇద్దరు వీడియోగ్రాఫర్లు ప్రతి చిన్నవిషయాన్ని కెమెరాల్లో, వీడియోల్లో బంధిస్తున్నారు.
అందరూ ఈ వేడుక తిలకించడానికి అక్కడక్కడా అరేంజ్ చేసిన క్లోజ్డ్ సర్క్యూట్ టీవీలు.
మంగళస్నానం చేయించి, మధుపర్కాలు కట్టించి, బుగ్గన చుక్క, కాళ్ళకు పారాణి పెట్టి కళ్యాణమండపంలోకి తీసుకుపోతున్న కొడుకును కంటినిండుగా చూసుకుంది అరుంధతమ్మ. ఈ ఘడియకోసమే కదా తను ఎన్నో ఏళ్ళు తపనపడింది. తన పిచ్చిగాని ఆ ఘడియ రానిదే ఎంత బలవంతం చేస్తే మాత్రం పెళ్ళి ఎలా అవుతుంది? ఆ కళ్యాణఘడియఇన్నాళ్ళకి వచ్చింది. ఆలస్యం జరిగినా మంచి సంబంధం.
ఆమెకి ఎంతో తృప్తిగా వుంది.
అంతా కళ్యాణవేదిక వద్దకు చేరుకున్నారు.
ఇసక వేస్తే రాలనట్టుగా ఎటు చూసినా జనం, ఆవరణ చాలక చుట్టూ మిద్దెల మీదా, చెట్లమీదా ఎక్కి కూర్చుని చూస్తున్నారు.
వరుడిని ఎత్తుపీట మీద కూర్చోబెట్టి మంత్రాలు చదువుతుండగానే, వధువును గంపలో కూర్చోబెట్టి మేనమామలు ఎత్తుకువచ్చి దించారు.
అసలే అందమయిన కాంచన పెళ్ళికూతురు అలంకరణలో మరింత అందంగా మెరిసిపోతూంది. అరవింద్ చిరునవ్వుతో చూస్తూండగా యిద్దరికీ మధ్యన తెర పట్టారు. తెరపై నుండి కాంచన ముఖం కనిపిస్తూనే వుంది.
జంట పురోహితులు జోరుగా మంత్రాలు చదివేస్తున్నారు.
ఈ అలంకరణలో చాలా బాగా వున్నావని కళ్ళతో చెబుదామని ప్రయత్నించాడు అరవింద్. కాని, కాంచన ధించిన తల ఎత్తలేదు.
అన్యమనస్కంగానూ, ముఖం పాలిపోయినట్టుగానూ అనిపించింది. నెలరోజుల క్రిందట చూసిన కాంచనకీ, ఈ కాంచనకీ ఎంతో తేడా.
"పెళ్ళిపిల్ల అంటే అలా వుండాలి ధించిన తల ఎత్తకుండా అంత చదువుకుని, అంత ఒద్దికగా తల వంచుకున్నదంటే....చాలా పెళ్ళిళ్ళు చూశాను. పెళ్ళిపీటలమీదే సరసాలు మొదలుపెట్టేస్తుంటారు" ఎవరో ముత్తయిదువ అంటూంది పక్కనున్నావిడతో.
కాంచననే చురుగ్గా చూస్తున్నాయి అరవింద్ కళ్ళు.
"జీలకర్ర బెల్లం" పురోహితుడి కేక.
"ఇదిగోనండీ."
"బాగా దంచలేదుకదమ్మా? పొడిపొడిగా రాలిపోతుంది. ఇలావుంటే శిరసు మీద ముద్దగా అతుక్కోదు."
అంతలో ఎవరూ వూహించని సంఘటన జరిగిపోయింది.
తూలిపడబోయిన కాంచనను పట్టుకున్నాడు అరవింద్. స్పృహ తప్పినట్టుగా అతడి చేతుల్లో వేలాడిపోయింది కాంచన. కళ్ళు మూతలు పడ్డాయి.
అరవింద్ కూర్చుని ఆమె తలని ఒళ్ళోకి తీసుకున్నాడు.
"నీళ్ళు....నీళ్ళు....ముఖమీద చల్లండి" మాధవరావు అరిచాడు.
అరవింద్ కాంచన చెయ్యిపట్టి పల్స్ చూసి వదిలేశాడు. ఎవరో గ్లాసుతో నీళ్ళు తెస్తే అర్చన ఆమె ముఖంమీద చల్లింది. "కాంచనా!"
నెమ్మదిగా కళ్ళు తెరిచింది కాంచన. "ఏమైంది నాకు?"