"అవును" అన్నట్లు తల వూపింది.
"నువ్వు....నువ్వు....కుష్ఠు రోగివి కదూ?"
సారధి భూమ్యాకాశాలు బ్రద్ధలైనట్లుగా అదిరిపడ్డాడు. ఇంతటి సుకుమార దారాల ప్రోవు, బంగారు తీగల అల్లిక__ఈమె కుష్ఠురోగా? ఇది నిజమేనా? తన తండ్రి కేదయినా పిచ్చెక్కిందా?
ఆ సమయంలో సారధికి నిజంగా పిచ్చెక్కినట్లయింది.
భారతి మళ్ళీ అవునన్నట్లు తల వూపింది.
"నీ ఒంటిమీద మచ్చలు వున్నాయి. వాటిని డాక్టరు కుష్ఠురోగపు మచ్చలుగా దయాగ్నైజ్ చేసి, ట్రీట్ మెంట్ తీసుకోమని నీకు సలహా ఇచ్చాడు అవునా?"
అవునన్నట్లు ఆమె మళ్ళీ తల వూపింది.
"నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఆ విషయ మెందుకు దాచావు నువ్వు? మాతో ఏ విధంగా చూసినా సరితూగని మీకు ఈ ఆస్తి, అంతస్తూ, వైభోగం అన్నీ సమకూడి సర్వ సౌఖ్యాలు అనుభవించ వచ్చునని కదూ?" గంగాధరంగారి కంఠం తారాస్థాయిలో విహరిస్తూ వుండగా న్యాయ నిర్ణేతలా ప్రశ్నిస్తున్నాడు.
'కాదు, కాదు' అని ఎలుగెత్తి చాటుదామనుకుంది భారతి. 'మిమ్మల్ని మోసం చేద్దామని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ఈ సంబంధానికి అంగీకరించింది. నా స్వార్ధంకోసం కాదు నాకు స్వర్గ సుఖాలమీద ఎప్పుడూ ఆపేక్షలేదు. ఎవరికీ అంటరాని దాన్నిగా ,అందరికీ దూరంగా ,ఓ దిక్కుమాలిన బాలికలానే జీవించటాన్ని వాంఛించాను నేను. కాని విధి నన్ను ఈడ్చుకువచ్చి ఇక్కడ పడవేసింది. దీనికి నా బాధ్యత ఎంతవరకు?' అవి చెబుదామనుకుంది. కాని ఆమె కంఠం మూగబోయింది. తన కళ్ళలోకి నిప్పులు కురుస్తూన్నట్లు చూస్తున్న గంగాధరంగారి తీక్షణతను భరించలేక తల వంచేసుకుంది.
గంగాధరంగారి ముఖంలో విజయగర్వం కనిపించింది. "నువ్వు అపరాధివి "అవునా?" అన్నాడు చేతికర్ర గాలిలోకి ఝుళిపిస్తూ.
భారతి పూర్తిగా అశక్తురాలయిపోయింది. విధికి లొంగిపోయినట్లయింది. 'ఒక్క మాటకూడా మాట్లాడటం నాచేత కాదు' అనుకుంటూంది జీర్ణమై, జితించిపోయిన మనస్సుతో రంగాజమ్మగారు గోడకు అంటుకుపోయి కోడలివంక ఆశ్చర్యంగా, జాలిగా చూస్తూంది.
"భారతీ!" అని గర్జించింది గంగాధరంగారి గొంతు తిరిగి. "నువ్వు మా అందరిని వంచించావు. మా అందరి ఆశలూ ముక్కలు చేశావు. పరిశుద్ధమైన మా ఇంటి వాతావరణాన్ని కలుషితం చేశావు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా?"
భారతికి గుండె ఝల్లుమంది. పడబోతున్నాయి పిడుగులు మీద. ఈ సమయంలో ఒక్కటే ఒక్క దిక్కు. అంతిమ ఆశతో అప్రయత్నంగా భర్తవైపు చూసింది.
"భారతీ! ఇది నిజమేనా?" అని అమాయకంగా గ్రుచ్చి గ్రుచ్చి చూస్తున్నట్లున్నాయి అతని కళ్ళు. "ఇహ ఈ విషఖండనం నుండి నీకూ, నాకూ ముక్తిలేదు" అంటున్నాయా చూపులు. ఆమె ఒక్క ఆశా క్రమంగా ఆమె నుండి దూరంగా జరిగి, మెట్లెక్కి, క్రమంగా మేడమీది గదుల్లో ఎటో అదృశ్యమైపోయింది.
"నువ్వు ఈ క్షణం నుంచీ ఈ ఇంటి కోడలివి కాదు." గంగాధరంగారి చేతిబెత్తం గాలిలోకి లేచి గుమ్మం వైపు దారి చూపించింది.
భారతి కదలకుండా నిలుచుంది. కదలటం ఎలాగో ఆమె శరీరం మరిచిపోయింది.
"అర్ధమయిందా, భారతీ! నువ్వూ, మీ నాన్నా చేసిన మోసానికి ప్రతిఫలం_ఈ ఇంట్లో నివసించే అర్హత నీకులేదు. నీకు పెళ్ళికాలేదు. గంగాధరంగారి కుటుంబమంటే ఎక్కడుందో తెలీదు. సారధనే వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. వింటున్నావా?"
భారతి ఇంకా కదలలేదు. ఆమె చూపులు కూడా ఎక్కడో నిలిచిపోయాయి.
"వెళ్ళు, సామాన్లన్నీ సర్దుకో. రాత్రని భయపడనక్కరలేదు. నలుగురు మనుషుల్ని సాయమిచ్చి పంపిస్తాను."
ఉన్నట్లుండి ఇందాకటి నుంచి హతాళురాలయినట్లు గోడకంటుకుపోయి వున్న రంగాజమ్మగారు ఒంట్లోకి కొత్త రక్తం ప్రవహించినట్లు. జీవం వచ్చినట్లు ఇవతలకు వూడిపడి భారతికి అడ్డుగా, గంగాధరంగారికి అభిముఖంగా నిలుచుంది.
"మీరు మనుషులుకాదు" అని అరిచింది. "మీరు....మీరు....రక్త ప్రసారం లేని బండరాయి, అమాయకుల మెడలు నరికే కసాయి వారు." ఆమె కంఠనాళాలు బయటకు ఉబ్బాయి .ఉద్రేకంలో మాటలు తడబడి, కంపించిపోతున్నది.
మొదట గంగాధరంగారు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్ని సంవత్సరాల తమ అపూర్వ సంసారంలో తన మాటకు ఎదురు తిరగటమలా వుంచి, కానీసం మారు మాట కూడా పలకని ఇల్లాలు....ఈ రోజున....ఆయనకు మతిపోయినట్లయింది, ఒక్క క్షణం కర్తవ్యం స్పురించలేదు.
తరువాత తెలివి తెచ్చుకున్నాడు. ఆ వెంటనే ఆయన కళ్ళు నిప్పులు కురిశాయి. "నన్నెదిరిస్తున్నావా, రంగాజమ్మా" అని గర్జించాడు.
ఆమె ముఖం వివర్ణమైపోయింది. "ఇది ఎదిరించటం కాదు" అంటూ భారతికి అడ్డు తొలుగుతూ ప్రక్కకి జరిగింది. క్షణకాలం కోడలి మీద నుంచి కాంతిరేఖలు మామగారిమీదకు ప్రసరించినట్లయినాయి.
"చూడండి, ఈ బంగారుబొమ్మను. ఈ ఒంటిమీద ఏ మచ్చ మాత్రం ఎంతకాలం నిలుస్తుంది? అందరిచేతా మోసగించబడేదేగాని, ఆమె ఒకర్ని మోసం చేయగలదని మీ కనిపిస్తుందా? పెద్దలు కూతురి మీద ప్రేమకొద్దీ చేసిన పనికి ఆమెదెలా బాధ్యత అవుతుంది? శిక్ష, శిక్ష అంటున్నారుగాని_మీరు చేస్తున్న పనికి మీ కర్ధం తెలుసునా? అది విధించే అధికారం మీకు వుందా? ఆ నిర్ణయాన్ని చేయవలసింది మన బాబు. మీరు కాదు."
"రంగాజమ్మా! నువ్వు నాకెదురుగా నిలబడి ఇన్ని కబుర్లు చెప్పటమా? నీకు నేను సంజాయిషీ ఇవ్వాలా?"
ఆమె కళ్ళ నుండి జలజలమని కన్నీరు ప్రవహిస్తూ వుండగా అతనివంక ప్రాధేయపూర్వకంగా చూసింది. "సంజాయిషీ కాదు నేను కోరేది. సానుభూతి చూపించమనే అభ్యర్ధన"
"చూపించను."
"చూపించి తీరాలి."
"నువ్వు నన్ను శాసిస్తున్నావా, రంగాజమ్మా?"
"అవును శాసిస్తున్నాను. ఈ ఇంటి యజమానురాలిగా నా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఇంతవరకూ ఎన్నడూ తీసుకోలేదు. ఈ ఇంటి బాగోలులతో మీకెంత నిమిత్తం వుందో, నాకూ అంతే వుంది. మీరు తప్పుదారి తొక్కుతుంటే మిమ్మల్ని సరిదిద్దవలసిన బాధ్యత నాకుంది. భారతి ఇక్కడ వుండాలని శాసిస్తున్నాను."
"నువ్వు నన్ను శాసించేటంతటి మొనగత్తెనయినావా. రంగాజమ్మా?" గంగాధరంగారి గొంతు ఉరుములు ఉరిమింది. "తక్షణం నువ్విక్కడ నుంచి వైదొలగక పోతే...."
"నేను కదలనిక్కడి నుంచి. తోటి ఆడదానికి అన్యాయం జరుగుతూంటే నా కాపరం కోసం ప్రాకులాడేటంతటి స్వార్ధపరురాల్ని కాదు."
గంగాధరంగారీ అవమానాన్ని భరించలేకపోయాడు. ఆయనలో పౌరుషం వేయి తలలెత్తి రెండువేల నాలుకలతో బుసకొట్టింది. "అలానా?" అని ఆమె జబ్బ పుచ్చుకుని గబాలున ఇవతలకు లాగాడు. ఆ విసురుకు నిలద్రొక్కుకోలేక ఆమె కుప్పలా క్రింద కూలిపోయింది.
"నీకు అధికారాలు కావాలేం?" ఆయన చేతిబెత్తం క్రూరంగా గాలిలో లాస్యం చేసింది. రంగాజమ్మగారి భుజాలమీద, నడుంమీద, ముఖం మీద స్వేచ్చావిహారం చేసింది. ఆమె నోట్లోంచి ఒక్క పలుకు కూడా రాలేదు. ఆ దెబ్బలన్నిటినీ మౌనంగా భరిస్తూ కళ్ళు తెరిచి అతనివంక చూస్తూంది. "ఇంతేగా నీకు చేతనయింది? నీ అహంకారానికి రూపకల్పన ఇదేగా? ఇన్నాళ్ళూ భయపడి నీ చేతి దెబ్బలు తిన్నాను. ఇప్పుడు నిర్భయంగా నీ చేతిదెబ్బలు తింటున్నాను" అన్న భావాలు ఆమె చూపులలో ఉట్టిపడుతున్నాయి.