ధీరజ్-అనుపమ దంపతులకు అసలు సంతానమే లేకపోవటం వల్ల జీవితంలో నిండుతనం లోపించినట్టు అయింది. ఎన్నిపూజలు, వ్రతాలు చేసినా ఎన్ని తీర్ధయాత్రలు తిరిగినా ఎందరు డాక్టర్లకు చూపించుకున్నా, ఇంటిని కళకళలాడించే సంతానం మాత్రం ఉదయించలేదు.
ఇతర ముత్తయిదువలు తనను గొడ్రాలుగా చూడడం, శ్రీమంతం, బాలసారెలు వగైరా ఫంక్షన్స్ కి పిలవకపోవడంతో ఆమెలో ఆత్మ న్యూనతాభావం కలగడం...ఆ బెంగవల్ల రోజంతా పిల్లల ధ్యాస తప్ప మరోటి కనిపించడం లేదామెకు.
భార్య స్థితిని గమనించిన ధీరజ్ ఎవరినైనా తెచ్చి పెంచుకోమని సలహా ఇచ్చాడు. పెంచుకున్న పిల్లలు స్వంత పిల్లలవుతారా అన్న అనుమానంతోటే తటపటాయించి ఇంతవరకూ ఆగిపోయిందామె. ఎవరిని తెచ్చుకున్నా వాళ్ళు 'అమ్మగారు' అనే పిలుస్తారు తప్ప 'అమ్మా' అని పిలవగలరా?
ఒకవేళ పిలిచినా తన సొంత తల్లిదండ్రులను పూర్తిగా మరచిపోయి, తమనే అంటిపెట్టుకుని వుంటారనుకోవడం అత్యాశే అవుతుంది. రేపు పెద్దయ్యాక వెళ్ళిపోతేనో?
చివరకు స్థిరనిశ్చయానికి వచ్చిందామె.
గబగబా పనులన్నీ ముగించుకుని 'ఆశాజ్యోతి' ట్రస్టుకు బయలుదేరింది అనుపమ.
అనాధ బాలబాలికలకు ఆశ్రయమిస్తున్న స్వచ్చంద సేవా సంస్థ అది. ఆత్రస్తూ నిర్వాహకుడు ఆమెను ఒక గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ చదువుకుంటున్న పిల్లలను చూపించాడు.
అందరూ ఏడు, ఎనిమిది సంవత్సరాలలోపు బాలబాలికలే! ముచ్చటగా వున్న ఒక బాలుడ్ని తన వెంట తీసుకుని హాలులోకి అడుగుపెట్టింది అనుపమ.
అప్పుడే ధీరజ్ ఇంకొక పిల్లవాడిని ప్లేగ్రౌండ్ నుంచి తీసుకు వచ్చాడు.
ఇద్దరూ ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు.
ఆ ఇద్దరూ వేరని, తమ ఆశ్రమం నుంచి ఇద్దరూ బాలురకు అమ్మా నాన్నల ప్రేమ లభిస్తుందనే భ్రమలో వున్నారు ట్రస్టు నిర్వాహకులు.
పిల్లలను అలా అప్పగించే ముందు, తను బాధ్యతగా వారికి కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపడం వారి పద్దతి. అందుకే వారిద్దరినీ ఉద్దేశించి పిల్లలను ఎలా చూసుకోవాలో చెపుతున్నారు.
"పరాయి పిల్లలను తెచ్చి పెంచుకోవదమనేది చాలా సున్నితమైన వ్యవహారం. అనాధలుగా అంతవరకు తాము వున్న వాతావరణంలో నుంచి హఠాత్తుగా కొత్త వాతావరణంలోకి వచ్చినప్పుడు ఆ కొత్తదనానికి అలవాటుపడాలంటే కొద్దిగా వ్యవధి అవసరం. ఇలాంటి సందర్బాలలోనే మీరు ఎంతో సంయమనం పాటించాలి. తమ కన్న తల్లిదండ్రులను మరచిపోలేక, మీతో కలిసి ఇమిడిపోలేక మానసిక సంఘర్షణకు లోనవుతూ వుంటారు పిల్లలు. మీరు కోరుకునేటంత వెంటనే మీతో ఆత్మీయథా బంధాన్ని పెంచుకోలేరు. అట్టి మానసిక సంఘర్షణలో వున్న పిల్లలపై ఒత్తిడి తీసుకురాకూడదు మంచితనంతో, ఆత్మీయతతో, ఓర్పుగా పసివారి మనసులను ఆకర్షించవలసి వుంటుంది. అలాంటి సమయంలోనే పిల్లలు మీకు దగ్గరవుతారు. అలా ఇరువురిలోనూ సహృద వాతావరణం పాదుకున్నప్పుడు పెంపకం అసలు ప్రయోజనం నెరవేరుతుంది. మీరు చేస్తున్న ఈ పనివల్ల ఇద్దరూ అనాధ బాలుర జీవితాలను తీర్చిదిద్దినట్టవుతుంది. మీకు పిల్లలు లేని లోటూ తీరినట్టూ వుంటుంది" అని చెప్పడం ఆపి ఎందుకో అనుమానం వచ్చి ఆ ఇద్దరి వంకా పరిశీలనగా చూశాడు ట్రస్టు ప్రెసిడెంట్.
అంతవరకూ తను చెప్పిన మాటలను ఆ ఇద్దరూ అసలు వినిపించుకోలేదనీ, ఆ ఇద్దరూ సజీవ ప్రతిమల్లా నిలుచుని వున్న తీరునిబట్టే అర్ధమయింది ఆయనకు.
భార్యాభర్తలిద్దరూ ఎవరికివారే ఒకరు కన్నీరు మరొకరు తుడవాలానే తపనతో ఒకరికి తెలియకుండా మరొకరు ట్రస్టుకు వచ్చారు.
ఇద్దరూ బాబులనే సెలక్ట్ చేశారు.
"ఏమండీ ఈ బాబు బాగున్నాడు కదండీ."
"లేదు అనుపమా_ఈ బాబే బాగున్నాడు."
"అదేం కాదండీ__ఈ బాబూ ముఖం చూడండి. ఎంత ముద్దు వస్తున్నాడో__ఇతనినే తీసుకువెళ్ళి పెంచుకుందామండీ."
"నా మాట విను అనుపమా__ఇంతకాలం నువ్వు చెప్పినట్టేచేశాను. కన్నబిడ్డను పోగొట్టుకుని ఈరోజు అనాధలను తీసుకువెళ్ళి పెంచుకొనే దుస్థితి నీ వల్లనే కలిగింది. ఇప్పుడుకూడా నీ మొండివైఖరి వదలకపోతే అసలు ఎవరినీ తీసుకువెళ్ళే ప్రశ్నేలేదు" ధీరజ్ కోపంగా అన్నాడు.
"అనండి__మీ కడుపుమంట చల్లబడెంతవరకూ తిట్టండి. నేను చేసింది తప్పు అని ఒప్పుకున్నాను కదా. పిల్లలు లేకుండా దొడ్రాలుగా బతకడం ఎంత నరకమో మీకన్నా నాకే ఎక్కువ తెలుసు. పిల్లలకోసం ఎంతగా తపించిపోతున్నానో తెలిసికూడా నన్ను ఇంకా నిందించదానికి మీకు నోరు ఎలా వస్తుందండీ_" గుడ్లనీరు కక్కుకుంటూ అన్నది అనుపమ.
అనాధ బాలలు ఇద్దరూ వింతగా ఆ దంపతుల వైపు చూస్తుండి పోయారు.
"అందుకే కదా చెబుతున్నాను. నాకు నచ్చిన ఈ పిల్లవాడినే తీసుకువెళ్ళి పెంచుకుందాం."
"ఎందుకనో ఈ బాబును చూడగానే నా తల్లిపేగు కదిలిపోయిందండీ. ఏ అమ్మ కన్నబిడ్డడో ముద్దులు మూటగట్టే ఈ చిన్నారిని చూసి దగ్గరకు తీసుకున్నాక, ఇంకొకరిని తీసుకువెళ్ళడానికి మనస్సు అంగీకరించడం లేదండీ."
"సారీసర్....ఈ పవిత్ర ప్రదేశాన్ని మీ వాధప్రతివాదనలతో కలుషితం చేయకండి. ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి నిర్ణయించుకుని వచ్చి ఎవరు కావాలో అప్పుడు తీసుకువెళ్ళండి. అంతే తప్ప ఇక్కడ కీచు లాడుకోవడం మంచి పద్దతికాదు. పసి మనసుల ఎదుటే మీరు ఇలా ప్రసరిస్తుంటే వాళ్ళ హృదయాలు గాయపడతాయనే ఆలోచన లేసమయినా లేనివాళ్ళు వాళ్ళను తీసుకెళ్ళిన తరువాత మాత్రం సక్రమంగా పెంచుతారని నమ్మకమేమిటి?" ఆశాజ్యోతి ట్రస్టు ప్రెసిడెంట్ ముఖాన చరిచినట్టు నిర్మొహమాటంగా చెప్పాడు.
ధీరజ్ దంపతులు చిన్నబుచ్చుకున్న ముఖాలతో ఇంటిదారిపట్టారు.
రా రాత్రంతా ఎవరి ఆలోచనలలో వాళ్ళున్నారు.
భళ్ళున తెల్లవారింది.
భార్యాభర్తలిద్దరూ చివరికి ఇద్దరినీ తెచ్చి పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఆశాజ్యోతి త్రాస్తుకి మరల బయలుదేరారు.
"సారీసర్....యూ ఆర్ టూ లేట్.....అనాధ బాలలను సంరక్షించడమే ధ్యేయంగా పెట్టుకున్న ఒక మహానుభావుడు ఉదయాన్నే మా వద్ద వున్న పాతికమంది పిల్లలనూ తీసుకువెళ్ళాడు."
"ఎవరతను....?"
"రాజశేఖర్ ఫ్రమ్ మద్రాస్."
ధీరజ్ ఉలిక్కిపడ్డాడు.
"అయ్యో....ఇప్పుడెలాగండీ" ఆందోళనగా అందామె.
"నన్ను క్షణం ఆలోచించుకోనీ..." సాలోచనగా అతని భ్రుకుటి ముడిపడింది.
"పోనీ, మనం వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఆ పిల్లలిద్దరినీ తెచ్చుకుంటే..."