Previous Page Next Page 
నల్లతంబి పేజి 19

తీగలాగితే డొంకంతా కదిలినట్టు అది తను అక్రమంగా ఆర్జించిన సొత్తు అని తెలిపోయిందంటే ఉన్న పరువు, పదవీ పోతాయి. అందుకే తెలు కుట్టిన దొంగలా మిన్నకుండిపోయాడు ఆ మంత్రివర్యుడు.
వాస్తవానికి పార్టీ ఫండు కింద వచ్చింది నాలుగుకోట్లు. కానీ, లెక్కలు చూపించి వారికి అందజేసింది రెండు కోట్లే. మిగిలిన సొమ్మును యధాతధంగా తిరిగి తెచ్చేస్తున్నాడు. పైపెచ్చు త్రీటైర్ లో వస్తున్నాడన్న నిజాయితీ!
అందుకే, వాటిలో ఒట్టి బట్టలు కాగా ఏమీ లేవని బొంకాడు.
అసలు ఎవరు చేసివుంటారో ఆరా తీస్తే రాజమండ్రిలో తెల్లవారుఝామున ఎక్కినా ఇద్దరూ గుర్తుకు వచ్చారు. టి.టి.ఇ.కి. ఆ ఇద్దరూ అనకాపల్లిలో దిగిపోయారు.
వాళ్ళే తాము తెచ్చిన సూట్ కేసులను వదలి మినిస్టరుగారి సూట్ కేసులను పట్టుకెళ్ళారని అతనికి అర్ధమైనా, పెదవి విప్పి చెప్పలేదు.
యధాప్రకారం ఆ మంత్రివర్యుని బెర్త్ పై 'కమెండో' అన్న స్టిక్కర్ వెక్కిరిస్తూ కనిపించింది.
బహిరంగంగా చెప్పుకోలేని దోపిడీ కాబట్టి, లేని నవ్వును ముఖాన తెచ్చుకుని బలవంతాన ఏమీ పోలేదన్నట్టు నటించాడు మంత్రి మహాశయుడు.
ఏమీ విలువైనవి పోకపోయినా, బట్టలనే దొంగిలించినప్పటికీ, ఆ దొంగతనం చేసింది 'కమెండో' అని తెలియతంవల్ల ఈ కేసుని కూడా ఇన్ స్పెక్టర్ ధీరజ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.
                                                *    *    *
ఆ గదిలో ఒంటరిగా అధికారి. అతని మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి.
తనకు 'నా' అనేవాళ్ళెవరూ లేరా? ఎవరికోసం ఈ దోపిడీలు....ఆ అక్రమ సంపాదన...?
ఇన్నేళ్ళు మనసు పొరల్లో నిక్షిప్తమై వున్న అనుభూతులు ఎందుకనో పదే పదే జ్ఞప్తికి వచ్చి అతనిని బాధించసాగాయి.
ఆ క్షణాన బహుశా తాను ఒంటరినన్న భావనకే అతని మనస్సులో బాధావీచికలు కదలాడుతున్నాయి.
అలాంటి ఆలోచనలతో మనసంతా ఆవేదనతో నిండిపోయిన తరుణంలోనే గదిలోకి ఎవరో వచ్చినట్టు అడుగుల చప్పుడు వినిపించింది.
ఆ చప్పుడు వినగానే అతని గుండె ఝల్లుమంది.
నిద్రలో కూడా ఆ చప్పుడును గుర్తుపట్టగలడు. వెయ్యి పనులతో సతమతమవుతున్నా, ఎంతమందిలో వున్నా, ఎక్కడున్నా, ఆ అడుగుల చప్పుడుకి అతని మనస్సు స్పందిస్తుంది. భావావేశం పొంగుకొస్తుంది.
మాటలలో వ్యక్తం చేయడుకానీ, ఆ సవ్వడి వినడమంటే అతనికెంతో ఇష్టం! అడుగుల చప్పుడు సరిగ్గా అతని ముందుకు వచ్చి ఆగిపోయింది.
సంధ్య చీకట్లు ముసురుకుంటున్న వేళ అయినప్పటికీ,  ఆ చిరు చీకట్లలో సయితం సంజీవి రూపం సమ్మోహనంగా కనిపించిందతని కంటికి.
"నిన్ను చదవమని పుస్తకాల మున్హు కూర్చోబెట్టి వచ్చానా లేదా?"
నువ్వు ప్రక్కన లేకుండా నేనో క్షణం కూడా గడపలేను."
"పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను. నిన్నెంతో ఉన్నతమైన స్థితిలో చూడాలని నా కోరిక. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఒళ్ళు దగ్గరుంచుకుని ఎగ్జామ్స్ కు ప్రిపేర్ కమ్మని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. వెళ్ళు!" ఉరిమాడు.
నీ బలవంతం మీదే ప్రయివేట్ గా డిగ్రీచదివించావు. పోనీలే అని వూరుకున్నాను. తీరా డిగ్రీ చేతికొచ్చేసరికి మళ్ళీ ఉద్యోగం అంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కమ్మంతున్నావు. అసలు నీ వుద్దేశం ఏమిటి...? ఉద్యోగం పేరుతో నన్ను వదిలించుకోవాలనా?"
"నిన్ను ఒక ఉన్నతోద్యోగిగా చూడాలని నా కోరిక."
"ఏమో, నాకవేమీ వద్దు. ఎలాంటి జీవితమైనా నీతోనే పంచుకుంటాను."
"షటప్..."
సంజీవి అప్పుడు గమనించింది. అతని కళ్ళల్లో ఎర్రజీర. ఆ వెంటనే నీలినీడలు.
"క్షమించు అధికారీ, నాకు వచ్చిందీ, నేను మనసారా వాచించేదీ దేన్నయినా సరే....నేను వదులుకోలేను. నాకే పదవులూ వద్దు. నాకుకావలసింది నీ సాంగత్యం. కష్టమైనా, సుఖమైనా కలోగంజో నీతోపాటే పంచుకుంటాను. ఇప్పటికైనా నా ప్రేమను అర్ధం చేసుకో. నువ్వు నన్నెంతో గారాబంగా పెంచావు. నిజమే. చిన్నప్పటి నుంచీ ఏది అడిగినా కాదనకుండా సమకూర్చావు. అందుకే అడుగుతున్నాను మిగిలిన ఈ జీవితాన్ని కూడా నీతోనే పంచుకోనివ్వు..."
అంతే__ఆవేశాన్ని అదుపులో వుంచుకోలేకపోయాడు అధికారి. ఊహించలేనంత వేగంగా కదిలిన అతని కుడిచెయ్యి 'ఛెళ్ మంటూ ఆమె చెంపను తాకింది.
కరిగిపోయిన ఆశలను చెల్లాచెదురైన ఊహలను ఏరుకోకముందే జరిగిపోయింది ఆ హఠాత్ సంఘటన.
ఆమె ఎర్రని చెంప మరింత ఎర్రగా కందిపోయింది.
తన ప్రేమ విఫలమైనందుకు విలవిల్లాడి పోతున్నదామె హృదయం.
"ఐ లవ్ యూ అధికారి....నువ్వు అవునన్నా కాదన్నా, నా నిర్ణయంలో మార్పు ఉండదు. చివరకు మృత్యువు ముంగిట వున్న క్షణంలో కూడా నా పెదవులు నిన్నే కోరుకుంటాయి. ఈ జీవితానికి పెళ్ళంటూ చేసుకుంటే నిన్ను తప్ప మరో పురుషుడి నీడను కూడా నా జీవితంలోకి ఆహ్వానించలేను."
"ఊహల్లో కలలుగానకు సంజీవి. నేను నిన్ను భార్యగా స్వీకరించడమనేది జరిగే పనికాదు. అనవసరంగా నాపై ఆశలు పెంచుకోకు" అంటూ అధికారి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.
తనను ఎంతో అపురూపంగా చూసుకున్న వ్యక్తి ఇంత నిర్దయగా తన ఆశలను తుంచివేస్తాడని సంజీవి కలలోనైనా అనుకోలేదు.
ఆమె కళ్ళనుంచి నీటి బిందువులు జలజలా రాలాయి. ఏమిటి తన జీవితం...?
ఏమౌతుంది.....కోరుకున్న వ్యక్తిని భర్తగా పొందే అదృష్టం తనకు ఈ జన్మలో లేనట్టేనా? ఆశించిన ఫలం దక్కనప్పుడు తనేవారి కోసం బ్రతకాలి?
చాలాసేపటి వరకూ అలా రకరకాల ఆలోచనలతో విచారిస్తున్న సంజీవిలో ఒక స్థిరనిర్ణయం చోటు చేసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న మరుక్షణం ఆమె మనసు తేలికైంది. ఇప్పుడామె వదనంలో విచారం కన్పించడం లేదు. పట్టుదల. తాను అనుకున్న కార్యం సాధించాలనే తీవ్రమయిన పట్టుదల కనిపిస్తున్నది.
                                                             *    *    *
 అలలు లేకుండా సముద్రాలు, అభిప్రాయ భేదాలు లేకుండా సంసారాలూ వుండవు.
ఎంత అన్యోన్యంగా కాపురం చేసే దంపతులకయినా ఒకోసారి అభిప్రాయభేదాలు రాకుండా వుండవు. చిరు కలహాలు, పెను పోట్లాటలు, మూతిబిగింపులు, మౌనవ్రతాలు-ఇవన్నీ ప్రతి ఇంట్లోనూ వుండేవే.
మిగతా అన్ని విషయాలకంటే దంపతుల్లో బేధాభిప్రాయాలు కలగడానికి ముఖ్యకారణం పిల్లలే కావడం చాలా సందర్బాలలో జరుగుతూ వుంటుంది.
అలా అని అసలు పిల్లలే లేని జంటలు అన్యోన్యంగా ఏ కలతలూ లేకుండా సుఖసంసారం చేస్తున్నారనడానికి వీలులేదు.

 Previous Page Next Page