Previous Page Next Page 
నల్లతంబి పేజి 21

"రాజశేఖర్ నాకు తెలిసిన వ్యక్తే. వెళ్ళి ప్రయత్నిస్తాను."
"నను కూడా తీసుకెళ్ళండి. నేను ప్రాధేయపడతాను. ఒక తల్లి మనసు అతనికి తెలియకపోదు. ఆ పిల్లలనూ ఇవ్వకపోడు."
"సరే, అలాగే వెళదాం."
అప్పుడు వూరడిల్లింది అనుపమలోని తల్లి హృదయం.
                                *    *    *
మైపాడు బీచ్.
సౌందర్యోపాసకులు, విలాసవంతులు, యవ్వనంతో ఉరకలువేసే కుర్రకారు తప్పనిసరిగా వెళ్ళే ప్రదేశాలలో ఇదొకటి.
నిత్యజీవితపు ఒత్తిళ్ళతో విసిగిపోతూ కాస్త దైహిక ఉపశమనం, ఒకింత మానసిక ఉల్లాసం కోరుకునే వార్హంతా ఆ సముద్రపు టొడ్డుకు వెళ్ళడం అలవాటైపోయింది.
కొన్ని గంటలు ఆహ్లాదాన్ని అనుభవించి మనసును, దేహాన్ని తేలిక చేసుకుని సేదతీర్చుకుని హాయిగా ఇళ్ళకు వెళుతుంటారు.
అధికారిలో ఎన్నాళ్ళనుంచో అదిమి వుంచుకున్న సహనం ఇవ్వాళ ఒక్కసారిగా బ్రద్దలైంది!
అందుకే, మనసు వికలమై, చాలాకాలం తరువాత తిరిగి మందు మైకానికి బానిసైపోయాడు. ఇంతవరకు కేవలం రెండే రెండు సందర్బాలలో విస్కీకి దాసోహమన్నాడు. ఒకటి జన్మనిచ్చిన తల్లి గుర్తొచ్చిన రోజు. రెండవది చిన్ననాటి నేస్తం సంజీవిపై తొలిసారిగా ఇవ్వాళ చేయి చేసుకోవడం.
సముద్ర తీరాన, కూరుకుపోతున్న ఇసుకలో బలవంతాన కాళ్ళీడ్చుకుంటూ అడుగులు వేయసాగాడు అధికారి.
చుట్టూ మెత్తటి ఇసుక. దూరంగా సముద్రంలో అలల వేగం పెరుగుతున్నదప్పుడే.
తన హృదయానికి తగిలిన గాయాలను తట్టుకోలేకపోతున్నాడు అధికారి. తన ఆనందాన్ని పంచుకోవడానికే కానీ, తన విషాదాన్ని వినిపించుకోవడానికి ఈ లోకంలో తనకంటూ ఎవరూలేరు. ఎవరూమిగలలేదు.
తన కన్నులముందు అనుక్షణం కనిపించేది సంజీవి. ఆ రూపమే ఇప్పుడు వేదనా రవమి....పరివేదనా శరమై....నిశ్శబ్దంగా రాలిపోయే నక్షత్రంలా.....నిట్టూర్పుగా మిగిలిపోయే విషద్వరలా కనిపిస్తోంది.
"ఓ నేస్తమా! చెలియలికట్టుకు ఆవల వున్నాన్నేను. వద్దంటున్న కొద్దీ నాలో ప్రేమకు ప్రాణం పోశావు. నేనేమో నిర్దాక్షిణ్యంగా దాని ప్రాణం తీసేశాను. నా రాతి హృదయంలో రాగాలు పలికించాలని ఆ రాగాలను ఏరి దోసిళ్ళనిండా నింపాలని నీ కెందుకింత ఉబలాటం? అసలు నా జీవితంలోకి ఎందుకు అడుగుపెట్టాలి నువ్వు? ఈ రాతి హృదయంలో ప్రేమకు స్తానంలేదని నీకెలా చెప్పేది? ఈ చెలికాని జీవితం జీవంలేని మరబొమ్మలాంటిదని, ప్రేమానురాగాలను కాలమనే గతం కూల్చివేసిందనీ, ఎలా....ఎలా....నీకు తెలిపేది? జీవితం ఆఖరి మజిలీలో వున్న నాకు ఏ ఆశలూ లేవు. కానీ, జీవిత యవ్వన తొలిదశలోనే వున్న నువ్వు నన్నాశించి నష్టపోతావని నిన్నెలా హెచ్చరించేది? ఈ అభాగ్యుడు చేయగలిగింది ఏముంది....చెప్పు నెచ్చెలీ...!"
ఆలోచనలతో అతని మనస్సు అల్లాడిపోతున్నది. తనను తను భాధించుకుని, క్రుంగదీసుకుని, దిగులుతో కృశించిపోతూ.....తీరానికి దగ్గరగా మనుషులకు అందనంత దూరంగా అధికారి ఒకచోట ఇసుకలో కూర్చుని, విస్కీ బాటిల్ ను ఓపెన్ చేశాడు.
అన్నార్తుని కడుపులోని ఆకలిలా ఘోషపెడుతోంది సముద్రం. మనిషి మనసులోని ఆందోళనలా ఎగసెగసి పడుతున్నాయి అలలు.
అతని వాలకాన్ని నలుగురైదుగురు అమ్మాయిలు ఆసక్తిగా గమనించారు. కానీ, అతనేదో ధ్యాసలో నడచివెళుతున్నట్టు - ఎవరితోటీ సంబంధం లేనట్టు-ఒక వైపుగా వెళ్ళి కూర్చోవడంతో మరొక మజ్నూనో, మరొక దేవదాసో అయుంటాడని జాలిపడ్డారు ఆ పడుచులు.
చంద్రకాన్త్య్లో బీచ్ అందాలు ఒలుకుతోంది. ఆ బీచ్ లో కాల్ గరల్స్ కు కొదవేమీలేదు. జేబులో దండిగా డబ్బు వుండాలేకానీ ముందు, మగువ లభ్యమవుతాయి. అధికారి వారి కంటికి విచిత్రంగా కనిపించాడు.
ఆశగా ఇద్దరు అతివలు అతని దగ్గరగా వచ్చి పలకరించి వెళ్ళారు. దూరంగా వుంది అతనికి సైటు కొట్టారు.
అధికారి బాటిల్ పైకెత్తి గడగడా నాలుగు గుటకలు వేశాడు. విస్కీ గొంతులోకి దిగిన కొన్ని నిమిషాలకే అతనిలో నిషా నషాళాని కెక్కింది.
అతనికి కొంచెం దూరంలో కావాలనే ఆ ఇద్దరు సుందరీమణులు ఇసుకలో కూర్చుని ఓరకంట అతని బలిష్టమైన కండరాలను తినేసేలా చూడసాగారు.
అంతుపట్టని, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది అతని అంతరంగం!
అంతకుముందు వరకూ సందడిగా వున్న పరిసరాలన్నీ ఇప్పుడు నిర్మానుష్యం అయిపోయాయి. ఆడ, మగ జంటలు అలసి సొలసి ఇంటిముఖం పట్టారు.
ఇసుకతిన్నెలు, సరివి తోటలు యధావిధిగా ఒంటరిగా మిగిలి పోయాయి. పౌర్ణమి రోజు కావడంవల్ల నిండు చంద్రుడు వీరవిహారం చేస్తున్నాడు. ఆకాశంలో ఒక్క మబ్బు తునక కూడా లేదు. సముద్రం సయితం ఆ నెలరాజును చూసి ఆనందంతో ఉరకలు వేస్తోంది.
వెన్నెల స్నానానికి మెరిసిపోతున్న సముద్ర కెరటాలు....వెండి వెలుగుల చక్కిలిగిన్తలకు కిలకిలారావాలు చేస్తున్నట్టు.....పరువులెత్తుకుంటూ వచ్చే కెరటాల చప్పుళ్ళు. ఒంటరితనాన్ని పోగొట్టడానికి నేనున్నాను మిత్రమా అన్నట్టు, సముద్ర జలాల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి అతన్ని ఆలింగనం చేసుకుంటున్నది.
అయినా, అతనిలో ఎలాంటి చలనమూ లేదు. విస్కీ మట్టుకు అతని మెదడు పూర్తిగా మొద్దుబారింది.
స్త్రీ కేవలం సౌందర్యవతేకాదు. మాతృమూర్తి కూడా....ప్రేమ స్వరూపిణి .... దయామయి .... దాక్షిణ్యశీలి...అనురాగ దేవత!
'ధృతితోడ గృహంబు దిద్దనే క్షమాతో పసిపాప నేత్తనే   
దయజూడవే బంధుజాలమున్ కరుణింపవే కష్టజీవులన్
శుచివై కులకీర్తి నిల్పవే సలుకాడకు నిష్టురంబుగా
సుకునేపకు ద్రోహచింతనన్....'
అంటే, ధృతి, క్షమ, దయ, శౌచం, కారుణ్యం, అనిష్టుర వాక్కు, అనభిద్రోహం, అనే సధ్గుణాల్నే జీవిత యజ్ఞంలో సమిధలుగా ఆహుతి ఇచ్చే ఆదర్శమూర్తి స్త్రీ.
స్త్రీ లేకపోతే శ్రేయస్సు లేదు. ప్రపంచం అరిష్టకష్టమై నష్టమవుతుంది.
స్త్రీ గురించి ఎవరో చెప్పిన ఆ నిర్వచనం ఆ క్షణంలో అతనికి తలపుకొచ్చింది. ఇదెంత వాస్తవమైనప్పటికీ....
ఒక స్త్రీ, మాతృమూర్తిగా చిన్ననాటనే తనను అనాధను చేసింది.
మరొక స్త్రీ, తన చిన్ననాటి నేస్తం....ఇప్పుడు తనకు దూరమై పోతున్నది.
అతనిలో నిశ్శబ్దం, నిర్లిప్తం పేరుకుపోసాగాయి. తానేమిటో, ఎలాంటి స్థితిలో వున్నాడో, ఎక్కడున్నాడో అనే వాస్తవాన్ని మరచిపోయి తాగుతున్నారు అధికారి.
కన్నులు మూసుకుపోతున్నాయి. రెప్పలు వాలిపోతున్నాయి. మత్తులో జోగుతున్న శరీరం తూలిపోతోంది.
కన్నులముందు వున్న లోకమంతా మసక మసకగా కనిపిస్తున్నది.

 Previous Page Next Page