Previous Page Next Page 
వెలుగుబాట పేజి 20


    ఝన్సీ కుమార్ లు ఇంటికి తిరిగి వచ్చేసరికి అటు కుమార్ తల్లిదండ్రులుకాని, ఇటు ఝాన్సీ తల్లీ, అక్కాకానీ లేరు. ఝన్సీ గాభరాపడుతోంటే, కుమార్ తేలిగ్గా "అందరూ కలిసి ఎక్కడికో వెళ్ళివుంటారు" అన్నాడు. అది అసంభవమని తెలిసిన ఝాన్సీ ఆందోళనగా "కుమార్! త్వరగా వెళ్ళి మీ వాళ్ళు ఎక్కడున్నారో చూడు!" అంది.
    "ఎందుకంత కంగారు? పసిపిల్లలా, తప్పిపోవటానికి?" అన్నాడు. తన ఆందోళనకు కారణం వివరించి చెప్పలేక పోయింది ఆమె. ఆ సమయంలో మేరీ వచ్చింది.
    డాక్టర్ కుమార్! మీ అమ్మా నాన్నగారు మా ఇంట్లో ఉన్నారు. మీ అమ్మగారు పెట్టి చేత్తోపట్టుకుని వెళుతుంటే, స్కూల్ కి వెళుతూ మా అమ్మ చూసిందిట, మా ఇంటికి తీసుకొచ్చింది. మీ అమ్మగారు పొలంపనికి కూలికి వెళ్ళారట! మీ నాన్నగారూ మా ఇంట్లో ఉన్నారు" అని చెప్పింది. కుమార్ కి అసలు మేరీ ఏం చెప్తోందోకూడా అర్ధంకాలేదు.
    "వాట్? వాట్? అన్నాడు అయోమయంగా. మేరీ కొంచెం కోపంగా మళ్ళీ చెప్పింది.
    "పద వస్తున్నాను" అంటూ ఉన్నవాడు ఉన్నట్లుగా వీధిలోకి వచ్చేసాడు. పోతూ మేరీ ఝాన్సీవైపు చూసింది. ఆ చూపుల్లో బాకులున్నాయి.
    ఝాన్సీ కోపంతో ఉడికిపోతూ తల్లి రాకకోసం ఎదురు చూడసాగింది, చెడామడా తిట్టాలని సంకల్పించుకొని.
    సాయంత్రం నాలుగూ, అయిదు ప్రాంతాలలో వచ్చారు తల్లీ, అక్కా ఆపసోపాలుపడుతూ. అక్క కొడుకు చేతిలో గారెముక్క ఉంది, వాడి ముక్కు కారుతోంది. ఝాన్సీ ఏమీ అనకుండానే తల్లి ప్రారంభించింది.
    "భీమన్న  పంతులుగారింట్లో అబ్దికమని  తెలుసుకుని వంటకెళ్ళాను. ఆవిడ పరమానందపడిపోయింది" డాక్టరమ్మగారి అమ్మగారా?" అని అడిగింది.
    "అవునమ్మా! కాని, ఇప్పుడావిడకి నేను తల్లినని చెప్పుకోవటం ఇష్టం ఉంటుందో? ఉండదో? ఎందుకులెండి నేను వంటలక్కనే!" అన్నాను.
    "ఏమిటోనండీ! ఈ కాలం పిల్లలకితల్లిదండ్రులమీద ప్రేమాభిమానాలు బొత్తిగా ఉండటంలేదు వాళ్ళకెంత తోస్తే అంత! అంది. ఇన్ని గారిలూ అప్పాలూ కట్టి ఇచ్చింది.
    "ఈ వయసులో ఆ బస్తీలో ఏం ఉంటారు? రెండు మూడిళ్ళలో వంట కుదిర్చిపెడతాను. తల్లీ తోడుగా మేం ఉంటాం!" అంది. దణ్ణంపెట్టి వచ్చాను. "ఇదిగో గారె! తింటావా?"
    ఝాన్సీకి నోట మాటరాలేదు. ఎంత తీవ్రమైన ప్రతీకారం? ఎంత దారుణమైనా చిత్రహింస!
    "అమ్మా! నన్నెందుకిలా హింసపెడుతున్నావు!"
    "ఏం చిత్రం! రెక్కలు ముక్కలయ్యేలా చాకిరీ చేసినదాన్ని నాకూనా, హింస నీకూనా?"  
    "ఈ వంట పనులు మానవా?"
    "ఎందుకు మానాలి? ఏ ఆధారం చూసుకుని? నీదారి నువ్వు చూసుకుంటున్నప్పుడు మా పాట్లు మేం పడాలి గదా?"
    "సరే! ఏం చెయ్యమంటావో చెప్పు, అది చేస్తాను."
    "నేను నిన్ను చేదుమెయ్యమంటున్నానా? అప్రతిష్ట పాలు కావద్దంటున్నాను. అప్రతిష్ట రాకుండా వుండాలేకాని, అది నీ ఒక్కదానితో పోతుందా? రేపు నీ చెల్లెల్ని కూడా ఎవరూ చేసుకోరు. పెద్దదానితోనే కుములుతున్నాను.
    అక్క అప్పుడే చదవటానికి తయారయింది. ఝాన్సీ  విసుగ్గా "సరే! అతడిని పెళ్ళిచేసుకోను సరేనా?" అంది.
    "అంతేకాదు. వాళ్ళూ మనం ఒకింట్లో వుండటానికి వీల్లేదు. అతడితో చనువుగా వుండటానికి వీల్లేదు."
    ఝాన్సీ శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోసాగింది. నోరు పెగుల్చుకుని "సరే" అంది.
    తల్లి వచ్చి ప్రేమగా మెటికలు విరవబోయింది.
    ఆ చేతులు విదిలించుకుని గదిలోకిపోయి తలుపులు దభాలున మూసుకుంది.
    శాంతమ్మ కూలిపని చేసుకుని మేరీ ఇంటికి వచ్చేసరికి కుమార్ ఎదురొచ్చాడు. పైకి ఎగ గట్టిన చీర, దుమ్ముకొట్టుకుని, రేగిఉన్న తల, చమటలు కారుతున్న ముఖం, ఈ అవతారంలో తల్లినిచూసి నిగ్రహించుకోలేకపోయాడు. తల్లి కాళ్ళదగ్గర మోకాళ్ళమీద కూలబడి తల్లి కాళ్ళచుట్టూ రెండు చుట్టి "అమ్మా!" అన్నాడు.
    శాంతమ్మ కంటినుండి నీటిబొట్లురాలి అతడి తలమీద పడ్డాయి.
    "నేనేం తప్పుచేశానమ్మా?"
    "బాబూ! ఎప్పుడూ నువ్వు చెప్పటం నేను వినటమే కాని, నేను నీకు చెప్పలేదు. చెప్పవలసిన అవసరం రాలేదు. నువ్వూ, ఆ అమ్మాయీ కలిసి ఉండడం నాకే బాగోలేదు. చెప్పలేకపోయాను ఇవాళ ఆ బాపనమ్మ శాపాలు వినలేక పోయాను. వాళ్ళ వుసురు మనకెందుకురా?"
    తల వంచుకుని లేచి నిలబడ్డాడు కుమార్. అతడు ఏమీ మాట్లాడలేకపోవటం శాంతమ్మకి కష్టం కలిగించింది.
    "చదువుకున్నోడివి, దర్జాగా నీ సుఖం నువ్వు  చూసుకో! మా కూలి బ్రతుకులు మాకుండనే వున్నాయి. మాతోపాటు పాటుపడే బాలయ్య వున్నాడు.
    జీవితంలో మొదటిసారి కొడుకును నిష్టూరంగా మాట్లాడింది. అప్పటికీ కుమార్ మాట్లాడకపోవటంచూసి మీ అయ్య అదృష్టవంతుడు.  ఇయ్యన్నీ  పడక్కర్లేకుండా, పిచ్చోడయి కూచున్నాడు. ఏడవటానికే, నాకీ కళ్ళిచ్చాడు దేవుడు" అంది.
    "అమ్మా! నేను మీకేం అన్యాయం చేశాను? ఏం తప్పు చేశాను?"
    "ఆ అమ్మాయితో ఇక్కడుండిపోయి చెల్లెలిని దేవుడి కప్పజెప్పావుగదరా?"
    "అమ్మా!"
    "ఇప్పటికైనా అయ్యని బాగుచెయ్యాలనీ, తమ్ముణ్ని పైకి తేవాలనీ ఉందా? నీ సంపాదనంతా ఆ అమ్మాయి తల్లికీ, అక్కకీ, తమ్ముడికీ, చెల్లెలికీ ధారపోస్తావా?"
    "అమ్మా! అమ్మా! ఈ ఉద్యోగం ఆ అమ్మయిదే! ఈ సంపాదనంతా ఆవిడదే!"
    "ఏంటిరా! మరీ వెర్రిదాన్ని చేసి మాట్లాడుతున్నావు. నీకు ఉద్యోగమయిందని కాగితం తెస్తే ఈ ఊరొచ్చావు. మంచీ, చెడ్డా  చూసుకుని మమ్మల్ని తీసుకువస్తానన్నావు. ఇప్పుడు ఉద్యోగం ఆ అమ్మాయిదే నంటావేంటి?"
    కుమార్ మాట్లాడలేకపోయాడు.
    "బాబూ! ఇక  నువ్వా అమ్మాయితో ఉండకు. అసలాళ్ళతో ఏ సంబంధమూ పెట్టుకోకు. నువ్వట్టా వుంటానంటేనే నీతో వుంటాం. లేకపోతే పోయి మా పాట్లు మేము పడతాం!"
    తల్లిని చెయ్యి పట్టుకొని లోపలి తీసుకొచ్చాడు కుమార్. తన రుమాలుతో ఆవిడ ముఖం తుడిచాడు.
    "అమ్మా! నిన్నూ, నాన్ననీ, తమ్ముడినీ నేను ఎప్పుడూ కష్టపెట్టను. చెల్లెలికోసం ఎంత కష్టపడ్డానో నీకు తెలీదా? పరిస్థితులు బాగాలేవమ్మా! కొన్నాళ్ళలో చక్కబడతాయని ఆశపడుతున్నాను."
    "అదంతా నాకు తెలవదురా! నువ్వాఇంట్లో ఉండకు. ఆ అమ్మాయితో ఏం సంబంధం పెట్టుకోకు. హమ్మో! బాపనమ్మ. శాపాలు తలుచుకుంటే గుండె దడ దడ లాడుతోంది."
    "ఆ ఇంట్లో మనం ఉండొద్దులేమ్మా!"
    మేరీ యింటి ప్రక్క వాటా ఖాళీగా ఉంటే, అందులోకి దిగారు కుమార్ కుటుంబం.

 

                                                         *    *    *


    కుమార్ ని రోజూ చూస్తున్నప్పుడు అతనితో కలిసి మెలిసి వుంటున్నప్పుడు, అతడు తన మనసులో ఎంత ప్రముఖ స్థానం ఆక్రమించుకున్నాడో ఝాన్సీ అంత బాగా అర్థం చేసుకోలేకపోయింది. కుమార్ ని చూడకుండా ఒక్క రాత్రి గడిపేసరికి, అతడు లేని జీవితం తనకు అంధకారమని బాగా తెలిసివచ్చింది ఆ రాత్రి అంతా నిద్రలేక ఆమె కళ్ళు బాగా ఎర్రబడ్డాయి. ఉదయం లేచిన దగ్గర్నుంచీ, ఆమె కొకటే ఆలోచన' "కుమార్ నెలా చూడాలా?" అని. తల్లి వద్దని ఆంక్ష పెట్టినకొద్దీ చూడాలనే తహతహ మరింత కాసాగింది. ముఖం కడుక్కొని కాఫీ అయినా త్రాగకుండా బయలుదేరింది మేరీ ఇంటికి.
    "ఎందుకు వెళ్తున్నాను? ఏంచెయ్యగలను?" అని మనసు గందరగోళంగా వేస్తున్న ప్రశ్నలను, ఉప్పొంగే క్రమ ప్రవాహం అనిచేసింది.

 Previous Page Next Page