Previous Page Next Page 
వెలుగుబాట పేజి 19


    
    ఝాన్సీ మాట్లాడలేదు.
    "అందరూ కలిసే తింటున్నారా?"
    "అవును."
    "వాళ్ళది ఏం కులం?"
    "హరిజనులు."
    "ఆ!" గుండె ఆగినంత పనయింది ఝాన్సీ తల్లికి. అక్కడికక్కడే కూలబడిపోయింది. తల్లికి ఒకసారి మైల్డ్ గా  హార్ట్ అటాక్  వచ్చిందన్న సంగతి గుర్తుచేసుకుని, తన తొందరపాతుకు పశ్చాత్తాపపడింది. తల్లి దగ్గరగా కూచొని కొద్దిగా గ్లూకోజ్ వాటర్ త్రాగించింది. తల్లి తేరుకుని కన్నీళ్ళతో "ఝాన్సీ వెంటనే, ఈ ఇంట్లోంచి పోదాంపద? లేకపోతే వాళ్ళనైనా పంపేయి" అంది.
    శాంతమ్మ బొమ్మలా చూస్తుంది. ఝాన్సీకి కాళ్ళూ, చేతులూ వణుకుతున్నాయి. గుడ్డిలో మెల్ల కుమార్ ఇంట్లో లేడు. ఎవరికో అనారోగ్యంగా ఉంటే, రోగి కదల లేని స్థితిలో ఉన్నాడని తనే వెళ్ళాడు.
    ఝాన్సీ మౌనం సహించలేకపోయింది తల్లి, "అలా పిండిబొమ్మలా నిలబడతావేమీ? వాళ్ళని పోమ్మను" అంది కర్కశంగా. ఈ దురుసుతనం భరించలేక "అది జరగదు" అంది ఝాన్సీ.
    "జరగదూ, జరగదూ? ఇలాంటిదేదో ఉంటుందని నేను అప్పుడే అనుకున్నాను. అవునమ్మా! నువ్వు పెద్దదానివై పోయావు, ప్రయోజనరాలివై పోయావు, సంపాదనపరురాలివై పోయావు. అంతేనమ్మా! నీ యిష్టంవచ్చినట్లు నువ్వుండు కాని, నాకింకా కొడుకు, కూతురు వున్నారు. ఇదిగో ఈ అభాగ్యురాలొకతే ఉంది. నేను వంటలు చేసుకు బతకాలిసిందే. హరిజనులలో కలిసి ఉన్నానంటే, నన్నెవరూ వంటలకు రానివ్వరు నువ్వూ నీ వాళ్ళూ సుఖంగా బతకండమ్మా! బిడ్డలు తల్లిని తేలిగ్గా తోసిపారెయ్యగలరు కాని, తల్లి బిడ్డలను శపించలేదు."  "ఎందుకమ్మా అంతంత మాటలు? ఇక్కడ నువ్వు ఉండలేకపోతే ఉండకు- నీకు డబ్బు పంపిస్తాగా?"
    "డబ్బు! ఏమనుకుంటున్నావమ్మా నువ్వు? ఈ ముష్టి తల్లికి ఇంత ముష్టి పారేస్తే పడివుంటుందనే కదూ? నేను నీకు తల్లిని గాను. నా మాటమీద గౌరవంలేదు- ఇక నీ ముష్టి నాకెందుకమ్మా! ఫరవాలేదు- నా రెక్కలలో బలం ఉంది- వంటలు చేసుకోగలను- పెళ్ళిచేసుకో దలచుకొంటే మాత్రం బాగా వెనుకా ముందూ ఆలోచించుకో! పెళ్ళంటే సూరేళ్ళపంట."
    శాంతమ్మ దీనంగా చూస్తోంది- ఝాన్సీకి గుండె దడదడ లాడుతోంది.
    "ఆ మాటలన్నీ తర్వాత ఆలోచిద్దాం. ముందు స్నానం చెయ్యమ్మా భోజనం చేద్దువుకాని......."
    "ఛీ ఈ కొంపలో స్నానం చేస్తావా? చెరువుకు పోయి స్నానం చేస్తాను. ఈ ఇంట్లో తిండి తింటానా , ఇంత బతుకూ బతికి. ఇంత మజ్జిగ తాగుతాను. ఉపోషాలుండటం ఈ ప్రాణి కలవాటే."
    చెరువుకు పోయి స్నానంచేసి తడిబట్టలతో నలుగురి ముందూ నడిచి ఇంటికి వస్తే తల్లికి అది శుద్ధి - ఏం మాట్లాడినా తల్లికికోపం మరింత ఎక్కువవుతుందని "అమ్మా! నేను ఆస్పత్రికి వెళుతున్నాను" అనేసి అక్కడినుంచి వెళ్ళిపోయింది ఝాన్సీ.
    ఝాన్సీ తల్లి అక్కను బెంబేలుగా చూస్తున్న శాంతమ్మ మీదకు మళ్ళింది.
    "ఛీ! ఇలా తల్లీ కూతుళ్ళను విడదీసినవారు సర్వనాశనమైపోతారు, జన్మ జన్మలమా రేంపనరకంలోపడి......" అని తిట్లుకు లంకించుకుంది.
    "బాపనమ్మా! బాపనమ్మా?!....." అంటూ అడ్డు పడింది శాంతమ్మ- పల్లెలో పుట్టిపెరిగిన శాంతమ్మకి బ్రాహ్మణుల శాపాలంటే చాలాభయం. తను ఏ జన్మలో ఏ పాపం చేసిందో, అందుకే ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నానని నమ్మే అనేకమందిలో ఆమె ఒకటి.
    "బాపనమ్మా! ఆడపిల్లని కనుక నువ్వట్లా అనగలిగావు మొగబిడ్డని మేమేవి అనగలం చెప్పు? మేమూ మనసులో మగ్గుతూనే ఉన్నాం. ఈయన చూస్తే ఇట్టా వున్నాడు- ఓ బిడ్డని అట్టా మట్టిపాలు చేసాను- ఇక చిన్నోడికి ఆ పాలేరు పని ఎప్పటికి వొదుల్తాదో తెలవదు ఇప్పుడు మా అబ్బాయి పెళ్ళి చేసుకుని తనబతుకు తను చూసుకుంటే మా గతేం కావాలో చెప్పు. ఏం ఉద్యోగమో, ఏమో? ఇంత జీతమని నా చేతికిచ్చిన పాపానపోలేదు. అప్పుడో పదీ, ఇప్పుడో అయిదూ ఇస్తాడు."
    "ఝన్సీ ఈ నెల అసలేమి పంపలేదు."
    "అదేంటో నాకు తెలువదమ్మా-శాపాలు పెట్టబోకు, ఇప్పటికీ సకంచచ్చి ఉన్నాం. నువ్వేం చెబితే అది చేస్తాను. అబ్బాయి మాటకెదురు చెప్పలేక కాని, బాపన పిల్లని చేసుకోవటం మాకు మాత్రం మంచిదా?"
    ఝాన్సీ తల్లిలో ఆశ కలిగింది. స్నేహ స్వరంతో "వీళ్ళిద్దరినీ విడిగా ఉంచాలి. మనం పైన చూసుకోవాలి!" అంది.
    మనం చెప్తే వింటారా?"
    "వయసు మహత్యం? వినరు. మీరు విడిగా వెళ్ళిపోతే, మీ అబ్బాయి మీతో ఉంటాడు. నేను వంటలు చేసుకుంటానని బెదిరిస్తే మా అమ్మాయి దారికొస్తుంది."
    "నేనూ కూలిపని చేసుకుంటాను. శాపాలు పెట్టబోకమ్మా! మేము ఇప్పుడే పోతాం, ఉండేటందుకు ఏ ఇల్లయితేనేం? మిమ్మల్ని ఏడిపించి మేమేం బావుకుంటాం?"
    అప్పటికప్పుడు పెట్టె సర్దుకుని, మతిలేని భర్త చేయి పట్టుకుని, ఇంట్లోంచి బయలుదేరింది శాంతమ్మ. ఝాన్సీ తల్లి సంబరంగా "మీ అమ్మకడుపు చల్లగా, నీకడుపు చల్లగా, వెయ్యేళ్ళు మీరంతా సుఖంగా బ్రతకండి" అంది. కన్నీళ్ళు ఆపుకొంటూ వెళ్ళిపోయింది శాంతమ్మ.
    అప్పుడు ఝాన్సీ అక్క "అమ్మా వాళ్ళు వెళ్ళిపోయారుకదా? చెరువు కెందుకు? ఇంట్లోనే స్నానం చేసేద్దాం?" అంది. తల్లి ఒప్పుకుంది. ఇద్దరూ స్నానాలు చేసారు.
    "అమ్మా! వంటలన్నీ రెడీగా ఉన్నాయే" అంది ఝన్సీ అక్క.
    "ఛ! వాళ్ళ వంటలు మనమెలా తింటామే?"
    "వాళ్ళ వంటలు కాదే! అన్నీ మన వంటలే! గుత్తి వంకాయకూర, కొబ్బరి పచ్చడి, సాంబారు....."
    "అయితే ఝాన్సీయే వంటచేసి ఉంటుంది. ఎంతయినా, మనమ్మాయి వాళ్ళచేతివంట తింటుందేమిటి? వడ్డించు భోంచేద్దాం."
    ప్రయాణపు బడలికతో ఆవురావురు మంటున్న తల్లీ కూతుళ్ళిద్దరూ తతృప్తిగా భోజనం ముగించారు.

                                                              *    *    *

 Previous Page Next Page