"మేము మధ్య తరగతి కుటుంబీకులం. మా నాన్న, అన్నదమ్ములు ఇద్దరే. మా పెదనాన్న మా నాన్నగారు ఇద్దరు. తోబుట్టువులు మా మేనత్త ఒక్కరే. మా పెద్దనాన్నగారి పేరు గోపాల శాస్త్రి. వారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కుమార్తెలు. ఆయన పెద్ద కుమారుడు కృష్ణమూర్తి. సెకండరీగ్రేడు ట్రై నింగు చదువుతుండగానే స్వాతి అనే హరిజన కన్యను పెళ్ళి చేసుకున్నాడు. అప్పట్నుంచీ పెద్దకొడుకు మా పెద్ద నాన్నకు దూరమయ్యాడు. రాకపోకలు లేవు. మా పెద్ద నాన్నగారి దృష్టిలో పెద్ద కొడుకు పోయినట్లే లెక్క. కృష్ణమూర్తి, స్వాతి విడిగా కాపురం ఉంటున్నారు. రెండో కొడుకు జానకిరాం. అతను ఎమ్మే ఫస్టుక్లాసులో పాసయాడు. ఉద్యోగం చెయ్యాలనిగాని, సంపాదించి భార్యను పోషించాలనిగాని ఆయనకు తోచదు. ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతలతోనే కాలం వెళ్ళబుచ్చుతాడు. ఆయన భార్య గౌతమి పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్ద కూతురు రత్నమ్మ. వారిది పల్లెటూరి కాపురం. వ్యవసాయం చేస్తుంటాడు అల్లుడు. వారి కాపురం బాగానే వుంది. రెండవ కూతురు శ్రీలక్ష్మి. ఆమె చిన్నతనంలోనే రెండేళ్ళు కాపురం చేశాక భర్త పోయాడు. అమ్మాయి పుట్టింట్లో అంటే మా పెద్ద నాన్నగారింట్లోనే ఉంటుంది. అమ్మాయి పూర్వ కాలపు భావాలుకలది. వితంతు వుల్లో ఉండవలసిన అన్ని పూర్వాచారపు లక్షణాలు ఆమెలో మూర్తీభవించి ఉన్నయ్యి. ఇదీ మా పెద్దనాన్నగారి కుటుంబ చరిత్ర." అన్నది జయలక్ష్మి మురహరితో.
మురహరి సావధానంగా విని "మీ కుటుంబ చరిత్ర చెప్పకుండా ఆపేశావేం" అన్నాడు.
* * *
ఉవ్వెత్తుగా నురుగులు కక్కుతూ వడ్డుకు వచ్చి తగిలి చెదిరి పోయే సముద్రపు కెరటాల వైపు చూస్తున్నది జయలక్ష్మి. మురహరితో ఇదివరకు ఎంత సన్నిహితంగా ఉండి కులాసాగా చలాకీగా మాట్లాడిందో ఇప్పుడంత దూరంగా ఉంటున్నది జయలక్ష్మి. ఎన్నడో జరిగిన ఆమె పెళ్ళి ఆమె ఎప్పుడో మర్చి పోయింది. కారణం పెళ్ళినాటికి తను ఎనిమిదేళ్ళ పిల్ల కావటమే. కట్టు, బొట్టు, జుట్టులతో ఏ మార్పూ లేకుండా అచ్చగా పెళ్ళికాని కన్యలాగే ఉంటున్న ఆమె నిత్య జీవితంలో ఆ నాటి సంఘటన కొంతకొంత మార్పు తీసుకొచ్చింది.
"జీవిత సమస్యలనేవి ఒక నాటితో పరిష్కార మయ్యేవి కావు. జీవించి ఉన్నన్నాళ్ళు కొన్ని సమస్యలు తేలనే తేలవు. కొన్ని సమస్యల్ని అవలీలగా మనస్సునుండి దూరం చేసుకున్నా సన్నిహితులైనవారు ఆ సమస్యల్ని మరింత దగ్గరకు వచ్చే టట్లు చేస్తారు. అప్పుడు ఉన్న సమస్యలు ఉండగా కొత్త సమస్యలు ఎదురవుతయ్యి. జీవిత వలయంలో తిరుగాడుతూ ఉన్నంత వరకు ఎవరేం చెయ్యగలరు మురహారీ. కొన్నాళ్ళు, జరిగిన వన్నీ తల్చుకుని నాలో నేను కుమిలిపోయేదాన్ని. క్రమేపీ ఆ జరిగిపోయిన సంఘటనలకు గోరీ కట్టి వాటిని తల్చుకోవటమే లేదు. చదువూ, సంస్కారమూ ఉన్నా నా గత జీవితాన్ని నేను పూర్తిగా మర్చిపోయినా వితంతువు అనే ముద్రను నా నుదుటి మీదనుంచి ఎవరు చెరపగలరు.? పలక మీద గీతాలు కావు చెరపటానికి." అన్నది, వంచిన తల ఎత్తకుండా.
"వివాహజీవితాన్ని కొంతకాలం అనుభవించావన్నమాట. నూతన దాంపత్య జీవితాన్ని అంత తేలికగా మర్చి పోవటం జీవితంలో సాధ్యం కాదేమో" అన్నాడు మురహరి.
ఒక్కసారిగా తలెత్తి అతని ముఖంలోకి చూసింది జయలక్ష్మి. అ చూపులో క్రోధమూ అవమానమూ, అందోళనా, ఆవేశమూ అన్నీ మిళితమై వున్నయ్యి.
"మురహరి అట్లా మాట్లాడాలని నువ్వు అనుకోక పోయినా నన్ను పరీక్షించాలనే ఉద్దేశ్యం కడుపులో పెట్టుకునే ఆ మాట అంత తేలికగా అనగలిగావు. కాలేజీలో చదువుతున్న జయలక్ష్మినే నువ్వు చూస్తున్నావుగాని అసలు జయలక్ష్మి ని కాదేమో. నేను బాల వితంతువును. నా భర్త నా తొమ్మిదో ఏటనే పోయారు. ఇప్పటికయినా తెలిసిందా నా వైవాహిక జీవితం ఎటువంటిదో"
ఆవేశంతో, ఆయాసపడుతూ ఒక్క నిట్టూర్పు విడిచింది జయలక్ష్మి.
"నా ఉద్దేశ్యం నిన్ను కించ పరచాలని కాదు జయలక్ష్మి. నువ్వంటే నాకు గౌరవం ఉంది. ప్రేమ ఉంది. ఈర్ష్యాభావం నాకు ఏమాత్రం లేదు. నువ్వన్నట్టుగా నేను కాలేజీలో చదివే జయలక్ష్మినే చూశానుగాని, బాలవితంతువైన జయలక్ష్మి ని చూడలేదు" అన్నాడు శుష్క స్వరంతో.
"అయితే విను"
మురహరి అక్కడే ఆ ఇసుకలోనే బాసిన పెట్టు వేసుక్కూర్చుని కుడితొడమీద కుడి మోచేతిని పోటీ పెట్టి చెంపన అరచేతిని ఆనించి జయలక్ష్మి వైపు ప్రేమపూరితమైన జాలిని ప్రదర్శిస్తూ.
"ఇంక జీవిత గాధను వినిపించు జయా" అన్నాడు.
"అడ్డు ప్రశ్నలు వెయ్యవుకదూ" అన్నది జయలక్ష్మి నవ్వుముఖంతో.
"ఏ ప్రశ్నలూ వెయ్యను సరేనా" అన్నాడు.
"నా జీవిత కథ విన్న తరువాత ఒకవేళ నా మీద నీ అభిప్రాయం మారవచ్చుకదూ"
మురహరి నవ్వుతూ "నువ్వే తుమ్ముకుని నువ్వే చిరంజీవి అనుకుంటే నే చెప్పేదేముంది జయా. అభిప్రాయాలు అర నిముషంలో మారవచ్చు, అనురాగం అణువణువుగా ఉంటే అభిప్రాయాలను ఏ మాత్రం తావు లేదు."
మనస్సులోని సందిగ్ధాన్ని త్రోసిపుచ్చి మృదుస్వరంతో పిల్చింది..
"మురహరీ"
"ఏం జయా"
"ఇవాళ నే చెప్పే నా జీవిత కథ నీ హృదయంలో శాశ్వతమైన ముద్ర వేసుకు పోతుందా"
"నేనెట్లా అప్పుడే చెప్పగలను జయా. ఒక నాడు నువ్వు నాకోసమే జన్మించిన అందాల బాలవనుకున్నాను. నాటకం రోజు తరువాత నీకు పార్టీ ఇచ్చినప్పుడు నాకు దూరమై పోతున్నా వనుకున్నాను. ఆ రోజున నా గదికి వచ్చినపుడు నువ్వు నా దానివే అనుకున్నాను. తరువాత నీ మాటలు విని నువ్వు ఎవరి ఎవరిదానివి కావేమో ననుకున్నాను. ఇవ్వాళ మల్లి నువ్వు నాకు సన్నిహితురాలివి అయ్యే అవకాశం కనిపిస్తున్నా వేమోననుకున్నాను. నా చేత ఇన్ని మాటలు పలికిస్తున్నావు. నీ జీవిత కథ మాత్రం చెప్పటం లేదు" అన్నాడు చిరుకోపంతో.
"కోపగించుకోకు హరీ. చెపుతాను విను" అని చెప్పసాగింది జయలక్ష్మి.
అప్పటికి సాయంత్రం అయిదు గంటలు దాటింది. ఇంకా ఎండ తగ్గలేదు.
"మా పెద్ధనాన్న గోపాల శాస్త్రి గారి కుటుంబ చరిత్ర చెప్పాను. ఇంక మా నాన్నగారి జీవిత చరిత్ర, మా నాన్నగారి పేరు శంకర శాస్త్రిగారు. సకల విద్యాపారంగతులు. ఆయనకు అన్ని శాస్త్రాలు తెలుసు. జ్యోతిష శాస్త్రంలో అందె వేసిన చెయ్యి. వైదిక కర్మలు చేయిస్తూ సంసార సాగరంలో మునిగి తేలుతూ ఉంటమే తప్ప ఆయనకు ఈ కాలపు ప్రపంచపురీతులు తెలియవు. చిన్నప్పట్నుంచే మా అమ్మ చాలా రోగిష్టిది. ఆవిడకు ఎప్పుడూ ప్రాణం మీదికి వచ్చే జబ్బులే. జీవితంలో ఆవిడ ఏ నాడూ సుస్తీ లేకుండా సుఖంగా ఉన్నాననుకోలేదు. ఆవిడ జీవితం అటువంటిది. నేనొక్క తినే వారికి సంతానం.
అంత సుస్తీగా ఉన్నా నన్ను ఎంతో గారాబంగా చూపేది. తమకు ఉన్నా లేకపోయినా ఎట్లాగో మా నాన్నకు నచ్చచెప్పి నా ముద్దు ముచ్చటలు తీర్చి తను ఆనందిస్తూ ఉండేది. నా సంతోషమే ఆవిడకు ఆనందం. నేను కులాసాగా నవ్వుతూ కబుర్లు చెపుతూ ఆడుకుంటుంటే ఆవిడ రోగం సగం తగ్గినట్లుగా తృప్తిపడేది. ఇట్లా పెరిగిన దాన్ని. నాకు ఏడెనిమిది సంవత్సరాలు వయస్సు రాగానే 'అష్టవరేత్ భవేత్ కన్యా' అన్న సిద్ధాంత రీత్యా పెళ్ళిచెయ్యాలని తల పెట్టారు మా నాన్న. అందుకు మా అమ్మ కూడా అంగీకరించింది. కారణం జబ్బుమనిషి కావటం చేత తను ఎప్పుడు కన్ను మూస్తావో అనే భయం చేతనే.
అంతవరకు నా జీవితం బాగానే గడిచిందని చెప్పాలి. ఎనిమిదేళ్ళ దాన్ని నాలుగో క్లాసు చదువు తున్నాను. ఆ వయస్సుకు నాకు భర్త అనీ, పెళ్ళి అనీ మంచి చెడ్డలనీ నాకేం తెలుస్తయ్యి. అందువల్ల నా సలహా సంప్రదింపుల ప్రమేయమే లేదు. పెళ్ళి సంగతి ఎత్తంగానే మా అమ్మ నెత్తీ నోరూ బాదుకుని ఏడ్చేది. ఎందుకనో ఆ రోజుల్లో నాకు లీలగా గుర్తు. చివరికి నా దిగులుతోనే పెళ్ళయిన రెండు నెల్లకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళింది"
తల్లిని తల్చుకుని కళ్ళొత్తుకుంది జయలక్ష్మి. తన జీవిత చరిత్ర చెపుతుంటే ఆ మాతృమూర్తి తనను ఏ విధంగా పెంచినదీ కళ్ళను కట్టినట్లుగా గుర్తుకు తెచ్చుకుని కంట తడి పెట్టసాగింది.
"మా నాన్నగారు జ్యోతిష్య శాస్త్రంలో విధి అని చెప్పాను కదూ. ఆయన నా జాతక రీత్యా వైధవ్యం తప్పదని తేల్చారు. ఆయన ఎంత శాస్త్ర ప్రమాణంగా చెప్పినా మా అమ్మ వినేది కాదు. నా బంగారు తల్లికి ఏ దేవుడూ అన్యాయం చెయ్యడు. ఒకవేళ చేసినా దాని జీవితంలో వైధవ్యం అనుభవించదనేది. మా నాన్నగారి వాదన ప్రకారం నాకు వైధవ్యం ఉంది కనక కట్నం కానుకలిచ్చి ఈడూజోడూ చూసి చిన్నవాడికి ఇచ్చి చేసేబదులు కానీ కర్చులేకుండా ఏభై ఏళ్లవాడికిచ్చి చేస్తే వాడు పోయినా అంత బాధ అనిపించదని డబ్బూ ఖర్చుకాదు అని ఆయన వాదన. రెండు మూడు నెల్లు తర్జన భర్జన పడ్డ తరువాత, రెండుసార్లు నాన్న చేతుల్లో దెబ్బలు తిన్న తరువాత అమ్మ జీవచ్చవంలా మంచానికి అంటుకు పోయి, ఇంక ఏ ఆశాలేక ఆయన చెప్పిన మాటలకు సరేనన్నది.
"సూరి శాస్రి అనే ఏభై ఏళ్ల తాతయ్యకు నేను తృతీయ కళత్రాన్ని. మొదటి ఇద్దరు భార్యలకూ పిల్లలు లేరు. ఏభై వేలు ఖరీదు చేసే ఆస్తి పాస్తులున్నయ్యి. ఆయన జాతకం కూడా మా నాన్నగారే చూసి ఆయనకు ఏభై ఎనిమిదో ఏట సంతాన ప్రాప్తి ఉన్నట్లుగా గణితం వేసి చెప్పారు. సర్వఖర్చులూ సూరి శాస్త్రిగారే భరించి నన్ను వళ్ళో కూర్చో పెట్టుకుని పెళ్ళి చేసుకున్నారు. నాన్న తృప్తి పడ్డారు. అమ్మ గుండెలు బాదుకుంది. నా పెళ్ళి చక్కగా అయిపోయింది"