Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 19


    "ఆ... అవునవును! జమీందారుగారి ఆరో కొడుకు రిక్షా తొక్కుతాడన్న మాటండీ" శ్రీదేవికి చిరాకేసుకొచ్చింది.
    "అతనయినా గాని అంత ఆస్తి ఉండగా రిక్షా ఎందుకు తొక్కాలి?"
    "ఎందుకంటే అది హాబీ అన్నమాటండీ! ఇప్పుడు మనకి స్టాంపులు సేకరించడం, రచనలు చేయడం, ఫోటోగ్రఫీల్లాంటివి ఎలా హాబీలో వాడికది హాబీ అన్నమాటండీ"
    "నేనింతవరకూ అలాంటి హాబీ గురించే వినలేదు" అందామె నమలేనట్లు.
    "నేనూ వినలేదనుకోండి! కానీ మన నవల్లో అలా వుంటుందన్న మాటండీ"
    "మరి ఇందులో హిప్నాటిస్ట్ ఎవరండీ?"
    సింహాద్రి స్పీడ్ గా ఆలోచించసాగాడు.
    "ఎవరా? ఎవరంటే... ఎవరంటే... ఆ! వాడేనండీ! రిక్షావాడు"
    శ్రీదేవి ఉలిక్కిపడింది.
    "రిక్షావాడా?"
    "అవునండీ"
    "అతనికెలా వచ్చు హిప్నాటిజం"
    "వాడు అమెరికాలో హిప్నాటిజం నేర్చుకుని వచ్చాడన్న మాటండీ! అది నవల ఆఖర్లోగాని ఆడియెన్స్ కి తెలీదు"
    "ఆడియోన్సేమిటి? పాఠకులు కదూ?"
    "ఓ... అయామ్ సారీ... ఇదే పిక్చర్ కూడా తీయాలని ప్లాన్ చేస్తున్నాలెండి. అందుకని ఆడియెన్స్ అన్నాను"
    "అప్పుడేమవుతుందండీ?"
    "ఏముందండీ? ఓ రోజు ఓ అమ్మాయి అతని రిక్షా ఎక్కి ఏడుస్తుందండీ. ఆమెను చూసి జాలిపడి రిక్షావాడు కథేమిటని అడుగుతాడండీ. ఆమె కథ చెప్తుందండీ! రిక్షావాడు ఆమె సహాయం చేయాలని నిశ్చయించుకుని రంగంలోకి దిగుతాడండీ! అక్కడి నుంచి కథ భలే తిరిగి పోతుందండీ! కథలోకి మహా మహా మంత్రగాళ్ళూ కూడా జొరబడతారండీ"
    "అబ్బ! ఒండర్ ఫుల్"
    "మనం కాసేపలా బీచ్ కెళ్దామాండీ?"
    "బీచ్ కా? హైదరబాద్ లో బీచ్ ఏమిటి?"
    "సారీ! కాదండీ. డిన్నర్ కెళ్దామా అనబోయి బీచ్ అన్నానండీ! అచ్చు తప్పన్నమాటండీ"
    "ఇప్పుడు టైం లేదండీ! మరోసారి వెళ్దాం. మా డాడీ నాకోసం ఎదురుచూస్తూంటాడు. అది సరేగానండీ- మీకు హిప్నాటిజం వచ్చా?"
    సింహాద్రి ఉలిక్కిపడ్డాడు.
    "హిప్నాటిజమా?"
    "అవునండీ! అది వచ్చినవాళ్ళంటే నాకెంతో ఇష్టం"
    "అలాగా! అయితే నాకూ వచ్చండి. హిప్నాటిజమే కాదు టెలీపతి, విలోపతి, సైకోపతీ, మైకోపతి ఇవన్నీ కూడా వచ్చండీ"
    "ఆ! నిజంగానా?"
    "అవునండీ! కావాలంటే మా చిరంజీవి నడగండి"
    "అవునండీ! వాడు చాలా పెద్ద హిప్నాటిస్ట్! కాపోతే ఈ విషయం ఎవరికీ తెలీదు. ఆఖరికి వాడిక్కూడా తెలీదు అంత సీక్రెట్ అన్నమాట"
    "ధనుంజయగారూ! నన్నోసారి హిప్నలైజ్ చేయరూ? ప్లీజ్"
    "మిమ్మల్నా?"
    "అవునండీ"
    "మిమ్మల్ని చేయటం కుదరదండీ"
    "ఎందుకని?"
    "ఏమోనండీ! తెలీదు. కానీ మీ అంత అందమయిన అమ్మాయిలను చేయాలంటే చాలా కష్టమండీ! కదురా చిరంజీవి"
    "అవునండీ! కుదరదండీ!"
    "పోనీ చిరంజీవిగారిని చేయగలరా?"
    "ఓ ఇట్టే చేస్తాను. చిరంజీవి ఇలారారా! ఇటుకూర్చో" అన్నాడు సింహాద్రి ఆనందంగా. చిరంజీవి వచ్చి అతని కెదురుగ్గా కూర్చున్నాడు.
    "నువ్విప్పుడు నావంకే చూస్తున్నావ్.....నావంకే చూస్తున్నావ్.....నావంకే చూస్తున్నావ్" అన్నాడు సింహాద్రి.
    చిరంజీవి మత్తెక్కిన వాడిలా అతని వంకే చూడసాగాడు.
    "నువ్విప్పుడు నిద్రలో కెళ్ళి పోతున్నావ్.... నిద్రలో కెళ్ళిపోతున్నవ్.... నిద్రలో కెళ్ళి కెళ్ళిపోతున్నావ్" అన్నాడు సింహాద్రి.
    చిరంజీవి గుర్రున గురక పెడుతూ కూర్చునే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసి ఆనందం పట్టలేక శ్రీదేవి తప్పట్లు కొట్టేసింది.
    "అబ్బ! యూ ఆర్ రియల్లీ ఒండర్ ఫుల్" అంది అతని వంక అభిమానంగా చూస్తూ.
    "ఇప్పుడు నువ్వు నిద్రలేచి ఎగిరి గంతులేస్తున్నావ్.....ఎగిరి గంతులేస్తున్నావ్.... ఎగిరి గంతులేస్తున్నావ్" అన్నాడు సింహాద్రి ద్విగుణీకృత ఉత్సాహంతో.
    అంత కష్టమయిన ఎక్సర్ సైజ్ ఇస్తున్నందుకు సింహాద్రి వంక కొరకొర చూస్తూ ఎగిరి గంతులేయసాగాడు చిరంజీవి.
    శ్రీదేవి మళ్ళీ తప్పట్లు కొట్టేసింది.
    "ఇప్పుడు నువ్వు ఇంటిబయటికెళ్ళి రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావ్.... రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావ్.... రూమ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావ్"
    చిరంజీవికి ఒళ్ళు మండిపోయింది. కాని చేసేదిలేక తూనీగలా బయటకు పరుగెత్తి  రూమ్ కి ఓ ప్రదక్షిణ చేసేసరికి అప్పుడే రూమ్ ముందు ఆటో దిగుతున్న మావయ్య కనబడ్డాడు. వెంటనే అదే తూనీగలాగా మళ్ళీ రూమ్ లో కొచ్చేసి కుర్చీలో కూలబడిపోయాడు ఒగరుస్తూ.
    అది చూసి వెంటనే తన సజెషన్ మార్చేశాడు సింహాద్రి.
    "నువ్విప్పుడు మామూలు స్థితిలో కొస్తున్నావ్.....మామూలు స్థితిలో కొస్తున్నావ్.....మామూలు స్థితిలో కొస్తున్నావ్...."
    "ఒరేయ్! బయట నిలబడ్డ  ఆ వ్యక్తిని హిప్నటైజ్ చెయ్ చూద్దాం" అంటూ చిరంజీవి సైగ చేశాడు శ్రీదేవి చూడకుండా.
    సింహాద్రి రోడ్డుమీద ఆటో రిక్షావాడి దగ్గర చిల్లరకోసం నిలబడ్డ మామయ్యను చూసి కంగారుపడ్డాడు. చిరంజీవి అయిడియా ప్రకారం రిస్క్ తీసుకోకపోతే శ్రీదేవి ముందు తన పరువు తీసేస్తాడు మామయ్య.
    శ్రీదేవిక్కూడా ఆ సలహా నచ్చింది.
    "అవునండీ! అదిగో ఇప్పుడే ఆటో దిగాడే - ఆ మీసాలతనికి చేయండి. భలే సరదాగా వుంటుంది" అంది ఆనందంగా.
    "సరే మీరడిగారు కాబట్టి చేస్తాను" అన్నాడు సింహాద్రి వణుకుతూ, అప్పటికే విశ్వనాథ గడప దగ్గరకొచ్చి లోపల సింహాద్రి, చిరంజీవిలతో పాటు ఓ అందమయిన ఆడపిల్లకూడా వుండడం చూసి ఠక్కున ఆగిపోయాడు. అతనిని చూసేసరికి దిమ్హాద్రి నోటివెంబడి మాటరాలేదు. పెదాలు మాత్రమే కదులుతున్నాయ్. అది చూసి చిరంజీవి సింహాద్రిని మేచేత్తో ఒక్కపోటు పొడిచాడు. "అమ్మో" అని అరచాడు సింహాద్రి. అరచి వెంటనే స్పృహలో కొచ్చి విశ్వనాథం వేపు చూసి "మీరు లోపలికొస్తున్నారు. లోపలికొస్తున్నారు. లోపలికొస్తున్నారు" అన్నాడు.
    విశ్వనాథానికి అతని మాటలేమాత్రం అర్ధంకాలేదు. అసలా ఆడపిల్ల ఆ రూంలో ఎందుకుందా అని అర్ధమవక ఛస్తూంటే మధ్యలో సింహాద్రి "మీరు లోపలికొస్తున్నారు" అని మూడుసార్లు అనడం మరింత అయోమయంగా అనిపించింది. ఆ ప్రదేశంలో ఎక్కడో ఏదో అసహజంగా ఉన్నట్లనిపిస్తోంది. అనుమానంగా గదిలోకి నడిచి నాలుగు మూలలా గాలిస్తున్నట్లు చూశాడతను.

 Previous Page Next Page