"ఏం తప్పిపోవు. ఒకవేళ అలా జరిగితే మైక్ లో ఎనౌన్స్ మెంట్ ఇప్పిస్తాలే" అన్నాడు.
"అంతవరకూ ఎందుకండీ?" అని ఆమె అతని చెయ్యిపట్టుకుంది.
"కానియ్యి" అనుకుంటూ వూరుకున్నాడు.
ఆమె ఒక్కొక్క స్టాల్ చూసుకుంటూ నడుస్తోంది. అతను మనుషుల ముఖాలన్నీ గాలించిపారేస్తున్నాడు.
మధ్యలో ఐస్ క్రీం పార్లర్ దగ్గర ఆగి ఐస్ క్రీం తిన్నారు.
"ఏం అబ్బాయి బాగున్నావా?" అన్న గొంతు వినిపించి తలత్రిప్పి చూశాడు. తమ ఊరివాడే. ప్రక్కన భార్య కూడా వుంది. ఇద్దరి చేతుల్లో బోలెడు ప్యాకెట్లు వున్నాయి.
మహేష్ తలవూపాడు.
"బాగా చదువుతున్నావా? ఏమిటో చిక్కిపోయినట్లుగా వున్నావు" అంటూ అతను ప్రశ్నలు వేస్తున్నాడు-మధ్య మధ్య యీ అమ్మాయి ఎవరా అన్నట్లు చూస్తూ, అతని భార్యకూడా ఆ అమ్మాయిని ఆసక్తిగా గమనిస్తోంది.
వాళ్ళ అభిప్రాయం గ్రహించి "మా క్లాస్ మేటు" అన్నాడు మహేష్.
"సరే వొస్తా. ఈ ఊరుచుట్టాలింటికొచ్చి ఎలాగూ వొచ్చాంగదా అని ఎగ్జిబిషన్ చూడ్డానికి వొచ్చాం. ఇదిగో యీ మహాతల్లి ఓ అయిదొందలు వొదిలించింది" అన్నాడు యిల్లాలిని ఉద్దేశిస్తూ.
ఆవిడ ముసిముసిగా నవ్వింది.
ఇద్దరూ వెళ్ళిపోయారు.
వెడుతూవుండగా "ఏమిటీ ఆ అమ్మాయి అతనితో చదువుకునే పిల్లా? చాలా సోషల్ గా వుండేటట్లుంది" అన్నది భార్య. 'సోషల్' అన్న పదం ఈ రోజుల్లో చదువు రానివాళ్ళు కూడా యధేచ్చగా వాడుతూంటారు.
"మరేమిటి డాక్టరీ అంటే? అ చదువు చదివే పిల్లలు అలాగే వుంటారు".
"కాని పిల్ల మాత్రం ముచ్చటగా వుంది. కళ్ళు తిప్పుకోలేకపోయానంటే నమ్మండి"
వాళ్ళ మాటలు లీలగా ఈ ఇద్దరికీ వినిపించాయి. ప్రియంవద పెదవుల మీద చిరుహాసం ఉదయించింది.
"రండి వెడదాం" అంటూ అక్కడ్నుంచి అతన్ని కదలదీసింది.
ఒక చోట మోటార్ సైకిలు ఫీటు....
ఇంకో చోట మాట్లాడే బొమ్మ....
మరో చోట మ్యాజిక్....
అలాగే....
మోడరన్ డాన్స్.....అందులో పోటీలు....
ఒక్కొక్కటే చూసుకుంటూ నడుస్తూన్నారు.
"ఏవండీ! రైలెక్కుదామండీ"
అతను తటపటాయించటంచూసి "రైలయితే మొత్తం గ్రౌండంతా కలయ తిరిగేస్తుందండీ, ఆంజనేయులెక్కడున్నాడో చాలా ఈజీగా చూడవచ్చు" అంది.
ఈ ఐడియా బాగానే వుందనుకుని, అతను క్యూలో నిలబడి రెండు టిక్కెట్లు తీసుకొచ్చాడు.
వాళ్ళు టర్న్ వచ్చాక రైలెక్కారు.
చిన్న కూతవేసి రైలు బయల్దేరింది.
ఆమె అతనిప్రక్కన ఆనుకుని కూర్చుంది. అప్రయత్నంగా ఆమె వైపు చూశాడు. గాలికి ముంగురులు రేగి అమాయకమైన ఆమె ముఖంమీద పడుతున్నాయి. చేత్తోముంగురుల్ని ఎగద్రోసుకుంటూ అతని ముఖంవంక చూసి నవ్వింది.
రేడియోలో ఎప్పుడన్నా వొచ్చే పాత హిందీ సినిమాలోని పాట "జవానీకి రైలు చలేజాయెరే"
అది ఆధారంగా ఆరుద్ర రాసిన "పడుచుదనం రైలుబండి పోతున్నది. ఓహూ పోతున్నది. వయసు వాళ్ళకిందులో చోటున్నది" అన్నపాట మనసులో మెదిలింది.
ధా ధిన్ ధిన్ ధా
ధా ధిన్ ధిన్ ధా
తా తిన్ తిన్ తా
తా ధిన్ ధిన్ తా
మనోక్షేత్రంలో తబలా ధ్వనితరంగాలు చెలరేగుతున్నాయి. ఎవరివో పాదాలు అనుగుణ్యంగా చిందులు వేస్తున్నాయి.
"ఏవండీ లేవరేమిటి? రైలాగిపోయింది"
తెలివి తెచ్చుకుని చూసేసరికి ఆమె చెయ్యిపట్టుకుని లాగుతున్నది.
* * *
జయింట్ వీల్ దగ్గరకువొచ్చారు.
"ఏవండీ"
"జయింట్ వీల్ ఎక్కుదామండీ అంటావు. కానియ్యి" అని మళ్ళీ క్యూలో నిలబడి రెండు టికెట్లు తీసుకొచ్చాడు.
వాళ్ళ టర్న్ వచ్చాక ఇద్దరూ జయింట్ వీల్ ఎక్కి ప్రక్క ప్రక్కన కూర్చున్నారు.
జయింట్ వీల్ కదిలింది.
చక్రం మరీ పైకి వెళ్ళినప్పుడు ప్రియంవదకు తలతిరిగినట్లయి, అతన్ని గట్టిగా పట్టుకుని భుజంమీద తలవాల్చింది.
"వొద్దు" అందామనుకున్నాడు- కళ్ళముందు ఆంజనేయులు రూపం మెదుల్తుండగా.
"కళ్ళు తిరుగుతున్నాయి" అంది మగతలో వున్నట్టు.
అతనప్రయత్నంగా ఆమె తలమీద చేయిపెట్టి నిమిరాడు.
జయింట్ వీల్ తిరుగుతోంది. ఆమె అతని భుజంమీదనుంచి తల తియ్యలేదు.
అతను వున్నట్టుండీ త్రుళ్ళి పడ్డాడు. జయింట్ వీల్ క్రిందకు వొచ్చి నప్పుడు తర్వాత టర్న్ కోసం నిరీక్షిస్తూ నిలబడివున్న క్యూలో ఆంజనేయులు నిలబడి వుండటం కనిపించింది. ప్రక్కన ఒక లావుపాటి స్త్రీ, యిద్దరు పిల్లలు.
"అదిగో ఆంజనేయులు" అని అరిచాడు ఉత్సాహంగా.
ప్రియంవద అదిరిపడి సరిగా కూర్చుంది. ఇంతలో వీల్ పైకి వెళ్ళి పోయింది.
"ఆంజనేయులు అక్కడ నిలబడివున్నాడు. ప్రక్కన ఎవరో వున్నారు" అన్నాడు.
వీల్ క్రిందకి వొస్తోంది.
"త్వరగా చూడు అదిగో అక్కడ" అన్నాడు చేయెత్తి చూపిస్తూ.
ఆమె అటుకేసి చూసి యింకోసారి అదిరిపడింది. ఇది ఎట్లాసంభవం? అతను.....అతను....
వీల్ పైకి వెళ్ళిపోయింది.
"అతనేకదూ?"
ఆమెకేమని జవాబు చెప్పాలో తెలియటంలేదు.