Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 20


    మంజుల అతని వైపు చూసి "మాట" అంది.
    అతను రెండు అడుగుల్లో ఆమెను చేరుకున్నాడు.
    "రేపు మనకు హాలీడే గదా సినిమా కెళ్ళాలనుకుంటున్నా టికెట్స్ ప్రాబ్లం. మీరు త్వరగా థియేటర్ దగ్గరకు వెళ్ళి టికెట్స్ తీసి పెట్టండి. మేం ఖచ్చితంగా పది గంటలకల్లా వచ్చేస్తాం" అంది.
    అతను ఆనందంతో బరస్ట్ అయిపోయాడు.
    "డబ్బు లిస్తాను" అని పర్సుతీసి లోపల చేయిపెట్టి అటూ ఇటూ కదిపింది.
    "సారీ! రూమ్ లో పెట్టి వచ్చాను. మీరు టికెట్లుతీసి పెట్టండి. రేపు పే చేస్తాను." అంది నొచ్చుకున్నట్లుగా.
    నిజానికి అతని దగ్గర డబ్బుల్లేవు. ఎనిమిది టికెట్లంటే ఏభై రూపాయలు కావాలి. కానీ ఆమెతో ఈ విషయం చెప్పడానికి జంకాడు.
    అలానే అన్నట్లు తల ఆడించాడు.
    మంజుల మరోమారు మనోహరంగా నవ్వింది.
    అతను వచ్చేశాడు రేపటి సినిమాకు ఇప్పుడే వెళ్ళి థియేటర్ దగ్గర కూర్చోవాలనిపించింది. కానీ డబ్బుల సమస్య పెనుభూతంలా కనిపిస్తోంది.
    ఆ రాత్రంతా శెట్టి, మునిరత్నం తో చర్చలు జరిపాడు.
    "అప్పుడే సినిమాల వరకు వచ్చిందన్న మాట" అని వాళ్ళంటే ఎంతో గర్వంగా ఫీలయ్యాడు ఆంజనేయులు.
    "టర్మ్ ఫీజు గట్టడానికి నా దగ్గర డబ్బుంది టర్మ్ ఫీజుకి ఇంకా చాలా టైముంది. ట్యూషన్లు చెప్పి సంపాదించాను. దాన్ని తీసుకునివెళ్ళి టికెట్లు తీసుకో. ఎలానూ రేపు ఆమె ఇచ్చేస్తుంది గనుక ఆ తరువాత నాకు ఇచ్చేయి" అన్నాడు శెట్టి అతన్ని కౌగిలించుకున్నంత పని చేశాడు ఆంజనేయులు.
    ఆ రాత్రి కలత నిద్రపోయాడు తెల్లవారే నిద్రలేచి తయారయ్యాడు.
    "గురూ! సినిమాలో మీరు మాట్లాడుకునే కబుర్లన్నీ చెప్పాలి అది షరతు" అని శెట్టి డబ్బులిచ్చాడు.
    దానికి అతను చాలా సిగ్గుపడిపోయాడు.
    ఎనిమిది గంటలకల్లా థియేటర్ చేరుకున్నాడు.
    తొమ్మిదిన్నరకు 'క్యూ' ప్రారంభమైంది. అప్పటికే చెమటతో తడిసి ముద్దయి పోయాడు. టికెట్లు చేతికి తీసుకోగానే సంబరపడిపోయాడు.
    బయట నిలబడి వెయిట్ చేయసాగాడు.
    కరెక్టుగా పదిగంటలకల్లా మంజుల తన మిత్రబృందంతో ఆటోలోంచి దిగింది.
    "గుడ్ మార్నింగ్" అంటూ అతని ముందుకొచ్చింది.
    "ఇదిగోండి టికెట్లు"
    ఆమె వాటిని తీసుకుని లెక్కవేసుకుంది.
    "చాలా థాంక్స్" అతనితో అని "వెళదాం రండే" అని మిత్రురాళ్ళను పిలిచింది.
    అందరూ వెళ్ళిపోతున్నారు. ఆంజనేయులు అలానే నిలబడి చూస్తున్నాడు ముందు వెళుతున్న మంజుల ఏదో గుర్తొచ్చినట్టు అతని దగ్గరకు వచ్చింది.
    "మీ విషయం మరిచే పోయాను. సారీ" అంది నాజూగ్గా.
    అతను మాట్లాడాలని నోరు తెరిచాడు గానీ ఏం మాట్లాడాలో తోచలేదు.
    "మీకు టికెట్లకు డబ్బిచ్చినా తీసుకోరని నాకు తెలుసు అందుకే మిమ్మల్ని ఇబ్బందిపెట్టటం లేదు. మీతో సినిమా చూడాలని నాకూ వుంది కానీ మీరు నాతో వస్తే ఇక హాస్టల్ లో ఆట పట్టిస్తారు. అందుకే మరోసారి మనిద్దరమే వస్తాం" అంది బుజ్జగిస్తున్న ధోరణిలో.
    "ఫవరాలేదు, మీరెళ్ళండి" చాలాసేపు మధనపడ్డాక చెప్పాడు.
    మంజుల వెళ్ళిపోయింది.
    తిరిగి హాస్టల్ కు వచ్చాడు. ఊరెళ్ళి బండి తోలిడబ్బు లిచ్చేస్తా నన్నాడు శెట్టితో. దానికి ఒప్పుకున్నాడు అతను. తామిద్దరూ ఏ పరిస్థితుల్లో సినిమా చూడలేక పోయారో వివరించాడు. మంజుల ఆడపిల్లగా ఆ మాత్రం జాగ్రత్తపడడం సహజమనిపించింది.
    నెక్స్ట్ డై క్లాసులో మంజులను చూడగానే ఆమెకు, తనకు మధ్య బాగా సాన్నిహిత్యం పెరిగినట్టనిపించింది. సినిమా ఎలా వుందో అడగాలనుకున్నాడు గానీ అప్పుడే లెక్చరర్ రావడంతో తన సీట్లోకి వెళ్ళి కూర్చున్నాడు.
    లెక్చరర్ డిప్రెషన్ గురించి చెప్పడం ప్రారంభించాడు.    
    "ఓ అమ్మాయిని ఓ అబ్బాయి బస్టాండ్ లో చూసి ఆకర్షింపబడ్డాడు. ఇక అతని దిన చర్య అదే. రోజూ మార్నింగ్ బస్టాండ్ కు వెళ్ళడం, ఆమె కాలేజీ బస్సు ఎక్కేవరకు అక్కడ వెయిట్ చేస్తూ చూడడం పరిపాటైపోయింది.
    కానీ ఓ రోజు షడన్ గా ఆమె కనిపించదు. ఏమైందో తెలియదు.
    లెక్చరర్ అదంతా తనను ఉద్దేశించి చెబుతున్నట్టే వుంది ఆంజనేయులకు తను అలా రోడ్డు రోమియో కాదు. మంజుల కొరకు రోజూ తను దారిలో వెయిట్ చేయడం గుర్తొచ్చింది. ఆంజనేయులుకు. అయితే అందర్లాగా తను వెకిలిగా ప్రవర్తించడం లేదు. కుళ్ళు జోక్ లు వేయడం లేదు. కుళ్ళు జోక్ లు వేయడం లేదు. తను మంజులను ఎంతో ఆరాధిస్తున్నాడు. దేవతలా పూజిస్తున్నాడు.
    ఈ విషయం చెప్పాలి మంజులకు. ఎలా? తనలో తానే గొణుక్కుంటున్నాడు.
    లెక్చరర్ మాటలు విన్పిస్తున్నాయి. "కొన్ని రోజులపాటు అతను డిప్రెషన్ కు లోనవుతాడు. నిరాశా నిస్పృహలు ఆవరిస్తాయి. అయితే ఆ తరువాత ఓ రోజు మరో అమ్మాయి ఎదురింటి మేడ మీద దర్శనమిస్తుంది. ఇక అప్పట్నుంచి అతను ఆమెను చూడడం ప్రారంభిస్తాడు. బస్టాండ్ అమ్మాయిని మరిచి పోతాడు. డిప్రషన్ దూదిపింజ లాగా తేలిపోతుంది....."
    ఇక భరించలేక పోయాడు ఆంజనేయులు.
    "నో......నో" అంటూ గట్టిగా అరిచాడు.
    కాస్తంతా ఏ క్షణంపాటు జడుసుకుంది. ఎందుకలా అతను అరిచాడో ఎవరికీ అర్ధం కాలేదు. లెక్చరర్ అయితే మరింత గాబరాగా చూశాడు.
    "ఐ యామ్ నాట్ సచ్ ఏ బాయ్ సార్. బ యామ్ లవ్వింగ్ వెరి సిన్సియర్లీ" అన్నాడు ఆంజనేయులు నిజాయితీ ధ్వనిస్తున్న కంఠంతో.
    క్లాసంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. గుసగుసలు ప్రారంభమయ్యాయి. అయిదు నిముషాల తరువాత అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. అదేమిటంటే ఆంజనేయులు వెర్రోడని.
    ఇక పాఠం చెప్పడం తల వల్ల కాదంటూ లెక్చరర్ వెళ్ళిపోయాడు.
    స్టూడెంట్స్ అంతా క్యాంటీన్ కెళ్ళారు.
    ఆంజనేయులు మాత్రం అలా గదిలోనే వుండిపోయాడు. మంజుల ఒక్కటీ తనను అర్ధం చేసుకుంటే చాలనుకున్నాడు.
    సాయంకాలం క్లాసయిపోగానే ఆమె అతని చేతిలో చిన్న చీటీ ఒక దానిని కుక్కింది.
    దాన్ని చూస్తూనే తమ ప్రేమ రెండో ఘట్టంలో ప్రవేశించినట్టనిపించింది. అతనికి దాని మడతలు తీయకుండానే ఎంతో పవిత్రతో కళ్ళ కద్దుకున్నాడు.
    జీవితంలో మొదటగా ప్రేయసి రాసిన లేఖ. దాన్ని విప్పకుండానే జేబులో వేసుకున్నాడు. అందులో ఏముందోనన్న టెన్షన్ మొత్తం మనిషినంతా వూపేస్తోంది. అందుకే ప్రేమ అనుభవలేక వేద్యం అన్నారు పెద్దలు. తూలుకుంటూ వెళ్ళాడు క్యాంటీన్ కు కాఫీ తాగుతూ లెటర్ విప్పాడు.

 Previous Page Next Page