17
తెలుపూ, నీలం రంగుల్లో వున్న హెలికాప్టర్ హెలిపాడ్ మీద నిలబడి వుంది. దాని పక్కన నిలబడి ఏర్పాట్లు అన్నీ సరిగా వున్నాయా లేవా అని చూస్తున్నాడు హాలీవుడ్ నుంచి వచ్చిన స్టంట్ ఫైలట్ టోనీ. పెద్ద గాజుబుడగలాగా కనబడుతోంది హెలికాప్టర్ తాలూకు కాక్ పిట్. ఆ కాక్ పిట్ ఎడమవైపు వున్న తలుపు తొలగించబడి వుంది. అక్కడ హెలికాప్టర్ లో నుంచి బయటకు పొడుచుకు వచ్చిన ప్లాట్ ఫారంలాగా ఒక కొయ్యి పలక బిగించి వుంది. దాని మీద వుంది షానావిజన్ కెమెరా. అంటే, హెలికాప్టర్ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ఆ కెమెరా హెలికాప్టర్ బయటకే వుండేలా ఆ చెక్కని బిగించి వుంది. చాలా ఖరీదైన కెమెరా అది. ఖరీదైనదే కాదు - కొనడానికి ఎక్కడా దొరకని కెమెరా అది. పానావిజన్ కంపెని వారు తమ కెమెరాలని కేవలం అద్దెకి ఇస్తారు. ఎవరికీ అమ్మారు. పెద్దపెద్ద సీనరీలను అందంగా, చిత్రీకరించవచ్చు ఆ కెమెరాతో.
హెలికాప్టర్ కాక్ పిట్ లో రెండు సీట్లు వున్నాయి. వెనక కొన్ని సీట్లు వున్నాయి.
తెరవబడివున్న ఎడంవేపు తలుపుకి వెనకగా వున్న సీట్లో కూర్చుని వున్నాడు కెమెరామేన్ ఆదిత్య. అతని దగ్గర వున్న బాగ్ లో చిన్న కెమెరాలు మరి రెండు వున్నాయి. జూమ్ లెన్సులు వున్నాయి. ఆ రిప్లేక్స్ కెమెరా ఒకటి అతనికి దగ్గరలోనే వుంది. అతని అసిస్టెంట్ సుందర్ అతని పక్కనే కూర్చుని వున్నాడు.
సీట్లో కొద్దిగా ముందుకు వంగి , పానావిజన్ కెమెరా వైపు చూశాడు ఆదిత్య. దాని వ్యూఫైండర్ లో వుంటే కుదరదు. అందుకనే ఈ చెక్క ఫ్లాట్ ఫారం నిర్మించి దానిమీద కెమెరాని ఫిక్స్ చెయ్యడం జరిగింది. కెమెరా తాలూకు వ్యూఫైండర్ తనకి కనబడదు గానీ, కేమేరానీ కంట్రోల్ చేస్తూ, అటూ ఇటూ తిప్పే హేండిల్ మాత్రం తన చేతిలో వుంటుంది.
చాలా డిఫికల్ట్ షాట్స్ ఇవి.
కెమెరాలో ఏం కనబడుతుందో అది తను చూడలేదు.
కేవలం తన ఏక్స్ పీరియన్స్ మీద, తన జడ్జిమెంట్ మీద ఆధారపడి సీన్స్ షూట్ చెయ్యాలి ఇప్పుడు.
కానీ,
అలాచేస్తే పూర్తీ సంతృప్తి రాదు తనకి.
తన అసిస్టెంట్ సుందర్ వైపు తిరిగాడు ఆదిత్య.
"సుందర్.......హెలికాప్టర్ డెత్ వాలీ మీదికి వెళ్ళాక నేను భాగా ముందుకి ఒంగిపోతాను. అప్పుడు వ్యూఫైండర్ లోంచి ఏం కనబడుతుందో, ఎలా కనబడుతుందో చూడొచ్చు. ఆ సమయంలో నేను జారి లోయలోకి పడిపోకుండా , నువ్వు నా నడుముని గట్టిగా వుడుంలాగా పట్టుకోవాలి. అర్ధమయిందా!" అన్నాడు.
తలూపాడు సుందర్. "కానీ నాదొక రిక్వెస్ట్ బాస్! అనవసరంగా ప్రాణాలు రిస్క్ చెయ్యకండి"
"పొతే పోనీయ్ వెధవ ప్రాణాలు!" అన్నాడు ఆదిత్య నవ్వుతూ. "వీడు గొప్ప సీన్ ఒకటి తీశాడని గుర్తు పెట్టుకుంటారా జనం లేక వీడు వందేళ్ళు బతికాడని గుర్తుపెట్టుకుంటారా? మంచి షాట్ కావాలా, వెయ్యేళ్ళు ఆయుర్దాయం కావాలా అని అడిగితే మంచి షాట్ కావాలని చెబుతాను నేను - ప్రతిసారీ కూడా"
నవ్వాడు సుందర్. అది నిజమని అతనికి తెలుసు. అందుకే ఆదిత్య ఏస్ కెమెరామేన్ అయ్యాడు. స్వతహాగా 'కెమెరా ఐ' వుంది. దానికి తోడు కృషి, దానికి తోడు ధైర్యం, దానికి తోడు డేడికేషన్.
అందుకే ఆదిత్య ఫీల్డులో హైయ్యెస్ట్ పెయిడ్ కెమెరామెన్ ఇప్పుడు.
అతనేకాదు. రఘుపతి యూనిట్ లో అందరూ టాప్ క్లాస్ వాళ్ళే వుంటారు. హైయ్యెస్ట్ పెయిడ్ హీరో హీరోయిన్లు, హైయ్యెస్ట్ పెయిడ్ డైరెక్టర్ ........అతను పదహారు వేల అడుగుల సినిమా తిశాదంటే అందులో అడుగడుగునా భారీతనం కనబడవలసిందే.
డైరెక్టర్ రఘుకుల తిలక్ తను తీయబోయే షాట్స్ ని మననం చేసుకుంటున్నాడు అతని అసిస్టెంట్ కోటేశ్వరరావు టైపు చేసిన షూటింగ్ స్క్రిప్టు కాగితాలు వున్న ఫైలు ని చదువుతున్నాడు. మేకప్ లో వున్న కిశోర్ తన నెర్వస్ నెస్ ని కప్పి పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు. ఒక్కసారిగా జరిగిపోతున్న సంఘటనలు ఉపిరి బిక్కిరి చేసేస్తున్నాయి. అన్నీ ఒక్కసారే - పెద్ద ప్రొడ్యూసర్ గారి భారీ బడ్జెట్ లో హీరోగా బుక్ కావడం, వెంటనే షూటింగ్ మొదలవడం ..........మొదటిరోజే హెలికాప్టర్ లో రిస్క్ షాట్స్........
ఉద్వేగంతో గట్టిగా దమ్ము పీల్చాడు కిశోర్.
యూనిట్ కి కావాల్సిన మిగతా సామగ్రిని, మరికొందరు ఆర్టిస్టులనీ తీసుకుని మరో హెలికాప్టర్ వారితో బాటే బయలుదేరుతుంది ఇప్పుడు.
కాక్ పిట్ లో కూర్చుని వున్నాడు టోనీ........స్టంట్ ఫైటర్.
జరుగుతున్నదంతా నిస్తేజంగా చూస్తోంది హీరోయిన్ మధుమతి.
డెత్ వాలీ మీదుగా వెళుతోంది హెలికాప్టర్ ఇప్పుడు.
ఆ డెత్ వాలీ లో హరీన్ వున్నాడా.......వుంటాడా? ఉన్నా కనపడతాడా? హరీన్ చనిపోకుండా వుంటే మాత్రం తనకి కనబడితీరతాడని నమ్మకంగా చెబుతోంది మనసు.
అది నిజమవుతుందా?
"రెడీ?" అన్నాడు టోనీ , డైరెక్టర్ రఘుకుల తిలక్ వైపు చూస్తూ.
"రెడీ!" అన్నాడు డైరెక్టర్ . "మనం డైరెక్ట్ గా వెళ్ళి డెత్ వాలీ మధ్యన స్థంభంగా నిటారుగా వుండే టెలిస్కోప్ కొండమీద దిగుతాం. ఓకె?"
ముందు మెల్లిగా తిరిగాయి హెలికాప్టర్ రెక్కలు. తర్వాత ప్రచండవేగంతో రివ్వున తిరగడం మొదలెట్టాయి. నెమ్మదిగా పైకి లేచింది హెలికాప్టర్. గాల్లో వెళ్ళాడుతున్నట్లు అటూ ఇటూ తిరిగి తర్వాత ముందుకు సాగిపోయింది.
కొద్దిక్షణల తర్వాత ఇళ్ళు కుంచించుకుపోయినట్లు కనబడ్డాయి. ఒక చిన్న నది వానపాములా కనబడింది. ఒక అటవీ ప్రాంతం పచ్చిక బయలులా కనబడింది.
ఆ తర్వాత -
ఆకుపచ్చ గోధుమ రంగూ కలిసిన అదొక వర్ణంతో కనబడింది భూమి.
తర్వాత ఎటుచూసినా ఎగిరిపోతున్న దూదిపింజెలాంటి మేఘాలు.
కొద్ది గంటల ప్రయాణం తర్వాత -
డెత్ వాలీ మధ్యలో ఒంటిస్థంభంలా నిటారుగా నిలబడి వున్న టెలిస్కోప్ కిండమీద దిగాయి. హెలికాప్టర్స్ పైనుంచి ఆ కొండ కొమ్ము చదునుగా చిన్న నాణంలా కనబడుతోంది గానీ, దిగిన తర్వాత చూస్తే అది చాలా విశాలమైన స్థలమే. పెద్ద పుట్ బాల్ గ్రౌండంత వుంది అది.
హెలికాప్టర్స్ అక్కడ దిగాక, కొద్దిసేపు విశ్రాంతిగా కూర్చున్నారు అందరూ. లైట్ గా స్నాక్స్ తీసుకున్నారు. తర్వాత చకచక షాట్స్ అరేంజ్ చేశారు డైరెక్టర్ రఘుతిలక్.
"కిశోర్.........ఇప్పుడు నువ్వు హెలికాప్టర్ తలుపు పట్టుకుని వెళ్ళాడుతుంటావు. హెలికాప్టర్ గాల్లోకి లేస్తుంది. అంటే లోయలోకి పోదనుకో. ఇక్కడే ఈ కొండ కొమ్ముమీదే తిరిగుతూ వుంటుంది. కానీ స్క్రీన్ మీద చూపించేటప్పుడు లోయతాలుకు ఏరియల్స్ షాట్స్ జుక్స్ టాపోజ్ చేస్తా అన్నమాట. అప్పుడు నిజంగానే నువ్వు లోయమీద ఎగురుతున్నట్లు అనిపిస్తుంది చూసేవాళ్ళకి. కిశోర్ .......ఈ సీన్ నువ్వు స్వయంగా చేయగలవా? డూప్ ని పెట్టమంటావా? నీ ఇష్టం. చెప్పు!"
డూప్ వుంటే బాగుంటుందని అనిపిస్తోంది కిశోర్ కి. కానీ ఆ సంగతి ఒప్పుకోవడానికి అహం అడ్డు వస్తోంది. రాకరాక వచ్చిన లక్కి చాన్స్ ఇది. ఇప్పుడే తను సామర్ధ్యాన్ని నిరూపించుకోవలసినది. నిజానికి ఇవన్నీ హరీన్ చెయ్యవలసిన సీన్లు ఉహాతీతంగా మారిపోయిన పరిస్థితులవల్ల తను చేస్తున్నాడు. ఈ దెబ్బతో ఫీల్డులో నిలబడిపోవాలి తను.
"నాకు డూప్ వద్దు. నా సీన్లు నేనే చేస్తాను" అన్నాడు కిశోర్ ధైర్యంగా.
"వెరీగుడ్ .........బీ కేర్ ఫుల్!" అన్నాడు డైరెక్టర్ రఘుతిలక్.
"నీకు కొంచెం అలవాటయ్యేదాకా సింపుల్ సీన్స్ షూట్ చేస్తాను. అ తర్వాత ఏరియల్ ఫైట్స్ .......ఓకె?"
తలూపాడు కిశోర్.
అతను హెలికాప్టర్ తలుపుని పట్టుకువెళ్ళాడుతుంటే హెలికాప్టర్ గాల్లోకి లేచింది. హెలికాప్టర్ తో బాటు అతని పై ప్రాణాలు పైనే లేచిపోయాయి. ఒళ్ళంతా చెమటలు పోశాయి. వణుకుతున్న చేతులు పట్టు తప్పుతాయేమోనని భయం కలిగింది. కిందికి చూశాడు. సరిగ్గా కొండకొమ్ముమీదగా ఆకాశంలో నిలబడి వుంది హెలికాప్టర్. వలలాంటి పెద్ద నెట్ పట్టుకుని నిలబడి వున్నారు యూనిట్ మెంబర్స్. తను పడినా ఆ నెట్ లోనే పడతాడు. కానీ ఇక్కడనుంచీ చూస్తుంటే, కొండకొమ్ము నయాపైసా అంత చిన్నదిగా వున్నట్లు భ్రాంతి కలుగుతోంది. దాని చుట్టూ వున్న లోయ రాకాసి నోరు తెరచినట్లు కనబడుతోంది.