పరాంకుశానికి రాబోయే సంచికకు మేటరే దొరకడంలేదు. కుర్చీలో కూర్చుని తల పగలకొట్టుకుంటున్నాడు. 'ఏడీ రామలింగం! వార్తలు సేకరించటానికి ప్రొద్దుటనగా పోయాడు. ఎంతకూ రాడేం?'
వందోసారో, నూటయాభయ్యోసారో తిట్టుకుంటుండగా రామలింగం ముఖం వేలవ్రేసుకుని లోపలకు వచ్చాడు.
"ఏమయినా దొరికాయా?" అని అడగబోయి "నీ మొహంచూస్తేనే తెలిసిపోతుంది చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు" అన్నాడు.
"అదికాదు సర్..."
"ఏదికాదు? ఊళ్ళో ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, వారానికి రెండు మూడు రేప్ లు జరుగుతున్నాయి! రోజుకు యెంతోమంది లేచిపోతున్నారు, నీకు వార్తలే కనబడ్డం లేదా?"
"జరుగుతున్నాయి సార్! మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి. వ్యక్తులు మారుతున్నారు కాని, విషయం పాతదే సార్! చదివీ చదివి జనానికి బోర్ కొడుతుంది."
"మినిష్టర్ల అక్రమాలు...."
"కొత్త గవర్నమెంటు వచ్చాక మంత్రులుకూడా అక్రమాలు చెయ్యటం మానేశారు సర్!"
"ఆఫీసర్ల లంచాలు?"
"అలాంటివాటిని గురించి పాఠకులు పట్టించుకోవటం మానేశారు సార్!"
"అక్రమ సంబంధాలు?"
"అవి రొటీన్ అయిపోయాయి సార్! మనకు మాత్రం లేవా అని పాఠకులు థ్రిల్ ఫీలవటల్లేదు సార్"
"మరి ఎట్లా చచ్చేదయ్యా? మన అంకుశం నిలబడేదెలా?" అని నెత్తీ నోరు కొట్టుకున్నాడు పరాంకుశం.
రామలింగం సీరియస్ గా ఆలోచిస్తున్నాడు.
"రామలింగం" అని పిలిచాడు పరాంకుశం.
"పేపరువాడు యిందాక వచ్చి బిల్లు కట్టకపోతే ఊరుకునేది లేదని దబాయించి వెళ్ళాడు. ఇన్నాళ్ళూ నన్ను చూసి వాదు హడలిపోయేవాడు. ఇప్పుడు వాడ్నిచూసి నేను హడలిపోతున్నాను."
"తప్పదు సార్! తప్పదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి."
"నీ వెధవ ఉపమానాలు కట్టిపెట్టు. అలా అని వూరుకున్నాడా? అంకుశం ఎడిటర్ పేపర్ బిల్లు కట్టలేక మొహం వేలాడేశాడని త్రిశూలంలో వేయిస్తా నన్నాడు."
"ఏమన్నాడు సార్?"
"అంకుశం ఎడిటర్, పేపరుబిల్లు కట్టలేక మొహం వేలాడేశాడని.....అబ్బ! ఎన్నిసార్లు చెప్పిస్తావయ్యా నాతో?"
"అన్నాడా సార్? ఆ మాట అన్నాడా?"
"ఏ మాట?"
"అంకుశం ఎడిటర్ పరాంకుశం మొహం వేలాడేశాడని."
"అన్నాడయ్యా! నేనబద్దాలు రాస్తానుగానీ, అబద్దాలు చెబుతానా?"
"మీరు తప్పుపని చేశారు సార్"
"ఏమిటి?"
"వాదు వచ్చిన టైంకి వెధవమొహంలా పెట్టకుండా బింకంగా ఫోజు పెట్టాల్సింది. అసలు యిప్పటిరోజుల్లో అంతా ఫోజు పెట్టటంలోనే వుంది సార్! లోపల సరుకేమీ లేకపోయినా సరే"
"నేను సినిమా యాక్టర్ని కాదయ్యా! పత్రికా ఎడిటర్ని విన్నావా? పత్రికా ఎడిటర్ని."
"విన్నాను సార్!"
"ఏమిటి విన్నావు?"
"విషయం కంపోజింగ్ లో మీరు మొనగాడు కాని పోజింగులో మాత్రం అర్భకులు."
"ఏమన్నావు?"
"అర్భకులు అన్నాను సార్."
"రామలింగం! నీమాట నాకు పరువునష్టం కలిగించేదిగా అనుమానంగా వుందేమిటి?"
"అసలు మనవృత్తే అదికదా సార్! ఇతరులకు పరువు నష్టం కలిగిస్తూ మన పరువు పెంచుకుంటూ పోవటంలో, అప్పుడప్పుడు మనకు పరువునష్టం కలుగుతూ యితరుల పరువు పెరుగుతూ వుంటుంది."
"బయటివాళ్ళని నేను తిడుతుంటే కమ్మగా వుంటుందిగానీ, వాడొచ్చి అప్పులవాడిలా నన్ను తిడుతుంటే కళ్ళు చెమ్మగిల్లాయయ్యా."
"ఉంటుంది సార్! అలాగే వుంటుంది. పాయింటేమిటంటే మనతో తిట్టించుకున్నవాళ్ళకి కూడా అలాగే వుంటుంది. అయితే మనం సంఘంలో కుళ్ళు కడిగెయ్యటానికి కంకణం కట్టుకున్నవాళ్ళం కాబట్టి యిటువంటివి లెక్కచెయ్యకూడదు."
"సరే! ఒప్పుకుందాం మరి మన సర్క్యులేషన్ ఎలా పెరగటం?" అన్నాడు పరాంకుశం, రెండుచేతుల్తో తలపట్టుకుని.
రామలింగం రెండునిముషాలపాటు చాలా సీరియస్ గ ఆలోచించాడు. ఉన్నట్లుండి అతని కళ్ళు మెరిశాయి. "సార్! నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది" అన్నాడు ఉషారుగా.
"ఏమిటి రామలింగం?"
"మన పత్రిక సర్క్యులేషన్ పెరగాలంటే మిగతా పత్రికలకంటే ముందుగా అతిముఖ్యమైన వార్తలు ప్రచురించాలి. ముఖ్యంగా ఆ త్రిశూలంగాడికంటే ముందుగా వేసెయ్యాలి. అంటే ఏం చెయ్యాలి? ప్రపంచానికెవరికీ తెలియని సంఘటన మనమే సృష్టించాలి. ఆ వార్త మనద్వారానే ప్రపంచానికి తెలియాలి."
పరాంకుశం చాలా ఉత్కంఠగా ముందుకు వొంగాడు. "ఇదేదో చాలా విచిత్రంగా వుందే, ఎలా చెప్పు?"
"ఆ సంఘటన మనమే సృష్టించాలి. ఫలానా ప్రముఖవ్యక్తి హత్యగావించబడ్డాడు. ఆ హత్య-ఆ హత్య మనమే చేయించి, పతాక శీర్షికక్రింద పబ్లిష్ చేసెయ్యాలి అవతల ఆ మనిషి చస్తూ వుండగానే, యిక్కడ మేటర్ రెడీ అయిపోవాలి. ఆ మాటకొస్తే అసలిక్కడ మేటర్ రెడీ చేసుకున్న తర్వాతే ఆ మనిషిని చంపాలి. అలాగే ఫలానా మంత్రిగారు ప్రయాణం చేస్తున్న తర్వాతే ఆ మనిషిని చంపాలి. అలాగే ఫలానా మంత్రిగారు ప్రయాణం చేస్తున్న విమానం బాంబు వుండటంవల్ల పేలిపోయింది. ఆ బాంబును మనమే పెట్టి ఎన్నిగంటల ఎన్ని నిముషాలకు పేలిపోతుందో, ఎంతమంది చచ్చిపోయారో..."
"ఆపు" అని అరిచాడు ఉద్రేకం ఆపుకోలేక పరాంకుశం.
తన అద్భుతమైన ఐడియాను ఉత్సాహంగా వల్లించుకుపోతున్న రామలింగం ఉలిక్కిపడి చూశాడు.
"ఏం సార్! బాగాలేదా?"
"నీ తలకాయలా వుంది. ఆ మాటకొస్తే నా బట్టతలలా వుంది. ముఖ్యమైన వార్తలు సేకరించమంటే యివా నువ్విచ్చే చచ్చు సలహాలు? ఇలాటి పిచ్చిపిచ్చి చచ్చు సలహాలిచ్చావంటే, నీ తల పుచ్చకాయలా విచ్చుకుంటుంది."
"అదే సార్! నేను చెప్పేది. ముందు న్యూస్ రాసేసి, కెమేరా రెడీగా పెట్టుకుని ఆ పని చేసెయ్యండి. నేపోతే పోయాను. మన పత్రిక సర్క్యులేషన్ పెరిగిపోతుంది."
పరాంకుశం రెండుచేతుల్తో తలపట్టుకున్నాడు. "రామలింగం, నీకు జర్నలిస్ట్ గా ఉద్యోగమిచ్చిన వెధవ ఎవరు?"
"అంత పెద్దమాటెందుకుగానీ... మీరే సార్."
"ఖర్మ" అంటూ పరాంకుశం నెత్తిబాదుకున్నాడు. "పో, యిక్కడ్నుంచి వచ్చేటప్పుడు ముఖ్యమైన వార్త సేకరించి తీసుకురాకపోయావో-నీ తల..."అని నాలిక కొరుక్కుని "పో సేకరించి తిరిగి రా" అని అరిచాడు.
యజమాని ఆజ్ఞ శిరసావహిస్తున్నట్లుగా రామలింగం యుద్దానికి పొమ్మన్నంత వేగంగా అక్కడ్నుంచి బయల్దేరాడు.