జనరల్ కంపార్టు మెంటులో ప్రయాణికుడు రిజర్వేషన్ కంపార్టుమెంటులో ప్రయాణికునికంటే కేవలం అయిదురూపాయల యాభైపైసలు తక్కువిచ్చాడు. ఆతేడా నరకానికీ, స్వర్గానికీ ఉన్నంత అవుతుందా?
రాజారావుకు ఆవేశం వస్తోంది ఇది ఈ నాటికధకాదని అతనికి తెలుసును. ఇలాంటి ప్రయాణం ఇదివరలో అతను రెండుసార్లు చేసి వున్నాడు. అతనికిది మూడోసారి మాత్రమే కావచ్చు. కానీ ఏ దృశ్యాన్ని రైల్వేప్లాటుఫారం కొన్ని దశాభ్దాలుగా చూస్తూనే వుంది. రైల్వే అధికారులకు, ప్రభుత్వానికి ఈ విషయం పూర్తిగా తెలుసు. కానీఎవ్వరూ ఏమీ చేయడంలేదు. చేయాలని అనుకోవడంలేదు.
రాజారావు ఆలోచనలాగిపోయాయి. అతన్ని కాస్త పక్కకు జరగమని ఎవరో రిక్వెస్టు చేస్తున్నారు. అతనికాళ్ళకు భుజాలకు మనుషులు తగుల్తూన్న పరిస్థితులలో ఎక్కడికి కదలాలో ఎలా కదలాలో అర్ధంకాక విసుగ్గా ఆ వ్యక్తిని చూద్దామని మెడతిప్పిన రాజారావుకు- ఈశ్వరరావు బుర్ర తగిలింది.
హిందీలో ఒకతను రిక్వెస్టు చేస్తున్నాడు- "అతను గుడ్డివాడు ఎలాగో అలా మీరందరూ దయతలచాలి..."
నీటైనా, ఖరీదైనబట్టలలో ఇన్ షర్టు చేసుకుని - అందమైన కళ్ళజోడు పెట్టుకుని- చెబితేకాని గుడ్డివాడని తెలియని వ్యక్తి- చేతిలో కర్రతో వీళ్ళమధ్యకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు.
"ఎంతవరకూ వెళ్ళాలి?" అన్నాడు ఈశ్వరరావు.
"పూనా- ఎలాగోఅలా మీరందరూ దయతలచాలి." అతను మళ్ళీ రిక్వెస్టు చేశాడు, అతని ఇర్ధింపుకు సమాధానంగా చౌదరి కంఠం కంగుమంది- "ఇంతరష్ లో పూనాదాకా గుడ్డివాన్నేలా ప్రయాణం కానిస్తారు? రిజర్వేషన్ దొరికేదాకా ఆగిపోనివ్వండి లేదా ఫస్టుక్లాసులో దొరికినప్పుడు పంపించండి. ప్రస్తుతం ఇక్కడెవ్వరూ మానవత్వం ప్రదర్శించే పరిస్థితిలో లేరు..."
ఈ మాటలకు చాలామంది బలపర్చారు. అయితే గుడ్డివాడు దిగడానికిష్టపడలేదు. అతనికెవ్వరూ సాయపడలేమని చెప్పారు, గుడ్డివాడు చలించలేదు. అతను నిలబడ్డవాటం చూస్తూంటే ఇలాంటి ప్రయాణాలకు బాగా అలవాటుబడ్డవాడిలాగున్నాడు. ఈ దేశంలో గుడ్డేవిటి? కుంటేవిటి__రిజర్వేషన్ లేకుండా వెళ్ళాలంటే ఇలాంటి ప్రయాణం చేయక తప్పదు.
ట్రయిన్ కదలబోతున్నదన్న సూచనగా గార్డు విజిల్ వినబడింది. అంతవరకూ ప్లాట్ ఫారంమీద నిలబడి ఉన్నాడో సూటుకేస్ వాలా అతను చాలా గొప్పవాడిలా వున్నాడు. అతన్ని దిగబెట్టడానికి ప్లాటుఫారంమీదకు చాలామంది వచ్చారు. చాలామంది అతని మెడలో దండలువేశారు. ఎందరితోనో అతను హాండ్స్ షేక్ చేస్తున్నాడు. ట్రయిన్ కదలబోతున్న సూచనవిని అతను స్టంటు సినిమా హీరోలా, దూసుకువస్తున్న బాణంలా-అక్కడున్న అందర్నీ వదిలించుకుని కిటికీలోంచి రాజారావూ వాళ్ళూ వున్నా పెట్టెలోకి దూకాడు. అతని బట్టలు నలిగిపోయాయి. మెడలోని దండలు నలిగిపోయాయి. మనిషికూడా నలిగిపోయాడు. ప్రయాణానికి ముందున్న ఠీవీ, కళ ఇప్పుడు అతనిముఖంలో లేవు. ఆజనంలో ఊపిరి పీల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడతను.
మొత్తంమీద హైదరాబాదునించి ట్రయిన్ కదిలింది. అటూ, ఇటూ కదలలేని పరిస్థితులలో ఆ రాత్రంతా అందులో గడపాలంటే ఎంత భయంకరంగా ఉంటుందోనని భయపడుతున్నారందరూ అయితే ఆకలికి రుచీ, నిద్రకు సుఖమూ తెలియదంటారు, ఎవరికరుణకునోచుకుని ఆ ప్రయాణికులను నిద్రదేవత కరుణించి ఒడిలోకి తీసుకుంది.
ట్రయిన్ ఆగినప్పుడల్లా రాజారావుకు మెలకువవస్తోంది. ఎవరైనా దిగుతారేమోనని ఆశగా చూస్తూండేవాడతను. ఎలాగో అలా మరికొంతమంది ఎక్కడమేకానీ దిగేవాళ్ళెక్కడా కనబడ్డంలేదు. పూనా ప్రాంతాలవరకూ దిగేవాళ్ళేలేరట. చాలామంది బొంబాయి వెడతారట.
గుడ్డివాడు అటుకదిలి, ఇటు కదిలి బూటుకాళ్ళతో ఎవరినో ఒకరిని తొక్కుతూండేవాడు. వాళ్ళు విసుక్కుంటే "గుడ్డివాణ్ని!" అనేవాడు. ఎవరికీ జాలికలగలేదు. కావాలని బోగీలో ఎక్కి - "ఇప్పుడు గుడ్డివాన్నంటావేం?" అని కసిరేవారు.
క్రమంగా నిలబడ్డవారిసంఖ్య తగ్గిపోయింది. ఎలాగో అలా ఎక్కడో అక్కడ చతికిలబడిపోయారు. అందువల్ల కంపార్ట్ మెంటు మరింత ఇరుకైపోయింది. గుడ్డివాడిబాధ చూడలేక ఒకాయన బెర్తుమీద కూర్చోమన్నాడు, చెప్పిందే తడవుగా గుడ్డివాడు బెర్తు ఎక్కికూర్చుని రెండుకాళ్ళు క్రిందకు వేలాడేశాడు. అతనికాళ్ళు తిన్నగా చౌదరి ముఖం మీదకు వచ్చాయి.
"ఏయ్-బూట్లేనా విప్పు. కాళ్ళు ఎలాగో అలా పైకైనా పెట్టుకో-" అన్నాడు చౌదరి.
"గుడ్డివాణ్ణి బూట్లు విప్పితే ఎక్కడని వెతుక్కోను..."
బాగుంది కంపార్టుమెంటులో ఇందరున్నారు. ఎవరో ఒకరిస్తారు. వెతుక్కోవడం సమస్యకాదు..." అన్నాడు చౌదరి.
"ఓసారిలాగే నాబూట్లు పోయాయి__" అన్నాడు గుడ్డివాడు.