Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 19

    ఆ మాటలలో నిజాన్ని రాజారావు గుర్తించాడు. అయితే ఈ నిజాన్ని గ్రహించిన వ్యక్తిలో పశ్చాత్తాపం కనబడ్డంలేదు- "పాపం నా గురించి ఒకవేళ నిష్కారణంగా చనిపోయింది-" అని విచారాన్ని వ్యక్త పరుస్తూ మేకమాంసం భుజిస్తున్న వ్యక్తిలా కనబడ్డాడతను రాజారావు కళ్ళకి.   
    "నిజమే- అయితే ఏం చేయాలంటారు?" అన్నాడు రాజారావు.   
    "అంతా మోసమండీ-" అన్నాడు ఎదుటి టులోసీ కూర్చున్న ఇంకో పెద్దమనిషి. "నా దగ్గర ప్లాట్ ఫారంమీద వుండే కండక్టరు అయిదు రూపాయలుచ్చుకుని మీ నంబరు ఇరవై అని ఫలానా బోగీదగ్గరకువెళ్ళమనీ చెప్పాడు. వెళ్ళాను. వెళ్ళేసరికి తెలిసిందేమిటంటే ఆయన చెప్పిన ఇరవై అంకె సరైనదే కానీ అధి బెర్తు నంబరుకాదు. వెయిటింగ్ లిస్టులో నా నంబరు. ఆ సంగతి తెలుసుకునేందుకు అయిదు రూపాయలు ఖర్చుపెట్టిన నేను ఇంకో మూడు రూపాయలు ఖర్చుపెట్టి ఇందులో సీటు సంపాదించాను..."   
    "మనం ఇందిరాగాంధీని తిట్టుకుంటాంగానీ-ఈ దేశానికి ఎమర్జెన్సీ తప్ప లాభంలేదు. చేతిలో కొరడా ఉంటే తప్పనీతిగా ప్రవర్తించని అధమస్థితికి దిగజారిపోయాం మనం-" అన్నాడు చౌదరి.   
    ఆ మాటలను సపోర్టు చేయకపోయినా ఎమర్జన్సీలో రైలు ప్రయాణం ఎంత సుఖంగా వుండేదో ఆకుపచ్చ యూనిఫారం వివరించేడు. మరి ఒకరిద్దరుకూడా అలాంటి విశేషాలు చెప్పారు.   
    రాజారావు కలగజేసుకుని- "బాగుదండీ-ఎమర్జన్సీ కొనసాగి వుంటే దేశంలో ఒక ప్రాంతంనుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి చాలా అవస్థ పడాల్సుండేదేమో..." అన్నాడు.   
    "మీరు కానీ జనతాపార్టీ కాదుగదా?" అన్నాడు యూనిఫారం.   
    "మనకు పార్టీ లేదండీ- ఎమర్జెన్సీలో ప్రజలకు కొన్ని సౌకర్యాలు సమకూరినా అధికారులు దురహంకారులై పోలేదూ, తమ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదూ?-" అన్నాడు రాజారావు.   
    "అందుకే అంతా మనలో ఉందంటున్నాను..." అన్నాడు యూనిఫారం- "ఎమర్జెన్సీ కావాలని ఎవడు కోరుకుంటాడు చెప్పండి? ఇలాంటి మోసాలు చూసినప్పుడు విసుగెత్తి ఓసారి అలా అనుకుంటాం-"   
    "అప్పుడప్పుడు కన్నతల్లి బిడ్డల్ని చావమని తిట్టినట్లు." అన్నాడు రాజారావు.   
    ఆ తర్వాత చర్చ రాజకీయాలమీద ప్రారంభమైంది. ట్రయిన్ కదిలి హైదరాబాదు చేరింది. మరి భోజనం దొరకడం అసాధ్యమని గ్రహించిన రాజారావు కడుపులో మిరపకాయబజ్జీల మంటకుపశాంతి కలిగించాడానికి అరటిపళ్ళుకొన్నాడు. అతను, ఈశ్వర్రావు ఆ పళ్ళు తిన్నారు. చౌదరి తన దగ్గరున్న ఆపిల్ కమలాఫలాలను వీళ్ళకు ఆఫర్ చేశాడు. ఒకేఒక కమలాఫలం ఇద్దరూ తీసుకుని చౌదరికో రెండు అరటిపళ్ళిచ్చారు. రెండు డజన్లదాకా పళ్ళుకొన్నారేమో అని ఇంకా చాలా మిగిలిపోయాయి.
       హైదరాబాదులో జనం విపరీతంగా ఎక్కేశారు. కిటికీల లోంచి మనుషులు, సామాన్లు, ప్రవాహంలా అలా రావడం జరుగుతూనే వుంది. ఆ బోగీలో నలభైమంది కూర్చునేంత జాగా ఉన్నదేమో-కానీ అప్పటికి ఓ నూటపాతికమందిదాకా ఎక్కేశారు. సామాను విపరీతంగా వుంది. ఇంకా ఎంతోమంది ఎక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.   
    ఇంచుమించు ఎక్కినవారందరూ బొంబాయి చేరవలసినవారేనని తెలిసేసరికి రాజారావు గుండె ఆగిపోయింది. అతనికిప్పుడు చౌదరి కనిపించడంలేదు. వారిద్దరిసీటుకు మధ్యగా పొడుగ్గావున్న జాగాలో ఎనమండుగురు నిలబడ్డారు. అందులోనే ఇప్పుడిప్పుడే రెండోవరస ఏర్పాటుకాబోతోంది.  
    రాజారావుకు అటూ ఇటూ కదలడానికి వీల్లేకుండా ఉంది- అతనికి ఊపిరాడడంలేదు. ఆ సమయంలో అతనికి చరిత్రలో చదువుకున్న బ్రిటిషువారి దురాగతం గుర్తుకువచ్చింది. పట్టుమని పాతికమందయినా పట్టని ఒక చిన్నగదిలోకి బ్రిటిషువారు వందలకొద్దీ ఇండియన్సునికూరి తలుపులు వేసేశారట. ఆ గదికి వేరేగాని వచ్చేమార్గంకూడా లేదట. ఊపిరాడక ఎందరో ప్రాణాలు కోల్పోయారట. హిందూదేశపు చరిత్రకారులు అధి ఒక కిరాతక చర్యగా అబివర్నించారు.   
    మరి ఇప్పుడు జరుగుతున్న దేమిటి?   
    రైల్వేబోగీకి కిటికీలున్నకారణంగా మనుషులూపిరాడక చనిపోవడమన్నది జరక్కపోవచ్చు. కానీ గాలిదూరదానికి సందులేకుండా మనుసులతో నిండిపోయివున్న ఈ బోగీలో ఒక రాత్రి అంత గడుపుతూన్న సామాన్యపౌరుడి విషయం ఎవరు పట్టించుకుంటున్నారు? డబ్బిచ్చి టిక్కెట్టుకొన్న ప్రయాణికుడికి రిజర్వేషన్ లేనంత మాత్రాన కొన్ని కనీససౌకర్యాలు చేకూర్చవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా?

 Previous Page Next Page