"అయితే కలలు పైన పెట్టుకో__" అన్నాడు చౌదరి. కళ్ళున్నవాళ్ళవస్తువులే పోతున్నాయీరోజులలో. గుడ్డివాడి సంగతి వేరే చెప్పాలా?
గుడ్డివాడు కాళ్ళు పైన పెట్టుకున్నాడుకానీ వుండండి సౌకర్యంకోసం వాటిని క్రిందకు జారుస్తున్నాడు. రెండుమూడుసార్లు హెచ్చరించాడు చౌదరి. ఆ తర్వాత నుంచి కాళ్ళు క్రిందకు దిగజార్చినపుడల్లా వాటిపైన కొట్టడం ప్రారంభించాడతను. రాజారావుకి జాలివేసింది కానీ చౌదరినిమాత్రం ఏమనగలడు?
అర్దరాత్రి వరకు వాళ్ళలా తగవులాడుకుంటూనే వున్నారు. చివరికి గుడ్డివాడు రాజారావున్న బెర్తువైపు మారాడు. ఈసారి అవస్థ రాజారావుకు వచ్చింది. అయితే ఇబ్బందిగా వున్నప్పటికీ అతను చౌదరిలా కటువుగా ప్రవర్తించలేక పోయాడు. కానీ బూటుకాళ్ళు అప్పుడప్పుడు ముఖానికి తగులుతూండడంవల్ల అతనుకూడా హెచ్చరించక తప్పలేదు.
"ఏం చేయను? గుడ్డివాణ్ని..." అన్నాడు గుడ్డివాడు.
"ఏంగుడ్డాడో- మనతో సమానంగా ప్రయాణంచేస్తూ మన ప్రాణాలమీదకు వచ్చాడు! కాలు తగిలినప్పుడల్లా పిక్కసోం పెట్టేయండి...." అన్నాడు చౌదరి తెలుగులో.
రాజారావు గుడ్డివాడితో - "నీ జోళ్ళకు నేను బాధ్యత వహిస్తాను. ఇంతమంది ప్రయాణికుల ఎదుట చెబుతున్నాను. కనీసం బూట్లు విప్పేయి...." అన్నాడు. గుడ్డివాడు బూట్లు విప్పలేదు.
కొంతమంది రాజారావుమీద జాలిపడ్డా- "గుడ్డివాడు కదండీ. అతనిభయం అతనిని ఎలానో అలా సర్దుకుపొండి__" అన్నారు. రాత్రి తెల్లవార్లూ అతనికి బూట్లున్న గుడ్డివాడి బాధ తప్పలేదు.
ఓ రాత్రివేళ రాజారావు అల్పాచమానావసరంవచ్చింది. చుట్టూచూసి లాభంలేదు అనుకున్నాడు. ఇంకో అరగంట పోయేసరికి-ఓసారి బాత్రూంకు వెళ్ళివస్తే కానీ నిద్రపట్టదనుకున్నాడు. లేచిచూద్దామని ప్రయత్నించి విఫలుడై ఊరుకున్నాడు.
నిద్రాదేవి కరుణించిన కారణంగా అతను ఎలాగో అలా అయిదు గంటల ప్రాంతం వరకూ ఉగ్గబట్టుకున్నాడు. అ ఆ తర్వాత ఇంకా లాభంలేదనిపించి లేచాడు. గుడ్డివాడి కాళ్ళు ముఖానికి తగిలాయి. తప్పించుకుని పాదం ఎత్తాడు. ఎత్తిన పాదం దగ్గర ఏర్పడిన కాళీలోకి వెంటనే క్రిందపడుకున్న వ్యక్తి సర్దుకున్నాడు. రాజారావు నాపాదాన్నెక్కడదించాలో అర్ధం కాలేదు. ఒక చేత్తో బెర్తును ఊతగా పట్టుకుని ఒంటికాలిమీద నిలబడి అతను కంపార్టుమెంటుని పరిశీలించసాగాడు. కలికి అందేఅంతదూరంలో బూటు పెట్టేటంత కాళీ ఒక బెడ్డింగ్ పైన కనబడింది. ఆ బెడ్డింగు మీద అన్ని పక్కల నుంచీ మనుషులు పడుకుని వున్నారు. రాజారావు తన పాదాన్నిక్కడ పెట్టి- రెండోపాదం ఎత్తాడు. క్రింద ఏర్పడిన ఆ కాళీ లోకి వెంటనే ఇంకో వ్యక్తి సర్దుకుని పడుకున్నాడు.
రాజారావు టైము చూసుకున్నాడు. బాత్రూం సరిగ్గా అరంగుళం దూరంలో వుంది. అక్కడికి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుందో ఏమిటో?
ఇప్పుడు రాజారావుకు ఎటువెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియడంలేదు. చాలామంది కూర్చునీ, కొద్దిమంది పడుకునీ నిద్రపోతున్నారు. కళ్ళుమూసుకుని నడిస్తే కొంతమంది మెడలనూ, కొంతమంది పాదాలనూ, మరికొంతమంది పొట్టలనూ తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి.
అతను సీట్ల అంచుల్నీ, మనుషులమధ్య వున్నా సూదిమొన అంత కాళీలను ఆధారంగా చేసుకుంటూ పదినిముషాల ప్రయాణంచేసి బాత్రూం వున్నా సందుదగ్గరకు వచ్చేడు.
"ఎలా వెడతావయ్యా? ఆవతల బాత్రూంలోకివెళ్ళు." అని అతన్ని హిందీలోగసిరి- "బాత్రూంలోకి వెళ్ళినాకేం లాభం- దాన్నిండా మనుషులేగా!" అనుకున్నారు వాళ్ళలో వాళ్ళు తెలుగులో.
రాజారావుకు ప్రాణం పోతున్నట్లుంది. ఆ అవస్థ అనుభవించే వాడికేగాని తెలియదు. వాళ్ళు తెలుగులో మాటాడుకోగానే అతనికి కాస్త ధైర్యం కలిగింది- "మీరూ తెలుగు వాళ్ళేనా?" అని నామమాత్రంగా పలకరించి- "అర్జంటుగా నంబర్ వన్ కి వెళ్ళాలి, అయిదారుగంటలనుంచి వున్నాను. ఇంకవుండలేను..." అన్నాడు.
ఒకతను జాలిపడి- ఎలా వెడతారు? బాత్రూంలో అడుగు పెట్టడానికి కూడా లేదు. నిండా మనుషులే..." అన్నాడు.
"నా అవస్థ నేను పడతాను..." అని రాజారావు బాత్రూం సమీపించాడు ఆలోగా అతను ఓ మనిషి కాలుతొక్కితిట్లు తిన్నాడు. కానీ పట్టించుకోలేదు. అతన్నిప్పుడు మొండితనం ఆవహించింది.
బాత్రూం తలుపులు తీసే వున్నాయి కానీ అందులో అడుగుపెట్టె అవకాశం లేదు. ఒక్క క్షణం అందులోంచి బయటకు రమ్మనమని అందులోవ్యక్తులను బ్రతిమాలాడేడతను. బయటకు రావడానికి చోటుంటే ఇందులో ఎందుకుంటాం- అని విసుక్కున్నాడందులో వ్యక్తి. అతనితో వాదించే శక్తి రాజారావుకి లేదు. అందువల్ల అతను చేతులు జోడించి- ఎలాగో అలా ఆ పక్కనున్న నలుగురూ బయటకురండి__అని వేడుకున్నాడు.